రాబిన్ సన్ క్రూసో కథ - Chapter 12
చాలామంది స్పెయిన్ దేశస్థులు ఆర్జెంటైనా నుండి వ్యాపారరీత్యా హవానా వెళ్తూ ఉండగా వారి ఓడ ఒక ద్వీపానికి ఢీకొని విరిగి పోయింది. ఆ ద్వీపమే ఫ్రైడే స్వదేశం. ఆ ఓడలోనున్న వారిలో చాలామంది చనిపోయారు. పదిహేడు మంది మాత్రం బ్రతికి బయటపడ్డారు. వారంతా ఆ ద్వీప వాసులకు బందీలయ్యారు. వారు ఈ స్పెయిన్ దేశస్తులకు తినడానికి ఇంత తిండి పెడుతూ మర్యాదగా చూస్తున్నట్టు నటిస్తున్నారు. వీరిలో ఒక్కొక్కర్నే క్రూసో ఉన్న ద్వీపానికి తీసికొనివచ్చి చంపి విందు చేసికొనాలని ఆ నరభక్షకుల ఆలోచన. ఈ విషయం ఆ తెల్లవారు గ్రహించలేదు. కాని వారికి ఆ ద్వీపం మీద జీవించడం కష్టంగానే ఉంది. అందువల్ల ఎలాగైనా ఆ ద్వీపంనుండి వారి స్వదేశానికి వెళ్ళాలన్న ప్రయత్నంలో ఉన్నారు కాని వెళ్ళడానికి వీలులేక ఆ ద్వీప వాసులతో స్నేహంగా ఉంటున్నట్టు వారూ నటిస్తున్నారు. మరిద్దరు అడవి మనుష్యులతో గూడా ఆ స్పెయిన్ దేశస్తుణ్ణి చంపి విందు చేసికొనాలని ఆ అడవి మనుష్యులు అనుకొన్నారు కాని క్రూసో అంతా తారుమారు చేశాడు. హంతకులలొ కొందరు తుపాకీ దెబ్బలకు బలి అయ్యారు. మిగిలినవారు తుఫానువల్ల సముద్రంలో ములిగిపోయారు.

ఆ స్పెయిన్ దేశస్థుడు తన కధను పూర్తిగా క్రూసోకు చెప్పి "మీరు నన్ను రక్షించి ఉండకపోతే వారు నన్ను చంపి విందు చేసికొని ఉందురు. నేను మీకు సర్వదా కృతజ్ఞుణ్ణి, మీకు విధేయుణ్ణి" అంటూ తన కధను ముగించాడు.

"మీ నావికులలో మిగతా పదహారుగురూ బ్రతికి ఉన్నట్టేనా ?"

"వారు ప్రస్తుతం బ్రతికే ఉన్నారనుకొంటాను, కాని త్వరలో వారిని ఈ రాక్షసులు తమ పొట్టను పెట్టుకొనక మానరు"

"అయితే మనం వారిని ఎలాగైనా రక్షించాలి. మనం ఆ ద్వీపానికి వెళ్ళి వారిని ఇక్కడకు తీసికొని వద్దాం. మనమంతా కలిసి ఒక ఓడను నిర్మించి దానిలో ఈ మహా సముద్రాలను దాటి మన దేశాలను చేరుకొందాం. మరి మీ దేశస్తులు నాతో సహకరిస్తారా ?"

"సంతోషంతో సహకరిస్తారు. ఎలాగైనా స్వదేశం చేరుకోవాలన్న ఆతృతతో వారూ ఉన్నారు."

"అయితే మన ప్రయాణానికి సిద్ధం కమ్మంటారా ?"

"మీరు రానవసరంలేదు. నేను ఈ ముసలివానితో వెళ్ళి వారందర్నీ ఇక్కడకే తీసికొని వస్తాను. కాని వారంతా ఇక్కడికి వస్తే తగిన ఆహారం ఇక్కడ ఉందా ?"

"ప్రస్తుతం ఉన్న తిండి గింజల్నీ, గొర్రెలవల్ల లభించే పాడిని జాగ్రత్తగా వాడుకొందాం. అడవిలో కావలసినన్ని పళ్ళున్నాయి. మనమంతా కలిస్తే ఇరవై మంది అవుతాంగదా ? అందరం కష్టపడి పని చేద్దాం. మన సేద్యాన్ని వృద్ధి చేద్దాం. ఒక ఓడను నిర్మించుకొందాం. దీని అంతటికి ఒకటి రెండు సంవత్సరాలు పట్టినా మన కష్టానికి ఫలితం దక్కకపోదు. మన దేశాలు చేరుకొనలేకపోము. కనుక తిండి విషయమై ఆలోచించనవసరం లేదు. మీరు వెళ్ళి వారిని తీసికొని రండి." అంటూ క్రూసో అతన్ని ప్రొత్సహించాడు.

"అయితే రేపు ఉదయమే మేము బయలుదేరి వెళ్తాం." అన్నాడు ఆ స్పెయిన్ దేశస్థుడు.

అడవి మనుష్యులు తీసికొని వచ్చిన పడవలో ఎనిమిది రోజులకు, పద్ధెనమండుగురికి సరిపోయే ఆహారపదార్ధాలను పెట్టమని క్రూసో ఫ్రైడేతో చెప్పాడు. అవసరమైతే అడవి మనుష్యులను ఎదుర్కొనడానికిగాను, రెండు తుపాకులను, కొంత మందు గుండును క్రూసో స్పెయిన్ దేశస్థునికి ఇచ్చాడు. ఆ మర్నాటి ఉదయమే స్పెయిన్ దేశస్థుడు, ఫ్రైడే తండ్రితో సహా సముద్ర యానానికి సిద్ధమయ్యాడు. "సుఖంగా వెళ్ళి లాభంగా రండి" అంటూ క్రూసో వారికి వీడ్కోలు ఇచ్చాడు.

ఎనిమిది రోజుల్లో వారిద్దరూ ఇతర స్పెయిన్ దేశస్థులతో గూడా తిరిగి రావచ్చునని క్రూసో అంచనా వేశాడు. వారు వెళ్ళిన ఎనిమిదవ రోజున క్రూసో వారి రాక కోసం కొండ శిఖరం మీద నిరీక్షించాడు. కాని వారి జాడ కాన రాలేదు. తొమ్మిదవ రోజున కొండ శిఖరంపైని ఫ్రైడేని ఉండమని చెప్పి క్రూసో తన ఇంట్లో వల ఉయ్యాలలో విశ్రాంతి తీసికొంటూ, స్వదేశ ప్రయాణానికి పధకాలు వేసికొంటూ ఉండగా ఫ్రైడే పరుగెత్తుకొంటూ వచ్చి "మాష్టర్ ! మాష్టర్ ! వాళ్ళొస్తున్నారు ! వాళ్ళొస్తున్నారు !" అంటూ సంతోషంతో కేకలు పెట్టాడు.

ఉయ్యాలలోనుంచి క్రూసో ఒక్క గంతు గెంతి కొండ శిఖరం మీదికి పరుగు పరుగున వెళ్ళాడు. అక్కడనుండి దూరదర్శినితో తీరం వైపు చూశాడు. దూరంగా సముద్రంలో ఒక ఓడ లంగరు వేసి ఆగినట్టు కనబడింది. క్రూసో దానిని జాగ్రత్తగా దూరదర్శినితో పరిశీలించాడు. అది ఇంగ్లండ్ దేశానికి వెందిన ఓడ. దాన్ని చూసి ఎంతగానో సంతోషించాడు. ఆ ఓడ తన ద్వీపానికి చేరువగా ఎందుకు ఆగిందా అని ఎంత ఆలొచించినా తగిన కారణం అతనికి ఏదీ కనిపించలేదు. ఇంతలో ఆ ఓడ నుంచి ఒక పడవ తన ద్వీపం వైపు వస్తున్నట్టు కనబడింది. దాంతో అతనికి సంతోషం పోయింది. ఏదో అపాయం వచ్చేటట్టు అతనికి అనిపించింది, అందువల్ల అతడు చెట్టుచాటు నుంచి పరిశీలించడం ప్రారంభించాడు.

కొంతసేపటికి ఆ పడవ తీరం చేరింది. ఆ పడవలో మొత్తం పదకొండుమంది ఉన్నారు. వారంతా ఇంగ్లండ్ దేశస్థులని అతడు సులువుగా గ్రహించాడు.

తాళ్ళతో బంధింపబడిన ముగ్గురు వ్యక్తుల్ని మిగతా ఎనమండుగురు ఒడ్డున పడవేశారు. ఆ బంధితులు తక్కిన వారిని ఏదో ప్రాధేయపడుతున్నట్టు క్రూసో గ్రహించాడు.

ఫ్రైడే ఎప్పుడు వచ్చేడోగాని క్రూసో వెనుక నిలబడి "మాష్టర్ ! మా వాళ్ళ లాగే మీ తెల్లవారు కూడా మనుష్యుల్ని చంపి తింటారనుకొంటాను." అన్నాడు. ఆ మాటకు క్రూసోకు కోపం వచ్చి, "లేదు; అలా తినరు; మా ఇంగ్లీషు వారు నరమాంసభక్షకులు కారు. మనుష్యుల్ని వారు ఏ కారణం చేతనైనా చంపితే చంపవచ్చును కాని నరమాంసం తినరు. ఇంకెప్పుడూ మా దేశస్థుల గురించి ఆలా మాట్లాడకు." అన్నాడు.

ఇంతలో ఆ నావికులలో ఒకడు ఒక బంధితుని మీదకు కత్తి ఎత్తాడు. ఆ బంధితుడు తనను రక్షించమని ప్రాధేయపడుతున్నట్టు సలాం చేశాడు. ఆ నావికుడు ఎత్తిన కత్తిని దించి ఇతర నావికులతో కలసి ద్వీపం మీదకు నడచు కొంటూ వెళ్ళిపోయాడు. బంధితులు తీరం మీద ఇసుకలో పడి ఉన్నారు. ఇదంతా గమ్నిస్తున్న క్రూసోకు అసలు విషయం అంతుపట్టలేదు.
ముందరి పేజి               తరువాతి పేజి


www.maganti.org