రాబిన్ సన్ క్రూసో కథ - Chapter 3
రాబిన్సన్ క్రూసో మంచి ఈతగాడే. అయినా ఆ అల్లకల్లోలమైన సముద్రంలో ఒక చిన్న దుంగముక్కలాగ కెరటాల మధ్య ఊగిసలాడిపోయాడు. అతని అదృష్టం కొద్దీ ఒక పెద్ద కెరటం వచ్చి అతన్ని ఈడ్చుకొనిపోయి ఒక యిసుక దిబ్బపైని పడవేసింది.

క్రూసో చాలాసేపు ఆ యిసుక దిబ్బ పైని చలనం లేకుండా ఉండిపోయాడు. కొంతసేపటికి అతని కళ్ళు వీడాయి. అతను కళ్ళు తెరిచి చూస్తున్నా అతనికి ఏమీ కనబడలేదు. మరి కాస్సేపటికి అతనిలో కాస్త చలనం కలిగింది. అతి కష్టం మీద అతను బలాన్ని కాస్త కూడగట్టుకొన్నాడు. ఇటూ అటూ చూశాడు. అతడు ఎక్కడ ఉన్నదీ అతనికి తెలియలేదు. అతని కాళ్ళను కెరటాలు ఉండి ఉండి తాకుతున్నాయి. మెల్లగా డేకుకొంటూ అతడొక ఎత్తైన ప్రదేశాన్ని చేరుకొన్నాడు. అక్కడ పచ్చిక వత్తుగా ఉంది. అక్కడ కాస్సేపు విశ్రాంతి తీసికొన్నాడు. ఇంతలో అతనికి గతమంతా గుర్తుకు వచ్చింది. వెంటనే అతడు లేచి కూర్చొని తన మిత్రుల కోసం ఇటూ అటూ చూశాడు. సముద్ర కెరటాలు తీరాన్ని తాకి మీదకు లేచి కింద పడుతూ అతనికి భూతాల్లా కనిపించాయి కాని అతని మిత్రులు కనిపించలేదు.

తన ప్రాణాలను కాపాడినందుకు క్రూసో తన మోకాళ్ళపైని కూర్చొని దేవునికి కృతజ్ఞత తెల్పుకొన్నాడు. తను బ్రతికి బయటపడినందుకు అతనికి సంతోషం కలిగినా తన తోటి వారందరూ సముద్రంలో మునిగిపోయి ఉంటారన్న తలంపు రావడంతో అతనికి విచారం పట్టుకొంది. విచారంతోపాటు అతనికి భయం కూడా వేసింది. దాంతో అతడు పిచ్చి వానిలాగ కేకలు వేస్తూ సముద్రతీరాన్న ఇటూ అటూ తిరిగాడు.ఏమి చేయాలో అతనికి తోచలేదు

అతనికి విపరీతంగా ఆకలి వేస్తూంది కాని తినడానికి ఏమీ లేదు. నోరు ఆర్చుకొనిపోయి విపరీతంగా దాహం వేస్తూంది కాని తాగడానికి మంచి నీళ్ళు లేవు. తడిసిన బట్టలను మార్చుకొనడానికి మారు బట్టలు లేవు.కనుచూపు మేరలో మనిషి కాడు గదా ఒక జంతువైనా కనబడలేదు. కాని ఆకలితో కడుపు కాలుతున్నది. దాహంతో ప్రాణాలు పొయేటట్టుగా ఉన్నయి. ఈ రెండింటినీ తట్టుకోవాలంటే కనీసం ఒక చల్లని చోట విశ్రాంతి తీసికొనడం అవసర మనిపించింది క్రూసోకు, కాని అది కొత్త ప్రదేశం, కనుచూపు మేరలో మనిషి కాడు గదా ఒక జంతువైనా కనబడలేదు. కాని దూరంగా చెట్లు, తుప్పలు అడవిలాగ కనబడుతున్నై. ఎక్కడ పడుకొంటే ఏ క్రూర జంతువు తనను పొట్టను పెట్టుకొంటుందో నని అతనికి భయం వేసింది.

అతనికి అతనే ధైర్యం చెప్పుకొన్నాడు. ఆకలి తీర్చుకొనడానికి ఏమైనా దొరుకుతుందేమోనని లేచి నిల్చొని ఇటూ, అటూ చూశాడు. దూరంగా ఉన్న అడవిలో ఏదైనా తినడానికి దొరకవచ్చునన్న ఆశ అతనికి కలిగింది కాని ఇంతలో మళ్ళా అతనికి నిరాశ కలిగింది. ఏదైన ఆహారం దొరికి తను బ్రతికినా ఆ కొత్త ప్రదేశంలో తను ఒంటరిగా జీవించవలసి వస్తుంది. ఇక మీదట తనకు ఎదురుగా ఉన్న సముద్రం, సముద్రకెరటాలు, దూరాన కనబడే చెట్లుచేమలే తనకు స్నేహితులు అనుకొన్నాడు. ఇంతవరకు తనొక సంఘజీవిగా నలుగురితో కలిసి బ్రతికాడు. ఇక మీదట ఏకాకిగా బ్రతకాలి.ఈ ఆలోచన అతనికి కలగడంతో అతను వణికిపోయాడు.

ఇంతలో అతనికి దూరంగా చెట్ల మధ్యను ఏదో తళ తళ మెరుస్తూ కనబడింది. అటు వైపు తేరి పార చూశాడు. అదొక కొలనులాగ కనబడింది. కనీసం దాహం తీర్చుకొనవచ్చు నన్న ఆశ అతనికి కలిగింది. దాంతో అతనికి ఎక్కడ లేని బలం వచ్చింది. ఆ దిక్కుగా అతడు పరుగెత్తాడు. అది కొలను కాదు, అదొక సెలయేరు. అతడు అతి తొందరగా ఆ సెలయేటిలోనికి దిగి నీరు త్రాగాడు. ఆ సెలయేటి నీరు ఎంతో తియ్యగా ఉంది. ఆర్చుకొనిపోయిన అతని నోటికి ఆ నీరు అమృతం అనిపించింది. తనివితీరా, కడుపునిండా నీళ్ళు త్రాగాడు, దాహం కట్టింది. కాస్త ఆకలి కూడా తీరింది. కడుపు చల్లబడింది. అప్పుడు అతడు మామూలు మనిషి అయ్యాడు. ఇకమీదట ఏమి చేయాలి అని అతడు ఆలోచించసాగాడు.

ఇంతలో ప్రొద్దుపోయింది. సంధ్య వెలుగు మాత్రమే ఉంది. కొద్ది సేపట్లో చీకటి అలుము కొంటుంది. కనుక క్రూర మృగాల వాత బడకుండా నిద్రపోవడానికి అనువైన స్థలాన్ని క్రూసో చూసికొనదలిచాడు. కొద్ది దూరంలో ఒక పెద్ద చెట్టు అతనికి కనబడింది. ఆ చెట్టు కొమ్మలు నలువైపులా బాగా వ్యాపించి ఉన్నాయి. దాని కొమ్మలు చాలా బలమైనవి. ఆ చెట్టు ఎక్కి ఒక బలమైన కొమ్మ మీద పడుకొని ఆ రాత్రి నిర్భయంగా గడపవచ్చునని అతడు అనుకొన్నాడు. వెంటనే అతడు ఆ చెట్టువద్దకు వెళ్ళాడు. ఒక కొమ్మను విరిచి ఆత్మరక్షణ కోసం దానిని ఒక ఆయుధంగా ఆ చెట్టు ఎక్కాడు. ఒక వెడల్పైన కొమ్మ మీద మేను వాల్చాడు. అలిసిపోయిన రాబిన్సన్ క్రూసోకు సురక్షితమైన చోటు దొరకగానే హాయిగా గాఢ నిద్ర పట్టింది.

ఆ మరునాడు సూర్యోదయం అయిన తరువాత గాని అతనికి మెలకువ రాలేదు. ఆకుల చాటు నుండి తన పైని పడుతున్న వెచ్చని . ఎండకు అతనికి మెలకువ వచ్చింది. అతడు లేచి కూర్చొని, కళ్ళు నులుపుకొని, వళ్ళు విరచుకొని, బద్ధకం తీరేటట్టు ఆవలించి కళ్ళు విప్పి చుట్టూ కలియజూశాడు. అప్పుడు అతనికి అతనెక్కడ నిద్ర లేచింది గుర్తుకు వచ్చింది

ఆకాశం నిర్మలంగా ఉంది. చెట్ల ఆకులనుకూడా కదల్చలేనంత మెల్లగా గాలి వీస్తున్నది. సముద్ర కెరటాలు ఎగిరెగిరి పడడం లేదు. సముద్రం ప్రశాంతంగా ఉంది. వాతావరణం హాయిగా ఉంది.

క్రూసో చెట్టు దిగి సముద్రం వైపు బయలు దేరాడు. నాలుగు అడుగులు వేశాడో లేదో దూరంగా సముద్రంలో ఓడ కనబడింది. అది విరిగిపోయి ప్రక్కకు వాలిపోయి ఉంది. దానిని చూడడంతోనే క్రూసో ఒక పెద్ద కేక వేశాడు. అది ఆశ్చర్యమో సంతోషమో చెప్పడం కష్టం. అతడు పరుగెత్తాడు. సుమారు అర మైలు దూరంలో ఆ ఓడ ఒక బండరాయికి గుద్దుకొని విరిగి నీటిలోనికి ఒరిగిపోయి ఉంది. గాలికి గత రాత్రి ఆ ఓడ అక్కడకు చేరి ఉండవచ్చునని క్రూసో ఊహించాడు. ఆ విరిగిన ఓడను చూస్తూ కాస్సేపు అతడు నిల్చున్నాడు.

గత సాయంత్రం నీళ్ళతో మాత్రం కడుపు నింపుకొన్న అతనికి ఆకలి వేయసాగింది. క్షణ క్షణానికి ఆకలి ఎక్కువ కాజొచ్చింది. తినడానికి ఏదైనా ఆ ఓడలో దొరకవచ్చునన్న ఆశ అతనికి కలిగింది. కనుక ఆ ఓడ మీదకు ఎలాగైనా వెళ్ళదలచు కొన్నాడు గాని సముద్రం పోటులో ఉంది. అందువల్ల అతడు సెలయేటికి వెళ్ళి మరొకసారి నీళ్ళతో ఆకలి తీర్చుకొన్నాడు.

మధ్యాహ్నానికి సముద్రపు పోటు తగ్గింది. అదే తగిన సమయమని క్రూసో తలచి, నీళ్ళలో దిగి ఈదుకొంటూ ఓడను చేరుకొన్నాడు. ఓడ అంచులు నీటి మట్టానికి చాలా ఎత్తుగా ఉన్నాయి. ఓడ పైకి ఎక్కడానికి ఎటు నుండి వీలుందో చూడడానికని ఈదుకొంటూ ఒకసారి ఓడ చుట్టు ప్రదక్షిణం చేశాడు. ఓడ లోనుంచి వ్రేలాడుతున్న ఒక మోకు ఒక చోట అతనికి కనబడింది. దాని ఆధారంతో అతడు ఓడపైకి ఎక్కి లోనికి దిగాడు.

ఏవో మూడు చిన్న ఆకారాలు ఆ ఓడలో ఇటూ అటూ పరుగెత్తుతున్నట్లు అతనికి కనబడ్డాయి. అతనికి భయం వేసింది. ఇంతలో ఒక కుక్క తోక ఆడిస్తూ అతని కాళ్ళను నాకుతూ అతని చుట్టూ తిరగసాగింది. దాని వెంట రెండు పిల్లులు కూడా వచ్చాయి. ఆ మూడూ అతి సంతోషంతో అతని చుట్టూ తిరగడంతో అతనికి ఒంటరితనం పొయినట్టు అనిపించింది. కుక్కకు పిల్లులకు పుట్టుకతోనే వైరమున్నా అవి ఆపద సమయంలో మైత్రిని అలవరచుకొన్నాయి. వాటికి తనే యజమాని అయినాడు. అతడు వాటిని ప్రేమతో దువ్వాడు. ఆ మూడూ అతనికి చేరువైనాయి. ఓడలో ఏమూల నేమున్నదో అతడు చూడదలచుకొని ఓడలో తిరగనారంభించాడు. ఆ మూడు జంతువులు అతని వెంట బడ్డాయి.

సముద్రంలోని ఒక బండరాయికి ఓడ ఢీకొని ముందుకు వాలిపోయింది. నీటి అడుగున ఉన్న బండరాళ్ళమీద ఓడ వెనుక భాగం ఆనుకొని నీటిలో మునగ లేదు. ఓడ ముందు భాగంలో నీరు నిండుగా ఉంది. వెనుక భాగం పొడిగా ఉంది. క్రూసో అదృష్టం కొద్దీ వెనుక భాగంలోనే ఆహారపదార్ధాలు, పనిముట్లు ఆయుధాలు ఉన్నయి. అవి తడిసిపోకుండా భద్రంగా ఉన్నాయి. అందుకు అతడు ఎంతో సంతొషించాడు. వెంతనే అతడు కొన్ని బిస్కట్లను తీసికొని పంట్లాం జేబులు నింపుకొన్నాడు. తను తింటూ, కుక్కకు, పిల్లులకు బిస్కట్లను వేస్తూ తనకు పనికివచ్చే సామానులు ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో అతడు ఒకసారి చూసికొన్నాడు.

ఏ క్షణాన్నయినా ఆ విరిగిన ఓడ మునిగిపోవచ్చును. అలా జరిగితే ఓడలోని ఏ ఒక్క వస్తువూ తనకు దక్కదు. కనుక తనకు అత్యవసరంగా కావలసిన సామానులను, ఆహారపదార్ధాలను మాత్రం వీలయినంత త్వరలో ఒడ్డుకు చేర్చాలని నిర్ణయించికొన్నాడు.

సుమారు అరమైలు దూరంలో తీరం ఉంది. ముందుగా ఆహారపదార్ధాలను, తన కొత్త స్నేహితులయిన కుక్కను, పిల్లులను ఒడ్డుకు చేర్చాలి. ఒక చిన్న పడవ ఉంటే ఈ పని సులువుగా జరుగుతుంది. ఓడలో ఉండిన ఆ ఒక్క చిన్న పడవా క్రిందటి రోజున నీటిలో మునిగిపోయింది. వేరొకటి ఆ ఓడలో లేదు. లేనిదానికోసం ఆలోచిస్తూ కూర్చుంటే కాలం దండగ అవుతుంది తప్ప సమస్య పరిష్కారం కాదు. కనుక ఏదో ఒక ఉపాయం ఆలోచించి తన కార్యాన్ని సాధించదలచుకొన్నాడు క్రూసో.

ఒకసారి ఇటూ అటూ అతడు కలియజూశాడు. కొన్ని తెరచాప కొయ్యలు, కొన్ని బల్ల చెక్కలు, కొన్ని మోకుతాళ్ళ ముక్కలు అతని కంటబడ్డాయి. వెంటనే అతడు వాటిని ఒక చోట చేర్చి వాటితో ఒక తెప్పను తయారు చేశాడు. దానిని ఒక మోకుకు కట్టి నీటిలోనికి దించాడు. ఆ తెప్ప కెరటాలకు కొట్టుకొని పోకుండా ఆ మోకును ఓడకు కట్టాడు.

ఓడలో కొన్ని ఖాళీ పెట్టెలు ఉన్నాయి. వాటిలో మూడు పెద్ద పెట్టెలను క్రూసో ఎంచాడు. రొట్టెలు, బిస్కట్లు, గోధుమలు, బార్లీ మొదలైన ఆహార పదార్ధాలతో ఒక పెట్టెను నింపాడు. ఇంకొక దానిలో తనకు కావలసిన బట్టలను సర్దాడు.మూడవ దానిలో సుత్తి, రంపం, గొడ్డలి మొదలైన పనిముట్లను పెట్టాడు. ఆ మూడు పెట్టెలను అతి కష్టం మీద జాగ్రత్తగా తెప్ప మీదకు మోకుల సహాయంతో దింపాడు. ఇంతలో అతనికి ముఖ్య మైన రైఫిళ్ళూ, పిస్తోళ్ళు, మందుగుండు, సొరకత్తులు గుర్తుకు వచ్చాయి. వెంటనే వాటికోసం ఓడలో వెతికాడు. అతనికి రెండు రైఫిళ్ళూ, రెండు పిస్తోళ్ళు, రెండు సొరకత్తులు ఒక మందుగుండు బస్తా మాత్రం అతనికి కనిపించాయి. నీరు తగలకుండా వాటిని కూడా తెప్ప మీదకు అతడు చేర్చాడు. తెరచాప గుడ్డలను కూడా తెప్ప మీద పడవేశాడు. తన అత్యవసరమైన సామగ్రి తెప్ప మీదకు చేరినట్టు నిర్ధారణ చేసికొన్న తర్వాత పిల్లులని, కుక్కను తెప్ప మీదకు దించి తనుకూడా తెప్ప మీదికి దిగాడు.

సముద్రంలో పోటు వచ్చింది. గాలివాటు తీరం వైపే ఉంది. వాతావరణం తనకు అనుకూలంగా ఉన్నందుకు అతడు సంతోషించి, దేవునికి తన కృతజ్ఞతలు తెల్పుకొని తెప్పను ఓడకు కట్టిన తాడును కోశాడు. ఒక విరిగిన తెడ్డు సహాయంతో తెప్పను అతడు ఒడ్డుకు చేర్చాడు. ఒడ్డున ఇసుకలో తెడ్డును పాతి, పోటు తగ్గే వరకు తెప్పను దానికి కట్టి ఉంచాడు. కొంతసేపటికి పోటు తగ్గింది. సామాను బరువుకు తెప్ప ఇసుక మీద ఉండి పోయింది.

తెచ్చిన వస్తుసామగ్రిని గతరాత్రి అతడు పడుకొన్న చెట్టు వద్దకు చేర్చడానికి అతనికి కొన్ని గంటలు పట్టింది. కొంతసేపు విశ్రాంతి తీసికొన్న తర్వాత పరిసర ప్రాంతాలను అతడు ఒకసారి పరిశీలించదలచాడు. అతనికి చేరువలోనే ఒక చిన్న కొండ ఉంది. అతడు ఒక రైఫిల్లో మందుగుండు దట్టించి దానిని తన భుజం మీద వేసికొని ఆ కొండ ఎక్కాడు. ఆ కొండ శిఖరం పైనుండి చుట్టూ చూశాడు. అతని చుట్టూ దూరాన సముద్రమే కనబడింది. దాంతో తానొక ద్వీపం మీద ఉన్నట్టు అతడు గ్రహించాడు. ఆ ద్వీపానికి పశ్చిమ దిక్కున రెండు ఇసుక దిబ్బలు, ఓడ పడి ఉన్నచోట బండరాళ్ళు తప్ప కనుచూపు మేరలో ఇంకెక్కడా భూప్రదేశం అతనికి ఆ సమయంలో కనబడలేదు. అతడు ఉన్న ద్వీపం మీద అతనికి కొన్ని పక్షులు తప్ప ఇంకే ప్రాణి కనబడలేదు. అతనికి చేరువులో ఒక చెట్టు మీద పక్షులు కొన్ని వాలి ఉన్నాయి. తన రైఫిల్ తో ఆ చెట్టు మీది పక్షులను కొట్టాడు. ఒక పక్షి మాత్రం ఆ దెబ్బకు నేలకూలింది. కొన్ని వందల పక్షులు ఆ తుపాకి శబ్దానికి ఆకాశంలో ఎగురుతూ ఇంకొక చోటికి పోయాయి. ఆ తుపాకి శబ్దానికి ఏవైనా జంతువులుగాని, ఎవరైనా మనుష్యులు గాని వచ్చి తనకు కనబడ వచ్చునని అతడు ఆశించాడు. కాని అలా జరగలేదు. అతని ఆశ నిరాశ అయింది.

ఆ ద్వీపం మీద తానొక ఒంటరి మనిషినన్న భావం అతనిలో స్థిరంగా ఏర్పడింది. దాంతో అతనికి ఎంతో విచారం కలిగింది. మళ్ళా మనుష్య ప్రపంచంలోనికి వెళ్ళే అవకాశం త్వరలో కలుగదని అతడు అనుకొన్నాడు. అందువలన ఒక సురక్షితమైన వసతిని ఏర్పరచుకోవలసిన అవసరం ఉందని అతడు భావించాడు. అందుకు తగిన ప్రదేశం కోసం అతడు ఆ కొండపైనుండి చూశాడు కాని ఏ స్తలాన్ని నిర్ణయించుకొనలేకపోయాడు.

ఇంతలో పొద్దువాలింది. అందువల్ల అతడు వెంటనే కొండ దిగి తన చెట్టు వద్దకు చేరుకొన్నాడు. అక్కడే చదునైన ప్రదేశం చూసి, తెరచాప గుడ్డతో ఒక చిన్న గుడారాన్ని వేసి అందులో అతి ముఖ్యమైన సామానులను అతడు భద్రపరచాడు. ఆ గుడారంలో నేలపైనే ఒక పడకను అతడు ఏర్పరచుకొన్నాడు. ఆ రోజంతా బాగా కష్టపడి పనిచేసినందువల్ల అతడు అలసిపోయాడు. పడక చేరగానే అతనికి గాఢ నిద్ర పట్టింది.

ఆ మర్నాడు క్రూసో ఈదుకొంటూ మళ్ళా ఓడ మీదకు వెళ్ళాడు. మరొక తెప్పను తయారు చేసి తనకు అవసరమైన మరికొన్ని ఆయుధాలను, బట్టలను, ఒక పరుపును ఇంకా మరికొన్ని ఇతర వస్తువులను ఒడ్డుకు చేర్చాడు. ఈ విధంగా అతడు పదకొండు సార్లు ఓడ మీదకు వెళ్ళి తనకు కావలసిన అతి ముఖ్యమైన సామానులన్నిటిని తెచ్చుకొన్నాడు. ఆఖరు సారి అతడు ఓడ మీదకు వెళ్ళినప్పుడు అతనికి ఒక బీరువాలో ఒక కత్తెర, రెండు మంగలి కత్తులు, రెండు చాకులు, నాలుగు ఫోర్కులు అతనికి దొరికాయి. నాణాలు రూపంలో కొంత డబ్బు కూడా అతనికి దొరికింది. ఆ నాణాలకు ఆ ద్వీపం మీద విలువలేకపొయినా అతడు వాటిని జాగ్రత్త పెట్టాడు.

ఆ ద్వీపం మీదకు అతడు చేరిన పదిహేను రోజుల తరువాత ఒకనాడు మరొక గాలి వాన వచ్చింది. ఆ నాడంతా అతడు గుడారంలో నుండి బైటకు రాలేదు. గాలివాన వెలిసిన తరువాత ఆ మరునాడు అతడు గుడారంలోనుండే సముద్రం వైపు చూశాడు. అతనికి ఓడ కనబడలేదు. ఆ గాలివానకు అది ముక్కముక్కలై కొట్టుకొనిపొయి ఉంటుందని అతడు అనుకొన్నాడు.
ముందరి పేజి               తరువాతి పేజి


www.maganti.org