రాబిన్ సన్ క్రూసో కథ - Chapter 5
ఆ ద్వీపం మీద అడవి గొర్రెలు ఎక్కువగా ఉండడంవల్ల క్రూసో వాటినే వేటాడి తినేవాడు. కొన్నాళ్ళకు గొర్రె మాంసం అంటే అతనికి విసుగు పుట్టింది. తన ఆహారంలో మార్పు అవసరం అనిపించింది అతనికి. ఎదురుగా అతనికి సముద్రం ఉండనే ఉంది. అతడు సముద్రంలోని చేపలను వేటాడి, సముద్రతీరాన్న తాబేళ్ళను పట్టుకొని వాటిని కాల్చుకొని తినడం ప్రారంభించాడు. ఆహారంలో మార్పులు రావడంతో అతనికి ఎంతో తృప్తి కలిగింది.

ఓడలోనుండి తీసికొచ్చిన సంచులను ఒకనాడు అతడు విప్పి చూస్తే అతనికి కొన్ని సంచులలో గోధుమలు, బార్లీ గింజలు కనబడ్డాయి. ఒక సంచీలో అతనికి తుక్కు కనబడింది. ఆ సంచీని తన ఇంటిముందు దులిపి దాచాడు.

ఇది జరిగిన కొన్నాళ్ళకు వర్షాకాలం వచ్చింది. వర్షాలకు తన ఇంటిముందు పచ్చగా లేచిన గోధుమ మొక్కలు అతనికి కనబడ్డాయి. అవి ఎన్నో లేవు. పది పన్నెండు మాత్రమే ఉన్నాయి. అవి కొన్నాళ్ళకు వెన్నులు వేశాయి. ఆ తొలి పంటలో వచ్చిన గోధుమలను క్రూసో భద్రపరిచి వాటిలో కొన్నింటిని నేల శుభ్రం చేసి వేశాడు. కాని సకాలంలో వేయనందున అవి సరిగా మొలకెత్తలేదు. అందువలన మిగిలినవాటిని సకాలంలో వేశాడు. అవి బాగా లేచాయి. పంట బాగా పండింది. ఆ పంటలో వచ్చిన గోధుమలను మరుసటి సంవత్సరం సకాలంలో వేశాడు. ఈ విధంగా ఏటేటా సకాలంలో గోధుమ పంటను పండించడం వల్ల నాలుగైదు సంవత్సరాలలో అతనికి సంవత్సరానికి తగినంత పంట పండుతూ వచ్చింది.

ఒకనాడు తన ఇంటిముందు కూర్చొని క్రూసో వడ్రంగి పని చేసికొంటూ ఉండగా అతనికి నేల కదులుతున్నట్టు అనిపించింది. ఇంతలో కొండమీదినుంచి మట్టి పెల్లలు కిందికి పడ్డాయి. ఇంటిలో పాతిన రాటలు విరిగి పడ్డాయి. భూకంపం వచ్చినట్టు క్రూసో వెంటనే గ్రహించి తత్ క్షణం నిచ్చెన వేసికొని గోడ దాటి ఆరు బయటకు వచ్చాడు. కొండకు చేరువలో ఉంటే అది విరిగి తన మీద పడవచ్చునన్న భయంతో అతడు సముద్రతీరానికి పరుగెత్తాడు.

ఆ భూకంపానికి కొండమీదినుండి కొన్ని పెద్ద రాతి బండలు దొర్లుకొంటూ వచ్చి సముద్రతీరాన్ని చేరుకొన్నాయి. ఆ రాతిబండల చప్పుళ్ళకు క్రూసో కొన్ను నిమిషాలపాటు భయపడ్డాడు. ఈ చప్పుళ్ళకు తోడు ఈదురుగాలి విపరీతంగా వీచ సాగింది. దీంతో క్రూసోకు భయం ఎక్కువయింది. ఆ భయంతో అతడు ఇసుకలో బోర్లాపడుకొని తన చేతులతో తన తలను కాపాడుకొంటున్నట్టు పట్టుకొన్నాడు. కొంతసేపటికి భూకంపం ఆగిపోయింది. కాని మరి కాస్సేపటికి మరి రెండు మూడు సార్లు భూమి కంపించింది. ఆకశమంతా కారు మబ్బులతో మూసుకొని పోయింది. పెనుగాలి వీచసాగింది. కొండంత ఎత్తున కెటాలు లేచి సముద్ర తీరాన్న విరుచుకొని పడజొచ్చాయి. కొన్ని పెద్ద చెట్లు కూకటి వేళ్ళతో సహా నేల కూలయి. ఉరుములు, మెరుపులతో వాన ప్రారంభమయి కుంభవృష్టిగా కురియనారంభిచింది. వాతావరణమంతా భయంకరంగా తయారయింది. ఆ గాలి వానలో సముద్రతీరాన్నే క్రూసో భయంతో కొంతసేపు గడపవలసివచ్చింది.

కొంతసేపటికి గాలివాన తగ్గింది. క్రూసో భయపడుతూనే తలదాచుకొనడానికి తన ఇంట్లోకి వెళ్ళాడు. ఆ రాత్రంతా, ఆ మర్నాడుకూడా వర్షం చలాసేపు పడింది. ఇల్లు విడిచి వెళ్ళలేక క్రూసో తన ఇంట్లోనే కాలక్షేపం చేయవలసి వచ్చింది. ఆ తుఫానుతో ఆ ప్రాంతానికి వర్షాకాలం ప్రారంభమయిందని క్రూసో ఊహించాడు.

తరచు వానలో తడుస్తూ ఉండడంవల్ల ఒకనాడు క్రూసో నిద్ర లేచేసరికి కాళ్ళూ చేతులూ పీకడం మొదలుపెట్టాయి. ఆ బాధతో అతనికి ఆ నాటి రాత్రి నిద్ర పట్టలేదు. ఆ తర్వాత కొద్ది రోజులపాటు క్రూసో తన పడకమీది నుంచి జ్వరంవల్ల లేవలేక పోయాడు. ఏ తోడూ లేకుండా ఆ స్థితిలో ఉండడంతో క్రూసోకు చాలా భయం వేసింది. జ్వరం వలన తను చనిపోవచ్చునని అతడు అనుకొన్నాడు. కాని కొన్నాళ్ళ తర్వాత ఒకనాటి రాత్రి అతనికి గాఢనిద్ర పట్టింది. ఆ మరునాడు అతనికి వంట్లో తేలికగా ఉన్నట్టు అనిపించింది. అతడు లేచి నడవగలిగాడు. మరికొన్నాళ్ళకు ఆరోగ్యవంతుడైనాడు.

క్రూసో ఆ ద్వీపంమీదకు వచ్చి పది నెలలయినా ఆ ద్వీపమంతా అతడు చూడలేదు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూడాలన్న కోరికతో ఆ ద్వీపమంతా తిరగాలనుకొన్నాడు.

అది జులై మాసం. వాతావరణం పొడిగా ఉంది. అదే అనువైన కాలమని క్రూసో ఒకనాటి ఉదయం సెలయేటి గట్టు మీదుగా ఎగువకు నడచుకొంటూ వెళ్ళాడు. సెలయేటిలో నీరు కొద్దిగానే ప్రవహిస్తున్నది. సెలయేటికి ఇరుప్రక్కలా గట్ల పైని పచ్చగడ్డి ఒత్తుగా పెరిగి ఉంది. కొన్ని చెరకు మొక్కలు ఏపుగా ఎత్తుగా పెరిగి ఉన్నయి. కొన్ని చోట్ల దట్టమైన తుప్పలు పెరిగి చిట్టడవుల్లాగ ఉన్నయి.

ఎగువకు వెళ్తున్నకొద్దీ సెలయేటి వెడల్పు తగ్గుతూ వచ్చింది. ఇంకా అలా ఎగువకు వెళ్ళాడు. అక్కడ సెలయేటి నీరు తేటగా చల్లగా ఉంది. చెస్ట్ట్లు దట్టంగా ఏపుగా పెరిగి ఆ ప్రదేశం ఒక అడవిలాగ ఉంది. అక్కడ రకరకాల పండ్లు చెట్లకు వ్రేలాడు తున్నయి. పండ్ల బరువుకు కొన్ని చెట్ట్ల కొమ్మలు నేలను తాకుతున్నయి. చెట్లమీదకు ఎగబ్రాకిన ద్రాక్షతీగలకు ద్రాక్ష పండ్లు గుత్తులు గుత్తులుగా వ్రేలాడుతున్నాయి. నేల మీద లెక్కలేనన్ని కర్బూజా పండ్లున్నాయి. అన్ని రకాల పండ్లను చూసేసరికి అతనికి నోరు ఊరడం మొదలు పెట్టింది. ఎంతో సంతోషంతో సాయంత్రంవరకు కావలసినన్ని పండ్లను తింటూ ఆ చెట్ల నీడను తిరిగాడు. అతనికి ఆ ఆనందంలో సూర్యుడు అస్తమించడంకూడా తెలియలేదు. చీకటి పడుతూ ఉండగా క్రూసో అక్కడే ఒక పెద్ద చెట్టు ఎక్కి నిద్రపోయాడు.

ఆ మరునాడు ఉదయం క్రూసో మరి నాలుగు మైళ్ళు ఎగువకు వెళ్ళాడు. అతడు అడవి దాటి లోయలోనికి వెళ్ళాడు. ఆ లోయంతా పచ్చికతో, విరబూసిన రకరకాల పూల మొక్కలాతో ప్క ఉద్యానవనంలాగ అతనికి కనబడింది. ఆ ప్రకృతి సౌందర్యాన్ని అతడు చూసి పరవశించి తనని తాను మరచి పోయి అలా చూస్తూ నిలబడ్డాడు.

అతనికి ఇరుప్రక్కలా రెండు కొండలున్నాయి. ఒక ప్రక్కనుండి సెలయేరు తూర్పువైపుగా ప్రవహిస్తున్నది. ఆ ప్రదేశాన్నంతా క్రూసో ఒకసారి కలియజూసి "ఈ ప్రదేశమంతా నాది. ఈ సౌందర్యమంతా నాది. నా హక్కును కాదనే వారు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఈ రాజ్యానికి నేనే రాజును" అని తనలో తనే అనుకొన్నా బిగ్గరగా పైకే అన్నాడు.

క్రూసో మూడు రోజులు కాలినడకను తన ప్రయాణాన్ని సాగించాడు. తర్వాత ఇల్లు చేరుకొన్నాడు. కొన్ని కమలా పండ్లను, కొన్ని ద్రాక్షపండ్లను క్రూసో ఇంటికి తీసికొని వెళ్ళాడు. కాని ద్రాక్షపండ్లు పాడయినాయి.

ఆ మర్నాడు క్రూసో రెండు సంచులను తీసికొని వెళ్ళి వాటినిండా కమలా పండ్లను తెచ్చుకొన్నాడు. ద్రాక్షపండ్లు ఎండు ద్రాక్షలు అవాలని వాటిని చెట్లమీదనే వదిలి పెట్టాడు. ఏవేవో పండ్లు ఆ అడవి ప్రాంతమంతా నేలమీద పడి ఉన్నాయి. వాటిలో చాలా వాటిని ఏవో సగం కొరికి వదిలిపెట్టాయి. వాటిని కొరికినవి జంతువులో, పక్షులో క్రూసోకు తెలియ లేదు.

ఆ సౌందర్యవంతమైన అడవి ప్రాంతం క్రూసోకు ఎంతో నచ్చింది. అందువల్ల వీలైనంత ఎక్కువ కాలం అక్కడ గడపాలనుకొన్నాడు. గాని దానివల్ల అతనికి నష్టం కలుగ వచ్చును. ఎక్కువ కాలం అక్కడే ఉంటే సముద్రం అతనికి కనబడదు. అదృష్టవశాత్తూ ఏదైనా ఓడ ద్వీపానికి చేరువగా వస్తే అతనికి అది కనబడదు. స్వదేశం చేరుకొనే అవకాశం అతనికి అనవసరంగా పోతుంది. కనుక అప్పుడప్పుడు వచ్చి ఆ ప్రంతంలో సరదాగా గడపదలచుకొన్నాడు క్రూసో. అందుకోసమని అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకొన్నాడు. దాని చుట్టూ ఒక గట్టి గోడను కట్టాడు. ఆ ఇంటికి "వన విహార్" అని పేరు పెట్టాడు. తన పాత ఇంటికి "సాగర దృశ్యం" అని నామకరణం చేశాడు."

సెలయేటికి చేరువలోనున్న ఆ అడవి ప్రదేశమంతా చాలా సారవంతమైనది గనుక అక్కడ కొంత నేలను శుభ్రం చేసి, బాగా తవ్వి, రెండు మళ్ళను తయారు చేశాడు. ఒక మడిలో గోధుమలు, రెండవ మడిలో బార్లీ గింజలు జల్లి నీరు పెట్టాడు. అవి మొలకలు ఎత్తి వెన్ను వేసే సమయానికి ఆ మళ్ళ చుట్టూ అతడు కంచె వేశాడు. కంచె వేయకపొతే అడవిగొర్రెలు వచ్చి చేలను నాశనం చేస్తాయని అతనికి తెలుసు. పగటిపూట పక్షులు వచ్చి నాశనం చేయడం మొదలు పెట్టాయి. అందుకని అతడు పగటిపూట చేలకు కపలా కాయవలిసి వచ్చింది. రోజంతా అతనికి వృధా కావచ్చింది. అందుకని అతడు కొన్ని పక్షులను చంపి చేలలో అక్కడక్కడ రాటలకు వేలాడవేశాడు. ఆ చచ్చిన పక్షులను చూసి ఇతర పక్షులు చేలమీదకు రావడం మానివేశాయి. క్రూసో కష్టపడినందుకు అతనికి తగిన ప్రతిఫలం దక్కింది. గోధుమ, బార్లీ పంటలు బాగా పండాయి.

వర్షాకాలంలో ఇల్లు విడిచి ఎక్కువసేపు బయటకు వెళ్ళడానికి క్రూసోకు వీలుండేది కాదు. అందుకని అతడు సన్నని, మెత్తని చెట్లకొమ్మలను నరికి తీసికొని వచ్చి బుట్టలు అల్లడం ప్రారంభించాడు. మొదట్లో ఆ బుట్టలు అంత బాగుండకపోయినా తన అవసరానికి పనికి వచ్చాయి. కొన్నాళ్ళకు అతనికి బుట్టలు అల్లడంలో నేర్పు వచ్చింది.

వండుకొని తినడానికి తగిన పాత్రలు అతని వద్ద లేవు. మంచి నీళ్ళు నిలవచేసికొనడానికైనా పాత్రలు అతనికి అవసరం. కాని అతని వద్ద ఏ పాత్రలూ లేవు. కనీసం మట్టిపాత్రలు ఉన్నా అతని అవసరం గడుస్తుంది. కుండల్ని తయారుచేయడం అతనికి తెలియదు.

కుండలను తయారుచేడానికి బంక మన్ను కావాలి. సారె లేకపోయినా కష్టపడి చేత్తో కుండలను తయారు చేయవచ్చును. అలా తయారు చేసిన వాటిని ఆరబెట్టాలి. అవి గట్టి పడినంతమాత్రాన అవి వినియోగపడవు. వాటిని కాల్చాలి. ఇదంతా క్రూసోకు తెలియదు. కాని అనుకోకుండా కుండలను తయారుచేయడంఅతడు తెలిసికొన్నాడు.

ఒకనాడు అతను గొర్రె మాంసం కాల్చుకొంటున్నప్పుడు ఒక మట్టి ప్రమిద మంటలో కాలి ఎర్రగా తయారవడం చూశాడు. అతని అనందానికి అంతు లేకపొయింది. వెంటనే అతడు బంక మన్నుతో కొన్ని మట్టి పాత్రలను తయారుచేసి ఆరబెట్టి ఆ రాత్రి వాటిని వామిలో కాల్చాడు. ఆ పాత్రలు బాగా కాలి గట్టిగా తయారయినాయి. అవి ఆకారంలో అందంగా లేకపోయినా తన అవసరాలకు బాగా ఉపయోగపడ్డాయి.

క్రూసో తొడుగుకొంటున్న బట్టలు బగా చిరిగిపోసాగాయి. కొత్త బట్టల అవసరం అతనికి కలిగింది. పంట్లాలు వేస్ట్ కోట్లు అతనికి అత్యవసరమైనాయి. నూలు బట్టలు తయారు చేసికొనే అవకాశం అతనికి లేదు. ఉన్ని వస్త్రాలు తయారు చేసికొనే అవకాశం అతనికి ఉన్నా అతనికి వాటిని తయారుచేయడం తెలియదు. అందువల్ల అతడు చంపిన గొర్రెల చర్మాలతోనే బట్టలను తయారుచేసికొనదలచాడు. దర్జీ పనిలో తన నేర్పును తెలిసికొనవలసిన సమయం ఆసన్నమైనదని అతడు అనుకొన్నాడు.

ముందుగా అతనొక బొచ్చు టోపీని తయారు చేశాడు. అది తన తల ఆదికి మించి వదులుగా, పెద్దదిగా తయారయింది. తర్వాత ఒక జత బట్టలు కుట్టుకొన్నాడు. అవి కూడా వదులుగానే తయారయినాయి. ఆ ద్వీపం మీద ఎండవేడి ఎక్కువ గనుక వదులుగా ఉండే బట్టలను తొడుగుకొనడం మంచిదని తనని తాను సమర్ధించుకొన్నాడు. తన బట్టలు ఎలాగున్నా తనను మెచ్చుకొనే వారు గాని, వెక్కిరించే వారు గాని ఆ ద్వీపం మీద ఎవరూ లేరు కనుక తన అవసరం తీరితే చాలు అనుకొన్నాడు క్రూసో. అవసరాన్నిబట్టి తెరవడానికి, మూయడానికి వీలుగా ఉండే ఒక గొడుగును తోలుముక్కలతో అతడు తయారు చేసికొన్నాడు.
ముందరి పేజి               తరువాతి పేజి


www.maganti.org