రాబిన్ సన్ క్రూసో కథ - Chapter 2 |
హల్ రేవువద్ద ఓడ ప్రయాణానికి సిద్ధంగా ఉంది. రాబిన్సన్ క్రూసోను చూడగానే సంతోషంతో స్వాగతం పలికాడు కెప్టెన్ కొడుకు. తండ్రి అనుమతితోనే క్రూసో వచ్చిఉంటాడన్న ఉద్దేశ్యంతో అతన్ని ఆదరంతో ఆహ్వానించాడు ఓడ కెప్టెన్.
ఓడలోని వివిధ భాగాలను వివరించి క్రూసోకు అతని స్నేహితుడు చూపించాడు. వాటిని ఎంతో కుతూహలంతో వింతగా చూశాడు క్రూసో. 1651 సెప్టెంబర్ 1వ తేదీన ఓడ హల్ రేవునుండి బయలుదేరింది. ఆనాడు సముద్రం ఉధృతంగా లేదు. ప్రశాంతంగా ఉంది. వాతావరణం ఎంతో హాయిగా ఉంది. గాలివాటుగా తెరచాప సహాయంతో ఓడ యార్ మౌత్ రేవు దిక్కుగా ప్రయాణం సాగించింది. క్రూసోకు ఇది తొలి సముద్రయానం. అందువల్ల ఉప్పు గాలి పడక, అతడు వాంతులు చేసికొని రెండు రోజులు పడక యెక్కాడు. దాంతో అతని దృష్టి ఇంటిమీదికి మరలింది. కాని అతని ఆరోగ్యం కుదుటపడడంతో అతను ఇంటి విషయం మరచి పోయాడు. ఆరు రోజుల అనంతరం ఓడ యార్ మౌత్ రేవును సమీపించింది. కాని ఆనాడు సముద్రం అల్లకల్లోలంగా ఉండడంవల్ల రేవు దూరంగా ఓడకు లంగరు వేయవలసివచ్చింది. నావికులు చిన్నపడవలను ఎక్కి రేవుకు దూరంగా తీరాన్ని చేరుకొని తర్వాత కాలినడకని ఆ పట్నం చేరుకొన్నారు. కొన్ని కష్టాలను ఎదుర్కొన్నా మొత్తం మీద క్రూసోకు అతని తొలి సముద్రయానం సంతోషాన్నే కలిగించింది. నావికుని జీవితం అతనికి ఎంతో నచ్చింది. కనుక అతడు ఇంటికి తిరిగి వెళ్ళ దలచుకొనలేదు. యార్ మౌత్ రేవు వద్ద ఓడ కెప్టెన్ తన అనుచరుల్ని దయతోచూసి వారికి కొత్త బట్టల జతలు, కొంత డబ్బూ ఇచ్చాడు. ఇంకా ముందుకు ప్రయాణం చేయదల్చుకొన్నవారు తనతో లండన్ రావచ్చునని, ఇష్టం లేని వారు తిరిగి వెనుకకు వెళ్ళిపోవచ్చునని అతడు చెప్పాడు. ఆనాడు క్రూసో తిరిగి ఇంటికి వెళ్ళదలుచుకొని ఉంటే అతని కధ ఇంకో విధంగా ఉండేది. కాని అతని మనస్సు సముద్రయానానికే పురిగొల్పింది. అందువల్ల అతడు ఆ ఓడలో అక్కడనుంచి లండన్ వెళ్ళాడు. అక్కడ కొన్నాళ్ళు ఉండి ఆ మహా నగరాన్ని చూడదలిచాడు. ఆ ఓడ తర్వాత ముందుకు సాగిపోయింది. లండన్ నగరంలో క్రూసో కొన్నాళ్ళు ఉండడంతో అతనికి కొంతమంది మంచి స్నేహితులు దొరికారు. వారిలో ఒకడు ఒక వాణిజ్య నౌకకు కెప్టెన్. అతడు తరచుగా వ్యాపారంకోసం గినియా దేశం వెళ్ళి వస్తూ ఉండేవాడు. గినియా దేశానికి యేదైన సరుకు తీసికొని వెళ్ళి లాభసాటిబేరం చేయమని అతడు క్రూసోకు సలహా ఇచ్చాడు. క్రూసోకు ప్రయాణపు కర్చులు, కేవు కర్చులూ యేవీ లేకుండా సహాయం చేయడానికి ఆ కెప్టెన్ అంగీకరించాడు. అందుకు క్రూసో యెంతో సంతోషించి ఆటబొమ్మలను గినియా దేశం తీసికొని వెళ్ళి, అక్కడ అమ్మి, ఆ డబ్బుతో అక్కడ బంగారపు పొడినికొని లండన్లో అమ్మడం ప్రారంభించాడు. ఆ విధంగా అతడు ఒక వ్యాపారస్తుడై లండన్లో మూడు సంవత్సరాలు ఉన్నాడు. ఆ మూడు సంవత్సరాలలో అతడు వ్యాపారరీత్యా నౌకా యానం చేస్తూ వివిధ దేశాలను సందర్శించాడు. ఆ యా దేశాలలో అనేక వింతలను, విశెషాలను చూశాడు. రకరకాలైన మనుష్యులు అతనికి తారసిల్లేరు. కొన్ని దేశాలలోని మనుష్యులు నల్లగా ఉన్నారు. కొన్ని దేశాలలోని ప్రజలు అర్ధనగ్నంగా ఉన్నారు. కొన్ని దేశాలలోని మనుష్యులు కొందరు తోటి మానవులను చంపి తింటారని క్రూసో విన్నాడు. ఒకసారి క్రూసో వ్యాపార నిమిత్తం ఒక వాణిజ్య నౌకలో వెళ్తూ ఉండగా టర్కీ దేశపు ఓడ దొంగలు వీరి నౌకను ముట్టడించి కొంతమందిని చంపివేశారు. కొంతమందిని బంధించి తీసికొని పోయారు. అప్పుడు క్రూసో ఆ దొంగల నాయకునికి బానిస అయ్యాడు. బానిసగా క్రూసో ఆ దొంగల నాయకుని ఇంట్లో ఊడిగపు పనులు చేయవలసి వచ్చింది. ఆ సమయంలో అతనికి తల్లి తండ్రీ గుర్తుకు వచ్చారు. ఆ దొంగల నాయకుని ఓడను అప్పుడప్పుడు క్రూసో కాపలాకాయవలసి వచ్చేది. ఆ ఓడలోనే కొన్నాళ్ళపాటు అతడు ఉండిపోవలసి వచ్చేది. అతడు చిన్నప్పుడు అల్లారుముద్దుగా పెరిగాడు. తర్వాత స్వేచ్చగా బ్రతికాడు. అందువల్ల ఆ బానిస బ్రాతుకు అతనికి ఎంతో కష్టంగా ఉండేది. ఎలాగైనా ఆ బందిఖానాలోనుండి విముక్తి పొందాలని క్రూసో ఆలోచించసాగేడు. ఆ దొంగల నాయకునివద్ద ఒక నీగ్రో బానిసకూడా ఉన్నాడు. క్రూసో అతనితో స్నేహం చేసి, అతన్ని మంచి చేసికొన్నాడు. ఆ ఇద్దరూ కలిసి ఎలాగైతేనేం రెండేళ్ళ తర్వాత ఆ నాయకుని తప్పించుకొని బయటపడ్డారు. ఆ దొంగల నాయకుని ఓడలో ఒక చిన్న పడవ ఉంది. ఒకనాటి అర్ధరాత్రి వారిద్దరూ ఆ చిన్న పడవలో ఎక్కి సముద్రతీరం వెంబడే గమ్యంలేని ప్రయాణం సాగించారు. అప్పుడప్పుడుతీరం చేరుతూ ఆకలి దప్పులను తీర్చుకొంతూ కొన్నాళ్ళపాటు వారు ప్రయాణం సాగించారు. ఒకసారి ఒక తీరంవద్ద ఒక సింహం ఎదురయింది. అదృష్టవశాత్తు క్రూసో వద్ద దొంగలనాయకుని తుపాకీ ఉంది. దాంతో ఆ సింహాన్ని చంపి తన ప్రాణాలను కాపాడుకొని, తన మిత్రుని ప్రాణాలను రక్షించాడు. ఆ సింహం చర్మాన్ని క్రూసో భద్రపరిచాడు. ఆ విధంగా వారు కొన్నాళ్ళు సముద్ర ప్రయాణం చేస్తూ ఉండగా ఒకనాడు వారికి పోర్చుగల్ దేశపు ఓడ ఒకటి కనబడింది. ఆ ఓడవైపు తమ పడవను మళ్ళించి క్రూసో తుపాకీని గాలిలో పేల్చాడు. ఓడలోనివారు వీరి పడవను చూసి వీరిని రక్షించ దలచుకొన్నారు. ఆ ఓడ కెప్టెన్ క్రూసోని అత్ని మిత్రుని ఆదరించి, వారిని ఓడలో ఎక్కించుకొన్నాడు. అందుకు క్రూసో ఆ ఓడ కెప్టెన్ కు తమ కృతజ్ఞతలు చెప్పుకొన్నాడు. తమ చిన్న పడవను, తను చంపిన సింహముయొక్క చర్మాన్ని, ఇంకా మరికొన్ని వస్తువులను ఆ కెప్టెన్ కు కానుకగా సమర్పించాడు. కాని ఆ ఓడ కెప్టెన్ వాటిని ఉచితంగా తీసికొనడానికి నిరాకరించి, వాటికి విలువ కట్టి డబ్బు ఇచ్చాడు. ఆ ఓడ కొన్నాళ్ళకు దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ పట్నం చేరుకొంది. క్రూసో మరి ముందుకు వెళ్ళకుండా ఆ పట్నంలో ఉండిపోదలిచాడు. అతని నీగ్రో మిత్రుడు ఆ ఓడలో పని చేయటానికి కుదురు కొన్నాడు. క్రూసో బ్రెజిల్ పట్నంలో చిన్న స్థలం కొనుక్కొని చిన్న ఇల్లు కట్టుకొని అక్కడ స్థిరపడ్డాడు. అక్కడ కూడా అతనికి కొంతమంది మంచి స్నేహితులు దొరికారు. అక్కడ అతడు నాలుగు సంవత్సరాలపాటు స్థిరంగా ఉన్నాడోలేదో అతని స్నేహితులలో కొందరు ఆఫ్రికా దేశం వెళ్తూ క్రూసోను ఆహ్వనించారు. ఆఫ్రికా వెళ్తున్న ఆ స్నేహితులలో కొందరు వ్యాపారస్తులు, కొందరు తోటల సొంతదారులు, ఈ తోటల సొంతదారులకు వారి తోటలలో పని చేయడానికి నీగ్రో బానిసలు కావాలి. ఆఫ్రికాలో బానిసలను డబ్బు ఇచ్చి కొనుక్కోవచ్చును. అందుకోసమే వారు వెళ్తున్నారు. ఆ స్నేహితులు క్రూసోను ఏ కర్చూ లేకుండా తీసికొను వెళ్ళి తీసికొని రావడమేకాక పెట్టుబడిలేకపోయినా అతనికి లాభాలలో భాగం ఇస్తామన్నారు. సముద్రయానం అంటే ఒడలు తెలియని క్రూసో ఆ లాభసాటి ప్రయాణానికి వెంటనే అంగీకరించాడు. వారి వాణిజ్య నౌక బ్రెజిల్ నండి ఆఫ్రికా దేశానికి ప్రయాణమయింది. ఓడ బయలి దేరిన నాడు వాతావరణం ప్రశాంతంగా ఉంది. పన్నెండు రోజులపాటు వారి ప్రయాణం సుఖంగా గడిచింది కాని పదమూడవ నాడు పెనుగాలి వీచడం మొదలుపెట్టింది. రానురాను పెనుగాలి ఎక్కువ అవుతూ వచ్చింది. ఓడ వారి అధీనంలో లేకుండా పోయింది. దానిని వారు గాలిపాటుకు వదలి పెట్టవలసి వచ్చింది. పదిహేను రోజులపాటు ఆ ఓడ గాలి వాటుగా సాగిపోయింది. తర్వాత గాలి తగ్గింది. అప్పటికి వారు వెస్ట్ ఇండీస్ దీవులకు చేరువలో ఉన్నట్టు ఆ ఓడ కెప్టెన్ తెలిసికొన్నాడు. ఆ దీవులను చేరుకొని కొన్నాళ్ళు విశ్రాంతి తీసికోవాలని ఆ ఓడలోని వారు అనుకొన్నారు. కాని యింతలో మళ్ళా పెనుగాలి వచ్చింది. ఓడ వారి అధీనం తప్పింది. అది సముద్రంలో ఊగిసలాడిపోయింది. రెండు రోజులపాటు అది వేరొక దిక్కుగా ప్రయాణం సాగించింది. రాను రాను ఆ పెనుగాలి ఉధృతమైన భయంకర తుఫానుగా మారింది. ఉవ్వెత్తున కెరటాలు లేచి ఓడను తాకడం మొదలు పెట్టాయి. ఆ కెరటాల తాకిడికి ఓడ ఏ క్షణాన్నైనా ముక్కలు కావచ్చునన్న భయం ఆ ఓడలోని వారికి కలిగింది. ఎంత తోడుతున్నా ఓడలోనికి నీరు ఎక్కువగా చేరుతూ వచ్చింది. అంతటి పెనుగాలిని, అంత ఉధృతమైన సముద్రాన్ని, అంత భయంకరమైన తుఫానును క్రూసో అంతకుముందుఎన్నడూ చూసి యెరగడు. రెందు రోజులపాటు సూర్యుడు ఆ ఓడలోని వారికి కనబడలేదు. ఆకాశం కారు మబ్బులతో మూసుకుపోయింది. మెరుపులతో, ఉరుములతో, పిడుగులతో వాతావరణం భయంకరంగా మారిపోయింది. వీటికి జడివాన ఒకటి తోడయింది. ఆ భయంకర పరిస్థితులలో ఓడ మునిగిపోక తప్పదని ఓడలోని వారందరూ అనుకొని భయపడ్డారు. ఓడ మునిగిపోకుండా కాపాడాలని ఓడ సరంగులు వారి శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నారు. వారికి అన్ని విధాలా ఓడ ప్రయాణీకులు సహాయ పడుతూనే ఉన్నారు. ఓడ సరంగులు వేసే కేకలకు అందులోని ప్రయణీకులకు ఒకప్పుడు ఆశ ఒకప్పుడు నిరాశ కలుగుతూ వచ్చయి. ఓడ విరిగి ముక్కలైనా, ఓడ సముద్రంలో మునిగినా ఆనాటితో ఆ ఓడలోని వారందరి జీవితాలు సమాప్తమౌతాయి. క్రూసో కధ పూర్తి అవుతుంది. ఆ ఓడలోని వారందరూ దేవునిపైని భారంవేసి ఆ దేవుని ప్రార్ధిస్తూ తమ అంతిమ యాత్రకోసం రెండు రోజులు నిరీక్షించారు. వారికి ఆ రెండు రోజులు రెండు యుగాలుగా అనిపించాయి. ఆ ఆపద సమయంలో క్రూసోకు తన గత జీవితం కళ్ళకు కట్టింది. వీరితో బయలుదేరకుండా బ్రెజిల్ పట్నంలో తన ఇంటి పట్టున ఉంటే బాగుండుననిపించింది. అసలు, తన తండ్రి మాట విని న్యాయవాదిగా యార్క్ లోనే ఉండి ఉంటే ఇంకా హాయిగా బాగుండేది. పెద్దలమాట పెడచెవిని పెట్టినందుకు శిక్ష అనుభవించక తప్పదనుకొన్నాడు. తన వారంతా తన కళ్ళకు కట్టారు. వారి క్షేమ సమాచారాలు అతనికి తెలియవు. తను ఎక్కడ ఉన్నదీ వారికి తెలియదు. ఓడ మునిగి తను చనిపొయినా వారికి తెలియదు. తను చనిపోయే ముందు వారందర్నీ ఒక్కసారి చూసే అవకాశం దొరికితే ఎంత బాగుండును అనిపించింది అతనికి. ప్రాణాలతో మళ్ళా యార్క్ వెళ్ళే ఆశ అతన్ని వదిలి ఆ తుఫానులో ఎగిరిపోయింది. నిరాశా నిస్పృహలతో అతి భయంకరంగా రెండు రోజులు గడిచిన తర్వాత మూడవ రోజు ఉదయాన్నే ఓడ సరంగులో ఒకరు "అదిగో నేల! అదిగో నేల!" అని అతి సంతోషంతో అరవడం క్రూసోకు వినిపించింది. అందరితోపాటు క్రూసోక్కూడా ఎక్కడలేని ఆనందం కలిగింది. జీవితం మీద అందరికి ఆశ చిగురించింది. ఆ కేకలు వచ్చిన దిశగా క్రూసో వెళ్ళాడు. అతన్ని ముక్కలుముక్కలుగా చీల్చి పారవేసేటట్టు పెను గాలి ఇంకా వీస్తున్నది. కళ్ళు మిరుమిట్లు గొలిపి అతన్ని గుడ్డి వాణ్ణి చేసేటట్టుగా ఒక పెద్ద మెరుపు మెరిసింది, చెవులు బద్దలయ్యేటట్టు ఒక ఉరుము ఉరిమింది. ఇంతలో ఓడ వెళ్ళి ఒక ఇసుక దిబ్బను ఢీకొంది.కెరటాలు ఉవ్వెత్తున లేచి ఓడమీద విరుచుకొని పడ్డయి. "ఓడ ముక్కలవుతూంది. వెంటనే చిన్న పడవను సముద్రంలోకి దించండి" అంటూ ఓడ కెప్టెన్ అరచాడు. సరంగులు చిన్న పడవను నీటిలోనికి దించారు. ఓడలోని వారందరూ అందులోకి దూకారు. సరంగులు ఆ పడవను నేలవైపుకు మళ్ళించి తీసికొని వెళ్తూ ఉండగా ఒక పెద్ద కెరటం ఒక భూతంలా వచ్చి దానిని ముంచివేసింది. అందులోని వారందరూ నీటిలో మునిగి పోయారు. వారిలో రాబిన్సన్ క్రూసో కూడ ఉన్నాడు. |
ముందరి పేజి తరువాతి పేజి |