" వడగళ్ళు "

- శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు


సిగ్గుల నిగ్గులు (కృష్ణా పత్రిక - 1950, ఆగష్టు 9)
సామాన్యంగా మనంవాడే భాషలో, సిగ్గు అనే శబ్దానికి రెండు అర్థాలున్నాయి. ఒకటి సిగ్గంటే చిద్విలాసం, శృంగారచేష్ట. రెండు సిగ్గు అంటే - అవమానం, లజ్జా అని అర్థం. మనం మొదటిరకపు సిగ్గును గురించే ఆలోచిద్దాం.

క్రొత్త పెళ్ళికూతుళ్ళను - " సిగ్గుల మొగ్గలు " అనడం ఆచారం. బాల్యంలోనుంచి యౌవనంలోకి వురుకుతూండే వయస్సులో కన్నెపిల్లలకు కలిగే భావ వికసనంలో కనిపించే తత్తరపాటును సిగ్గు అనవచ్చు. తన జీవిత వసంతంలో ఝుమ్మని తిరగనున్న తుమ్మెద కుమారుణ్ణి చూచినప్పుడు కలిగే సంభ్రమాన్ని కూడా సిగ్గనే అంటారు.

నవోఢలో దాగిన కోరికలు, వాటి ననుసరైంచే.... - ఒక్కసారిగా పూలజల్లుగా కురియసాగినపుడు కలిగే మైమరపునుకూడా సిగ్గుక్రిందనే జమకట్టవచ్చు. ఎవరొ గడుసుకత్తెతప్ప సామాన్యంగా ప్రతి పెండ్లికూతురూ భర్తను చూడగానే తల వంచుకుని, తన రెక్కలలో తాను వొదిగి, కుదించుకొని కూర్చుంటుంది.

ప్రియుని చూపులతో కలిసి మల్లెపందిరు లల్లుకోవలసిన తన చూపుల్ని పెళ్ళికూతురు తలవంచుకొని తన సొగసుపైన జల్లించుకొంటుంది. ఆమెలో ఆనందం పైకుబికి పరుగులెత్తుతుంటే - హృదయం దాన్ని అదలించి వెనకకు మరలిస్తూ వుంటుంది. అప్పుడామె తనచుట్టూ వలపులనే రంగురంగుల ఉంగరాలు సృష్టించుకొని వాటిలో బంగారు బొంగరంలా తిరుగుతూ వుంటుంది.

సిగ్గుకు సొగసు కల్పించేవి - వయస్సూ, మనస్సూ, వయస్సు మళ్ళినతర్వాత కూడా కొందరు వనితలు సిగ్గును అభినయిస్తారు - వలపు విలువను చెల్లించడంకోసం. కాని దానిలో సహజమైన ఉద్వేగం, ఉత్సాహం మృగ్యం.

మన కావ్యాలలో సిగ్గులోగల చిలిపితనాన్ని గురించి అతిసుందరంగా వర్ణించారు. స్త్రీలకు సిగ్గు వెలలేని ఆభరణమన్నారు. సిగ్గుదొంతరల తెరల నొక్కొక్కటే చుట్టివేసి అందాన్ని మూటగట్టి చేతికందినట్లుగా నిలబడే వయసుకత్తెలో ఎంత అందం వుంది. సిగ్గుపడి నవ్వినప్పుడామె చిరుచెక్కిళ్ళలో పడే సొట్టలపై వ్యాఖ్యానం ఎంతని వ్రాయగలరు?....

మగవాడికికూడా సిగ్గు అనే లక్షణం లేకపోలేదు. కాని దానికో అందంగాని, ఆకర్షణగాని వుండదు. పండిన మొక్కజొన్న చేనుపైన కంకెలో రామచిలుక వ్రాలి, పచ్చని రెక్కలు రెపరెప విసురుతూ ఎర్రటి ముక్కుతో వయ్యారంగా జొన్నపొత్తులనారగిస్తూ ఎంత సొగసులు కల్పిస్తాయో - పదిమంది పడుచుకత్తె లొకచోట చేరినపుడు వారి చేష్టలు, చిలిపితనం, సిగ్గులు, అంతటి శోభను ప్రసాదిస్తాయి.

కోరిన ఒక క్రొత్తలోకంలోకి, వ్యక్తిలోకి, విశేషంలోకి తొంగి చూసినప్పుడు ఒకవిధమయిన సిగ్గు ఆవరిస్తుంది. ఆ క్రొత్తవెలుగును మనస్సులోకి తెచ్చుకోవడం కోసం పొందే తత్తరపాటునుకూడా సిగ్గనే అంటారు.

కొన్ని కొనితెచ్చుకొన్న సిగ్గులుంటాయి. ఉదాహరణకు చూడండి...పెళ్ళిలో ఒక వనితను పిలిచి మగళహారతి పాడమంటారు. పాడాలని వున్నా చాలాసేపు తటపటాయిస్తుంది. తల వంచుకొంటుంది. పారిపోవడానికి ప్రయత్నిస్తుంది.....అదంతా కొనితెచ్చుకొన్న సిగ్గును గొప్పగా అభినయించడానికి చేసే ప్రయత్నం. తర్వాత ఎప్పుడోగాని ఆమె పాట ప్రారంభించదు. కొందరు సగం పాట పాడి కళ్ళు పైకెత్తి - సిగ్గుకెరటాలు తమమీద దొర్లి నిలవనీయనట్లుగా - హారతి పళ్ళెం విడిచి పారిపోతారు. ఆమె నిలబడి పాడటంకంటె...అలా పారిపోడంలోనే ఎక్కువ అందం వుంటుందొకప్పుడు. స్త్రీ నిజంగా సిగ్గుల భరిణె అయినప్పుడే అందాలు చెరిగి పోస్తుంది.
www.maganti.org