రాబిన్ సన్ క్రూసో కథ - Chapter 6
రాబిన్సన్ క్రూసో ఇన్నాళ్ళూ ఆ ద్వీపంలో ఒక వైపునే ఉంటూవచ్చాడు. రెండవ వైపు ఎలాగ ఉందో చూడాలన్న కోరిక అతనికి కలిగింది. ఒకనాడు అతడు ఒక తుపాకీని చేతపుచ్చుకొని, ఆహారపదార్ధాలతో ఒక సంచీని భుజానికి తగిలిచుకొని తన కుక్కతోగూడా ఆ ప్రాంతాన్ని చూడాలని బయలుదేరాడు.

అతడు నడచుకొంటూ ద్వీపానికి రెండవ వైపున నున్న సముద్ర తీరాన్ని చేరుకొన్నాడు. అక్కడ చాలా తాబేళ్ళు, అనేక రకాలైన పక్షులు, చేరువుగా అడవి ప్రంతంలో మందలు మందలుగా పరుగెత్తుతూ అడవి గొర్రెలు అతనికి కనిపించాయి. అతడు నివసిస్తున్న ప్రాంతంలో అతడు ఎప్పుడూ ఇన్ని తాబేళ్ళను, పక్షులను, గొర్రెలను చూడలేదు. ఈ ప్రాంతంలో నివసిస్తే పుష్కలంగా ఆహారం దొరుకుతుందన్న ఆశ అతనికి కలిగినా, ఏదైనా ఓడ ఆ ద్వీపానికి చేరువగా వస్తే తను ప్రస్తుతం నివసిస్తున్న వైపుకే వస్తుందన్న నమ్మకం ఉండడం వలన ఈవైపున అతను నివసించదలచుకొనలేదు.

ఆ ప్రదేశమంతా పరిశీలిస్తూ కాలినడకను పదిపన్నెండు మైళ్ళు ఆ తీరం వెంబడి వెళ్ళాడు. తర్వాత వెనుకకు పోదలచాడు. తను వెనుకకు మరలిన చోట గుర్తుగా ఒక రాటను పాతాడు. ఈ సారి అతడు రెండవవైపునుండి ఆ రాట వరకు రాదలచాడు.

క్రూసో మరలి వస్తున్నప్పుడు ఆ తీరానికి సుమారు ఇరవై మైళ్ళ దూరంలో మరొక ద్వీపం ఉన్నట్టు అతనికి కనిపించింది. వీలైనంత త్వరలో ఆ ద్వీపానికి వెళ్ళాలనుకొన్నాడు. ఈ ఒంటరి బ్రతుకునుండి విముక్తి పొందాలన్న వాంఛ అతని మనస్సులో ఎప్పుడూ ఉంటూనే ఉంది.

దూరంగా కనబడుతున్న ఆద్వీపాన్ని చరుకొంటే తన స్వదేశమైన ఇంగ్లండ్ చేరుకొనే అవకాశం లభిచవచ్చునని అతని ఆశ. పెద్ద పడవ ఒకటి మంచిది ఉంటే అందులో ఎలాగైనా ఆ ద్వీపానికి వెళ్ళ వచ్చు ననుకొన్నాడు. కాని అదే లేదు. కనుక తానే ఒక మంచి పడవను తయారుచేసికొనాలని నిర్ణయించుకొన్నాడు.

"అయితే పడవను ఎలా తయారు చేయాలి ? ఇంతకు తను ఒక పడవను తయారుచేస్తే అది సముద్రయానానికి పనికి వస్తుందా ?" అన్న అలోచనైనా లేకుండా ఆ మర్నాడే తన పని ప్రారంభించాడు.

"సాగరదృశ్యా"నికి చేరువలో సముద్రతీరం వైపునున్న ఆరు అడుగుల మందం గల ఒక చెట్టును అతడు ఎంచుకొన్నాడు. కొన్నాళ్ళకు కష్టపడి దానిని గొడ్డలితో నరికి పడగొట్టాడు. ఒక నెల రోజులు శ్రమపడి దానిని పడవ ఆకారంలో చెక్కాడు. తర్వాత దానిలో తొట్టిని దొలిచాడు. మొత్తం మీద నాలుగు నెలలలో ఒక పడవను తయారు చేశాడు. కష్టపడి తయారు చేసినందుకు అది చక్కగానే తయారయింది. తన నేర్పుకు తనే మురిసిపోయాడు.

సముద్రానికి నూరు గజాల దూరంలో ఆ పడవ తయారయి ఇసుకలో ఉంది. తానొక్కడు దానిని నీటిలోనికి లాగుకొని పోలేడు. దానిని ఎలాగైనా నీటిలోనికి తీసికొని వెళ్ళాలి. ఉపాయాలు ఆలోచించసాగాడు. పడవను నీటిలోనికి తీసికొని వెళ్ళే అవకాశం లేదని అతడు గ్రహించాడు. సముద్ర జలాన్నే పడవ వద్దకు ఎందుకు తీసికొని రాకూడదనుకొన్నాడు. అది అతనికి అసాధ్యం కాదనిపించింది. వెన్శ్టనే అతడు సముద్రతీరం నుండి పడవ వరకు ఒక కాలువను త్రవ్వనారంభించాడు. ఎంతో శ్రమపడి ఆరడుగుల వెడల్పున నాలుగు అడుగుల లోతున కాలువను కొన్ని నెలల్లో త్రవ్వ గలిగాడు క్రూసో. అతని పడవ ఆ కాలువ నీటిలో తేలియాడుతూ కనబడే సరికి ఆ సంతోషంతో తను పడిన శ్రమను మరచిపోయాడు.

ఆ పడవకు క్రూసో ఒక తెరచాపను అమర్చాడు. గట్టి కర్ర చెక్కలతో రెండు తెడ్లను తయారు చేశాడు. ఒక బరువైన ఇనుప ముక్కతో ఒక లంగరునుకూడా ఏర్పరచాడు. పడవకు ముందున, వెనుకను తొట్టెలో రెండు పెట్టెలను బిగించాడు. వాటిలో ఆహారపదార్ధాలను, పిస్తోళ్ళను, మందుగుండు మొదలైన సామానులను చెమ్మ తగలకుండా జాగ్రత్తగా పెట్టాడు. పడవ లోపలి అంచుకు దిగువగా చెక్కను దొలిచి అందులో ఒక రైఫిల్ను పెట్టి దానిపైని ఒక అట్టను అంటించాడు. తెడ్డు వేయడానికి కూర్చునే చోట తనకు ఎండ తగలకుండా ఉండడానికి తన గొడుగును అమర్చాడు. తన ఏర్పాట్లన్నీ చూసికొని తను ఇంగ్లండ్ ఆ పడవలో వెళ్తున్నట్టే ఊహించాడు.

ఆ ద్వీపానికి అతడు వచ్చి అప్పటికి ఆరేళ్ళయింది. అది నవంబర్ మాసం. సముద్రయానానికి అది అనుకూలమైన కాలం. కనుక ముందుగా తన పడవ సముద్రయానానికి నిలుస్తుందో లేదో పరీక్షచేయ దలచుకొన్నాడు. తన పరీక్షకు ఆ పడవ నిలిస్తే ప్రయాణానికి ఏర్పాట్లు వెంటనే చేసికోదలచుకొన్నాడు.

ముందుగా ఆ పడవలో ఒకసారి ఆ ద్వీపం చుట్టూ తిరిగి రావాలనుకొన్నాడు. ఆ పడవలో పశ్చిమ దిక్కుగా తీరం వెంబడి బయలుదేరాడు. కొద్దిదూరం అతడు వెళ్ళాడో లేదొ అతనికి కొన్ని రాళ్ళ బండలు అడ్డు వచ్చాయి. వాటిలో కొన్ని బండలు నీటి మట్టానికి పైనా, కొన్ని నీటి మట్టానికి అడుగున ఉన్నాయి. వీటిని పడవ ఢీకొని బోల్తా పడే అవకాశముంది. ఏమి చేయాలో అతనికి వెంటనే తోచలేదు.

"ఒడ్డుకు దూరంగాపడవను సముద్రంలోనికి తీసికొని వెళ్ళి చివరి బండను చుట్టి రావడమా? లేక వీలయినచోట బండలను తప్పించుకొంటూ తీరం వెంబడి వెళ్ళడమా?" అని అతడు కాస్సేపు అలోచించాడు. తీరానికి దూరంగా తీసికొని పోతే తన పడవ నిలుస్తుందన్న నమ్మకం అతనికింకా కుదరలేదు. అందువల్ల బండల మధ్య ఏదైనా తోవ కనబడుతుందేమోనని అతడు పరిశీలించాడు. బండలు అడ్డుగా లేని సన్నని మార్గం ఒకటి అతనికి గోచరించింది. పడవను అటువైపు మళ్ళించాడు. బండల మధ్యకు పడవ ప్రవేశించగానే అది నీటి వరవడిలో పడి అతని అధీనంలో లేకుండా తీరానికి దూరంగా కొట్టుకొని పోసాగింది. అతడు ఎంత ప్రయత్నిచినా ఒడ్డుకు రాలేకపోయాడు. క్షణ క్షణానికి అతడు ఒడ్డుకు దూరమవుతున్నాడు. ఆ సమయంలో గాలి కూడా అతనికి ప్రతికూలంగానే వీచింది. ఏ క్షణాన్నయినా పడవ బోల్తా పడవచ్చునని అతడు భయపడ్డాడు. బ్రతికి బయటపడే ఆశ అతనికి ఆడుగంటింది.

నిమిష నిమిషానికి రాబిన్సన్ క్రూసో తీరానికి దూరమవుతూ కొన్ని మైళ్ళ దూరం సముద్రంలోకి వెళ్ళాడు. ఇంతలో అస్తమించడానికి పశ్చిమ దిశను సూర్యుడు సిద్ధంగా ఉన్నాడు. క్రూసోకు భయం ఎక్కువయింది. కాని ఇంతలో గాలివాటు తీరంవైపు మళ్ళింది. రానురాను గాలి వేగం హెచ్చయింది. అతడు వెంటనే తెరచాపను ఎత్తేడు. గాలి వేగానికి పడవ అతి వేగంగా ద్వీపాన్ని చేరుకొంది. క్రూసో ప్రాణాలు తేలిక పడ్డాయి. క్రూసో పడవను ఒక చెట్టుకు కట్టి ఇసుకలో మోకాళ్ళపైని కూర్చొని తనను కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు తెల్పుకొన్నాడు.

ఆందోళన వల్లను, శ్రమ వల్లను క్రూసో అప్పటికే చాలా అలసిపోయాడు. అక్కడనుండి కదలలేక ఉన్నచోటనే ఇసుకలో పడుకొని ఒడలు మరచి నిద్రపోయాడు. ఆ మర్నాటి ఉదయానికి గాని అతనికి మెలకువ రాలేదు. లేవలేక లేవలేక అతి కష్టం మీద అతడు లేచికూర్చొని చుట్టూ కలియ జూశాడు. అతడు ఏ ప్రాంతంలో ఉన్నదీ, అక్కడనుండి తన పడవ ప్రయాణం ఎటుసాగించాలో అతనికి తెలియలేదు. అతనికి తూర్పు దిక్కున సముద్రంలో రాళ్ళబండలు కనిపించాయి. క్రితం రోజున ఆ రాతి బండలు పెట్టిన కష్టాలు జ్ఞప్తికి వచ్చాయి. అక్కడ నుండి తన ప్రయాణాన్ని పడమటివైపు సాగించదలచాడు. ప్రస్తుతం తను ఉన్న ప్రాంతాన్ని పరిశీలించదలచి అక్కడకు చేరువలో నున్న ఒక ఇసుక దిబ్బను ఎక్కి చూశాడు.

ఆ ప్రదేశాన్ని లోగడ ఒకసరి చూసినట్లు అతనికి అనిపించింది. కాస్సేపు ఆలోచించగా లోగడ ఒకసారి తన "వన విహార్" నుండి ఆ ప్రదేశానికి వచ్చినట్టు జ్ఞప్తికి వచ్చింది. తను లోగడ పాతిన రాట అతనికి కనిపించి ఆ విషయం నిజమని రుజువు చేసింది.

"వన విహార్" అక్కడకు దూరంగానే ఉన్నా అతడు ఒక రైఫిల్ ను చేత పుచ్చుకొని గొడుగు వేసికొని అటువైపు వెళ్ళాడు. సాయంత్రానికి అతడు "వన విహార్" చేరుకొన్నాడు. అతడు ఇల్లు చేరుకొనే సరికి ఎండలో నడవడంవల్ల బాగా అలసి పోయాడు. గోడ దాటి ఇంట్లో ప్రవేశించి ఇల్లంతా చూశాడు. అతడు ఎలాగ వదిలిన వస్తువులు అలాగే ఉన్నాయి. ఇంతలో చీకటి పడింది. పడుకొనగానే అలసటవల్ల గాఢ నిద్రపట్టింది

అతనికి మంచి నిద్రలో మెలకువ వచ్చింది. ఇల్లంతా చాలా చీకటిగా ఉంది. ఆ చీకట్లో ఎవరో అతన్ని "క్రూసో ! క్రూసో !" అని పిలిచినట్లనిపించింది. అతనికి భయం వేసింది. అది కల అనుకొన్నాడు. ఇంతలో "క్రూసో ! ఎక్కడ ఉన్నావ్ రాబిన్సన్ ? ఎక్కడికి వెళ్ళావ్ క్రూసో ?" అన్న మాటలు వినబడ్డాయి. అతనికి ఆశ్చర్యం వేసింది. అతన్ని ఆ ద్వీపంమీద అంత చనువుగా పిల్చేవారు ఎవరున్నారు ? ఈ ఆలోచనలకు అతనికి నిద్రమత్తు వదిలిపోయింది. ఇంతలో మళ్ళా అవే మాటలు వినబడ్డాయి. తనను అలా ఎవరు పలకరిస్తున్నారో అతడు అప్పుడు గుర్తించాడు. అలా తనను పిలిచినది ఎవరో కాదు,తను పెంచుకొంటున్న రామచిలుక ! తన రామచిలుక తనని వెతుక్కొంటూ "సాగరదృశ్యం" నుండి ఈ "వనవిహార్"కు వచ్చింది. తన యజమాని కోసం అది ఎంత ఆరాటపడి వెతికిందో గదా !

క్రూసో "వనవిహార్"లో మూడు రోజులు ఉండి తర్వాత నడచుకొంటూ "సాగరదృశ్యం" చేరుకొన్నాడు.

సముద్రంలోని ఆటుపోటులను శ్రద్ధగా గమనిస్తే తన పడవమీద ఆ ద్వీపంచుట్టూ సురక్షితంగా తిరిగి రావచ్చునన్న ఆలోచనతో అతను ఒకనాడు బండల తీరానికి ఉదయమే వెళ్ళి కూర్చున్నాడు. సాయంత్రం వరకు సముద్రపు ఆటు పోటులను గమనించాడు.
ముందరి పేజి               తరువాతి పేజి


www.maganti.org