శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


వర్షం - వనితా

ఎంత వేదన నాకు నెలతా
ఎంత వేదురు నాకు మెలతా!!
జోరుమను వానలో
శూన్యకుటిలో జేరి
భాద్రపదమున నొంటి
బాధపడుచుంటినే
|| ఎంత ||

పర్జన్యఘోషలకు
పగిలిపోవును గుండె
పుడమియెల్లను నీరు
పొరలిపోతున్నదే
|| ఎంత ||

దూరదేశాల పం
దురుచుండె నా ప్రియుడు
తపియుంచు చుంటినే
దర్పకుని బాణాల
|| ఎంత ||

నెమిలి గుంపులు మనసు
తిమిరెక్కి నర్తించె
అదొ బలాకిక రాగ
మాలాపనము సేసె
|| ఎంత ||

ఎంత చక్కటి రేయి
ఎంత చీకటి గోయి
ఏమిటో ఈ మెఱపు
లింత వుడికించునే

ఎంత వేదన నాకు నెలతా
ఎంత వేదురు నాకు మెలతా!!

-- బెంగాలీ - విద్యాపతి