రాబిన్ సన్ క్రూసో కథ - Chapter 4
గడచిన పదిహేను రోజులలోను ఆ ద్వీపంమీద రాబిన్సన్ క్రూసోకు వేరొక మానవుడు కనబడలేదు. తాను తప్ప ఆ ద్వీపంమీద వేరొక మానవుడు లేడన్న అభిప్రాయం అతనికి కలిగినా అతడు ఇంకా ఆ ద్వీపాని పూర్తిగా చూడకపోవడం వల్ల అతని అభిప్రాయంమీద అతనికే పూర్తిగా విశ్వాసం కుదరలేదు. ఆ ద్వీపంమీద ఏ మూల ప్రాంతంలోనైనా అనాగరికులైన అడవి మనుష్యులు ఉండవచ్చు నన్న అనుమానం అతన్ని బాధిస్తూనే ఉంది. ఆ పదిహేను రోజుల్లో అతనికి పక్షులే కనబడ్డాయి. అయినా ఏ అడవి ప్రాంతంలోగాని, కొండ చరియల్లో గాని క్రూర జంతువులు ఉండవచ్చునన్న భయం అతనికి ఉంది. రాత్రీ పగలు ఆ ద్వీపంమీద అతనికి ప్రశాంతంగానే ఉంటున్నదిగాని తనకు కనబడని శత్రువులు ఏమూలనైనా ఉంటే ఉండవచ్చును. కనుక తనను తాను రక్షించుకొనడానికి తగిన ఇల్లు అవసరమని క్రూసో భావించాడు.

ఇల్లు కట్టుకొనేటప్పుడు అతడు ముఖ్యంగా నాలుగు సూత్రాలను పాటించదలచుకొన్నాడు. మొదటి సూత్రం : మంచి నీటికి చేరువలో ఆరొగ్యకరమైన ప్రాంతంలో నివేశ స్థలం ఉండాలి. రెండవ సూత్రం : ఇంటికి ఎండవేడి ఎక్కువగా తగలకూడదు, చల్లగా ఉండాలి. మూడవ సూత్రం : శత్రువుల బారినుండి తనను తాను రక్షించుకొనడానికి అనువైన స్థలంలో ఇల్లు కట్టుకొనాలి. నాల్గవ సూత్రం : అదృష్టవశాత్తు ఏదైనా ఓడ ఆ ద్వీపానికి చేరువగా వస్తే అది తన ఇంటినుండి కనబడాలి.

తన గృహనిర్మాణానికి అటువంటి అనువైన స్థలం లభిస్తుందేమోనని అతడు వెతికాడు. కొండకు తూర్పు వైపున ఆనుకొని ఉన్న చిన్న చదునైన ప్రదేశం అనువైనదిగా క్రూసోకు తోచింది. ఆ స్థలం సుమారు రెండు వందల గజాల పొడవు, వంద గజాల వెడల్పు ఉండవచ్చునని అతడు లెక్కవేశాడు. ఆ స్థలంలో ఇల్లు కట్టుకొంటే ఆ కొండే తన ఇంటికి వెనకవైపు పెట్టనిగోడగా ఉంటుందని, సాయంత్రం వరకు ఎండ తగలకుండా ఆ కొండ కాపాడగలదని అతనికి తోచింది. అందువల్ల ఆ స్థలాన్ని తన నివేశ స్థలంగా అతడు స్థిరపరచుకొన్నాడు.

అతడు సముద్రం వైపు ముఖం పెట్టి కొండకు చేరువగా నిల్చున్నాడు. అక్కడనుంచి ముందుకు పది అడుగులు వేసి అక్కడ ఒక గుర్తు పెట్టాడు. మళ్ళా అదే చోటుకు వచ్చి కుడి ఎడమ ప్రక్కలకు పదేసి అడుగులు వేసి గుర్తులు పెట్టుకొన్నాడు. ఈ మూడు గుర్తులను కలుపుతూ అర్ధ చంద్రాకారంలో ఒక గీతను గీశాడు. దానిమీద అయిదు అడుగుల ఎత్తున సూది మొనలుగల రాటలను పాతాడు. ఆ విధంగానే ఆ రాటలకు ఆరంగుళాల ఎడంలో మరొక వరుసను రాటలు పాతాడు. ఆ రెండు వరుసల రాటలను కలుపుతూ ఓడలోనుంచి తెచ్చిన ఇనుప తీగలను చుట్టాడు. ఆ రెండు వరుసల మధ్యను రాళ్ళను మట్టిని నీళ్ళతో కలిపి పోశాడు. ఈ విధంగా కొన్ని రోజులు కష్టపడి ముందుగా ఒక గట్టి గోడను అతడు నిర్మించాడు. ఆ గొడకు ఎక్కడా ద్వారాన్ని అమర్చలేదు. అతడు ఒక నిచ్చెనను తయారుచేసి దాని సహాయంతో అతడు ఆ గోడను దాటుతూ ఉండేవాడు.

వెనుకవైపు నున్న కొండే ఒక గోడగా ఉంది. ఆ కొండ లోని ఒక రాతిబండకు ఒక పెద్ద కన్నం ఉంది. తన ఆహారపదార్ధాలను, మందుగుండును, ఇతర ముఖ్యసామగ్రిని అందులో అతడు భద్రపరచుకొన్నాడు.

ఓడలోనుంచి తెచ్చిన తెరచాప గుడ్డలతో కొండకు చేరువుగా ఒక చిన్న గుడారాన్ని క్రూసో వేశాడు. దాని పైని మరొక పెద్ద గుడారాన్ని వేశాడు. ఎంత పెద్ద వాన వచ్చినా లోపలకు నీరు కారకుండా ఈ రెండు పొరల గుడారం తనను కాపాడగలదన్న నమ్మకం అతనికి కలిగింది. ఓడలోనుండి తెచ్చిన ఒక వల ఉయ్యాలను ఆ గుడారంలో కట్టుకొని అందులోనే అతడు పడుకొని నిద్రపోయేవాడు.

ఆ ద్వీపం మీద అతడు ఒంటరి వాడు. రోజులు గడుస్తున్న కొద్దీ గడచిన రోజుల లెక్క అతనికి జ్ఞప్తియందు ఉండకపోవచ్చును. కనుక ఏదో ఒక రకమైన కాలెండరు అత్యవసరమని అతనికి తోచింది. అందుకని అతనొక బల్లచెక్కను తీసికొని దానిని సాఫుగా చిత్రిక పట్టి దానిపైని "ఈ ద్వీపానికి 1659 సెప్టెంబర్ 30వ తేదీన చేరాను" అని చాకుతో చెక్కాడు. తన ఇంటి ముందు ఒక రాటను పాతి దాని మీద ఆ బల్లను మేకులతో బిగించాడు. ఆ రాట మీద ప్రతిరోజూ క్రూసో ఒక నిలువు గీత గీస్తూ ఉండేవాడు. ప్రతి ఏడవ గీతను అంటే ప్రతి ఆదివారం నాటి గీతను ఇతర గీతల కంటే కొంచెం పొడవుగా గీసే వాడు. ప్రతి మొదటి తేదీ గీతా ఆదివారం గీతకు రెండింతలు ఉండేది. ఈ విధంగా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలను క్రూసో లెక్కిస్తూ వచ్చాడు.

ఓడలోనుండి తెచ్చిన ఆహార పదార్ధాలను తింటూ కూర్చుంటే అవి కొన్నాళ్ళకు తరిగిపోతాయి. తర్వాత తినడానికి ఇంకేమీ మిగలదు. కనుక అవి పూర్తిగా తరిగి పోక ముందే వేరే ఆహారాన్ని అతడు సంపాదించుకోవాలి. అందుకని అతడు తుపాకీని పట్టుకొని రోజూ వేటకు వెళ్ళడం ప్రారంభించాడు. అతని వెంట అతని కుక్క తోడుగా వెళ్ళేది. క్రూసో చంపిన పక్షుల్ని ఆ కుక్క వెళ్ళి నోట కరచుకొని తెచ్చేది.

మధ్యాహ్నం పూట ఆ ద్వీపం మీద ఎండవేడి ఎక్కువగా ఉండేది. అందువల్ల ఎండ బాగా ఎక్కగానే క్రూసో ఇంటికి వచ్చి ఏదో ఇంత తిని పడుకొనేవాడు. ఆ సమయంలో అతడు ఏ పనీ చేసేవాడు కాడు.

ఒకనాడు అతడు వేటకు వెళ్ళినప్పుడు అతనికి కొన్ని గొర్రెలు కనబడినయి. అవి చాలా పిరికివి. క్రూసోను చూడగనే అవి అడవిలోనికి పారిపొయాయి. వాటిని తుపాకితో చంపాలని క్రూసో ఎంత ప్రయత్నించినా అవి దొరక్కుండా తప్పించుకొన్నాయి. ఎలాగైతేనేమి అతడొకసారి ఒక ఆడ గొర్రెని తుపాకితో కాల్చి చంపాడు. దాని వెంట ఒక చిన్న గొర్రెపిల్ల ఉంది. దానిని అతడు సులువుగా పట్టుకొన్నాడు. చంపిన గొర్రెను దాని పిల్లను మోసుకుని అతడు తన ఇంటికి తీసుకొనివచ్చాడు. పెద్ద గొర్రె మాంసాన్ని అతడు కాల్చుకొని విందారగించాడు. గొర్రెపిల్లను మచ్చిక చేసుకొని, పెంచాలని అతడు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. అది దాని తల్లి కోసం బెంగపెట్టుకొని తిండి మానివేసింది. అందువల్ల క్రూసో దాన్నికూడా చంపి విందు చేసుకొన్నాడు.

ఇంకొకనాడు క్రూసోకు ఒక గొర్రెపిల్ల ఒంటరిగా కనబడింది. దానిని చంపకుండా ఎలాగైనా పట్టుకొనాలని ఎంతో ప్రయత్నించాడు కాని అది అతనికి దొరకలేదు. అందువల్ల అతడు దాని కాలును గురిచూసి తుపాకీని పేల్చాడు. ఆ దెబ్బకు అది కింద పడింది. దానికి చికిత్స చేసి కాలుకు కట్టుకట్టాడు. తన చేత్తో దానికి మేత పెడుతూ వచ్చాడు. కొన్నాళ్ళకు అది తేరుకొంది. అతనివద్ద దానికి చనువు ఏర్పడింది. ఆ విధంగా అది అతనికి పెంపుడు జంతువు అయింది. అది అతని చుట్టూ తిరుగుతూ, అతని ఇంటి ముందు పచ్చిక మేస్తూ ఉండేది.

రాబిన్సన్ క్రూసో ఒక రామచిలుకనుకూడా పెంచాడు. మధ్యాహ్నం నిద్రపోయి లేచిన తర్వాత తన ఇంటికి కావలసిన సామగ్రిని తయారు చేసికొంటూ రామచిలుకకు మాటలు నేర్పుతూ ఉండేవాడు. అతన్ని "క్రూసో" అని రామచిలుక పిలిచేది. నేర్పిన అన్ని మాటలను వల్లిస్తూ ఉండేది. దాని మాటలకు క్రూసో మురిసిపోయి ఆనందిస్తూ ఉండేవాడు.

తన ఇంటికి కావలసిన అనేక కర్రసామానులను క్రూసో తయారు చేసికొంటూ వచ్చాడు. అతనికి ఒక కుర్చీ, ఒక టేబిలు అవసరమనిపించాయి. క్రింద కూర్చొని భోజనం చేయడం అతనికి కష్టంగా ఉండేది. అందుకని అతడు ఓడలోనుండి తెచ్చిన కర్రచెక్కలతో వాటినికూడా తయారు చేసికొన్నాడు. అతడు తన దినచర్యను డైరీలో వ్రాసికొనడానికి ఆ కుర్చి టేబిలూ ఎంతో ఉపయోగపడేవి.

అతడు కొన్ని కర్ర షెల్ఫులను తయారు చేసికొన్నాడు. వాటిని రాతిబండలో నున్న ఆ పెద్ద కన్నంలో అమర్చాడు. తన పనిముట్లను, మేకులను ఇతర ఇనుప సామానులను ఆ షెల్ఫుల్లో తడి తగలకుండా భద్రపరచాడు. కొన్ని బల్ల చెక్కలను కొండగోడకు మేకులు కొట్టి తాపడం చేశాడు. వాటి మీద తన రైఫిళ్ళను, పిస్తోళ్ళను వ్రేలాడ వేశాడు. ఈ ఎర్పాట్లన్నిటిని చేసికొని క్రూసో ఎంతో తృప్తి పడ్డాడు. అంతే కాదు తన పనితనానికి ఎంతో గర్వ పడ్డాడు.

నేలను తవ్వడానికి ఒక పార తనకు అవసరమయింది. ఒక గట్టి మానులోని ఒక ముక్కను తీసికొని దానిని చెక్కి పార లాగ తయారు చేసికొన్నాడు. తగిన వడ్రంగి పనిముట్లు అతని వద్ద లేకపోయినందువల్ల వీటిని తయారు చేయడానికి చాలా కాలం పట్టింది. అవన్నీ కాస్త మొరటుగా ఉన్నా అవి ఎందుకు అలా ఉన్నాయి అని కాని, ఇంత ఆలస్యం ఎందుకు అయిందని కానీ అతన్ని అడిగేవారు ఎవరూ లేరు.

తన ఇంటిలోని కొండ గోడలో ఒక చోట చిన్న గుహ వంటిది ఉంది. దానిలో మన్ను మెత్తగా ఉన్నట్టు అతనికి కనబడింది. తన కర్రపారతో ఆ మట్టిని అతడు ఒకనాడు తవ్వి చూశాడు. పారకు మట్టి సులువుగానే వచ్చింది. వీలయినంత వరకు అతడు తవ్వుతూ వెళ్ళాడు. కొంతసేపటికి ఆ గుహలో నుండి వెలుపలికి వచ్చాడు. అతడు ఎక్కడ ఉన్నదీ చూసుకొంటే తన ఇంటికి కొన్ని గజాల దూరంలో ఉన్నట్టు అతడు తెలిసికొన్నాడు. కొత్తగా ఏర్పడిన ఈ సొరంగం తన ఇంటికి ఒక ద్వారంలా ఉపయోగ పడగలదని అతనికి అనిపించింది. దానికి ఒక తలుపుని అమర్చాడు. ఈ సొరంగం వల్ల తన ఇంట్లో జాగా ఎక్కువయింది.

రోజూ చీకటిపడిన తర్వాత ఏ పని చేసికొనడానికి వీలు లేక నిద్ర రాకపోయినా అతడు వేగంగా పడుకొనవలసి వచ్చేది. అతని వద్ద ఏ రకం నూనే లేదు, దీపం లేదు. కనీసం కొవ్వొత్తి కూడా లేదు. చీకట్లో ఏమీ తోచక అలా పడుకొనడం అతనికి నచ్చలేదు. దీనికి ఒక ఉపాయం ఆలోచించి అతడు చంపిన గొర్రెలలోని కొవ్వును దాస్తూ వచ్చాడు. బంకమట్టితో ఒక ప్రమిదను తయారు చేశాడు. తెరచాపగుడ్డపీలికతో ఒక వత్తిని తయారు చేశాడు. మట్టి ప్రమిదలో కొవ్వును ఉంచి దానిలో గుడ్డ వత్తిని పెట్టి వెలిగించాడు. అది వెలిగింది. అది ఎంతో కాంతివంతంగా లేకపోయినా నిలకడగా కొవ్వొత్తిలాగ వెలిగింది. అతనికి దీపం సమస్య తీరింది. ఆ ద్వీపంమీద దీపం వెలిగించాడు.
ముందరి పేజి               తరువాతి పేజి


www.maganti.org