శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


అరణ్యకం

ఓ వనీ ఓ వనీ
ఓ అరణ్యాని,
దారి తప్పిన
బాటసారి చందమున
దిగులుగా నుంటి
వదేమిటి జనని?
అందరివలె దారి
నడుగ వెందులకు ?
ఒంటిగా భీతి
జనించదా నీకు?
వాన వచ్చెను
పక్షి బావ యెల్గెత్తి
అరచెను;
మిగతవి సరగున బలికె
గాయకు లెందరో
కలిసి వాద్యముల
గళము గల్పిన యట్టి
గానమ్ము చెవుల
విని చొక్కిపోయి
నిల్చొని యుంటివేమొ
!
ఊరి బయళ్ళలో
నున్నట్లె,
యిచట చేరిన పసులు
పచ్చిక మేయుచుండె;
ఊరి వీథులవలె
నున్న విచటను
పొదరిళ్ళ వరుస
సొంపులు దిద్దుకొనుచు
చీకటి పడగనే
నీ కష్ట ఫలము
చల్లగా యింటికి
సాగింతువేమి?

ఆవుల పిలుచు చున్నారు
గోపకులు
కొట్టుచున్నారు
మ్రాకులను తక్షకులు
ప్రొద్దువోయిన
నొక్క త్రోవరి వచ్చి
పాదవస్థలిజేరి
పడుకొని
పక్షి రవరూపమైన
నీ రమ్య సంగీతమును విని,
తన్మయతను నాచికొనును,
ఒరులకు నపకార
మొనరించి యెరుగ
నట్టి దానవు;
ఒక్క యాటవికుండు
నిచ్చట నిన్
పల్కరించకయున్న
బెంబేలు పడిపోని
బిత్తరి వీవు;
కమ్మని నీదు
ఫలమ్ముల దినుచు
హాయిగా జీవింప
నగు వేయి యేండ్లు

కమ్మతావుల
విరజిమ్ముదు వీవు
కర్షక శ్రమకు
అక్కరయె లే దిచట;
కలమధాన్యములతో
తులతూగుచుండు
నో వనీ ఓ జననీ
వనరాణి
నీ వెంత గొప్పదానివి
తల్లి యిదిగొ చేకొమ్ము
నా నమస్కృతి సహస్రమ్ము

-- వైదికం - కృష్ణ యజుర్వేదం