రాబిన్ సన్ క్రూసో కథ - Chapter 14
ఆ మర్నాడు ఖైదీల నందర్నీ ఓడ కెప్టెన్ విజయ గర్వంతొ పలకరించి "మీరంతా దుర్మార్గులు, విశ్వాసఘాతకులు, స్వామిద్రోహులు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే దుర్బుద్ధి గలవారు మీరు. నన్నూ నా స్నేహితుల్నీ ఈ ద్వీపం మీద వదిలిపెట్టి నా ఓడను స్వాధీనం చేసికొనాలనుకొన్నారు. ఇక్కడ తిండి లేక మేము చనిపోతామని మీరు భావించారు. కాని తానొకటి తలిస్తే దైవ మొకటి నిర్ణయించాడు.

"ఈ ద్వీపానికి గవర్నరు ఒకరు ఉన్నారు. ఆయన పేరు రాబిన్సన్ క్రూసో. ఇప్పుడు మీరంతా ఆయనకు ఖైదీలుగా చిక్కారు. మిమ్మల్ని ఆయన ఇంగ్లండ్ పంపించి, మీ తిరుగుబాటు చర్యను చట్టరీత్యా విచారించవలసిందని ప్రభుత్వాన్ని కోరదలచారు. బ్రిటిష్ ప్రభుత్వం మీకు తగిన శిక్ష విధిస్తుంది."

"మన గవర్నరుగారికి ఓడలో జరిగినదంతా వివరంగా విన్నవించుకొన్నాను. ఈ కుట్రకు నాయకుడైన అట్కిన్సును ఇక్కడే వారు విచారించి శిక్షించ దలచుకొన్నారు. మిగతా వారిని విచారణ నిమిత్తమై ఇంగ్లండ్ పంపించదలచుకొన్నారు" అంటూ ఓడ కెప్టెన్ వారికి చెప్పాడు.

ఇంతలో రాబిన్సన్ క్రూసో కొత్త దుస్తులు ధరించి గవర్నరులాగ ఠీవిగా వారి ముందుకు వచ్చి " మీరంతా స్వామిద్రోహులు, న్యాయంగా మిమ్మల్ని అందర్నీ ఉరి తీయాలి. కాని మీరంతా కుట్ర నాయకుడైన అట్కిన్సు మాటలకు మోసపోయి మీ కెప్టెన్ కు ఎదురు తిరిగినట్టు నాకు తెలిసింది. కనుక మీరు మీ కెప్టెన్ కు క్షమాపణ చెప్పుకొంటే మిమ్మల్ని క్షమించగలను. అట్కిన్సుకు ఉరిశిక్ష విధిస్తున్నాను," అని చెప్పాడు.

ఆ కుట్ర దారులందరూ క్రూసో కాళ్ళ మీద పడి క్షమాభిక్ష వేడికొన్నారు. కాని క్రూసో మాట్లాడాకుండా ఠీవిగా కెప్టెన్ తో సహా వెళ్ళిపోయాడు.

క్రూసో తో కెప్టెన్ సమాలోచనలు జరిపి తుదకు కుట్ర దారులలో దుర్మార్గులను ఒక జట్టు కిందా, మిగిలిన వారిని ఒక జట్టు కిందా విభజించాడు. దుర్మార్గుల కాళ్ళూ చేతులూ కట్టి వేసి వారిని కొండగుహలో పడవేయమని, ఇతరులను 'వన విహార్ ' లో ఉంచమని క్రూసో ఫ్రైడేని ఆజ్ఞాపించాడు. కెప్టెన్ తన స్నేహితులైన వారిని ఆ కుట్ర దారులకు కాపలా కాయమని నియమించాడు. తర్వాత ఓడను ఎలా స్వాధీనం చేసికొనాలన్న విషయమై క్రూసోతొ కెప్టెన్ చాలాసేపు చర్చించి క్రూసో సలహాలను పాటించడానికి కెప్టెన్ అంగీకరించాడు.

వెంటనే కెప్టెన్ కుట్రదారుల వద్దకు వెళ్ళి, "గవర్నరు గారు మీ విషయమై మూడు సూచనలు చేశారు. ఒకటి, స్వేచ్చా జీవులుగా మీరు ఈ ద్వీపం మీద ఆజన్మాంతం ఉండడం. లేక రెండు, ఇంగ్లండ్ వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించడం, లేక మూడు, వారికి విధేయులుగా ఉండి ఓడని స్వాధీన పరచుకొనడంలో వారికి సహాయపడి ఏ శిక్షా లేకుండా హాయిగా స్వదేశం చేరుకొవడం. ఈ మూడింటిలో ఎవరికి ఏది కావాలో కోరుకొనండి" అని చెప్పాడు.

ఓడను తిరిగి కెప్టెన్ కు స్వాధీన పరచడానికి తగిన సహాయం చేయడమే కాక బ్రతికి ఉన్నంత కాలం క్రూసోకే కాక కెప్టెన్ కు కూడా విధేయులుగా ఉండడానికి వారు అంగీకరించారు.

తర్వాత నమ్మకస్తులైన పన్నెండు మంది నావికులను ఓడ కెప్టెన్ ఎంచుకొని, ఓడను స్వాధీన పరచుకొనడానికి బయలు దేరాడు. వారంతా కలిసి ఓడలోనున్న కుట్రదారులలోని మరొక నాయకుణ్ణి తుపాకీతో కాల్చి చంపి, ఇతరులను వశపరచుకొన్నారు. వెంటనే వారు ఏడుసార్లు తుపాకులను గాలిలో పేల్చారు. ఆ సాంకేతికాలను విని ఇంటికి వెళ్ళి క్రూసో హాయిగా నిద్రపోయాడు.

ఆ మర్నాడు ఉదయం క్రూసో నిద్ర లేచిన తర్వాత కెప్టెన్ వచ్చి దూరాన్న సముద్రంలో నిలిచి ఉన్న ఓడను విధేయతతో చూపిస్తూ "గవర్నరు గారూ ! ఆ ఓడ నాది కాదు మీది. ఆ ఓడకు చెందిన మేము, మీ అధీనుల మవుతున్నాము. మీ ఆజ్ఞలను శిరసావహించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. ఆజ్ఞాపించండి" అంటూ మోకాళ్ళ పైని కూర్చున్నాడు. రాబిన్సన్ క్రూసో ఆ ఓడను తదేకంగా చూస్తూ కొయ్యలా నిలబడి పోయాడు. అతని మనస్సులోని సంతోషం అతన్ని నిశ్చేష్టుణ్ణి చేసింది. ఆ ద్వీపంనుండి ఎలాగైనా బయటపడి తన స్వదేశం చేరుకొనాలనే తలంపు చాలా కాలంగా అతనికి ఉంది. కాని ఇంత త్వరలో ఆ ఆశ నెరవేరుతుందని అతడు కలలోగూడా ఊహించలేదు. అందువల్ల అతని ఆనందానికి అంతు లేక పోయింది. అతని కళ్ళ వెంట ఆనంద భాష్పాలు రాలేయి. శరీరం అతని స్వాధీనం తప్పింది. అతను ఎక్కడ ఉన్నదీ అతనికే తెలియలేదు. ఆ అనందంలో అతడు నేలకు ఒరిగిపోతూ ఉంటే కెప్టెన్ అతన్ని పట్టుకొని పడుకో బెట్టాడు. తర్వాత అతనికి కాస్త ద్రాక్ష సారాని కెప్టెన్ ఇచ్చాడు. ద్రాక్షసారా తాగి, కాస్త ఆహారం తిసికొని కెప్టెన్ ఇచ్చిన చుట్టను కాలుస్తూ ఉంటే క్రూసో మనోభావాలు ఎన్నో సంవత్సరాల వెనక్కు వెళ్ళాయి.

"గవర్నర్ గారూ ! మేము ఏం చెయ్యాలో ఆజ్ఞాపించండి" అన్నాడు కెప్టెన్.

"నా సంతోషం నుండి నన్ను తేరుకోననీయండి. ఈ ఒక్క రాత్రి నన్ను నా ద్వీపం మీద గడపనీయండి" అన్నాడు క్రూసో.

"తమ ఇష్ట ప్రకారమే కానీయండి. మరి మన ఖైదీల విషయమై మీ నిర్ణయం తెలియజేయండి."

"ఓడ మీద నిన్న మీరు చంపిన ఆ నాయకుని శవాన్ని ఇక్కడకు తెప్పించి ఒక చెట్టుకు వ్రేలాడకట్టండి. ఆ శవాన్ని చూసి ఇతర కుట్రదారులు ఒక గుణపాఠం నేర్చుకొంటారు. ఆ తర్వాత వారి విషయమై ఆలోచిద్దాం."

"మీ సామానులలో వేటిని ఓడలోకి ఎక్కించమంటారో సెలవియ్యండి. ఆ పనైనా ఈ లోపున పూర్తి చేస్తాం."

"అయితే ఓడను తీరానికి చేరువుగా తిసికొనిరండి."

ఆ సాయంత్రం గవర్నర్ రాబిన్సన్ క్రూసో తన దర్బారులో కూర్చున్నాడు. అతని కుడి ప్రక్కను కెప్టెన్ ఆశీనుడైనాడు. వారి వెనుక వారి అనుచరులు, వారికి ఎదురుగా ఖైదీలను నిల బెట్టారు. వారికి ఎదురుగా దూరంగా ఒక చెట్టుకు కుట్రదారుల నాయకుని కళేబరం వ్రేళ్ళాడుతూ ఉంది.

మీ నాయకుని శవాన్ని మీరంతా ఒకసారి చూడండి. మీలో ఎవరైనా ఓడ మీదకు రా ప్రయత్నించారా మీకూ అదే గతి పడుతుంది. జాగ్రత్త. ఇక్కడ నేను సమకూర్చుకొన్న ఆస్తినంతా మీకు వదిలి పెడుతున్నాను. ఈ ద్వీపం మీద నాకు రెండు ఇళ్ళు ఉన్నయి. వాటిలో మీరు హాయిగా నివసించవచ్చును. నాకు మూడు గొర్రెల మందలు ఉన్నయి. వాటి పాడిని మీరు అనుభవించండి. నేను మూడు మళ్ళను సాగు చేసి గోధుమలను, జొన్నలను పండించాను. మీరు మరి కొన్ని మళ్ళను సాగు చేసి వ్యవసాయం వృద్ధి చేసికొనండి. నేను రెండు తుపాకులను మాత్రమే తీసికొని వెళ్తున్నాను. ఇవాళో రేపో పదహారు మంది స్పానిష్ దేసశ్థులు ఇక్కడికి వస్తాఆరు. వారి కోసం త్వరలో ఒక ఓడను పంపించగలనని వారికి చెప్పండి. దేవుడు చాలా దయగలవాడు. నన్ను ఆ దైవం రక్షించాడు. అడవి మనుష్యుల బారి నుండి ఆ భగవంతుడే నన్ను రక్షించాడు. ఇన్ని సంవత్సరాలు ఏ అపాయం రాకుండా ఆ దయామయుడే నన్ను కాపాడాడు. మీరంతా కలిసి మెలిసి ఈ ద్వీపం మీద బ్రతకండి. మీరు పశ్చాత్తాపం పడితే దేవుడు మీకు తప్పక మేలు చేస్తాడు" అని క్రూసో ఆ కుట్రదారులకు హితోపదేశం చేశాడు.

ఆ మర్నాటి ఉదయమే క్రూసో తన బొచ్చు టోపీనీ, తోలు దుస్తులను, వింత గొడుగుని ఓడలోనికి పంపించాడు. తన రామచిలుకను భుజం మీద ఎక్కించుకొని, దాని పలుకులను సరదాగా వింటూ ఓడ ఎక్కాడు.

ఓడ లంగరు ఎత్తి నీటిలో కదిలి పోతుంటే క్రూసో ద్వీపం వైపు తదేకంగా చూస్తూ ఉంటే తన కొయ్య కాలెండరు కనబడింది. అతని ఇరవై ఏడేళ్ళ ద్వీపాంతర వాసం అతని కళ్ళకు కట్టింది. ఒకసారి తన కుక్కను తల్చుకొన్నాడు. మనస్సులోనే క్రూసో దేవునికి కృతజ్ఞతలు తెల్పుకొంటూ ఉండగా ఓడలో ఏదో అలజడి వినబడింది. ఎవరో ఇద్దరు ఖైదీలు తమని కూడా ఓడ ఎక్కించమని కెప్టెన్ ను ప్రార్ధిస్తున్నారు. కెప్టెన్ నిరాకరిస్తున్నాడు. అప్పుడు క్రూసో దయదలచి, ఆ ఇద్దర్నీ కూడా ఓడ ఎక్కనిచ్చాడు.

1687 జూన్ 11 వ తేదీన ఇంగ్లండ్ దేశ కొండ శిఖరాలు దూరంగా రాబిన్సన్ క్రూసో కు కనబడ్డాయి. ముప్ఫై అయిదు సంవత్సరాల అనంతరం తన మాతృదేశం తన కళ్ళకు కంపడినందుకు క్రూసో మనస్సు ఆనందంతో చిందులు వేసింది. అతడు తలవంచుకొని, కళ్ళు మూసికొని మనస్సులో దేవుణ్ణి ప్రార్ధిస్తూ మోకాళ్ళ పైని కూర్చున్నాడు.

ఓడ ఇంగ్లండ్ దేశ తీరం వైపు సాగి పోతూంది.
సమాప్తం - కథ కంచికి మనం ఇంటికి.....
అక్షర దోషాలు సాధ్యమయినంతవరకు లేకుండా ఉండటానికి ప్రయత్నించటం జరిగింది. మా కన్నుగప్పినవి ఎక్కడయినా మీకు కనపడితే తెలియచెయ్యమని విన్నపము
మొట్టమొదటి పేజీ           ముందరి పేజి


www.maganti.org