రాబిన్ సన్ క్రూసో కథ - Chapter 7 |
గొర్రెలను, పక్షులను తన తుపాకులతో వేటాడుతున్న కొద్దీ క్రూసో వద్ద మందుగుండు తరిగిపోతూ వచ్చింది. తనవద్ద నున్న మందుగుండు పూర్తిగా అయిపోతే తన తుపాకులకు మరి పని ఉండదు. "ఎవరైనా శత్రువులుగాని, ఏవైనా క్రూర మృగాలుగాని నన్ను ఎదుర్కొంటే నాగతేంకాను ?" అని క్రూసో అలోచించసాగాడు.
అడవి గొర్రెలను వేటాడి చంపి తినడంకన్నా వాటిని పట్టుకొని, పెంచి అవసరమైనప్పుడు చంపి వండుకొని తినడం మంచిదని క్రూసో నిర్ణయించుకొన్నాడు. కాని వాటిని ఎలాగ పట్టుకొనడం ? తను కనబడితేనే అవి జడిసి పరుగెత్తి పారిపోతున్నాయి. వాటిని పట్టుకొనడానికి ఉపాయం ఆలోచించసాగాడు. అడవి గొర్రెలు తరచుగా మేత కోసం వచ్చే ప్రదేశం అతనికి తెలుసు. అక్కడ ఒక లోతయిన పెద్ద గొయ్యిని అతడు త్రవ్వాడు. ఆగోతిపైని సన్నని కట్టె పుల్లలను పేర్చి వాటిపైని మట్టిని పోశాడు. ఆ మన్ను కనబడకుండా ఆకులతో కప్పాడు. తర్వాత వాటిపైని గోధుములను కుప్పగా పోసి, చెట్టు ఎక్కి మాటువేశాడు. కొన్ని గొర్రెలు పచ్చగడ్డిని మేస్తూ అటు వచ్చాయి. వాటిలో రెండు పెద్ద గొర్రెలు, మూడు గొర్రె పిల్లలు గోతిమీది గోధుమలు చూసి తినడానికి ఆశతో వచ్చి గోతిలో పడ్డాయి. పెద్ద గొర్రెలను మచ్చిక చేసికొనడం సాధ్యంకాదని క్రూసో వాటిని చంపి విందు చేసికొన్నాడు. గొర్రెపిల్లలను పట్టుకొని వాటిని తన ఇంటి ముందు ఒక చెట్టుకు కట్టాడు. వాటికి రోజూ మేత పెడుతూ వాటిని మచ్చిక చేసికొన్నాడు. అతని వద్ద ఇప్పుడు నాలూగు గొర్రె పిల్లలు ఉన్నాయి. "సాగరదృశ్యం" చేరువలో ఒక పచ్చిక మైదానం ఉంది. ఆ మైదానం చుట్టూ అతడు ఒక ఎత్తయిన కంచె వేశాడు. ఆ ఆవరణలో ఆ నాలుగు గొర్రెపిల్లలను అతడు వదిలి పెట్టాడు. అక్కడ అవి స్వేఛ్చగా కావలసినంత పచ్చికను మేస్తూ అక్కడ ఉన్న చెట్ల నీడను విశ్రాంతి తీసికొంటూ ఉండేవి. వాటికి నీటి వసతి కూడా అతడు ఏర్పరచాడు. రోజూ అతడు వాటితో కాస్సేపు కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. రెండేళ్ళు గడిచేసరికి, వండుకుతిన్న గొర్రెలు పోగా అతడు నలభై మూడు గొర్రెలకు అధిపతి అయ్యాడు. ఆ గొర్రెలు తన అవసరానికి మించినన్ని పాలను ఇచ్చేవి. త్రాగగా మిగిలిన పాలతో అతడు వెన్నా, నెయ్యీ, జున్నూ తయారు చేసికొని తింటూ ఉండేవాడు. పడవ మీద వెళ్ళి గండం తప్పి ప్రాణాలతో సముద్రంలోనుండి బయట పడ్డ తర్వాత అతడు ఇంగ్లండ్ ప్రయాణం గురించి అలోచించడమే మానివేశాడు. ఆ ద్వీపం మీద తన ఒంటరి జీవితాన్ని వీలయినంతవరకు సుఖమయం చేసికొనడానికే అతడు నిశ్చయించుకొన్నాడు. ఆ దృష్టితోనే కృషి చేయదలచుకొన్నాడు. గోధుమ పంట సమృధ్ధిగా పండు తున్నది.అయినా అతడు గోధుమ రొట్టెలను తిని చాలా రోజులయింది. గోధుమ పిండితో రొట్టెలను తయారు చేసికొనాలన్న తలంపు అతనికి కలిగింది. కాని గోధుములను ఎలా పిండి కొట్టడం ? ఆలోచిస్తే సాధించ లేని కార్య ముండదు. ఒక గట్టి మానును రోలు ఎత్తున కోసి దాని మధ్యను నిప్పులు పోసి కాల్చి గుంటను ఏర్పరచి ఒక రోలును అతడు తయారు చేశాడు. ఒక కర్ర రోకలిని తయారుచేసి గోధుములను పిండి కొట్టాడు. ఆ పిండిని ఒక పాత గుడ్డలో వేసి వస్త్ర కాళం చేసాడు. పిండి సిద్ధమయింది కాని రొట్టెలను కాల్చడానికి రొట్టెల పొయ్యి లేదు. ఆలోచిస్తే అసాధ్యమయినది లేదుకదా ? కుండలను తయారు చేసినట్టే రెండు రొట్టె అచ్చులను అతడు మట్టితో తయారు చేసి కాల్చాడు. రెండు రాతి పలకల మీద పెద్ద మంట పెట్టాడు. నీళ్ళతో గోధుమ పిండిని ముద్దగా కలిపి అచ్చులో వేశాడు. ఎర్రగా కాలిన రాతి పలకపైని ఈ అచ్చులను పెట్టి వాటి మీద ఒక కుండను బోర్లించి దాని చుట్టూ మంట పెట్టాడు. కొంతసేపయిన తర్వాత కుండను తీసి చూశాడు. ఎర్రగా కాలిన రొట్టెలు అచ్చుల్లో కనబడ్డయి. సంతోషంతో క్రూసో ఎగిరి గంతు వేశాడు. ఆ రొట్టెలను గొర్రెమాంసం కూరతో తింటూ ఉంటే అతనికి పండగ అనిపించింది. ఒంటరి జీవితమే అయినా రొట్టె, పాలు, వెన్న, జున్ను, మాంసం, పండ్లు మొదలైన ఆహారపదార్ధాలు క్రూసోకు సమకూరేయి. సొంత ఇల్లుంది. ఇల్లేమిటి ఆద్వీపమే అతని సొంతం. ఏపని ఎప్పుడు చేసినా అతన్ని అడిగేవారు లేరు. అతడు స్వేచ్చా జీవి. మొత్తంమీద ఆ ద్వీపంలో అతని జీవితం ప్రశాంతంగానే గడిచిపోతున్నది. కాని అతనికి ఒకే దిగులు. అది తను మళ్ళా మనుష్య ప్రపంచంలోనికి వెళ్ళే అవకాశం లేదేమోనని. తన పడవ ఉన్నచోటికి వెళ్ళాలని అతనికి ఒక నాడు అనిపించింది. తన గొర్రె చర్మం దుస్తులు ధరించి బొచ్చు టోపీ పెట్టుకొన్నాడు. తన వింత గొడుగును పట్టుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా బయలుదేరాడు. అతని వేషం ఎలా ఉన్నా అతన్ని చూసి నవ్వేవారు అక్కడ ఎవరూ లేరు. అతని తలమీది టోపీకి సరియైన ఆకారం లేదు. దాని వెనుక అంచు మెడ మీదకు వేళ్ళాడుతూ ఉంది. వేస్ట్ కోటు నడుందాటి తొడలమీద జీరాడుతూఉంది. పంట్లాం మోకాళ్ళవరకే ఉంది. అది పొట్టి పంట్లామో పొడుగు నిక్కరో చెప్పడం కష్టం. నడుముకు కట్టుకొన్న తోలు బెల్టులోనుండి ఒక గొడ్డలి, ఒక రంపం వ్రేలాడుతున్నాయి. భుజం మీదనుండి నడుముకు అడ్డుగా కట్టుకొన్న క్రాస్ బెల్టు సంచుల్లో మందుగుండు నిండుగా ఉంది. వీపు మీద ఆహారపదార్ధాల బుట్ట ఉంది. భుజంమీది నుండి ఒక రైఫిల్ వేలాడుతూఉంది. ఈ వేషానికి తోడు తన వింత గొడుగును వేసికొని బయలుదేరాడు. అతడు తన పడవ వద్ద కాస్సెపు కూర్చొని, సముద్రంలోని ఆటుపోటులను పరిశీలించి, ఇంటికి బయలు దేరాడు. అతడు మెల్లగా అడుగులు వేసికొంటూ ఆలోచిస్తూ కిందకు చూస్తూ నడుస్తూ ఒక్కసారి ఆశ్చర్యంతో ఆగిపోయాడు. ఆశ్చర్యంతోపాటు అతనికి భయం కూడా కలిగింది. చలనం లేకుండా రాతి బొమ్మలా నోరు తెరచుకొని నిలబడి పోయాడు. కొంతసేపటికి క్రూసో తేరుకొని చుట్టూ కలియజూశాడు. చెవులను నిక్కించి విన్నాడు. అతనికి కొత్తది ఏదీ కనబడలేదు. సముద్రం హోరు తప్ప వేరొక శబ్దం వినబడలేదు. అతడు తన కళ్ళ ముందు తడి ఇసుకలో ఉన్న పాదముద్రను పరిశీలిస్తూ ఉండి పోయాడు. అది మనుష్యుని పాదముద్ర. ఆ ముద్ర అక్కడ ఎలా పడింది ? అది ఎవరి పాద ముద్ర ? ఈ ప్రశ్నలకు అతనికి సమాధానం దొరకలేదు. ఆ పాదముద్రను అలా చూస్తున్న కొద్దీ అతనికి భయం ఎక్కువ కాసాగింది. అతనికి ఎదురుగా కాళ్ళముందు ఒకే ఒక పాదముద్ర ఉంది. ఇంకా మరికొన్ని పాదముద్రలు కనబడవచ్చునని ఆ సముద్ర తీరాన అతడు అటూ ఇటూ తిరిగి చూశాడు. కాని పాదముద్రలు ఏవీ కనబడలేదు. ఇంతకూ అతడు చూసింది పాదముద్ర అవునో కాదో నన్న సందేహంతో ఆ పాదముద్ర వద్దకు మళ్ళా అతడు వెళ్ళాడు, దానిని నిశితంగా చూశాడు. సందేహం లేదు, అది మానవుని పాద ముద్రే ! తడి ఇసుకలో స్పష్టంగా కబడుతూనేఉంది. దానిని గురించి ఆలోచిస్తున్న కొద్దీ అతనికి సందేహం, అనుమానం, భయం, పిరికితనం కలుగజొచ్చయి. ఎవడో ఒక అడవి మనిషి వేరొక ద్వీపంనుండి తన ద్వీపానికి వచ్చి ఉండాలన్న భయం ఎక్కువయింది. ఇక అక్కడ ఉండలేక మెల్లగా అడుగులో అడుగు వేసికొంటూ, ప్రతి రెండు అడుగులకూ ఒక సారి వెనక్కు తిరిగి చూస్తూ ముందుకు అడుగులు వేస్తూ మెల్లగా ఇంటివైపు నడవసాగాడు. దూరంగా అడవిలో ఉన్న ప్రతి చెట్టూ అతనికొక అడవి మనిషి లాగ కనబడసాగింది. ఏ క్షణాన్నైనా అడవి మనుష్యులు వచ్చి తన మీద పడవచ్చు నన్న భయంతో తన తుపాకీమీద చెయ్యి వేశాడు గాని దానిని తీసి మందుగుండు దట్టించలేకపోయాడు. ఎలాగైతేనేం అతడు తన "సాగరదౄశ్యం" చేరుకొన్నాడు. మూడు రోజులపాటు అతడు ఆ ఇంట్లో నుండి బయటకు రాలేదు. ఆ మూడు రోజులూ తిండి తింటున్నా, పడుకొన్నా, ఏ పని చేస్తున్నా ఆ పాదముద్ర గురించే ఆలోచించసాగాడు. ఇంతకూ ఆ పాద ముద్ర తనదే కావచ్చునన్న అనుమానం అతనికి నాలుగవ రోజున కలిగింది. ఆ అనుమానం తీర్చుకొనడానికిగాను అతడు బిక్కు బిక్కు మంటూనే సముద్ర తీరానికి వెళ్ళాడు. చెరిగిపోకుండా ఆ పాదముద్ర తడి ఇసుకలో ఇంకా అలాగే ఉంది. ఆ ముద్రను తన పాదంతో కొల్చి చూసికొన్నాడు. ఆ ముద్ర తన పాదానిది కాదన్న నిశ్చయానికి అతడు రాక తప్పలేదు. ఆ ముద్ర తన పాదం ఆదికన్నా పెద్దదిగా ఉంది. భయంతో మళ్ళా ఇంటి ముఖం పట్టాడు. ఆ ద్వీపం మీదకు అడవి మనిషో, మనుష్యులో వచ్చారన్నది నిజం అన్న అభిప్రాయానికి క్రూసో రాక తప్పలేదు. తనని తాను రక్షించుకొనడానికి అతడు ఆ ద్వీపం వదిలి పోలేడు. కనుక తన ఆత్మరక్షణకు కొన్ని ఏర్పాట్లు చేసికొనడం తప్పదనుకొన్నాడు క్రూసో. తర్వాత తన ఆలోచనలను కార్యరూపంలో పెట్టసాగాడు. తన ఇంటి చుట్టూ ఉన్న గోడకు కాపుదలగా దాని ముందున పదడుగుల ఎత్తున మరొక గోడను అతడు నిర్మించాడు. ఆ గోడకు పొడుగునా ఏడు చోట్ల ఏడు కన్నాలు పెట్టాడు. శత్రువులు ఎవరైనా తన ఇంటిని ముట్టడిస్తే వారికి కనబడకుండా ఆ ఏడు కన్నాలలో నుండి ఒకేసారి ఏడు తుపాకులను పేల్చడానికి తగిన ఏర్పాట్లనుగూడా అతడు చేశాడు. ఆ గోడ బైటవారికి కనబడకుండా ఉండాలని దాని చుట్టూ క్రూసో మొక్కలను నాటేడు. అవి త్వరలో పెద్దవయి తన ఇంటిని మరుగు పరచాయి. తన గొర్రెలను మూడు మందలకింద విభజించి, మూడు ప్రదేశాలలో కంచెలు వేసి ఉంచాడు. కొండమీద ఉన్న ఒక చిన్న గుహలో తన దూరదర్శినిని, ఒక రైఫిల్ ను, కొంత మందుగుండును దాచిపెట్టాడు. అక్కడ నుండి తన శత్రువుల రాకపోకలను గమనించదలచాడు. తన ఆత్మరక్షణకోసం తను చేసికొన్న ఈ ఏర్పాట్లతో అతడు తృప్తి పడ్డాడు. ప్రతి ఉదయం క్రూసో కొండపైకి ఎక్కి శత్రువులు ఎవరైనా తన ద్వీపం మీదికి వచ్చారేమోనని తన దూరదర్శినితో చూసేవాడు. అంతే కాదు దైవవశాత్తు ఏదైనా ఓడ తన ద్వీపం వైపు వస్తే బాగుండునన్న ఆశతోగూడా చూస్తూ ఉండేవాడు. ఏ ప్రమాదం సంభవించకుండా ఒక సంవత్సరం పాటు రోజులు గడిచాయి. రోజులు గడుస్తున్న కొద్దీ రాబిన్ సన్ క్రూసో ఆ పాదముద్ర విషయం మరచిపోసాగాడు. |
ముందరి పేజి తరువాతి పేజి |