రాబిన్ సన్ క్రూసో కథ - Chapter 9
ఒక సంవత్సరం తర్వాత ఒకనాడు ఐదు పడవలలో ముప్ఫై మంది అడవి మనుష్యులు మళ్ళా ఆ తీరానికి వచ్చారు. ఈ సారి వారు తన మీద దాడి చేయవచ్చునని క్రూసో భయపడ్డాడు. కాని అతడు ఆ ద్వీపంమీద ఉన్నట్టు వారికి తెలుసునో, తెలియదో అతనికి తెలియదు. అయినా తన జాగ్రత్తలో తను ఉండడం మంచిదని క్రూసో అనుకొన్నాడు. అతడు వెంటనే తుపాకులలో మందుగుండు దట్టించాడు. ప్రహరీ గోడ లోని ఏడు కన్నాలవద్ద ఏడు రైఫిళ్ళను అమర్చాడు. తనవద్ద రెండు పిస్తోళ్ళను, రెండు కత్తులను ఉంచుకొని దాడిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. కాని అడవి మనుష్యులు సముద్ర తీరం వద్దనే ఒక మంట చుట్టూ నృత్యం చేస్తూ అరుస్తున్నారు. కొంతసేపు వారిని అలా ఒక గోడ కన్నంలొనుండి క్రూసో చూశాడు.

తర్వాత వారికి కనబడకుండా జాగ్రత్తగా పిల్లిలాగ కొండ శిఖరంపైకి ఎక్కాడు క్రూసో. అక్కడ బోర్లా పడుకొని తన దూరదర్శినితో వారివైపు అతడు చూశాడు. ఆ అడవి మనుష్యులు అతి సంతోషంతో ఒడలు మరచి నృత్యం చేస్తూనే ఉన్నారు. కాళ్ళూ, చేతులూ బంధింపబడిన ఇద్దరు వ్యక్తులు వారికి చేరువులో నేలపైని పడి ఉన్నారు.

ఆ తర్వాత ఒక బంధితుని తలపైని ఒకడు దుడ్డుకర్రతో బలమైన దెబ్బకొట్టి చంపివేశాడు. ఆ వెంటనే మరి కొందరు హతునిమీద పడి అతన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేశారు. తర్వాత అతని మాంసాన్ని కాల్చుకొని తిన్నారు. ఆ అనందంలో వారుండగా రెండవ బంధితుడు ఎలాగో కష్టపడి కట్లు విప్పుకొని పరుగెత్తసాగాడు. వాడు కొంత దూరం పరుగెత్తి వెళ్ళేవరకు అతన్ని వారిలో ఎవరూ చూడలేదు. తర్వాత వారిలో ముగ్గురు అతన్ని చూసి వెంబడించారు. ఇంతలో ఖైదీకి ఉప్పుటేరు అడ్డువచ్చింది. అయినా అతడు నీటిలోనికి దుమికి ఈదడం మొదలుపెట్టాడు. అతడ్ని వెంబడిస్తున్న ముగ్గురిలో ఒకడికి ఈతరాదు. అందువల్ల వాడు వెనక్కు తిరిగి తన ముఠాను చేరుకొన్నాడు. మిగిలిన ఇద్దరూ నీటిలోనికి దుమికి ఈదుతూ ఖైదిని వెంబడించారు.

ఆ ఖైదీ యువకుడైనందువల్ల ఆత్మరక్షణకోసం వడి వడిగా ఈది ఆవలి ఒడ్డు చేరుకొని పరుగెత్తసాగాడు. అతన్ని వెంటాడుతున్న ఆ నరరూప రాక్షసులు మరింత వెనకబడ్డారు. కొండ శిఖరం పైనుండి క్రూసో ఇదంతా గమనించాడు. ఎలాగైనా ఆ ఖైదీని రక్షించగలిగితే తనకొక తోడు దొరుకుతాడన్న ఆశ అతనికి కలిగింది. వెంటనే ఒక రైఫిల్ ని చేతపుచ్చుకొని, వడివడిగా కొండదిగి, ఖైదీకి ఆ అడవి మనుష్యులకు మధ్యగా వచ్చి క్రూసో నిలిచాడు.

క్రూసోను చూడగానే ఆ అడవి మనుష్యులు అతని మీదకు రాబోయారు. వెంటనే క్రూసో వారిమీదకు రైఫిల్ ని పేల్చాడు. వారిలో ఒకడు ఆ దెబ్బకు నేలకూలేడు. రెండవవాదు ఆ తుపాకీ మోతకు మొదట జడిసినా తర్వాత ధైర్యం తెచ్చుకొని తన విల్లును తీసి అమ్మును ఎక్కుపెట్టాడు. సముద్రతీరాన్న ఉన్న ఇతర అడవి మనుష్యులకు వీరు కనబడకుండా చెట్ల మరుగున ఉన్నా తుపాకీ శబ్దానికి వారంతా తనమీదకు రావచ్చునన్న భయం క్రూసోకు కలిగింది. ఐనా ఆ పరిస్తితులలో తనను తాను రక్షించు కొనడానికి రెండవవానినికూడా కాల్చిచంపక తప్పలేదు.

ఆత్మ రక్షణకోసం పరుగెత్తుతున్న ఖైదీ రైఫిల్ శబ్దానికి భయపడి వెనక్కు తిరిగి కొయ్యలాగ నిలబడిపోయాడు. తన శతృవులు ఇద్దరూ నేలమీద పడి ఉండడం చూశాడు. తన శతృవుల ముఠానుండి ఇంకెవ్వరూ తమవైపు వస్తున్నట్టు అతనికి గోచరించలేదు. విందు ఆరగిస్తున్న ఆనందంలో ఏమి జరిగిందీ వారికి తెలిసి ఉండదు. క్రూసో ఒక సారి చుట్టూ కలియజూశాడు.

ఆ ఖైదీని తన దగ్గరకు రమ్మనమని క్రూసో పిల్చాడు. కాని వాడు భయంతో కదల లేదు. క్రూసో ఈ సారి వాడిని చేత్తో సంజ్ఞ చేసి పిల్చాడు. కొంతసేపటికి వాడు అడుగులోఅడుగు వేసికొంటూ మెల్లగా క్రూసో వైపు నడిచాడు. వాడికి భయం పోగొట్టడానికి క్రూసో అతని వైపు నవ్వుతూ చూశాడు. దాంతో ఆ ఖైదీకి కాస్త భయం తగ్గింది. ప్రతి రెండు అడుగులకు ఒక సారి శరణుజొచ్చినట్టు మోకాళ్ళ పైని కూర్చొని లేస్తూ క్రూసోకు చేరువుగా అతడు వచ్చాడు. తర్వాత క్రూసో పాదాన్ని ఎత్తి తన నెత్తిపైని పెట్టుకొన్నాడు. ఇకమీదట అతడు క్రూసోకు దాసుడుగా ఉనండడానికి నిశ్చయించుకొన్నట్టు తన అంగీకారాన్ని ఆ విధంగా అతడు తెలియజేశాడు.

అతన్ని స్నేహపూర్వకంగా క్రూసో లేవనెత్తాడు. కాని అతడు భయపడుతూ తన భాషలో ఏమేమో మాట్లాడసాగాడు. ఆ మాటలకు అర్ధం క్రూసోకు తెలియకపోయినా వాటి తాత్పర్యం స్నేహాన్ని కోరుతున్నట్టు క్రూసో గ్రహించాడు. సుమారు ఇరవై అయిదు సంవత్సరాల అనంతరం మళ్ళా ఆనాడు క్రూసో మనుష్య కంఠస్వరం విన్నాడు. అతనికి ఎంతో ఆనందం కలిగింది.

ఇంతలో తుపాకి దెబ్బ తిన్న మొదటివాడు లేచి కూర్చున్నాడు. క్రూసో మొలకు వ్రేలాడుతున్న కత్తిని అతని కొత్త స్నేహితుడు అడిగి తీసికొని తమ శత్రువుల తలలు నరికి క్రూసో పాదాలముందు ఉంచాడు. శత్రువుల వద్దనున్న విల్లు, అమ్ములను అతడు తీసికొన్నాడు. తర్వాత ఒక పెద్దగొయ్యి తీసి దానిలో తన శత్రువుల శవాలను పాతిపెట్టాడు.

విధేయుడైన బానిస ఒకడు ఇప్పుడు క్రూసోకు దొరికాడు. ఆ బానిసను క్రూసో తన ఇంటికి తీసికొని వెళ్ళి వాడికి కడుపునిండా తిండి పెట్టాడు. ఒక దుప్పటి ఇచ్చి కప్పుకొని పడుకొనమని సంజ్ఞలతో క్రూసో చెప్పాడు. అలిసిపొయిన ఆ బానిసకు, కడుపునిండా తిండి దొరకడంతో పడుకొన్న వెంటనే హాయిగా నిద్ర పట్టింది.

ఒడలు మరిచి హాయిగా నిద్రపోతున్న తన బానిసవైపు క్రూసో తదేకంగా చూశాడు. అతడు యువకుడు. అతనికి ఇంకా ఇరవై అయిదు ఏళ్ళు నిండి ఉండవు. ఒడ్డుగా పొడుగ్గా ఆరోగ్యంగా ఉన్నాడు. కండలు తిరిగిన దేహంతో బలంగా కనబడుతున్నాడు. అతని జుట్టు ఉంగరాలు తిరిగి లేదు, పొడుగ్గా మామూలుగా ఉంది. చర్మం నల్లగా లేదు. చామన చాయ రంగులో ఉంది. పెదిమలు మోటుగా లేవు. నాజూకుగా ఉన్నాయి. ముక్కు దిబ్బగా లేదు. బాగానే ఉంది. అతని పలువరుస తీర్చి దిద్దినట్టుంది. అతడు ఆ అడవి మనుష్యులకు భిన్నంగా ఉన్నాడు.

ఒక గంటసేపు హాయిగా నిద్రపోయి ఆ బానిస లేచాడు. అతడు వెంటనే తిన్నగా క్రూసో వద్దకు వెళ్ళి అతని పాదాల ముందు మోకరిల్లాడు. క్రూసో పాదాలను తన నెత్తిన పెట్టుకొన్నాడు. "ఇకమీదట నేను మీ బానిసను" అని అతడు తెలియజేస్తున్నట్టు క్రూసోకు అనిపించింది.

క్రూసో మాతృభాష ఇంగ్లీషు. అది ఆ బానిసకు అర్ధం కాదు. అతడు మాట్లాడే ఆటవిక భాష క్రూసోకు బోధపడదు. అందువల్ల వారిద్దరూ ఒకరి భావాలను ఒకరికి సంజ్ఞలతోనే తెలియజేసికొన్నారు. ఒకరిని ఒకరు బాగానే అర్ధం చేసికొన్నారు. ఆ బానిసను దయతో చూడడానికి క్రూసో అంగీకరించాడు. అతనికి సేవ చేయడానికి ఆ బానిస అంగీకరించాడు.

శుక్రవారంనాడు అతని ప్రాణాలను క్రూసో రక్షించాడు గనుక అతనిని ఆనాటినుండి 'ఫ్రైడే' అని క్రూసో పిలవసాగాడు. తనను ' మాస్టర్ ' అని సంబోధించమని ఫ్రైడేకి చెప్పాడు.

తర్వాత 'ఎస్ ' 'నో' అని ఎప్పుడు అనాలో క్రూసో ప్రైడేకి నేర్పాడు.ఆ తర్వాత తన ఇంట్లోనున్న వివిధ వస్తు సామగ్రుల పేర్లను నేర్పాడు. స్వతహాగా ఫ్రైడే తెలివైన వాడు. కనుక అతడు చాలా ఇంగ్లీషు పదాలను త్వరలో నేర్చుకొన్నాడు.

క్రూసో తన పాత బట్టలను ఫ్రైడేకి ఇచ్చాడు. తన మాస్టర్ లాగే తనూ బట్టలు ధరించినందుకు ఫ్రైడే మురిసి పోయాడు.
ముందరి పేజి               తరువాతి పేజి


www.maganti.org