రాబిన్ సన్ క్రూసో కథ - Chapter 8
ఒక నాటి ఉదయం క్రూసో తన ఇంటి వద్ద నిలబడి చూస్తూ ఉండగా సముద్రంలో చాలా దూరాన అతనికి ఏదో నల్లగా కనబడింది. వెంటనే అతడు కొండ ఎక్కి దూరదర్శినితో అటు చూశాడు. ఒక పడవ తన ద్వీపమునుండి దూరంగా పోతున్నట్టు గమనించాడు. మరి కొంతసేపటికి అది మరి కనిపించలేదు. "ఎవరో ఇతర ద్వీపవాసులు నా ద్వీపానికి వచ్చి వెళ్తున్నట్టుంది" అని అనుకొన్నాడు.

అతని ఊహ నిజమే. చేరువలోని కొన్ని ద్వీపాలలో అడవి మనుష్యులు నివసిస్తున్నారు. వారిలో వారికి అప్పుడప్పుడు తగవులు వచ్చి, చిన్న యుద్ధాలుగా మారుతూ ఉండేవి. ఆ యుద్ధాలలో కొందరు ఇతరులకు బంధితులయేవారు. గెలిచిన వారు ఓడినవారిని క్రూసో నివసిస్తున్న ద్వీపానికి తీసికొని వచ్చి, చంపి, వండుకొని తింటూ ఉండేవారు. క్రూసోకు ఆనాడు కొంతమంది అడవి మనుష్యులు వారి బంధితులను క్రూసో ఉన్న ద్వీపానికి తీసికొనివచ్చి వారిని చంపి విందు చేసికొన్నారు. కాని ఆ విషయం క్రూసోకు తెలియదు.

క్రూసో కొండ దిగి వచ్చి, ఒక రైఫిల్ ను పట్టుకొని సముద్రతీరం వైపు వెళ్ళాడు. అతనికి ఒక చోట మనుష్యుల తలలు, ఎముకలు, మాంసం ముద్దలు కనబడ్డాయి. వాటిని చూడగానే అతని ఒడలు జలదరించింది. వాటిని చూడలేక అతడు తన ముఖాన్ని ఇంకొక వైపుకు తిప్పుకొన్నాడు. అతనికి కడుపులో తిప్పి, తల తిరిగి కళ్ళు చీకట్లు కమ్మాయి. ఎలాగో ధైర్యాన్ని కూడగట్టుకొని వీలయినంత త్వరగా తన ఇంటికి వెళ్ళాడు. ఆనాడు అతనికి ఏదీ తినాలనిపించలేదు. నిద్ర పోవాలని కళ్ళు మూసికొంటే అతనికి ఆ దృశ్యమే కళ్ళకు కట్టసాగింది. ఆ రోజంతా ఏదేదో ఆలోచిస్తూ భయంతో కాలం గడిపాడు.

పద్ధెనిమిది సంవత్సరాలపాటు నిర్భయంగా ఒంటరిగా క్రూసో ఆ ద్వీపంమీద జీవించగలిగాడు. కాని ఆనాటితో అతనికి ప్రాణభయం పట్టుకొంది. కాని తనకు తానే ధైర్యం చెప్పుకోవలసి వచ్చింది. చెట్ల చాటున ఉన్న తన ఇంట్లో మరొక పద్ధెనిమిది సంవత్సరాలు ఎవరికంటా పడకుండా బ్రతకవచ్చునన్న ధైర్యం అతనిలో కలిగింది. అయినా మరికొన్ని జాగ్రత్తలు అతనికి అవసర మనిపించాయి.

అనవసరంగా అతడు మందుగుండును కర్చు చేయ దలచు కొనలేదు. తప్పని సరిగా ఎప్పుడూ తన వెంట ఒక తుపాకీని తీసికొని వెళ్ళదలచాడు. మొలకు కట్టుకొనే తోలు పటకాలో రెండు కత్తులను ఎల్లప్పుడూ ఉంచుకొనదలచాడు. కర్రల మంట వల్ల వచ్చే పొగ చాలా దూరం కనబడే అవకాశం ఉందని బొగ్గులమీదనే వంట చేసికొనడం క్రూసో ప్రారంభించాడు.

ఒకనాటి సాయంత్రం అతనికి తుపాకీ పేలిన శబ్దం వినబడింది. అతడు వెంటనే కొండ శిఖరంపైకి వెళ్ళాడు. ఇంతలో బండరాళ్ళున్న తీరంవైపునుండి మళ్ళా తుపాకీ శబ్దం వినపడింది. వెంటనే అతడు దూరదర్శినితో అటువైపు చూశాడు. కాని అప్పటికే చీకటి పడినందువల్ల అతనికి ఏమి కనబడలేదు. మునిగిపోతున్న ఏదో ఓడనుండి ఆ ప్రేలుడు శబ్దాలు వచ్చియుండ వచ్చునని అతడు అనుకొన్నాడు. ఆ ఊహ నిజమయి, ఆ ఓడలో ఎవరైనా సజీవులై ఉంటే వారికి నేల చేరువలోనే ఉందని తెలియడానికిగాను క్రూసో కొండపైని ఒక మంటపెట్టాడు.

ఆ మరునాదు తెల్లవారగానే దూరదర్శినితో తీరం వైపు చూశాడు. పొగమంచులో ఏదో ఒక ఓడ అక్కడ లంగరు వేసి ఉన్నట్టుగా అతనికి కనిపించింది.

అతడు వెంటనే చెట్ల చాటుగా కొండదిగి తీరంవైపుకు వెళ్ళాడు. సందేహంలేదు అది ఓడే ! అతనికి ఎంతో సంతోషం కలిగింది. కాని ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ఆ ఓడ బండరాళ్ళకు ఢీకొని, విరిగి, ఒరిగిపొయి ఉంది. అతని ఆశ నిరాశ అయింది.

"పాపం ! ఆ ఓడ విరిగినందువల్ల ఎంతమంది మునిగి చనిపోయారో !" అని మనస్సులోనే విచారించాడు. ఒకరిద్దరైనా సజీవులై ఉంటే వారు తనకు తోడవుతారన్న ఒక ఆశ అతనికి కలిగింది. అతనికి ఎవరైనా తోడు అవసరమన్న కోరిక ఇంతవరకూ అంత ఎక్కువగా కలుగలేదు. కాని తన ద్వీపానికి అడవి మనుష్యుల రాకపోకలు ఎక్కువ అవుతున్నందువల్ల ఆ అవసరం అతనికి తెలియ వచ్చింది.

ఒకరైనా బ్రతికి ఉండవచ్చు నన్న ఆశతో అతడు తన పడవ మీద ఆ ఓడ వద్దకు వెళ్ళాడు. తన పడవను ఆ ఓడకు కట్టి ఓడపైకి వెళ్ళాడు. అతనికి ఒక కుక్క తోక ఆడిస్తూ స్వాగతం ఇచ్చింది. దానికి అతడు ఒక రొట్టెముక్క పెట్టాడు.

తర్వాత క్రూసో ఓడలో తిరగసాగాడు. ఓడలోని నీళ్ళలో మునిగి చనిపోయిన ఇద్దరు నావికులు మాత్రం అతనికి కనబడ్డారు. ఓడలోని ఆహారపదార్ధాలన్నీ తడిసి పాడయినాయి. అతనికిఎంతో బాధ కలిగింది. ఆ ఓడలో అతనికి దక్కినవల్లా కొంత ద్రాక్షసారా, కొద్దిగా మిఠాయి, కొన్ని జతల బట్టలు, కొన్ని స్పెయిన్ దేశపు వెండి నాణాలు, కొన్ని బంగారపు కడ్డీలు. ద్రాక్షసారా, మిఠాయి, బట్టలు అతనికి పనికివచ్చేవే కాని ఆ ఒంటరి జీవికి ఆ ద్వీపంమీద ఆ బంగారపు కడ్డీలు, వెండినాణాలు ఎందుకూ పనికిరానివే. అయినా వాటినన్నిటిని తీసికొని తన ద్వీపానికి బయలుదేరాడు. ఆ పడవ వెంట ఈదుకొంటూ కుక్క కూడా వచ్చింది. ఆ మధ్యనే తన కుక్క చనిపోయినందువల్ల ఈ కొత్త కుక్క తనకు తోడైనందుకు క్రూసో సంతోషించాడు.

తర్వాత కొన్ని నెలల వరకు క్రూసో జీవితం మామూలుగా గడిచిపోయింది. ఒకనాటి ఉదయం క్రూసో తన అలవాటు ప్రకారం కొండమీదికి వెళ్ళాడు. సుమారు రెండు మైళ్ళ దూరంలో సముద్రతీరాన అతనికి పొగ కనబడింది. వెంటనే అతడు దూరదర్శినితో చూశాడు.

అడవి మనుష్యులు కొందరు మంటచుట్టూ కూర్చొని ఏదో కాలుస్తున్నారు. క్రూసో వారిని లెక్కపెట్టాడు. వారు తొమ్మండుగురు ఉన్నారు. ఎవడినో చంపి, ఆ మంటలో కాల్చుకొని తినబోతున్నారని క్రూసో ఊహించుకొన్నాడు. అంతేకాదు "వచ్చేసారి వారు నన్ను చంపి విందు చేసికొంటారు కాబోలు !" అని తనకు తెలియకుండానే అనుకొన్నాడు. దాంతో అతని ఒడలు జలదరించింది.

క్రూసో బోర్లా పడుకొని వారిని దూరదర్శినితో అలా చూస్తూనే ఉన్నాడు. కాల్చుకొన్న మాంసాన్ని వారంతా తిని, తర్వాత ఆ మంట చుట్టూ ఒక గంట సేపు నృత్యం చేశారు. ఆ తర్వాత వారు సన్నని పొడుగుపాటి పడవలమీద పశ్చిమదిక్కుగా వెళ్ళిపోయారు. వారు కనుమరుగైన తర్వాత క్రూసో ఆ చోటుకు వెళ్ళాడు. అక్కడ అతనికి పుర్రెలు, ఎముకలు, మాంసం ముద్దలు కనబడ్డాయి. ఆ నాటి నుండి రాబిన్సన్ క్రూసోకు మనశ్శాంతి లేకుండా పోయింది.
ముందరి పేజి               తరువాతి పేజి


www.maganti.org