శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


మరుత్తులారా!

ఓ మరుత్తులారా ఓ
హో మరుత్తులారా!
మీ కదలిక నీటికి రుచి
మీ కదలిక వనస్పతుల
మిసమిస లొలికించుచుండు;
మీరు చూపవలె మాకొక
దారిని మారుతములార?
ఓ మరుత్తులారా ఓ
హో మరుత్తులారా!

మీరు వానకురిపించిన
సారవంతమగు భూములు,
సస్యవంతమగు నేలలు.
శక్తివంటు లగుదురు మా
సర్వ మానవాళి నిజం
ఓ మరుత్తులారా! ఓ
హో మరుత్తులారా!

కురిపించండీ వర్షం,
ధరణిని మొలిపించండీ,
సరిత్తులను పారించండీ
మీ తాకిడితో మబ్బులు
మీ ధ్వానంతో దబ్బున
మిగుల జలము వర్షించును
మేలిమి కూతురు, మాతా
పితరుల మురిపించి బహూ
కృతులను కురిపించుగదా
ఓ మరుత్తులారా ఓ
హో మరుత్తులారా!

వర్షపూర్వకమ్మగు ది
వ్య ప్రభంజ నార్భటి మా
పాలిటి బంగారు పంట;
వంటజేసి వడ్డించే
వనితవోలె, మానవ భో
జనదాయిని యగునుగదా
ఓ మరుత్తులారా ఓ
హో మరుత్తులారా!

-- వైదికం - అథర్వవేదం