శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


అపుడు - ఇపుడు

కనులెత్తి చూడు మంగన
యంచు నాత డన్న,
ఛీ కొట్టి పొమ్మంటిని గాని
కదలలే దొక్కింత గాని,
పైపెచ్చు నాముందునకు వచ్చి
నా కరద్వయము పట్టుకోగా
కోపపరవశ నగుచు
వదిలివేయు మటంచు
విదిలించినాను;
కాని ఆత డొకింత
కదలనే లేదు
తన మోము నా చెవి
దరికి రానిచ్చి,
ఏమిటో చెప్పబోయిన
సిగ్గులేని సేత లివేమని
చీదరించితిని
ఏమైన నతడు
చలించనే లేదు

నా చెంపలకు సోకినవి
అతగాని పెదవులు
సంభ్రమాన్విత నయిపోయి
తగదు సాహసమని
దండించినాను,
కాని అతనికి
సిగ్గన్నది లేదు.

అతనొక సుమము
తనంతట దెచ్చి
తలలో నమర్చె
నిదంతయు వట్టి
జతనము
నిష్ప్రయోజనమని యంటి
నైనను కదల లే
దా వగకాడు

అటు నిటు జూచి
కాసంత సేపాగి
అతగాడు, నా కంఠ
మందున్న పూలమాల
తీసుకుని, ఏ మనకుండ
నెటకొ వెడలిపోయెను
నన్ను విడిచి ఓ సకియ

ఇపుడు నేనిట
నిశ్వసించుచు, నొంటిగా
గూరుచుండి, ఏకాంతమ్మునందు
అనుకొను చుంటి
ఆయన యేల తిరిగి రాడు
నా దరికంచు..

-- బెంగాలీ - టాగూర్