రాబిన్ సన్ క్రూసో కథ - Chapter 10
రాబిన్సన్ క్రూసోకు ఒంటరి జీవితం పోయింది. అతనికి నూతన ఉత్సాహం కలిగింది. ఫ్రైడేకి ఇంగ్లీషు భాష నేర్పడం, వంట నేర్పడం, ఇంకా ఇతర పనులు నేర్పడంతో క్రూసోకు దొంత కాలక్షేపంగానే ఉంది.

పిండి దంచి రొట్టెలు చేయడం ఫ్రైడే నేర్చుకొన్నాడు. దీనివలన క్రూసోకు శ్రమతగ్గి కాస్త విశ్రాంతి లభించింది. పొహ్రైడే త్వర త్వరగా ఇంగ్లీషు నేర్చుకొంటూ ఉండడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత ఇంకొకరితో మాట్లాడే అవకాశం కలిగినందుకు క్రూసో ఎంతో ఆనందం పొందాడు. ఫ్రైడే అంటే క్రూసోకు ఆదరం అభిమానం ఏర్పడ్డాయి.

ఒకనాడు క్రూసో ఫ్రైడేతో కలిసి సముద్ర తీరానికి వెళ్ళాడు. అడవి మనుషులు ఎవరినో చంపి తిని వదలిపెట్టిన మనుష్యుల తలలు, ఎముకలు, మాంసం ముద్దలు ఒకచోట పడి ఉన్నాయి. వాటిని పాతిపెట్టమని క్రూసో ఫ్రైడేకి చెప్పాడు. ఆ పని చేస్తున్నంతసేపూ వాటిని తింటే బాగుండు నన్నట్లు ఫ్రైడే చూస్తూ ఉండడం క్రూసో గమనించి అతనిలో ఇంకా వెనుకటి గుణం పోనందుకు ఆశ్చర్యపోయాడు.

మనుష్య మాంసం తినకూడదని క్రూసో ఫ్రైడేకి నచ్చ చెప్పాడు. తన మాస్టర్ తన ఉద్దేశ్యాన్ని గ్రహించినట్టు ఫ్రైడే తెలిసికొని సిగ్గు పడ్డాడు. తన తప్పును క్షమించమని ఫ్రైడే తన మాష్టర్ ను వేడుకొన్నాడు. ఆ తర్వాత మరెప్పుడు కూడా నరమాంసం తినాలన్న కోరిక ఫ్రైడేలో కలుగలేదు.

రానురాను ఫ్రైడేకి ఇంగ్లీషు బాగా అర్ధం కాజొచ్చింది. తప్పో, ఒప్పో జంకు లేకుండా ఇంగ్లీషు మట్లాడడం ఫ్రైడే అలవరచుకొన్నాడు.

ఆ ద్వీపం మీదకు తను ఎలా వచ్చిందీ క్రూసో ఫ్రైడేకి వివరించి చెప్పాడు. తమ ఓడ ఎలా ఉండేదో క్రూసో వర్ణిస్తూ ఉంటే ఫ్రైడే ఆశ్చర్యపోయాదు. అటువంటి ఓడే ఒకటి నాలుగు సంవత్సరాలక్రితం తను నివసిస్తూ ఉండిన ద్వీపానికి తుఫానులో కొట్టుకొని వచ్చి విరిగిపోయిందని, అందులోనుండి పదిహేడు మంది తెల్లవారిని ఆ ద్వీపవాసులు రక్షించారని ఫ్రైడే చెప్పాడు. "ఆ తెల్లవారిని మేము కారిబ్బులని అంటాం. వారు మనుష్యుల్ని చంపుతారనుకొండి" అన్నాదు ఫ్రైడే.

దక్షిణ అమెరికాలోని స్పెయిన్ దేశస్థులగురించి ఫ్రైడే చెప్తున్నట్టు క్రూసో గ్రహించాడు.

అక్కడికి చేరువలోనున్న ఒక పెద్ద ద్వీపం ఫ్రైడే స్వదేశం. ఎలాగైనా ఆ ద్వీపాన్ని చేరుకొంటే అక్కడ ఉన్న తెల్లవారి సహాయంతో ఒక పెద్ద పడవను నిర్మించి దానిలో తన స్వదేశానికి చేరుకోవచ్చునన్న ఆశ క్రూసోకు కలిగింది. తను తయారు చేసిన పడవ వద్దకు ప్రైడేని తీసికొనివెళ్ళి దానిని చూపించి డానిలో ఆ పెద్ద ద్వీపానికి వెళ్ళడానికి వీలవుతుందా అని క్రూసో అడిగాడు. ఆ ప్రశ్న వినగానే ఫ్రైడే ముఖం చిన్నబోయింది

"ఏం అలా విచారంగా ఉన్నావు ? మీ వాళ్ళు జ్ఞాపకం వచ్చారా ?" అని క్రూసో అడిగాడు.

"నేనేం చేశాను మాస్టర్ ? నా మీద మీకెందుకంత కోపం ?" అంటూనే ఫ్రైడే అక్కడనుండి వెళ్ళిపోయాడు.

మరి కొద్ది సేపటిలో ఒక గొడ్డలిని తీసికొనివచ్చి క్రూసోకు ఇచ్చాడు.

"ఇది ఇప్పుడెందుకూ ?" అని క్రూసో అడిగాడు.

"నన్ను నా దేశం పొమ్మంటున్నారు గదా ? నేనంటే మీకు ఇష్టం లేదు. కనుక నన్ను దీంతో చంపండి. నా పీడ మీకు వదులుతుంది." అన్నాడు ఫ్రైడే తల వాల్చుకొని.

క్రూసో ఆ మాటలకు ఆశ్చర్యపోయి "నీ మీద నాకు కోపం లేదే ! అలా ఎందుకు అనుకొంటున్నావు ? అని అడిగాడు.

"మరి నన్నెందుకు నా దేశం పొమ్మంటున్నారు"

"నీ వాళ్ళను చూడాలని నీకు లేదా ?"

"ఎందుకు లేదు ? చూడాలనే ఉంది. కాని నేను మిమ్మల్ని విడిచి వెళ్ళను. మీరు వస్తేనే వెళ్తాను."

"నేను మీ దేశం వస్తే మీ వాళ్ళు నన్ను చంపి తినరా ?"

"తినరు. మిమ్మల్ని మా వాళ్ళు ఏమీ చేయకుండా నేను చూస్తాను. మీ వంటి తెల్ల దొరలు అక్కడ కొంత మంది ఉన్నారు గదా ?" అంటూ ఫ్రైడే కళ్ళనీళ్ళు పెట్టుకొన్నాడు.

తనమీద ఫ్రైడేకి ఎంత ప్రేమ, అనురాగం, గౌరవం ఉన్నాయో క్రూసో ఆ క్షణాన గ్రహించాడు. "నిన్ను ఒంటరిగా మీ దేశం పంపించను. నీవు నాతోటే ఉందువుగాని. ఇద్దరం కలిసే మీ దేశం వెళ్దాం. కాని ఈ పడవలో మనిద్దరం వెళ్ళగలమా ?" అని ఫ్రైడేకి అర్ధమయ్యేటట్టు విడమర్చి అడిగాడు.

"ఇది కెరటాల తాకిడికి నిలవదు. మునిగిపోతుంది. ఇంతకన్నా పెద్ద పడవ కావాలి" అన్నాడు ఫ్రైడే.

"అయితే మనం ఒక పెద్ద పడవను తయారు చేద్దాం" అన్నాడు క్రూసో.

పెద్ద పడవను తయారు చేయడానికి ఒక పెద్ద చెట్టును ఆ మర్నాడే ఫ్రైడే ఎన్నుకొన్నాడు. అతనికి చెట్ల గురించి బాగా తెలుసును ఆ చెట్టును గొడ్డలితో ఒక రోజులో అతడు నరికి పడగొట్టాడు.

తనవద్దనున్న వడ్రంగి పనిముట్లను ఎలా ఉపయోగించాలో క్రూసో ఫ్రైడేకి నేర్పాడు. వారిద్దరూ కలిసి కష్టపడి ఒక నెల రోజుల్లో ఆ మానును పడవగా తయారు చేశారు. క్రూసో చేసిన పడవ కన్నా ఇది చాలా పెద్దది. తీరానికి దూరంగానే ఉన్నా ఒకరికి ఒకరు తోడు ఉండడంతో వారిద్దరూ కలిసి గుండ్రని కర్రముక్కలపైని ఆ పడవను జరుపుకొంటూ సముద్ర తీరానికి చేర్చారు. సముద్రానికి పోటు వచ్చినప్పుడు ఫ్రైడే ఒక్కడే అతి సులువుగా ఆ పడవను నీటిలోనికి మళ్ళించాడు. అతని నేర్పుకు క్రూసో ఆశ్చర్యపోయాడు. కెరటాలలో తేలియాడుతున్న ఆ పడవను చూసి వారిద్దరూ ఒకర్ని ఒకరు అభినందించుకొన్నారు.

"ఈ పడవలో మనం మీ దేశం వెళ్ళగలమా ?" అని క్రూసో ఫ్రైడేని అడిగాడు.

"ఓ ! సులువుగా వెళ్ళగలం ! పెనుగాలి ఎదురు వచ్చినా వెళ్ళగలం !" అంటూ ధైర్యంతో, గర్వంతో, సంతోషంతో ఫ్రైడే చెబుతూ ఆనందంతో నృత్యం చేశాడు.

తర్వాత ఫ్రైడే, క్రూసో కలిసి ఒక తెరచాపను ఒక కొయ్యకు అమర్చారు. ఇతర హంగులన్నీ ఆ పడవలో అమర్చుకొనడానికి వారికి మరి రెండు నెలలు పట్టింది. పడవ సముద్రయానానికి తయారయింది. కాని ఇంతలో వర్షాకాలం వచ్చింది. వారి సముద్ర యానం వాయిదా పడింది.
ముందరి పేజి               తరువాతి పేజి


www.maganti.org