" వడగళ్ళు "
- శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు |
అరలు (కృష్ణా పత్రిక 1942, ఆగష్టు 27) |
' అర ' అనేది మనం మామూలుగా వాడేమాట! పూర్ణమైన ఒక అనుభూతిలో నుంచిగాని, ఆహారంలోనుంచిగాని - మరి ఏ యితరంలోనుంచిగాని ' అర ' ను స్వీకరించడం ఎంతో సుఖమైన విషయం. చూడండి - ' అర్ధాంగి ' అనేది ఎంత తీయని మాట! పూర్ణమైన ఒక యితర స్త్రీకంటె, అర్ధాంగి అయిన స్త్రీలోనుంచి ఎంత సుఖం, శాంతి అనుభవిస్తున్నాడు పురుషుడు? అర్ధాంగిలో మళ్ళీ కొన్ని ' అర ' లున్నాయి. అరమోడ్పు కనుదోయి, అరనవ్వు, అరపలుకు, అరకౌగిలి - ఇవి కలిగించే ఆనందం! మా బందరు పౌరులకు అరలలో వుండే సొగసు బాగా తెలుసు. కాఫీహోటళ్ళలో అరకప్పు కాఫీకంటె ఎక్కువ ఎవరూ త్రాగరు. ఎక్కువ త్రాగాలంటే అరకప్పు తర్వాత అరకప్పేగాని ఎక్కువ ఆర్డరివ్వరు. నిండుకప్పులో రుచి వుండదనీ - అధవా వున్నా అందులో నాగరికత వుండదనీ వీరి మతం. ఇతర - ప్లేటునిండా తిఫిన్ తిని, కప్పుకాఫీ కడుపులో పోసి కిల్లీ బిరడా వేస్తూ వుంటారు. మావాళ్ళకు ప్లేటు తిఫిన్ మోటు అనిపిస్తోంది. అరప్లేటు ఉప్మా, అరప్లేటు పకోడీ - వీటిలో రుచివున్నదని కనిపెట్టకలిగారు మా పట్టణవాసులు. ఎంత డబ్బున్నవాళ్ళన్నా - వీశెల లెక్కన ఎవరూ బజారు వస్తువులు కొనరు. అరవీశె నెయ్యి, అర్ధశేరు పప్పు, అరబస్తా బొగ్గులు, అరతులం ఇంగువ, అరపౌను కాఫీపొడి - ఇలాకొనడం ఆచారం. సిగరెట్లు వెలిగించి పూర్తిగా నుసి చెయ్యడం అందరికీ అలవాటుకాని మా పట్టణవాసులు - సిగరెట్టును రెండుచేసి, అవుసరమైనప్పుడల్లా ఒకటి పీల్చి అవతల పారెయ్యడంలో దర్జా నాగరికతా వున్నాయని - ఆ పద్ధతి మొదలుపెట్టారు. మీసం వున్న మగవాళ్ళలో వాటిని సగం చేశారు చాలామంది. ఎందుకని! అందం కోసం! నిండు మీసం వున్నవాళ్ళను చీంబోతనీ, బొద్దింక అనీ హేళన చేస్తున్నారు. చొక్కా చేతులు సగం పొడవుగా ఎప్పుడో మారినాయి. ఇప్పుడు చొక్కాలే సగంగా అవతరించాయి. సగంకోట్లు వేయడం హుందాతనంగా మారింది. మాంసాహారుల యింటికి బంధువు లెవరన్నా వస్తే ' అరకోడి ' తో విందు చేస్తూ వుంటారు. అది బంధువులకు మర్యాదను సూచిస్తుంది. పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడు, ఒకటి, రెండు మార్కులు వేసేందుకు చేతులు రావు. 'పోనీ ఒక అరమార్కు తగలేద్దాం!' అనుకొంటూ వుంటారు. బడిపంతుళ్ళకు అరమార్కు మీద అమితమైన అభిమానం. డాక్టర్లక్కూడా అరలంటే ఎంతో ప్రీతి. ఏం మందిచ్చినాసరే అన్నం తినేముందు అరగంటకనో, తిన్నతర్వాత అరగంటకనో, నిద్రపోయేముందు అరగంటకనో వేసుకొమ్మని చెపుతూ వుంటారు. ఇంజక్షను ఇవ్వవలసివస్తే అరగంట కొకటి పొడిస్తే మంచిదని చెపుతూ వుంటారు. పైనచెప్పిన అరలన్నిటికంటె అందమైంది - ఐశ్వర్యంగలది ఏమిటో తెలుసా! - అర్ధచంద్రుడు. భావకవిత్వం చెప్పేవారికి బాగా తెలుసు. - అరలలో వుండే అందం. అందుకనే వారు వ్రాసే గేయాలు ' అర్థకాలం మించవూ . భావాన్ని కూడా ' అర ' వరకే చెప్పి అలా వదిలివేస్తారు. గీతాలలో అరపాదం వ్రాసి గీతలు పెట్టి వదిలివేస్తూ వుంటారు. ఒక గీతంలో - అర అక్షరాలు....అర గీతలు - వుండడం ఎంతో సొగసుంది. ' నేను వెఱ్ఱిని ____ ____ నిజము ఆమె లేత ____ _____ ' ఇలాటి అరపదాలలో మజా కనిపిస్తోంది. మొన్న మా లండను శాస్త్రిగారు వ్రాశారొక అసంపూర్తి గేయం. ' నాకు...నేనే...వేరేలేరు.... నాది అసంపూర్తి జీవితం.... ఒక్కరే వ్రాసి ఆపివేసిన భారతం... ' ఇలా ఆయనగారి జీవితం, అసంపూర్ణం, అరా అవడంవల్లనే అంత విలువ సంపాదించించింది. పావుల్ని గురించి కూడా ఒకటి రెండు విషయాలు... ' పావు వేశాడు ' అంటే నిషా అని అర్థం. ' పావుఠావు ' అంటే ఉద్యోగానికి స్వస్తి అని అర్థం. ఈ పావులలో , అరలలో వున్నసొగసు, సుఖం లేదు. 'పావు ' అంటే ' ట్రాజడీ ' - 'అర ' అంటే ' కామెడీ ' - జీవితంలో ' అరల ' సౌఖ్యం అనుభవించినవారందరికీ వ్యాసం అంకితం. |
www.maganti.org |