రాబిన్ సన్ క్రూసో కథ - Chapter 11
వర్షాకాలం గడిచి, శీతాకాలం ప్రవేశించింది. సముద్ర యానానికి వాతావరణం అనుకూలంగా ఉంది. క్రూసో తమ ప్రయాణానికి కావలసినవన్నీ ఒకనాడు తన 'సాగరదృశ్యం'లో అమర్చుకొంటున్నాడు. ఫ్రైడేని పడవను సిద్ధం చేయమన్నాడు. పడవ వద్దకు వెళ్ళిన ఫ్రైడే అక్కడినుండి పరుగెత్తుకొంటూ, "ఓ మాష్టర్ ! ఓ మాష్టర్ ! ..." అని అరుస్తూ వచ్చాడు.

ఆ అరుపులకు క్రూసో తన పని వదిలిపెట్టి ఫ్రైడేకి ఎదురు వెళ్ళి "ఏమిటి ఫ్రైడే ? ఏమి జరిగింది ?" అని అడిగాడు.

"అటు చూడండి మాష్టర్ ! పడవలు, మూడు పడవలు ! ఒకటీ! రెండూ! మూడూ !" అంటూ ఉద్రేకపడుతూ సముద్రం వైపు దూరంగా చూపించాడు. ఆ పడవలను చూసి ఫ్రైడే భయపడుతున్నట్టు క్రూసో గ్రహించాడు. భయపడవద్దని ఫ్రైడేకి అతను ఎంత చెప్పినా లాభం లేకపోయింది. ఆ పడవలలో అడవి మనుష్యులే వస్తున్నారనీ, వారు తనను చంపి తింటారని భయపడ్డాడు.

"ఫ్రైడే ! మన వద్ద తుపాకులు ఉన్నాయి, ఎంత మంది అడవి మనుష్యులు వచ్చినా నేను వారిని చంపగలను. నీవు వట్టి పిరికివాడివి. కనుక వెళ్ళి ఆ గుహలో తలదాచుకో !" అని క్రూసో అన్నాడు. దాంతో ఫ్రైడేకి పౌరుషం వచ్చి "మాష్టర్! నేనూ యుద్ధం చేస్తాను" అని అన్నాడేగాని మరుక్షణంలో "మాష్టర్ ! మనం ఇద్దరం ! వాళ్ళు చాలా మంది ఉన్నారు" అన్నాడు.

"మరేం భయంలేదు. కనబడకుండా చెట్ల చాటునుండి వారిని ఎలా చంపవచ్చునో నాకు తెలుసును. ముందు ఇది కొంచెం తాగు. నీకు ధైర్యంవస్తుంది" అని చెప్పి కొద్ది ద్రాక్ష సారాని ఫ్రైడే నోట్లో పోశాడు క్రూసో. ఆ తర్వాత క్రూసో ఫ్రైడేతో గూడా కొండశిఖరం మీదకు వెళ్ళి తన దూరదర్శినితో తీరంవైపు చూశాడు. మూడు పడవలలో నుండి ఇరవైమందికి పైగా అడవి మనుష్యులు దిగుతూ కనిపించారు. కాళ్ళూ, చేతులూ కట్టివేసిన ముగ్గురు వ్యక్తుల్ని పడవలలో నుండి వారు దింపి తీరాన్న పడవేశారు.

వారికి చేరువలో ఒక చిట్టడవి ఉంది. అక్కడనుండి ఎండు కర్రలను ఏరి తెచ్చి మంట పెట్టారు. మరి కొద్దిసేపటిలో ఆ ముగ్గురు బంధితుల్ని వారు చంపి ఆ మంటలో కాల్చుకొని తింటారని క్రూసో గ్రహించాడు. వెంటనే అతనికి ఆ అడవి మనుష్యులమీద చాలా కోపం వచ్చింది.

"ఫ్రైడే ! ఆ నరరూప రాక్షసులు ఆ ముగ్గురు అమాయకుల్ని చంపి తింటూ ఉంటే పిరికిపందలాగ ఇక్కడనుండి చూస్తూ కూర్చొనలేను. ఏమైనాసరే ఆ ముగ్గుర్నీ రక్షించాలి. నీవు నాకు సహాయం చెయగలవా ?"

"వారు చాలా మంది ...."

"నీవు పిరికివాడివి. ఇక్కడే ఉండు. నేనొక్కడ్నే వారిని ఎదిరించగలను. నేను వారందర్నీ చంపలేకపోయినా, భయపెట్టి వారిని తరిమి వేయ గలను. నీతో మాట్లాడుతూ మరొక్క క్షణం కూడా వృధా చేయదలచుకోలేదు". అంటూనే క్రూసో కొండ దిగాడు. ఫ్రైడే చేసేది ఏమిలేక క్రూసోను అనుసరించాడు.

"మాష్టర్ మీరు ఏం చేయమంటే అది చేస్తాను. ఏం చేయాలో ఆజ్ఞాపించండి." "అయితే, నీవు అన్ని తుపాకులలోను మందు దట్టించు" అని క్రూసో ఆజ్ఞాపించి తను కూడా తిపాకులలో మందు దట్టించడం ప్రారంభించాడు. కొద్దిసేపట్లో వారిద్దరూ యుద్ధానికి సిద్ధమయ్యారు.

"ఫ్రైడే ! మాట్లాడకుండా, చప్పుడు చేయకుండా నా వెనుకనే రా. నేను ఏది చెపితే అదే చెయ్యి ! నోరు మెదపకూడదు. తెలిసిందా ? నా వెనుకనే రా" అంటూ ముందుకు నడిచాడు క్రూసో. వారిద్దరూ శతృవులకు కనబడకుండా చెట్ల చాటున నక్కుతూ శతృవులకు చేరువగా వెళ్ళారు. క్రూసో పిల్లిలాగ మెల్లగా చెట్టు చాటున ఉన్న ఒక మెట్ట ప్రదేశం చేరుకొన్నాడు. అక్కడనుండి చూస్తే అతనికి అడవి మనుష్యులు, వారి బంధితులు బాగా కనబడ్డారు. వారిలో ఒకడు తెల్ల వాడు.

అప్పటికే ఆ నరభక్షకులు అకణ్ణి చంపివేశారు. ఇంకొకణ్ణి చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంక ఒక్క క్షణం క్రూసో ఆగ దలచుకొనలేదు.

"ఫ్రైడే ! సిద్ధంగా ఉన్నావా ?" అని మెల్లగా అడిగాడు. "యస్ మాష్టర్ !" అని వినీ వినిపించకుండా అన్నాడు ఫ్రైడే. అతడు అన్నింటికి తెగించి మొండి ధైర్యంతో ఉన్నట్టు క్రూసో గ్రహించి, "అయితే వారి మీదకు తుపాకీ పేల్చు !" అని అతన్ని అజ్ఞాపించి వెంటనే అతనుకూడా శతృవుల మీదకు తుపాకీ పేల్చాడు. ఫ్రైడే కూడా తుపాకీ పేల్చాడు. ఆ దెబ్బలకు ఇద్దరు అడవి మనుష్యులు చనిపోయారు. మరిద్దరు గాయపడ్డారు. మిగిలిన వారంతా భయభ్రాంతు లయ్యారు. ఎటు పరిగెత్తితే ఏమి ప్రమాదం వస్తుందో అన్నట్టు వారంతా బొమ్మల్లాగ నిలబడి పోయారు.

క్రూసో ఏమి చెబితే అది, క్రూసో ఏది చేస్తే అది చేయడానికి నిశ్చయించుకొన్న ఫ్రైడే తన మాష్టర్నే చూస్తున్నాడు. క్రూసో పేల్చిన తుపాకీని కింద పడవేసి మరొక తుపాకీని తీసికొన్నాడు. ఫ్రైడే కూడా అలాగే చేశాడు. కొంతసేపు వారిద్దరూ ఆ అడవి మనుష్యుల మీదికి తుపాకులను పేల్చారు. ఆ అడవి మనుష్యులు ప్రాణభీతితో ఇటూ, అటూ పరుగెత్త సాగారు. గాయపడిన వారు కింద పడి మూలుగుతున్నారు.

"ఫ్రైడే నా వెనుకనే రా !" అంటూ మరొక తుపాకీని తీసికొని చెట్లచాటునుండి బైటకు వచ్చి క్రూసో బంధితుల వైపు నడవసాగాడు. మరొక తుపాకీతో ఫ్రైడే తన మాష్టర్ని అనుసరించాడు. వీరిని చూడగానే అడవి మనుష్యుల్లో నలుగురు పరుగెత్తుకొంటూ వెళ్ళి రెండు పడవల మీదికి ఎక్కారు.

ఫ్రైడే శతృవుల మీదికి తుపాకీని పేలుస్తూ ఉంటే క్రూసో బంధితుల బంధనాలను విప్పాడు. కాని ఆ ఇద్దరిలో తెల్లవాడు ఒక్కడే ప్రాణాలతో ఉన్నాడు. అతనిని క్రూసో లేవనెత్తాడు. అతడు స్పానిష్ భాషలో క్రూసోకు కృతజ్ఞతలు చెప్పుకొన్నాడు. ఆ స్పెయిన్ దేశస్తుడు చాలా నీరసంగా ఉన్నా క్రూసో ఇచ్చిన తుపాకీని చేత పుచ్చుకొని ఆ నరభక్షకుల్ని ఎదిరించడానికి సంసిద్ధుడయ్యాడు. పడవలు ఎక్కిన ఆ నలుగురు వీరి మీదకు బాణాలను వదిలారు. కాని అవి వీరికి తగలలేదు. అందువల్ల వారు మరింత భయపడి పడవలను సముద్రంలోనికి తీసికొని పోసాగారు. వారి పడవ ఒకటి తీరాన్న ఉండిపోయింది.

ఆ నలుగురు వెళ్ళి ఒక సైన్యాన్ని కూడదీసికొని వచ్చి ఈ ద్వీపాన్ని ముట్టడించే అవకాశముందని, శతృశేషం లేకుండా చేయాలని క్రూసో నిశ్చయించుకొని మూడవ పడవలోనికి ఫ్రైడేతో కూడా అతడు ఎక్కాడు. అందులో ఇంకొక బంధితుడు బోర్లా పడి ఉన్నాడు.

క్రూసో అతని బంధాలను కోసి అతన్నీ లేవతీసి కూర్చో పెట్టాడు. అతని ముఖం చూడాగానే ఫ్రైడే ఒక కేకపెట్టి నవ్వుతూ, పాడుతూ సంతోషంతో గెంతడం ప్రారంభించాడు. అతనికి అంత ఆనందం ఎందుకు కలిగిందో క్రూసోకు వ్సెంటనే తెలియలేదు. ఆ తర్వాత తెలిసింది, ఆ బంధితుడు ఫ్రైడే తండ్రేనని.

ఈ ఆనందంలో శతృవులను వెంబడించాలన్న సంగతి ఆ ఇద్దరూ మరచిపోయారు. అది కూడా వారి మేలుకే జరిగింది. మరి రెండు గంటలు గడవకముందే పెద్ద గాలివాన వచ్చింది. వారిని వెంబడించి ఉంటే ఆ గాలివానకు బ్రతికి బయటపడేవారు కారు.

ఫ్రైడే ఉపచారాలు చేయగా అతని తండ్రి కాస్త తేరుకున్నాడు. ఉద్రేకంతో శతృవులను ఎదిరించిన స్పెయిన్ దేశస్తుడు నీరసం వచ్చి ఒక చెట్టుకింద వాలిపోయాడు. వారిద్దరూ తిండి తిని ఎన్నాళ్ళయిందో !

"ఫ్రైడే ! వీళ్ళిద్దరూ తినడానికి ఏమైనా త్వరగా తీసికొని రా, నీళ్ళు మరచిపోకు !" అని చెప్పి క్రూసో ఫ్రైడేని ఇంటికి పంపించాడు. ఫ్రైడే పరుగెత్తుకొని వెళ్ళి వారిద్దరికీ సరిపోయినన్ని రొట్టెలు, పళ్ళు, నీళ్ళు తీసికొని వచ్చాడు ఫ్రైడే. అతని తండ్రికి నోరు ఆర్చుకొని పోవడం వల్ల రొట్టెలు, పళ్ళు తినలేక అతడు కడుపు నిండా నీళ్ళు మాత్రం తాగాడు. ఆ ఇద్దరూ కాస్త తేరుకొన్నా లేచి నడవలేకపోయారు. ఫ్రైడే, క్రూసో కలిసి ఆ ఇద్దర్నీ పడవమీద 'సాగరదృశ్యాని 'కి చేరువగా తీసికొని వెళ్ళారు.

క్రూసో ఒక స్ట్రెచ్చర్ లాంటిది తెరచాప గుడ్డతో తయారుచేశాడు. దాని మీద వారిని మోసుకొని వెళ్ళాడు. ఇంటి ముందు ఒక గుడారాన్ని ఫ్రైడే వేసి అందులో వారిద్దర్నీ పడుకొనబెట్టాడు. స్పెయిన్ దేశస్తుడు ఆ మర్నాటికి తేరుకొన్నాడు.
ముందరి పేజి               తరువాతి పేజి


www.maganti.org