నిత్యయవ్వనానికి...
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌పుట్టినప్పుడు మనమంతా ఏకకణజీవులుగానే ఉద్భవిస్తాం. అందువల్ల మెదడులోనివైనా, చర్మం లోనివైనాసరే, ప్రతికణంలోనూ ఒకేరకమైన జన్యువులుంటాయి. ఒక్కొక్కచోట ఒక్కొక్కరకం జన్యువుల చర్యలవల్ల కణాలకు వేరువేరు రూపాలు ఏర్పడతాయి. ప్రాణులు ముసలివై చచ్చిపోయేందుకని ప్రకృతిసిద్ధంగా జన్యువులు ఆత్మహత్య చేసుకునే ఏర్పాటు జరిగింది. కణవిభజన సమయంలో క్రోమొసోమ్‌ కొసలకు టోపీలవంటి టెలోమీర్లు తరిగిపోవడంతో మన శరీరాలు క్రమంగా శిథిల మైపోతాయి. టెలోమీర్ల? పెరుగుదల కోసం పనికొచ్చే టెలోమరేస్‌ అనే ఎన్‌జైము ఉత్పత్తి జరగదు.
క్రోమొసోమ్‌ కొసలకు టోపీలవంటి టెలోమీర్లు
ఈ టెలోమరేస్‌ను కృత్రిమంగా ప్రవేశపెడితే ఏమవుతుంది? బాక్టీరియా తప్ప మిగిలిన ప్రాణులన్నీ బహుకణ జీవులే. ప్రాణి బతకాలంటే వివిధ కణసముదాయాలన్నీ సవ్యంగా సహజీవనం చెయ్యాలి. టెలోమరేస్‌ను ఉపయోగిస్తే ఈ ప్రక్రియకు విడి జీవకణాల ఆధిపత్యం అడ్డురావచ్చు. అవి తమ సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నించే అవకాశముంది. అందువల్ల అవి కొన్నిసార్లు మాత్రమే విభజన చెందేట్టుగా జీవపరిణామ క్రమంలో ఏర్పాటు జరిగిందనుకోవచ్చు. ఆ గడువు తీరాక ఒక టైమర్‌ ఈ విభజనను నిలిపివేస్తుంది. కేన్సర్‌ వచ్చినప్పుడు మాత్రం ఈ "టైమర్‌" పనిచెయ్యదు. తత్ఫలితంగా కణాలు అంతులేకుండా పెరిగిపోతాయి. ఇటువంటిది జరిగితే కణాలకు లాభమే కాని అసలుకే మోసం వస్తుంది. మొత్తం ప్రాణి భద్రత దృష్య్టా ఎట్టి పరిస్థితుల్లోనూ కణవిభజన అంతు లేకుండా జరిగి కేన్సర్‌కు దారితీసే ప్రమాదం కలగకూడదు. బహుశా అందుకనే జన్యువుల కొసల టోపీలు క్రమంగా అంతరించి, కొంతకాలానికి ప్రాణికి ముసలితనమూ, ఆ తరవాత చావూ కలిగే ఏర్పాటు ప్రకృతిలో ఉందేమో.
టెలోమరేస్‌ తయారీకి ప్రతి కణంలోనూ ఏర్పాటు ఉంటుంది. కేన్సర్‌లో జీవకణాల విభజన క్లోనింగ్‌ను పోలినది. అంటే ఆ కణాలన్నీ ఒకే జీవకణంనుంచి పుట్టుకొచ్చినవే. మామూలుగా కణాల పెరుగుదలను నియంత్రించే శక్తులేవీ వాటిమీద పనిచెయ్యవు. ఆ కణాల్లో పరిణామాలూ, పరిపక్వం చెంది క్రియాశీలత సాధించే దశలూ కలగవు. పిండదశలోనే ఉన్న ఈ కణాల సంఖ్య విపరీతంగా పెరుగుతూ పోయి కణితి ఏర్పడుతుంది. ఇది ఏర్పడిన చోట అంతకు ముందున్న వ్యవస్థతో దీనికి సంబంధం ఉండదు కనక ఆ వ్యవస్థ పనితీరుకు ఇది ఆటంకంగా పరిణమిస్తుంది. ఒక వ్యవస్థలో పెరిగిన కేన్సర్‌ కణాల్లో కొన్ని వేరుపడి పక్కనున్న మరో శరీరభాగానికి వెళ్ళి తగులుకోవడం కూడా కద్దు. అందుచేత కొన్ని రకాల కేన్సర్‌లు కాలేయం నుంచి ఊపిరితిత్తులవంటి భాగాలకు పాకుతూ ఉంటాయి.
కేన్సర్‌ కణాలు టెలోమరేస్‌ను విడుదల చేసుకుని తమ జాతి కణాలు నిరాటంకంగా విభజన చెందేట్టు చూసుకోగలవు. ఈ ప్రక్రియలో టెలోమీర్‌ తోకలు పొట్టివై కొంతకాలానికి కణవిభజన ఆగిపోవడ మనేది జరగదు. కేన్సర్‌ కణాలు విపరీతంగా పెరిగి ప్రాణాపాయం కలుగుతుంది. దీన్నిబట్టి చూస్తే టెలోమరేస్‌వల్ల మామూలు కణాలు ముసలివి కాకుండా నిలపడం సాధ్యమే కాని కొన్ని కణాలు విపరీతంగా పెరిగి కేన్సర్‌ కలగవచ్చు.
కొన్ని పరిశోధనల్లో జీవకణాల్లో "రిట్రోవైరస్‌" ద్వారా టెలోమరేస్‌ను ప్రవేశపెట్టి దాని ప్రక్రియల్ని కృత్రిమంగా త్వరితం చేశారు. తద్వారా కలిగిన మార్పులను కనిపెట్టారు. కొన్నింటిలో కృత్రిమపదార్థం వల్ల క్రోమొసోమ్‌లలో కొత్త జన్యువుల ప్రవేశం జరుగుతుంది. మరికొన్నింటిలో ఆ పదార్థం కణంలో చోటు సంపాదించుకుని క్రోమొసోమ్‌ జోలికి పోకుండా టెలోమరేస్‌ను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. వీటన్నిటిలోనూ కణాలు పునరుజ్జీవనం చెందడంవల్ల కొన్నిరకాల కండరాల జబ్బులు నయం కాగలవనీ, ఎయిడ్స్‌వల్ల "టి" కణాలు నాశనం కాకుండా నిరోధించవచ్చనీ తేలింది. టెలోమరేస్‌ లోపించడంతో ముఖ్యమైన జీవకణాలు కొన్ని క్షీణించడంవల్ల ప్రాణులు చచ్చిపోతాయి కూడా.
ఇవన్నీ చూస్తే టెలోమీర్లు పొట్టిగా ఉండడంవల్ల కేన్సర్‌ తగ్గుతుందనే ప్రయోజనం ఒక్కటే కనిపిస్తోంది. ఇది కూడా అన్ని రకాల కేన్సర్లకూ పూర్తిగా పనిచెయ్యకపోవచ్చు. మగవారిలో ఒక్క వీర్యకణాల్లోనూ కొన్ని ఇతర కణాల్లోనూ మాత్రమే టెలోమీర్లు పొడుగ్గా ఉంటాయి కనక కేన్సర్‌ నివారణకై టెలోమీర్లను కురచగా చేసే చికిత్సవల్ల వారి సంతానోత్పత్తి సామర్య్థం తగ్గవచ్చు.
ఆయుష్షును పెంచే ప్రయత్నాల్లో రోగనివారణ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుచేతనే కేన్సర్‌ చికిత్సలో కణాల గురించిన ప్రత్యేక పరిశోధనలు జరిగాయి. కణాలు పుట్టి పెరగడం ప్రకృతిసిద్ధంగా కాకుండా, అదుపు లేకుండా అతివేగంగా అవాంఛనీయ పద్ధతిలో కొనసాగడం ఒక్క కేన్సర్‌లోనే జరుగుతుంది. అందుచేత జీవకణాల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఈ పరిశోధనల్లో సులువయింది. ఈ ధోరణిలో సాగే పరిశోధనలు ప్రస్తుతం ఎక్కువగా జంతువుల మీదనే జరుగుతున్నాయి. కొన్ని దశాబ్దాల్లో ఇవి మనుషుల మీద కూడా జరగక మానవు. అప్పటికి ఇవి విజయాన్ని సాధిస్తే "భగవంతుడు" ఇచ్చిన ఆయుష్షును పొడిగించడం మనిషికి అసాధ్యం కాదు.