రాబిన్ సన్ క్రూసో కథ - Chapter 13
ఆ ఎనమండుగురు నావికులు అడవిలోనికి వెళ్ళారు. వారు కనుమరుగైన తరవాత క్రూసో బంధితులున్న చోటుకు వెళ్ళాడు. ఫ్రైడే అతన్ని అనుసరించాడు. వారిద్దరివద్ద ఆయుధాలు ఉన్నాయి. క్రూసో ఆ బంధితులకు చేరువగా వెళ్ళి "ఎవరండీ మీరు ?" అని స్పానిష్ భాషలో అడిగాడు.

నివాస యోగ్యం కాని ఒక నిర్మానుష్య ద్వీపం అని ఆ బంధితులు ఊహిస్తున్నచోట గొర్రెతోళ్ళ దుస్తులలో ఒక వ్యక్తి వచ్చిన తమను పలకరించడంతో వారు ఆశ్చర్య పోయారు.

"నన్ను చూసి మీరు ఆశ్చర్యపోకండి. నేను అడవి మనిషిని కాను. నే నొక ఇంగ్లీషు వాడిని. మీరు ఆశించకపోయినా మీకు ఇక్కడ ఒక స్నేహితుడు ఉన్నాడని అనుకొనండి. ఇక మీదట మనమంతా స్నేహితులుగా ఉందాం. మీకు కావలసిన సహాయం చేయడానికే మేమిద్దరం వచ్చాం." అన్నాడు క్రూసో స్నేహపూర్వకంగా.

"దేవుడే తన దూతను మీ రూపంలో మాకు సహాయం చేయడానికి పంపించాడని భావిస్తున్నాం. మే మొక పెద్ద ఆపదలో చిక్కుకొన్నాం. మీరే మమ్మల్ని రక్షించాలి." అని ఆ ముగ్గురిలో ఒకడు ఇంగ్లీషులో అన్నాడు.

"మీరేం భయపడకండి. నేనూ ఇంగ్లీషు వాడినే. నా తోటి దేశస్థులను ఆదుకొనడం కన్నా నాకింకేం కావాలి ? అది నా ధర్మం. మీకు తప్పక షాయం చేస్తాను. ఇతడు నా బానిస. ఇతని పేరు ఫ్రైడే. ఒకప్పుడు ఇతన్ని కూడా ఆపద నుండి రక్షించాను. ఇతడు నా నమ్మిన బంటు. ఇక చెప్పండి మీకు ఏ సహాయం కావాల్ఫ్" అని క్రూసో ఇంగ్లీషులో మాట్లాడి వారికి ధైర్యం కలుగ జేశాడు.

"ఆ కనబడుతున్న ఓడకు నేను కెప్టేన్ను. మేము సముద్రయానం చేస్తూ ఉండగా నా నావికులలో కొందరు నాకు ఎదురు తిరిగారు. నన్ను చంపి నా ఓడను తమ స్వాధీనం చేసికొనాలని వారు ఎత్తు వేశారు. వీరిద్దరూ విశ్వసపాత్రులైన నా స్నేహితులు. కనుక వీరు వారితో కలియలేదు. అందువల్ల వీరిద్దరూకూడా వారికి శాతృవులైనారు. మిగతా నావికులందరూ నా ఓడను స్వాధీనపరచుకొనడానికి ఏకమైనారు. కాని మమ్మల్ని చంపడానికి వారిలో చాలామంది వ్యతిరేకించారు. ఈ విషయమై వారిలొ వారికి తర్జన భర్జనలు జరిగాయి. తుదకు మమ్మల్ని ఈ ద్వీపం మీద వదలి పోవాలని వారు నిర్ణయించుకొన్నారు. ఇక్కడ మాకు తినడానికి తిండి, తాగడానికి నీరూ లేక మాడిమాడి త్వరలో చావాలని వారి ఉద్దేశ్యం" అంటూ తన విషాదగాధను ఆ ఓడ కెప్టెన్ క్రూసోకు తెలియజేశాడు.

"సరే; వారి ఉద్దేశాన్ని నేను తారుమారు చెస్తాను. వారంతా పడుకొన్నట్టు ఉన్నారు. వారికి శాశ్వతమైన నిద్రను ప్రసాదిస్తాను. కాని మీరు నాకొక వాగ్దానం చేయాలి"

"అదేమిటో చెప్పండి. ప్రమాణపూర్తిగా మీరు ఏం చేయమంటే అది చేస్తాం" అన్నాడు ఓడ కెప్టెన్.

"మా యెడల సద్భావంతో, స్నేహంతో..."

"ఓ తప్పకుండా ఉంటాం" అంటూ ఆ ముగ్గురూ క్రూసో చెప్పినట్టు ఉండడానికి ప్రమాణం చేశారు.

"స్నేహితులారా ! ఇక చూడండి మీ ఓడను మీకు మళ్ళా స్వాధీనం చేస్తాను. ఆ తర్వాత నన్నూ నా నౌకరునూ ఏ సుంకం లేకుండా మీ ఓడలో లండన్ తీసికొని వెళ్ళాలి."

"ఎంతో సంతొషంతో మిమ్మల్ని తీసికొని వెళ్తాం. మాకు అంతకన్నా కావలసింది ఏముంది ?" అన్నాడు ఆ కెప్టెన్.

వెంటనే క్రూసో వారి ముగ్గురి బంధనాలను కోసి వారిని బంధవిముక్తుల్ని చేశాడు. ఆ ముగ్గురికి మూడు తుపాకులు ఇచ్చాడు. ఆ ఐదుగురూ కలిసి నావికులు వెళ్ళిన దిక్కుగా వెళ్ళారు.

"చూడండి !..." అంటూ కెప్టెన్ ఏదో అనబోయాడు.

"నా పేరు రాబిన్సన్ క్రూసో, నన్ను మీరు క్రూసో అని పిలవండి చాలు."

"చూడండి క్రూసో ! ఆ జట్టులోని వారందరూ చెడ్డ వారు కారు. వారిలో కొంతమంది మాత్రం దుర్మార్గులు. వారిని మాత్రం మనం చంపితే చాలు. అందర్నీ చంపితే మన సముద్రయానానికి కావలసినంత మంది మనకు ఉండరు" అన్నాడు కెప్టెన్.

"ముఖ్యుల్ని చంపితే మిగిలిన వారు మనకు లొంగక మానరు" అన్నాడు క్రూసో.

అడవికి చేరువగా వెళ్ళగానే మాట్లాడవద్దని, మెల్లగా చప్పుడు చేయకుండా నడవమని అందర్నీ క్రూసో హెచ్చరించాడు. ఆ ఐదుగురూ జాగ్రత్తగా అడవిలోనికి ప్రవేశించారు. చెట్లనీడను నావికులు నిద్ర పోతున్నారు.

ఆ జట్టు నాయకులలో ముఖ్యుణ్ణి గురి చూసి ఓడ కెప్టెన్ తన తుపాకీ పేల్చాడు, అతని స్నేహితులలో ఒకడు ఇంకొక ముఖ్యుణ్ణి గురి చూసి తుపాకీ పేల్చాడు. వారిలొ ఒకడు చని పోయాడు. రెండవవాడు గాయపడి మూలిగాడు. తుపాకుల ప్రేలుళ్ళకు నిద్రపోతున్న వారందరూ లేచి పరిస్థితి అర్ధం కాక బొమ్మల్లాగ నిలబడ్డారు. వారిని ఉద్దేశిస్తూ ఓడ కెప్టెన్ "మీరు మాతో యుద్ధం చేయలేరు. మీ నాయకులలో ఒకడు మరణించాడు. రెండోవాడు చావుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక చెప్పండి మీరు మాకు లొంగిపోయి మా ఆజ్ఞలను పాటిస్తారా ? లేక మా తుపాకులకు బలి కాదలచుకొన్నారా ? మీరు మాకు లోబడి ఉంటామని మాట యిస్తే మీకు ఏ హానీ కలుగదు. లేకపోతే మీకు చావు తప్పదు." అంటూ గట్టిగా హెచ్చరించాడు. దాంతో మిగిలిన ఆరుగురూ చేతులు ఎత్తి నిలబడ్డారు.

"క్రూసో ! వీరిలో ఇద్దర్ని నమ్మడానికి వీలు లేదు. కనుక ఆ యిద్దర్నీ తాళ్ళతో బంధించడం మంచిది" అని ఓడ కెప్టెన్ క్రూసో చెవిలో రహస్యంగా చెప్పాడు.

క్రూసో ఆజ్ఞను అనుసరించి ఫ్రైడే కెప్టెన్ చూపించిన ఇద్దర్నీ బంధించాడు. మిగిలిన నలుగురూ కెప్టెన్ కు క్షమాపణ చెప్పుకొని, ఇకమీదట ఆయనకు విధేయులుగా ఉండడానికి అంగీకరించారు.

ఇంతలో ఓడపైనుండి తుపాకీ శబ్దం వినవచ్చింది. ద్వీపం మీదకు వచ్చిన వారిని తిరిగి రమ్మనమని సాంకేతికంగా ఓడ మీది వారు తుపాకీ పేల్చారు. ద్వీపంనుండి పడవ ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో ఓడమీదివారు ఉండుండి సాంకేతికంగా తుపాకుల్ని చాలా సార్లు పేల్చారు. కాని ఫలితం కనబడకపోవడంతో మరో పదిమంది నావికులు మరొక పడవ మీద ద్వీపం వైపు బయలు దేరడం క్రూసో దూరదర్శినితో గమనించాడు. ఆ విషయం కెప్టెన్ కు తెలియజేశాడు.

"ఆ పడవలో వస్తున్న పదిమందితో మనం యుద్ధం చెయవలసి వస్తే వారిలో నలుగుర్ని మనం చంపకూడదు. ఆ నలుగురూ స్వతహాగా మంచివారె. కాని ఒత్తిడివల్ల వారు నా శతృవులతో చేరక తప్పలేదు," అని కెప్టెన్ క్రూసో తో అన్నాడు.

"అలాగే కెప్టెన్ ! ఆ పడవ తీరానికి చేరువగా వస్తున్నది కనుక మనం పొదల చాటున వాఆరికి కనబడకుండా దాగొనాలి. పదండి !" అంటూ కెప్టెన్ను, మిగతా వారిని మూడ క్రూసో హెచ్చరించాడు.

అందరూ పరుగు పరుగున వెళ్ళి పొదలమాటున నక్కి కూర్చున్నారు. ఇంతలో పడవ తీరం చేరింది. అందులోనుండి ముగ్గురు తప్ప అందరూ తీరం మిదకు గెంతారు. వారి మితృల కోసం చుట్టూ కలియ జూశారు. ఎవరూ కనబడ లేదు. వారు గొంతెత్తి బిగ్గరగా పేరు పేరునా పిల్చారు. కాని ఎటువంటి సమాధానం వారికి రాలేదు. అందువల్ల వారు తమ స్నేహితులను వెతకడానికి బయలు దేరారు. పడవలోనివారు తీరం వెంబడి పడవను నడిపించుకొంటూ బయలుదేరారు.

కొత్తగా వచ్చిన వారిని అడవిలోనికి దూరంగా తీసికొని వెళ్ళడానికి క్రూసో ఒక ఉపాయం ఆలోచించాడు. ఫ్రైడేని, కొత్త స్నేహితులలో ఒకణ్ణి పిలిచి, "మీరిద్దరూ అడవిలోనికి దూరంగా వెళ్ళి శతృవుల పిలుపులకు సమాధానంగా గట్టిగా పలకండి. ఆ విధంగా వారిని అడవిలోనికి తీసికొని పొండి" అని వారితో చెప్పి పంపించాడు. అతడూ ఓడ కెప్టెనూ పొదల చాటున నక్కి కూర్చుని అంతా గమనించసాగారు.

ఫ్రైడేతో వెళ్ళిన నావికుడు అడవిలోనికి దూరంగా వెళ్ళి కొత్తగా వచ్చిన వారిని పేరుపెట్టి పిలవసాగాడు. కొత్తగా వచ్చిన వారు ఆ పిలుపులకు సమాధానంగా కేకలు వేస్తూ అటు వెళ్ళ సాగారు. తర్వాత వారికి ఇంకొక దిశ నుండి పిలుపులు వినబడ్డయి. వెంటనే వారు అటు మళ్ళారు. ఈ విధంగా వారు అడవిలోనికి దూరంగా వెళ్ళారు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. అడవిలో చీకటి అలుముకొనజొచ్చింది. తిరిగి తిరిగి అలిసిపోయి ఆ కొత్తవారు నిరాశతో తీరంవైపు తిరుగు ముఖం పట్టారు.

క్రూసోతొ గూడా ఓడ కెప్టెన్ వారికోసం దారి కాశాడు. వారు దగ్గరకు రాగానే కెప్టెన్ వారిపైకి తుపాకీ పేల్చాడు. తను ఉద్దేశించిన ఇద్దరూ నేలకూలేరు. అందులో ఒకడు చనిపోయాడు, రెండవవాడు గాయపడ్డాడు. అదే సమయంలో ఫ్రైడే వెనుకనుండి గాలిలోనికి తుపాకీని పేల్చాడు. నడుమనున్న శతృవులు భయపడి, చేసేది ఏమిలేక చేతులు ఎత్తి క్రూసోకు లొంగి పోయారు. ఫ్రైడే వారిని తాళ్ళతో బంధించాడు. ఇంతలో బాగా చీకటి పడింది.
ముందరి పేజి               తరువాతి పేజి


www.maganti.org