శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


వానికదుగో!

పూలదండ కూర్చుటకీ
ప్రొద్దంతా కూరుచుంటి,
పూలు జారి జారిపోవు
పొలతి యెందుకో!
అచట నీవు కూరుచుండి
, ఆసక్తిని కనుగొమ్మల
నాలోకించుచు నుంటివి
అతి గుప్తముగా!!
చీకటి కుట్రలు పన్నే
నీకన్నులనే యడుగుము __
ఈకళవళపాటులోన
నెవరిది తప్పో!!
పాటపాడ మొదిలిడినా
పాటరాదు, నీపెదవుల
పయి తొలకే దొంగనవ్వు
నడుగు మెందుకో!!
నీ నవ్వుల పెదవులే ప్ర
మాణముగా చెప్పనిమ్ము,
గానమ్ము మౌనములోనే
కలిసిపోవు టెందుకో?
పూలదండకూర్చుటకీ
ప్రొద్దంతా కూరుచుంటి
పూలు జారి జారిపోవు
పొలతి యెందుకో!

-- బెంగాలీ - టాగూర్