ముసలితనం
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌



గౌతమ బుద్ధుడుగా పేరుపొందని పిన్నవయసులో సిద్ధార్థుడు మొదటిసారిగా రోగగ్రస్తులనూ, ముసలివారినీ, శవాన్నీ చూసి చలించిపోయాడని అంటారు. ప్రతి ప్రాణికీ తప్పనిసరిగా వచ్చే ముసలితనం ఎవరికీ నచ్చని ఒక సహజ పరిణామం. చివరి ఘట్టమైన మృత్యువుకు మునుపటి దశ కాబట్టి అదంటే మనకు కాస్త భయం కూడా. మనకు పూర్తిగా అర్థం కానటువంటి తక్కిన విషయాలలాగే ముసలితనం అనేది కూడా ఎన్నో అపోహలకు గురి అవుతూ ఉంటుంది. దీన్ని గురించిన ఆధునిక పరిశోధనలు ఎటువంటివో తెలుసుకోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది.
మనం మనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని రెండు రకాలుగా అర్థంచేసుకోవచ్చు. మొదటిది హేతువాద, భౌతికవాద పద్ధతి. రెండో పద్ధతిలో వేదాంత ధోరణీ, ఆధ్యాత్మిక వైఖరీ, మిథ్యావాదమూ మొదలైనవి ఎన్నయినా కలిసిపోయి ఉంటాయి. ఇక ఆ అయోమయంలో కళ్ళకు కనిపించే చరాచర ప్రపంచం గురించి ఎలాగయినా ఊహించుకోవచ్చు. ఈ ఊహలు నేలవిడిచిన సాములాగా ఉండకుండా, మనకు తెలిసినంతవరకూ ప్రకృతిని విజ్ఞానపరంగా అర్థం చేసుకోగలిగితే మనం కాస్త ప్రగతిని సాధించినట్టే. ఎందుకంటే ఎవరెన్ని చెప్పినా మానవసమాజం సాధించిన ప్రగతి ముఖ్యంగా విజ్ఞాన సముపార్జన మీద ఆధారపడినదే. ఈ అవగాహనలో ముసలితనాన్ని గురించిన భావనలు కూడా ఒక భాగమే.
మనుషులకి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం తమ ఉనికి. వీలున్నన్నాళ్ళు మంచి ఆరోగ్యంతో బతకడమే మనకు ప్రధానమైన విషయం. అందుకనే ఈనాటికీ ఎవరినైనా కలుసుకోగానే మొదట అప్రయత్నంగా "బాగున్నారా?" అని ఆడుగుతాం. కాని ఆరోగ్యాన్ని ఎంతగా కాపాడుకున్నా ముసలితనం మాత్రం రాకమానదు. ప్రకృతిలోని ప్రాణులన్నిటికీ వర్తించే ముసలితనం, చావు వగైరాల గురించి మనిషికి అనాదిగా తెలుసు. ఈ పరిణామదశలను అర్థం చేసుకోవడం మనిషికి సమాజ జీవితంలో సాధ్యమైంది. 50 వేల ఏళ్ళ క్రితమే నియాండర్తాల్ జాతి మానవులు శవాలను ఖననం చెయ్యడం మొదలుపెట్టారు. పుట్టుకనుంచి గిట్టేదాకా ఏమవుతుందో ఆదిమానవులు అనుభవం ద్వారా తెలుసుకునే ప్రయత్నాలు చేశారు.
ఫ్రాన్స్ లోని 50 వేల ఏళ్ళనాటి నియాండర్తాల్ సమాధి
పుట్టినప్పుడు నిస్సహాయంగా ఉన్నప్పటికీ పసిపిల్లలు పెద్దయాక యుక్తవయస్సుకు చేరుకుంటారు. యవ్వనంలో శక్తినీ, బలాన్నీ, సంతానోత్పత్తికి సామర్య్థాన్నీ పొందుతారు. ఆ తరవాత అనుభవం, తెలివితేటలూ పెరుగుతాయి కాని శరీరం సడలిపోతుంది. నాగరికత మొదలైనప్పటినుంచీ మనవాళ్ళు నిత్యయవ్వనులుగా ఉంటే బాగుండునని కలలు కంటూనే ఉన్నారు. మన పురాణాల్లోని దేవతలు అమరులే కాదు. వారికి ఎప్పుడూ ముప్ఫై ఏళ్ళే! ముసలితనంతో అమరులైతే మాత్రం లాభమేముంది? అందుకే మన దీవెనల్లో కూడా ఆయురారోగ్యాలు కలిసే ఉంటాయి.
శరీరంలో కలిగే రోగాలనూ, రొష్టులనూ పరిశీలించి తగిన చికిత్స చెయ్యడం ఏనాడో మొదలయింది. వీటిలో కొన్నయినా వార్థక్యాన్ని వాయిదా వేసే ప్రయత్నాల వంటివి. చరకుడూ, శుశ్రుతుడూ, బుద్ధుడి కాలంనాటి జీవకుడూ పేరుపొందారు. వీరంతా తమ కాలానికి సంబంధించినంత వరకూ "ఆధునిక" విజ్ఞానం సాధించినవారే. అందువల్ల మన దేశంలో మొదటినుంచీ వేదాంత ధోరణి మాత్రమే ఉండేదని వాదించేవారికి ఏమీ తెలియదనుకోవాలి. ఎందుకంటే భౌతికవాద, హేతువాద దృష్టి లేకుండా ఇటువంటి పరిశోధనలు చెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు. తరవాతి కాలంలో సూక్ష్మస్థాయిలో బాక్టీరియావంటి వాటివల్ల కలిగే పరిణామాలను అర్థం చేసుకోవడంలో వైద్య, శరీరశాస్త్రాలు ముఖ్యంగా పశ్చిమదేశాల్లో చాలా ప్రగతిని సాధించాయి.
మనిషి సగటు ఆయుష్షు కాలంతో బాటుగా పెరుగుతోంది. నియాండర్తాల్ దశలో 20 ఏళ్ళు బతికిన మానవులు ప్రాచీన గ్రీస్ నాగరికత నాటికి 28 ఏళ్ళూ, మధ్యయుగపు యూరప్ లో 33 ఏళ్ళూ బతికారు. 19వ శతాబ్దం అంతానికి 37కు మించని సగటు వయసు చికిత్సా పద్ధతుల్లోని అభివృద్ధి కారణంగా ఈ రోజుల్లో దాదాపుగా 70కి పెరిగింది. దీనివల్ల సమాజంలోనూ, జీవితం పట్ల మనుషుల దృక్పథంలోనూ కూడా ఎన్నో మార్పులు కలిగాయి. సగటు వయసునూ, జీవన ప్రమాణాలనూ కూడా మెరుగుపరిచే ప్రయత్నాలు మొదలయాయి. మరొకవంక ముసలితనానికి శాస్త్రీయ కారణా లెటువంటివో కూడా అవగాహనకు వస్తున్నాయి. తరవాతి వ్యాసంలో ఆ వివరాలు తెలుసుకుందాం.
మనిషి సగటు ఆయుష్షులో పెరుగుదల