శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


నాయంతటనేను!

తోట దఱి చెట్టుమాటున
తొలగి నిల్చినాడనే గాని,
నే నేమి యడుగలేదు
కన్నులరవిచ్చి వేకువ
కదలుచుండె.
చలువ తెమ్మెఱ మెల్లన
సాగుచుండె.
మంచు చిన్కులతో
గుబాళించె గఱక
మర్రి మానిక్రిందుగ జేరి
మగువ యొంటి నీవు
నవనీత మృదుల
పాణిద్వయమున
పాలు పిండుచునుంటి
నే జోలి లేక.
నేనుమాత్ర మింకను నట్లె
నిలిచియుంటి.
ఏను బల్లెత్తుమాట
వచించలేదు;
పలికినది పొన్నపైనుండి
పక్షి యొకటి;
పల్లెబాటపై మావి
పూల్ చల్లుచుండె;
వరుసగా ఝంకరించుచు
వచ్చె నళులు;
కొలనిగట్టున శివుని
కోయిలను దెరచినారు;
భక్తులు పాడుచున్నారు, పాట
చెలియ, పాత్ర నంకమునందు
చేర్చిపట్టి
నీవు పాలనుపిండుచున్నావు
నేను నిల్చుకొనియుంటి
వట్టి గిన్నియను బట్టి;
తెఱవ నీ దఱికే
చనుదేఱలేదు.

మేల్కొనియె నింగి
గుడిగంట మ్రోతవలన;
విడిచిపెట్టిన పనుల
త్రొక్కిడుల జేసి,
దుమ్ము లేచుచునుండె
మార్గమ్ములందు;

కడవలను చంక నిడుకొని
కాంత లెల్ల వచ్చుచుండిరి
నదినుండి వరుసగట్టి;
గలగలా మ్రోయుచుండె
నీ కంకణములు,
నిండుచున్నది నీ
పాలకుండయెల్ల,
ఎండ ఎదుగుచు
నుండిన దెంతొ,
కాని, తెఱవ
నీ దఱికే చనుదేరలేదు

-- బెంగాలీ - టాగోర్