" వడగళ్ళు "

- శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు


కృత్యాద్యవస్థలు ( కృష్ణాపత్రిక - జనవరి 8, 1949)
మానవులు నిత్యజీవితంలో ఎన్నో అవస్థలు పడుతూ వుంటారు. తప్పుకొంటూ వుంటారు. ఈ అవస్థల్లోకెల్లా అతి అందమయిందీ, అనుభవయోగ్యమైందీ ఒక అవస్థ వుంది. అది కృత్యాద్యవస్థ. దీన్ని ఏదో ఒక సందర్భంలో అనుభవించనివాళ్ళంటూ వుండరు.

ఎంత సాధనచేసిన విద్య అయినా, ఎంత అలవాటు అయిన కళ అయినా - ప్రతి వ్యక్తీ మొదట్లో వాటిని సాగదీసేందుకు సానపట్టేందుకూ ఎంతో అవస్థ పడతాడు. చూడండి గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు పాట ప్రారంభించుతారా! మొదట్లో వాళ్ళకంటె మనం బాగా పాడతామనిపిస్తుంది. " కొంచెం పెగిలిరావే రాగమా! నీకు మ్రొక్కుతాను, లేకపోతే నా పరువు బండలైపోతుంది. " అన్నట్టు ఎంతో పెనుగులాడతారు పాపం. కొంతసేపటికి తడిగడ్డి రాజిరాజి అంటుకున్నట్టు అంటుకుంటుంది స్వరం.

కూచిపూడి భాగవతులు నాటకమాడుతుంటే - కొంచెం తెలిసిన వాళ్ళు ఒక్క కునుకుతీసి మరి వెడుతూవుంటారు. అప్పటికి నాటకం కృత్యాద్యవస్థ దాటి కొంచెం రక్తి కడుతుంది.

ఇక కథో, కవిత్వమో వ్రాద్దామని కవులు కలం తీసినప్పుడు వుంటుంది తమాషా! ఒక పంక్తి వ్రాయనూ-కొట్టివెయ్యనూ. మళ్ళీ వ్రాయనూ- మళ్ళీ గీత పెట్టనూ, కాగితం జడలమాతంగిలాగా తయారవుతుంది. అలాంటి సందర్భపు పెయింటింగులు అయిదారు వేస్తేగాని అసలు రూపం బయటపడదు. కొందరు ఒక వ్యాసం వ్రాయాలంటే పదిపేజీలు చించివెయ్యాలి. కలం చివరంతా ముఖంపుల్లలాగా నమిలివెయ్యాలి. అప్పటికి స్విచ్ ఆన్ అవుతుంది.

ఆడవాళ్ళు రోజూ అంటించే నిప్పేనా ! అది చూడండి వంట ఆరంభించే ముందెంత మారాం చేస్తుందో! కట్టె పొయ్యి అవస్థలు పడలేకనే ఇప్పుడంతా స్టవ్లు, కుంపట్లు ప్రారంభించారు. కిర్సనాయిలు కరువు వచ్చిన తర్వాతా వీటివిషయంలోనూ కృత్యాద్యవస్థ తప్పడంలేదు. ఇక మగవాళ్ళు వంట ప్రారంభిస్తే- ఆ కుంపటి నిజంగా కుంపటి అయివూరుకుంటుంది. స్టవ్ వెలిగితే ఒక్కసారి వెలుగుతుంది లేకపోతే అసలు వెలగదు. సమ్మె చేస్తూ వుంటాయి ఈ రెండూ మధ్య మధ్య.

చూడండి! సైకిలంటూ వుంది. దాన్ని ఉపయోగించడం చేతనయిన తర్వాత ఎంతో సుఖం వుంది. కాని నేర్చుకునేటప్పుడెంత అవస్థ! ఒకటిరెండు రోజులు ఏ పర్రనో కౌలుకు తీసుకుని పంచె పైకి కట్టి, పళ్ళు బిగించి - అదో అవతారం దాల్చి, సాధన ప్రారంభించాలి. దాన్నే ' పర్రపాసింగ్ ' అంటారు. ఇది కొంచెం అలవాటైన తర్వాత ధైర్యంచేసి ఎక్కబోయి ముందుకుపడి రూపాయలంతా, అర్థరూపాయలంతా , పావలాల మేరకు శరీరం ఎర్రపరచుకుంటారు. ఆ అవస్థ దాటిపోతే - ఉన్న పిల్లలందరినీ వెనకా ముందూ కూచోబెట్టుకుని బజారులన్నీ తిరగవచ్చు పాతసైకిల్ మీద.

ప్రేమను సంపాదించడం విషయంలోకి వస్తే - ఎంత కృత్యాద్యవస్థ. ఒక గూట్లో గువ్వలాగా కూర్చున్న హృదయాన్ని బులిపించి, వలపించి, బయటకు తేవాలి. మంత్రాలకు చింతకాయలురాలే ఘట్టమా అది! రెండవ హృదయాన్ని అర్థం చేసుకొని, అవుననిపించుకొని - ఆవలపు ప్రపంచంలో అడుగుపెట్టేలోగా ఎన్ని సుడిగుండాలు - ఎన్ని తుఫానులు? యజ్ఞంలో కొయ్యనుంచి నిప్పు పుట్టించినంత అవస్థ అవుతుంది. ఈ అవస్థ దాటిన రసికుడు కోటలో పాగావేసి కూర్చుంటాడు. అప్పుడూ " రాధవు నీవై, కృష్ణుడనేనై " అనగలిగేది.

కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది. కృత్యాద్యవస్థ అధికమయిన కొద్దీ, దాని తర్వాత లభించే సౌఖ్యం కూడా అధికమవుతుందని. మానవులకే ఈ అవస్థ అనుకుంటే, యంత్రాలకు కుడా వుంది. రైలు చూడండి! ప్రతి స్టేషను దగరా ఆగుతుంది. మళ్ళీ బయలుదేరాలంటే అత్తవారింటి దగ్గరినుంచి బయలుదేరే అల్లుడు పడ్డంత అవస్థ పడుతుంది. ముందుకు సాగబోయి ఒకసారి వెనక్కి గుద్దుకొని ' కూ ' అని గోలపెట్టి ఇన్ని కన్నీళ్ళు కార్చి ' తప్పదురా దైవమా ' అని ఏడుస్తూగాని ముందుకుసాగి స్పీడు అందుకోదు.

రైలు సంగతి అలా వుంచండి - మా బందరులో గుర్రపు బళ్ళక్కూడా ఈ కృత్యాద్యవస్థ వుంది. ఏకోర్టు పని మీదనో, రైలుస్టేషనుకనో, గుర్రపుబండి కుదుర్చుకుని ఎక్కి కూర్చోగానే - ఆ గుర్రం ఇల్లరికపు కూతురులాగా ముద్దులు ప్రారంభిస్తుంది. కొంచెంసేపు బండి వెనకకు నెట్టుతుంది. రోడ్డుకు అడ్డంగా తిరుగుతుంది. ఇక వెనక కాళ్ళతో బండిని తన్నడం ప్రారంభిస్తుంది. గుర్రం కదలదు. బండివాడు లోపలివాళ్ళను దిగనియ్యడు - టైం ఆగదు...ఆ విధంగా బండిలో వాళ్ళు హతమారి, అవతల పెట్టుకొన్నపని పూర్తిగా నాశనమైతే గాని ఆ అశ్వరాజం ముందుకు సాగదు.
www.maganti.org