" వడగళ్ళు "

- శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు


ఆవకాయ పాట (కృష్ణా పత్రిక - డిసెంబరు 28, 1944)
మొన్న మా అరుగు మీద ఒక అతను కూర్చుని రామదాసు కీర్తనలు పాడుతున్నాడు. రామదాసుగారు ముక్తి పొందడం మాట అలావుంచి లేనిపోని గొడవ నెత్తికెత్తుకొని పడ్డ అవస్థలు వింటుంటే - ఎంతో బాధ అనిపిస్తోంది.

తన భార్యకో చీర కొన్నాడా! నగ చేయించాడా! కడుపునిండా అన్నం తిన్నాడా! - ఏమీ లేకుండా అంతా భద్రాద్రి రామునికి సమర్పించి మళ్ళీ ఆయన దగ్గిర వసూలు చేసేదాకా - ఒక అవస్థ అయిందాయనకు. మధ్య జామీనుండి ఏ బ్యాంకులోనో అప్పులిప్పించినవారి బాధ రామదాసు బాధ కంటె వేయిరెట్లు అధికం. కొన్నాళ్ళు ఏడిపించి అయినా రాములవారు బాకీ యిచ్చేశారు. కానీ ఈ జామీనుదార్లు పదిమంది రామదాసులంత బాధపడి చివరకు తామే ఏ ఇల్లో...అమ్మి చెల్లించుకోవాలా అప్పు.

అయితే రామదాసుకి లేని వీలు ఒకటి వుందివీరికి. కొన్నాళ్ళు ఆలోచించి, దివాలా పిటీషన్ దాఖలు చేయవచ్చు. ఈ రామదాసులనాటి కాలంలో ఇది చివరిసీను. రామదాసు తానీషా సొమ్ము కాజేసి జైలులో పడ్డాడు. ఎంతో బాధ పడ్డాడా చీకటి గదిలో. కానీ నెలనెలా అద్దెకట్టి ఇరుకు కొంపల్లో ఇంటిల్లపాదీ బందిఖానాలో లాగా పడే అవస్థలు చూస్తే రామదాసుగారి పనే తేలిక అనిపిస్తుంది.

నేనెరుగున్నవారు ఒకరు ఇలాటి ఇరుకుకొంపలో వుండి, తెల్లవార్లు గాలిలేక, వెలుగులేక, పిల్లలు లేచి కూర్చుని ఏడుస్తుంటే - భార్య పరిస్థితులుచూచి భరించలేక భర్తతో ఇలా నివేదించుకొంటుంది.

"ఎందుకు కుదిర్చావయ్యా...ఈ పాడుకొంప...పడలేను బాధ...అబ్బబ్బ...బాధ...." అని చేసే గోల రామదాసు కీర్తనలలో భావానికీ, రాగానికీ, తాళానికీ, ఏమాత్రం తీసిపోవు.

ప్రపంచంలో ఇంకో రకమైన రామదాసులుంటారు. అయితే వీరి భక్తి వేరు, ఆరాధనాదైవం వేరు. వయస్సూ, సొమ్మూ వున్న సమయంలో ఒక వేశ్యను ప్రేమించి ఆ రూపములో, కులుకులో ఏదో మహత్తర భాగ్యాన్ని దర్శించి - తన సొమ్మంతా ఆమెకు సమర్పించడం, ఆమెకో ఆలయం, ఆనంద నిలయం కట్టించడం, తర్వాత ఆమె అతనికి ముక్తిమార్గం చెప్పడం జరుగుతుంది. వెంటనే వీధులవెంట రామదాసు భజన బృందంతో సెమ్మా పుచ్చుకొని, బయలుదేరి - స్వీయగాధ గానంచేస్తూ, విహరిస్తూ వుంటారు వీరు. కాని, వారిపేర ఒక ఆలయం, ఒక దేవత అక్కడ నిత్యయాత్రికులు ఏర్పడి పోతారు కలకాలం..

అన్నట్టు మల్లినాధ సూరిగారు ఇటీవల పెళ్ళికి వెళ్ళివచ్చారు. ఆనెలలోనే ఆవకాయ, మాగాయకూడా పెట్టించారు. ఖర్చు చాలా అయింది. అప్పుడు వారు కట్టి పాడినపాట....

మున్నాళ్ళ పెళ్ళికి ముప్ఫైయ్యి వదిలాయి రామచంద్రా!!
రైలువాడికి ఇస్తి రానూపోనూ ఇరవై రామచంద్రా!!
పెట్టికూలికి పోయె పైనొక్క రూపాయి
బండ్లవాళ్ళకు ఇస్తి పధ్నాలుగణాలు !!రామ!!
ఇంటావిడకు కుట్టిస్తి వంటిమెడ రెవిక !!రామ!!
ఒక్క రెవికకి పట్టె రొక్కమ్ము రెండు
కుట్టువాడికి ఇస్తి గట్టిగా బేడాను !! రామచంద్రా !!
ఫేషన్ అనుకొని పక్కనున్న ఆమె
టిక్కట్టు నేకొంటి రామచంద్రా
టిక్కెట్టుకే పట్టె జాకెట్టు ఖరీదు !!రామ!!
ఆవకాయకు అయేనా అరవయ్యి రూకలు !!రామ!!
మాగాయకు పట్టె మరి ఇరవై రూకలు !!రామ!!
లక్ష్మయ్యకే ఇస్తి సాక్షాత్తు యాభయ్యి !!రామ!!
కారమూ, ఉప్పును ఇంట్లోనే కొట్టిస్తి !!రామ!!
కాయలు స్వయముగా
చేయి చేసి తరిగితి !!రామ!!
ఇంత చేసిన పిదప ఎవడో చుట్టమువచ్చి
వఱ్ఱగా తినిపోవు ఎవడబ్బ సొమ్మని !!రామ!!
కొట్టులోపల అప్పు జోకొట్టితే పోవునా !!రామ!!


" ఏమండి మల్లినాధులూ ఇంత ఖర్చు అవస్థా వుంటే ఎలాకాలం గడిపెది? దీనికేమైనా ముక్తిమార్గం ఆలోచించడం మంచిది. ఈ సంసారాన్ని, ప్రేమనూ, జింజుకానాను వదిలితే సుఖమున్నదేమోనంటే - వారిలా సెలవిచ్చారు. " మీరు బలేవారండీ! ఉన్న సుఖాన్ని కూడా పోగొట్టుకోమన్నారా! ఇల్లు వదిలితే ఎవరండీ ఆదరించేది? ఇలాగే అవస్థ పడుతూ వుంటాం. ఇప్పుడు సన్యాసం పుచ్చుకోమంటే నా తరమా!

అయినా 365 ఇళ్ళు మాట్లాడిపెట్టండి. అలాగే సన్యాసం పుచ్చుకొంటాను.ధర్మం బోధిస్తూపోతే, మనకు సమర్పించే వస్తువుల ధర అడగనే అడగరు....అన్నారు

అయితే ఇకముందు వారు సంసారకూపంలో మునిగిపోకుండా, జీవితాన్ని సాధ్యమైనంతవరకు ఇంటిబయటనే గడుపుతూ - లోకంలోని రుచులను గ్రహిస్తూ వుంటారుట. ప్రస్తుతం వారు విల్సు సిగరెట్టులోని మజా కనిపెడుతున్నారు.
www.maganti.org