" వడగళ్ళు "

- శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు


ఊతపదాలు (కృష్ణా పత్రిక - సెప్టెంబరు 6, 1941)
సామాన్యంగా మనం మాట్లాడుతున్నప్పుడు ఉపన్యాసాలిచ్చేటప్పుడు కొన్ని ఊతపదాలు దొర్లుతూవుంటాయి. మాట్లాడేవారు ఆ మాటల్ని ఎక్కువగా గుర్తించకపోయినా వినేవారికి ఒకప్పుడు విసుగ్గాను, ఒకప్పుడు వింతగాను వుండక తప్పదు. ఉదాహరణలు అనేకం.

మా కాలేజీలో తెలుగు పండితుడొకాయన ఒక పిరియడ్లో " పక్షంలో " అనే మాట మూడువందలసార్లు వాడేవాడని విద్యార్థులు రుజువుచేసుకున్నారు. " మీరు ఇలా అల్లరి చేసే పక్షంలో, పరీక్షలలో సరిగా వ్రాయలేని పక్షంలో, అపకీర్తి నానెత్తిన పడ్డపక్షంలో, కాలేజీపక్షాన, ప్రిన్సిపల్ గారు నన్ను సంజాయిషీ కోరే పక్షంలో..." ఇలా నడిచేది ఆయనగారి ధోరణి.

మరో తెలుగు పండితుడు ఎక్కువగా " యొక్క " అనే మాట వుపయోగించేవాడు. " ఈ యొక్క పద్యం చాలా ముఖ్యమయింది. మీ యొక్క నోటుబుక్కులు తెరిచి, ఈ యొక్క అర్ధాలు వ్రాసుకోండి " - ఇదీ ఆయనగారి శైలి.

ఇంగ్లీషులో ప్రసంగించేవారికి వెల్, దెన్, సో, మొదలయిన ఊతపదాలు ఎక్కువగా దొర్లుతూ వుంటాయి. ఒక కాలేజీ ప్రిన్సిపాల్ గారికి " వెల్ " అనే మాటలు వాడకపోతే వాక్యం నడిచేదేకాదు. ఒకసారి ఆయనగారు త్రిలోకాలను గురించి మాట్లాడుతూ - వెల్ పాతాళం, వెల్ వైకుంఠం, వెల్ బ్రహ్మలోకం, వెల్ ఈ మూడులోకాల్ని వెల్ త్రిమూర్తులు పాలిస్తూ వుండటం - వెల్ ఎంత గొప్ప? - ఇలా ఎన్నో వెల్సు. ఆయనగారు ఒక గంటలో వుపయోగించే వెల్సు, మద్రాసు రాష్ట్రంలో (ఉమ్మడి) జిల్లాబోర్డు నూతులకన్న చాలా ఎక్కువగా వుంటాయని తేల్చారు.

కొందరు మనతో మాట్లాడేటప్పుడు, మధ్యలో ఆపి, ' నేను చెప్పేది అర్ధమైందా ' అనడం అలవాటు. ' బజారువెళ్ళి పావలా పెట్టి పళ్ళుకొని తిరిగి వస్తున్నా. ఏం నేను చెప్పేది అర్ధమైందా...! ' ఇందులో అర్ధం కానిదేం వుంటుందో ? అయినా ఆయన ప్రశ్నిస్తూనే వుంటాడు.

మరికొందరు మనతో మాట్లాడుతూ మధ్యలో ' నీకేమయినా పిచ్చా? ' అని సూటిగా ప్రశ్నిస్తూ వుంటారు. ఒక వ్యక్తితో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రశ్నవేసేటప్పటికి ఆశ్చర్యపోయి " నాకు లేదండీ ! రెండు మూడేళ్ళ క్రింద మా తమ్ముడికే కొంచెం పిచ్చెక్కింది. భగవంతుని దయవల్ల ఇప్పుడు తగ్గింది " అన్నాడట.

ఇంతకన్నా విచిత్రమయిన వూతపదాలున్నాయి. మా మేనత్త ఒకామె మాట్లాడితే " శాస్త్రం చెప్పినట్లు " అంటుంది. నేను వాళ్ళ వాకిట్లోకి వెళ్ళగానే - ' ఇంత ఎండలో వచ్చావేం ! అంతా కులాసాగా వున్నారా ! శాస్త్రం చెప్పినట్లు వస్తూపోతూ వుంతేనే చుట్టరికాలు. కాళ్ళు కడుక్కో ! రెండు మెతుకులు తిందువుగాని శాస్త్రం చెప్పినట్లు ' అనేది. అదేం శాస్త్రమో ఎవరు చెప్పారో దైవానికి తెలియాలి.

మరికొందరి మాటల్లో " అన్నట్లు ' వాడటం చాలా ఇష్టం. ప్రతి వాక్యంలో ఈ అన్నట్లు ఎన్నో పడుతూ వుంటాయి. " అన్నట్లు ఆ అబ్బాయి వాకిట్లోకి వచ్చాడా. పోనీ ఒక్క నిముషం కూర్చోకూడదూ ! ... అన్నట్లు అప్పుడే లేచిపోయాడు. అది ఏమంత మర్యాదా !...అన్నట్లు మనం చెపితే వింటారా " - ఇదీ ఆమెగారి ధోరణి.

కొందరు మాట్లాడుతూ " అసలు నీకు బుద్ధి వుందా అంట? " అని ప్రశ్నించడం మనం తబ్బిబ్బు కావటం తటస్థిస్తూ వుంటుంది. ఆ మాట నీకు అనేది ఏ తృతీయా పురుషకో చెందుతుందనేది మనకు తర్వాతగాని అర్ధంకాదు.

మా వూళ్ళో ఒక ఆమె " నీకు కోపం వస్తే నే చెప్పలేను " అంటూ వుంటుంది. మనకు కోపం చాలాసేపటిక్రిందే వచ్చినా బయటపెట్టడానికి వీలు కుదిరేదికాదు. ఒక ప్రముఖ నాయకుడు వుపన్యాసంలో " వర్తమానకాలంలో " అనే తరచు వుపయోగించేవాడు. భీమా డిండిమ శ్రీ చెరుకువాడ నరసింహం పంతులుగారు " భవిష్యత్తులో " అనే మాటను వాడుతూనే వుండేవారు ఆ భవిష్యత్తు ఎంత ముందుకు జరిగినా!

ఈ ఊతపదాలంటే ఊరికే తీసిపారేసేవి కావు - ఊత తప్పితే ఉబుసూ, ఉత్సాహం ఎక్కడ వుంటుంది?
www.maganti.org