" వడగళ్ళు "
- శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు |
యుద్ధం తెచ్చిన భాష - 1942 నవంబరు 8 |
[ రెండవ ప్రపంచ సంగ్రామ కాలంలో - ఎక్కడ చదివినా, విన్నా యుద్ధ వార్తలే కనిపించేవి. ఆబాలగోపాలం వాటిని శ్రద్ధగా వినేవారు. కొన్ని ఘట్టాలు మనస్సుకు హత్తుకుపోయేవి. వాటినుంచి కొన్ని ఉపమానాలు బయలుదేరినాయి. కొన్నిటినీ వ్యాసంలో గమనించవచ్చు ]
యుద్ధం రాజకీయంగా అనేక మార్పులు తెచ్చింది. భాషలోకూడా మార్పు రావడం గమనించాలి. రేడియో వినేవారు, పత్రికలు చదివేవారు యుద్ధానికి సంబంధించిన భాషను - ఎండబెట్టి దాచిన వొడియాలలాగా - ఎప్పుడు పడితే అప్పుడు వాడేస్తూన్నారు. టెక్నికల్గా వాడే మాటలు కూడా చాలామందికి వచ్చేసినాయి. వాటిని మనవాళ్ళు క్రొత్తక్రొత్త భావాలలో పొదిగి అందిస్తున్నారు. ఒక వ్యక్తి మరో వ్యక్తి జీవితాన్ని పాడుచేసుకొన్నాడని చెప్పవలసివస్తే " ఫలానావాడు ఆ వెంకటరావు జీవితాన్ని టార్పెడో చేశాడురా " అనడం కద్దు. ఉద్యోగం దొరక్క సంసారం సరిగ్గా నడవని మిత్రుణ్ణి పలకరిస్తే " ఏం చెప్పను బ్రదర్! నాకు ఇంట్లోనూ, బయట అంతా " బ్లాక్ అవుట్ "గా వుంది అని చెప్పి నీళ్ళుకారాడు. ఇక చదువుకొన్న ఇల్లాలు తన ఇంట్లో పిల్లిదూరి నేతిగిన్నె నాకిపోయిందని చెప్పడానికి " నేను తలుపు దగ్గరకు వచ్చేటప్పటికి అది మెల్లగా నేతిగిన్నె దగ్గరకు పురోగమిస్తుంది. నా కాలి అలికిడి విన్నది. వెంటనే వెనుకకు తిరిగి మ్యావ్ మ్యావ్ అంటూ తిరోగమించింది. " ఇటీవల మేము ఒకరి ఇంట్లో జరిగిన విందుకు వెళ్ళాం. చాలామంది పెద్దలు వచ్చారు. అందులో విదేశం నుంచి సెలవుమీద వచ్చిన ఒక ఉద్యోగి కూడా వున్నాడు. అందరి భోజనాలు అయిపోయినాయి. పెరుగు ముద్దలు నంజుతున్నారు. ఆ సమయంలో విదేశం నుంచి వచ్చిన పెద్దమనిషి...పులుసు తర్వాత మళ్ళీ ఆవకాయ కలపడం సాగించాడు. అది చూసి పక్కనున్నాయన " ఏమిటి స్వామీ తమరు ' రియర్ గార్డు ' యాక్షను సాగించారిప్పుడు " అని. అంతా నవ్వుకొన్నారు. ఎవరైనా కారుల్లోనో, బస్సుల్లోనో చుట్టలు వెలగించి ధూమవలయాలు వదులుతుంటే పక్కవాళ్ళు "స్మోక్ స్క్రీన్ వేశాడురా బాబూ! " అనడం వింటూ వుంటాం. ఇటీవల ఒక ఉద్యోగి ఇంటికి అత్తగారు వచ్చింది. ఆవిడ చాలా గయ్యాళీ...కూతురూ అంతే. ఆయన ఇద్దరి ధాటికీ తట్టుకోవడం కష్టమని జంకి భార్యను పిలిచి " ఏయ్ ! ఒక ఫ్రంట్ లోనే జయించలేకుంటే - సెకండు ఫ్రంట్ జాయిన్ చేశావెందుకు? " అంటూ తెల్లటవెల్ పైకెత్తి విసురుతూ " సంధి ! సంధి ! " అని అరిచాడుట. ఒక మేష్టరుగారికి నలుగురయిదుగురు పిల్లల్లున్నారు. వాళ్ళు ఇంట్లో ఏ వస్తువూ బ్రతకనివ్వరు. కలం ఒకడు తీసి దాస్తాడు. పెన్సలొకడు కాజేస్తాడు. గుండీలొకడు విప్పుకుపోతాడు. మేష్టరుగారు స్కూలుకు బయలుదేరే సమయానికి ఒకటీ కనిపించక విసుక్కొని " వీళ్ళ దాడి ఎదుర్కోలేకుండా వున్నాను. చూచిచూచి నామీద గొరిల్లా యుద్ధం సాగిస్తున్నారు మలపలు " అని గోలపెట్టడం మామూలు. ఒకసారి చుట్టాలింటికి వెళ్ళాను. వాళ్ళదొడ్లో పెరుగు తోటకూర మడిలో మేకలు పడి మొదలంటా కొరికివేసినాయట....ఆ గృహస్థు యెంతో బాధపడి " పాడుమేక, తోటకూర మడి అంతా మెషన్ గన్ చేసిపారేసింది " అన్నాడు. ప్రతిరోజూ శ్రద్ధగా రేడియో వినే ఒక ఇల్లాలు ఆదివారం నాడు భర్తతో సంసార విషయాలను గురించి సంభాషిస్తూ - ఇలా వార్తా ప్రసారం చేసింది. " ఈ వారపు సంగతుల సింహావలోకనం" అని. నేతిచెంబు మీద మొన్నటిదినం పిల్లి పెద్దయెత్తున దాడిచేసింది. చెంబు వొరిగింది. కాని నేతి నష్టం కాలేదు. కనుక ఈవారం నేతి పరిస్థితిలో ఆందోళన లేదు. కూరల బుట్టలోకి ఎలుకలు ' పారాచూట్ల ' ద్వారా దిగి చాలా నష్టం కలిగించాయి. కనుక వాటిమీద గట్టి దెబ్బ తీయాలి.....మళ్ళీ కూరలు తెచ్చుకోవాలి" __ " అన్నట్లు మా ఇంట్లో పనిచేసే మనిషి పాలమనిషి, బహుళ పంచమాంగ దళంగా వ్యవహరిస్తూన్నట్లున్నారు, లేకపోతే మనం తగవులాడామని బయటివారికెలా తెలుస్తుంది" అని ఒక ఇల్లాలు భర్తతో తన భయం వెల్లడించుకొంది. బడిలో ప్రతిరోజూ దెబ్బలు తినే కుర్రాణ్ణి చూచి వీధి బడిపంతులన్నాడుట " ఏం లాభం! ఈ వెధవ వీపు 'మాల్టా ' అయిపోయింది. వీడికి మాత్రం జ్ఞానం రాలేదు. " అని. [ మాల్టా ద్వీపం పై అంతులేని విమానదాడులు జరిగినాయి ఆ యుద్ధంలో] |
www.maganti.org |