పుట్టేదెప్పుడో ముందే తెలుస్తుంది కాని చావును గురించి ముందుగా తెలియడం అరుదు. అందువల్ల విధిగా వచ్చేదైనప్పటికీ చావు అందరికీ ఒక మిస్టరీగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. దాన్ని గురించి ఎంతో జిజ్ఞాసా, భయాలూ, సందేహాలూ కలుగుతూంటాయి. శరీరం అశాశ్వతమనీ, జీవితం బుద్బుదప్రాయమనీ అనేక వైరాగ్య భావనలు మనకు ఉండనే ఉన్నాయి. అందరం ఎప్పుడో ఒకప్పుడు పోవలసిందే అనే ఆలోచన జీవితం, సమాజంపట్ల మన వైఖరిని బలంగా శాసిస్తుందనడంలో సందేహం లేదు. సమాజంలో సమష్టి భావన నానాటికీ తగ్గి, మనిషి ఒంటరిగా పుట్టి, ఒంటరిగానే పోతాడనే "వేదాంత" ధోరణి పెరగడంతో ప్రజల సామాజిక దృక్పథం కొంతవరకూ మార్పుచెంది తీరుతుంది. ఇది చాదస్తమనేది మనకు తెలుసు. అలాంటప్పుడు శాస్త్రవిజ్ఞానపరంగా మనకు ముసలితనం, చావు వగైరాల గురించిన వివరణ ఎటువంటిదో కొంతవరకైనా తెలుసుకోవడం లాభిస్తుంది. |
వేదాంతుల మాట ఎలా ఉన్నా కాలంతోపాటు మన శరీరాల్లో కలిగే మార్పుల గురించిన పూర్తి అవగాహన ఈనాటికీ లేదనే చెప్పాలి. అయినప్పటికీ సైన్స్ దీన్ని గురించి చాలా విషయాలు వివరించగలదు. వయసుమళ్ళిన మానవశరీరాలు ఎలాంటి మార్పులు చెందుతాయో, జీవకణాల్లో ఎటువంటి పరిణామాలు కలుగుతాయో అనేక సంవత్సరాలుగా జరుగుతున్న ఆధునిక శాస్త్ర పరిశోధనల ద్వారా తెలియవస్తోంది. |
పుట్టిన ప్రతి మనిషీ మామూలుగా కొంతకాలానికి ముసలివాడై చనిపోతాడు. ముందుగా ముసలితనపు లక్షణాలేమిటో చూద్దాం. వయసుతోబాటు శరీరం పటుత్వం కోల్పోతుంది. ఎముకలు పలచబడతాయి. చర్మానికి సాగే గుణం తగ్గుతుంది. గాయాలు త్వరగా మానవు. యవ్వనంలో లాగా జీవకణాల పునరుత్పత్తి జరగదు. శాస్త్రవేత్తలు వీటికిగల భౌతిక కారణాలకై ప్రతి జీవకణం కేంద్రకంలోనూ ఉన్న జన్యువుల్లో వెతకడం ఆరంభించారు. ఈ డిటెక్టివ్ పని ఇంకా కొనసాగుతూనే ఉన్నా కొన్ని విశేషాలు కాస్తకాస్తగా బైటపడుతున్నాయి. ఏడుగురు గుడ్డివాళ్ళూ, ఏనుగూ చందంగా రకరకాల కోణాలనుంచి ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. కేవలం కారణాలు తెలుసుకోవడంకాక చికిత్సకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. |
ఆరోగ్యంగా ఉందామని ఎంత ప్రయత్నించినా, వయసుతో మన శరీరాలు కాస్తకాస్తగా శిథిలమవుతూ కొన్నాళ్ళకి నశిస్తాయనేది మనకి తెలిసి, మనని బాధించే సత్యం. ఇది ప్రాణుల ప్రాథమిక లక్షణంలాగా కనబడుతుంది. ఎందుకంటే 50కోట్ల సంవత్సరాల క్రితం రూపొందిన ప్రాణుల్లో కూడా ఇలాగే జరిగిందని శిలాజాల పరిశోధనల్లో తేలింది. |
మొదట్లో ముసలితనంవల్ల పటుత్వం తగ్గడం అనేది వాడకంవల్ల కత్తులూ, కటార్లూ మొక్కపోవడం వంటిదనే అనుకునేవారు. కాని పంతొమ్మిదో శతాబ్దం మధ్యకాలంలో ఉష్ణగతి శాస్త్రం (thermodynamics) సూత్రాల ప్రతిపాదన జరిగాక ఈ భావన సడలింది. అందులోని రెండో సూత్రాన్నిబట్టి చూస్తే శిథిలంకావడం, తుప్పుపట్టడంవంటివి నిర్జీవపదార్థాల్లోనూ, వ్యవస్థల్లోనూ జరుగుతాయి కాని, ఆహారం తిని, పెరిగే జీవజాలంలో జరగవని తేలింది. |
మన శరీరాల్లో జరిగే దీర్ఘకాలిక, తక్షణ పరిణామాలన్నిటినీ జీవకణాల స్థాయిలో అర్థం చేసుకోవడం మొదలయింది. జీవరాశి మొదట ఏకకణజీవుల రూపంలోనే ప్రారంభమైందనేది తెలిసినదే. అనేక ఏకకణజీవాలు ఒక తుట్టెలాగా ఏర్పడి మనుగడ సాగించడంలో ఎక్కువ ప్రయోజనం కలిగి ఉంటుంది. వాటిలో కొన్ని ప్రత్యేక బాధ్యతలు చేపట్టడంతో అవి ఒకే పెద్ద బహుకణజీవికి వేరువేరు అవయవాలుగా రూపొంది ఉంటాయి. ఆ విధంగా మొదలైన బహుకణ జీవులు ప్రాచుర్యం చెంది అనేక రూపాలను సంతరించుకున్నాయి. అయినా వాటి శరీరాల్లోని వివిధ కణసముదాయాల మధ్య మంచి సమన్వయం ఉండడం చాలా అవసరం. ఒక వ్యవస్థలో తలెత్తే లోపాలు తక్కినవాటి మీద తీవ్రమైన ప్రభావం కలిగించగలవు. వ్యవస్థకు తగిలిన దెబ్బ మరీ పెద్దదయితే ప్రాణి చచ్చిపోతుంది. |
స్థూలంగా చెప్పాలంటే అనియత (random) క్రమంలో ఉండే కణాలన్నీ ప్రాణుల శరీరాల్లో చేరగానే "సజావుగా" అమరి తమ పనులను "సక్రమంగా" నిర్వర్తిస్తాయి. అంతేకాదు. అవసరమైనప్పుడు విరిగిన ఎముకలు అతుక్కోవడం వగైరా చర్యలద్వారా తప్పులు సరిదిద్దుకుంటాయి కూడా. మళ్ళీ ఇందులోనూ అన్ని జంతువులూ ఒకటిగా లేవు. క్షీరదాల్లో ఇలాంటివాటికి పరిమితులుంటాయి. ఉదాహరణకు మన వేలి చర్మం గాటుపడితే బాగవుతుంది కాని, వేలే తెగిపోతే మరొకటి మొలవదు. కొన్ని జలచరాల్లో మాత్రం తెగిన పొడుగాటి స్పర్శకాలు (tentacles) మళ్ళీ పెరుగుతాయి. దీని వల్ల తేలుతున్నదేమిటంటే ప్రాణుల శరీరాల్లో సమయానికి తగిన పరిరక్షకచర్య తీసుకునే సంక్లిష్ట వ్యవస్థ ఉన్నప్పటికీ ఎల్లకాలం ఉండే యవ్వనానికీ, చావును తప్పించుకునేందుకూ ఏర్పాట్లు మాత్రం కనబడవు. |
మనిషిలాగే జంతువులన్నీ ముసలివౌతాయి. కుక్కలూ, పిల్లుల సగటు ఆయుర్దాయం మనకన్నా తక్కువ. అలాగే ఏనుగు, తాబేలువంటివి మనకన్నా ఎక్కువ కాలం బతకవచ్చు. మరొక విశేషమేమంటే ముసలితనం అన్ని ప్రాణుల్లోనూ ఒకే వేగంతో ముంచుకురాదు. ముసలితనానికీ తినే తిండికీ కూడా సంబంధముంది. కొన్ని ప్రయోగాల్లో సగం పస్తులుంచిన ఎలుకలు ఎక్కువ కాలం బతికాయి. మొక్కల రెమ్మలు కత్తిరిస్తూ ఉంటే బాగా పెరుగుతాయని మనకు తెలుసు. మనుషుల్లో కూడా శరీరాన్ని వ్యాయామంద్వారానో, ఉపవాసాలద్వారానో "శ్రమ" పెట్టినప్పుడల్లా జీవితకాలం పొడిగించబడుతోందని రుజువయింది. అంటే దీనర్థం "సుఖజీవనం" సాగిస్తున్న శరీరం తప్పనిసరిగా ముసలితనం, చావు అనే ప్రకృతి నియమాలకు లొంగిపోతుందనా? ఆహారంలో "కేలరీలు" తగ్గించి, విటమిన్లూ, ఖనిజలవణాలూ ఎక్కువగా తిన్న జంతువులు ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతుకుతున్నాయి. |
పరిణామవాదాన్నిబట్టి చూస్తే తిండికి లేమి కలిగిన ప్రతికూల పరిస్థితిలో జాతి అంతరించిపోకుండా ఉండేందుకు ప్రాణుల శరీరాలు ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది. మన శరీరాల్లో దాదాపు అన్ని అంశాలనూ శాసించేవి జన్యువులే (జీన్స్). మన ఆరోగ్యాన్నీ, ఆయుర్దాయాన్నీ శాసించేవి మన శరీర కణాల్లో అతిసూక్ష్మ స్థాయిలో జరిగే మార్పులేనని తెలిసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎంతటి వేదాంతులైనా తమకు రోగం వచ్చినప్పుడు నిర్లిప్తంగా ఉండలేరు. సమస్యలను అర్థం చేసుకున్న శాస్త్రవిజ్ఞానం ద్వారా తగిన చికిత్సను పొందగలిగితే వారు మరికొన్నాళ్ళు బతికి, తమ వేదాంతాన్ని మరింత వల్లె వేయగలుగుతారు! రోగచికిత్స కూడా లాభాలు గడించే వ్యాపారంగా మారుతోందనేది నిజమైనా శాస్త్ర పరిశోధనలవల్ల ప్రజలకు కొంతయినా మేలు జరుగుతోందనడంలో మాత్రం సందేహం లేదు. |