రాబిన్ సన్ క్రూసో కథ - Chapter 1 |
ఉత్తర ఇంగ్లండ్ దేశంలో యార్క్ అనే పట్నం ఒకటి ఉంది. ఆ పట్నంలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు. అతనికి ముగ్గురు కొడుకులు. వారిలో చివరివాడు రాబిన్ సన్ క్రూసో.
1632వ సంవత్సరంలో రాబిన్ సన్ క్రూసో పుట్టాడు. అతడు చిన్నప్పటి నుండీ ధైర్యవంతుడు. వీరుల కథలను ఎక్కువగా చదువుతూ ఉండేవాడు. అందువల్ల అతడు పెరిగి పెద్ద వాడు అవుతున్న కొద్దీ వీరోచితమైన జీవితాన్ని గడపాలని అనుకొంటూ ఉండేవాడు. అతని తండ్రి అతనికి బాగా చదువుచెప్పిస్తూ వచ్చాడు. క్రూసో బాగా చదువుకొని గొప్ప న్యాయవాది కావాలని అతని తల్లి తండ్రులు ఆశిస్తూ ఉండేవారు. కాని ఆ వృత్తి అంటే క్రూసోకు ఇష్టం లేదు. నావికుడుగా సముద్ర యానం చేయాలనీ, అనేక దేశాలు చూసి రావాలనీ క్రూసో కోరుకుంటూ ఉండేవాడు. అతని శ్రేయస్సు కోరి అతని తల్లిదండ్రులూ, బంధువులూ, స్నేహితులూ అతన్ని నావికుడుగా వెళ్ళవద్దని ఎంత నచ్చచెప్పినా అతని మనస్సు మారలేదు. కాని అతని తండ్రి గట్టిగా మందలించడంతో క్రూసో తన కోరికను మనసులో అణుచుకొనక తప్పలేదు. అతని తండ్రి స్నేహితులలో ఒక ఓడ కెప్టెన్ కూడా ఉన్నాడు. అతడు ఒకనాడు వారి ఇంటికి వచ్చాడు. అతనితోపాటు క్రూసో ఈడు వాడే ఐన అతని కొడుకు కూడా వచ్చాడు.ఇద్దరూ ఒకే ఈడు వాళ్ళు అవటంతో వెంటనే స్నేహం యేర్పడింది. వారిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఆ కొత్త స్నేహితుడు అతని తండ్రితోగూడా తరచుగా ఓడ మీద సముద్రయానం చేస్తూ అనేక దేశాలు చూసి వచ్చాడు. ఆయా దేశాలలోని వింతలను విశేషాలను అతడు క్రూసోకు ఆనాడు వివరంగా చెప్పాడు. దాంతో క్రూసో మనసు మళ్ళీ నౌకాయానం మీదకు మళ్ళింది. అతనిలోని పాత కోరిక మళ్ళీ రేకెత్తింది. "సముద్రయానం చేసి వివిధ దేశాలలోని వింతలూ, విశేషాలు చూసి రావాలని నాకు యెంతో సరదాగా ఉంది. నావికునిగా నా జీవితాన్ని గడపాలని ఉంది" అంటూ క్రూసో తన మనస్సులోని కోరికను ఆ కొత్త స్నేహితునికి తెలియజేశాడు. "దానికేముంది? వచ్చే శనివారం మేం హల్ రేవు నుండి బయలుదేరి ఓడలో లండన్ వెళ్తున్నాం. నీకు సరదాగా ఉంటే మాతో రా. నీకు ఏ కర్చూలేకుండా నేను తీసికొనివెళ్తాను," అన్నాడు ఆ కొత్త స్నేహితుడు. "నాకు రావాలనే ఉంది. కాని మా నాన్నగారికి ఇష్టం లేదు" "యేం?" "నావికుడు తన ప్రాణాలను యెప్పుడూ అరచేతిలో పెట్టుకొని ఉండవలసి ఉంటుందని ఆయన భయం." "సముద్రయానంలో ప్రమాదాలు ఉన్నాయనుకో ! అప్పుడప్పుడు మనం తుఫానులను యెదుర్కోవలసి ఉంటుంది. కాని అవి యెప్పుడోగాని రావు. ప్రతి వృత్తిలోను మంచీ, చెడూ రెండూ ఉంటాయి.సముద్రయానం చేసే నావికులకు తుఫానులను యెదుర్కొనే ధైర్యసాహసాలు ఉండాలి. అప్పుడే వారి జీవితాలు సంతోషదాయకంగా ఉంటాయి. వివిధ దేశాలను, రకరకాల మనుష్యులను అనేక వింతలను చూసే అదృష్టం ఒక్క నావికులకే కలుగుతూ ఉంటుంది. అందరికీ ఈ అదృష్టం ఉండదు. మీ నాన్నగారు ఆశించినట్టుగా నీవు ఒక న్యాయవాదివి అయితే ఈ ఊళ్ళొనే ఉంటూ నీ జీవితమంతా ఒకే విధంగా గడపవలసి ఉంటుంది." నాకు చిన్నపటినుంచి నావికుని జీవితమంటేనే సరదా. తుఫానులంటే నాకు భయం లేదు. పెనుగాలులు వీస్తూ ఉవ్వెత్తున కెరటాలు లేచిపడుతున్నప్పుడు సముద్రంలో ఓడ ఉయ్యాలలాగా ఊగిసలాడుతూ ఉంటే ఎంతో సరదాగా ఉంటుంది కదూ?" అన్నాడు క్రూసో సముద్రయానంలో తుఫానును ఊహించుకొంటూ. "అల్లకల్లోలంగా ఇండే సముంద్రంలో ఓడ ప్రయాణం సరదాగా ఉండదు. చాలా భయంకరంగా ఉంటుంది. కాని దానివల్ల నీకు ధైర్యసాహసాలు అబ్బుతాయి," అన్నాడు స్నేహితుడు. "నన్ను సముద్రయానానికి పంపమని మా నాన్నగారిని చివరిసారిగా అడుగుతాను. ఆయన సమ్మతిస్తే సరే సరి, లేకపొతే ఎవరితోను చెప్పకుండా వచ్చి మిమ్మల్ని హల్ రేవువద్ద వచ్చే శనివారం కలిసికొంటాను." అని క్రూసో తన నిశ్చయాన్ని తన స్నేహితునికి తెలియజేశాడు. "తప్పకుండా కలిసికో" అన్నాడు ఆ కొత్త స్నేహితుడు, క్రూసో చేయబోయే పని తప్పని తెలియక. అతిధిగా వచ్చిన ఓడ కెప్టెన్ తనకొడుకును తీసికొని వెళ్ళిన తర్వాత క్రూసో తన తండ్రివద్దకు వెళ్ళి తనను సముద్రయానానికి పంపమని బ్రతిమలాడాడు. "నీవు న్యాయవాదివి అయితే నీవు నీ జీవితాన్ని హాయిగా గడపవచ్చును. నీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. నీవు నా మాట విని ఇంటి పట్టున ఉంటే నీకు యేది కావాలంటే అది ఇస్తాను. సముద్రయానమంటే నీవు యేదో ఊహించుకొని సరదా పడుతున్నావే కాని అందులో ఉండే ప్రమాదాలను నీవు గుర్తించడంలేదు. నా మాట విని ఆ జీవితం గురించి మరచిపో. పెద్దవాళ్ళ మాట వినడం నీకు ఎంతో మంచిది. వినకపోతే ఆ తప్పుకు తగిన శిక్ష నీవే అనుభవిస్తావు" అంటూ క్రూసో తండ్రి అతన్ని నయాన్నా భయాన్నా మందలించాడు. కాని క్రూసో బుద్ధి మారలేదు. అందువల్ల అతడు ఎవరికీ చెప్పకుండా ఇల్లు విడిచిపెట్టి బయలుదేరాడు. శనివారం నాటికి అతడు హల్ రేవు చేరుకొని అతని స్నేహితుని కలిసికొన్నాడు. ఇంటినుండి పరారీ అయిననాటికి రాబిన్ సన్ క్రూసో మరీ చిన్న వాడేం కాదు. ఆ నాటికి అతని వయస్సు ఇరవై సంవత్సరాలు. |
ముందరి పేజి తరువాతి పేజి |