రంగుల కలలు, వాస్తవాలు
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌రంగులను చూడగానే కళ్ళు ఆకర్షణకు లోనవడం జీవపరిణామక్రమంలో అవసరమైన చర్యగా భావిస్తారు. రంగులు మననేకాదు, పక్షులనుకూడా ఆకర్షిస్తాయి. నెమలిలాగా అందమైన పింఛంతో ఆడపక్షులను ఆకర్షించలేని చిన్నచిన్న మామూలు మగపిట్టలు కొన్ని తమ గూటిని రంగులతో "అలంకరించి" జోడీకై నిరీక్షిస్తాయి (పటం).
రంగులంటే మనకూ ఇష్టమే. ఇరవయ్యో శతాబ్దంలో ముందు ఫోటోలూ, తరవాత సినిమా, టెలివిజన్‌లూ నలుపు తెలుపు అవతారాలెత్తిన తరవాతనే రంగులు సంతరించుకున్నాయి. మనకు కనబడుతున్నదంతా సహజంగా "కలర్‌"లోనే ఉన్నా ఈ దృశ్యాలను మొదటిసారిగా కృత్రిమ రంగుల్లో చూసినవారు చాలా తృప్తిని పొందారు.
అసలు రంగులనేవి ఎలా ఏర్పడతాయో సామాన్యంగా మనం ఆలోచించం. సూర్యకాంతిలో రకరకాల నిడివిగల విద్యుదయస్కాంత తరంగాలు కలిసి ఉంటాయి. వాటిలో మన కంటికి కనబడేవి 380 (ఊదా రంగు) నుంచి 720 (ఎరుపు) నానోమీటర్ల నిడివి కలిగినవి మాత్రమే. (కోటి నానోమీటర్లు ఒక సెంటిమీటర్‌కు సమానం). అంతకన్నా ఎక్కువ, తక్కువైన తరంగాలు మనకు కనబడవు. అన్నీ కలిస్తే తెల్లని కాంతి ఏర్పడుతుంది. మనకు వస్తువులు ఏ రంగులో కనబడుతున్నాయనేది వాటిమీద ఎటువంటి కాంతితరంగాలు పడుతున్నయనేదాని మీదనేకాక మన కళ్ళ పరిస్థితిమీద కూడా ఆధారపడుతుంది. తెల్లనివన్నీ పాలూ, నల్లనివన్నీ నీళ్ళూ అని నమ్మేవాళ్ళు అమాయకులే కానవసరంలేదు. రంగుల విషయంలో మన కళ్ళే మనని ఏమార్చగలవు. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం.
ఇంతకుముందు వివరించినట్టుగా రెటీనా పొరలో కాంతికి స్పందించే ఓప్సిన్‌ అనే ప్రోటీన్‌ కణాలుంటాయి. ఓప్సిన్‌ కణాలలోని వివిధ అమినో ఆసిడ్లు రంగులలోని తేడాలను గుర్తించేందుకు తోడ్పడతాయి. రంగులకు మన కళ్ళు స్పందించడం గురించి చెప్పేముందు "దృష్టి స్థిరత"ని గురించి తెలుసుకోవాలి. మండుతున్న ఎలెక్ట్రిక్‌ బల్బ్‌ తీగను తగుమాత్రం దూరంనుంచి ఒకటి రెండు సెకన్ల పాటు తదేకంగా చూసి, కాసేపు కళ్ళు మూసుకున్నాక కూడా వెలుగుతున్న ఫిలమెంట్‌ మనకు కనబడుతున్నట్టే ఉంటుంది. కళ్ళకు ఉండే ఈ జ్ఞాపకశక్తినే దృష్టి స్థిరత, లేదా పెర్సిస్టెన్స్‌ ఆఫ్‌ విజన్‌ అంటారు. (గబగబా కదిలే సినిమా స్టిల్స్‌ చలనచిత్రం అనే భ్రమకలగడానికి కూడా ఇదే కారణం) రెటీనా కణాలు ఎక్కువగా "బ్లీచ్‌" అవడంవల్ల ఇలా జరుగుతుంది. దృశ్యం అంతర్ధానం అయిపోయినా కణాలు "సద్దుమణిగేదాకా" మెదడుకు సంకేతాలు అందుతూనే ఉంటాయి. ఇది జరుగుతున్నప్పుడు ఫిలమెంట్‌ రంగులు మారుతూ ఉంటుంది. అంటే కొన్ని రంగులకు సంబంధించిన కణాలు మళ్ళీ యథాస్థితికి చేరడానికి తక్కినవాటికన్నా ఎక్కువ సమయం పడుతుందన్నమాట.
సంపూరకమైన రంగులు
మామూలు వస్తువుల విషయంలోకూడా ఒక్కొక్కప్పుడు ఇలా జరగవచ్చు. ఉదాహరణకు ఏదైనా పుస్తకానికి గల ముదురు ఎర్రని అట్టకేసి కాసేపు చూసి, వెంటనే దృష్టిని తెల్లని గోడకేసి మరలిస్తే గోడమీద పుస్తకం ఆకారం ఆకుపచ్చగా కాసేపు కనిపిస్తుంది. దీనర్థం ఏమిటంటే ఎర్రని కాంతికి స్పందించే కణాలు ఎక్కువగా బ్లీచ్‌ అయిపోయాయని. ఎరుపుకు "పూరకమైన" ఆకుపచ్చ కాంప్లిమెంటరీ కలర్‌. అలాగే నీలం రంగుకు పసుపుపచ్చని రంగు పూరకం. రంగు కళ్ళద్దాలు ధరించి కొన్ని రోజులు తిరిగినవారికి త్వరలోనే అవి అలవాటైపోయి లోకమంతా మామూలుగానే కనిపిస్తుంది. అవి తీసేసిన కొన్నాళ్ళవరకూ మాత్రం ఈ కాంప్లిమెంటరీ రంగులు వారిని ఇబ్బంది పెడతాయి. కొన్ని విచిత్రమైన పరిశోధనల్లో ఒక లెన్స్‌ ఎరుపుదీ, మరొకటి ఆకుపచ్చదీ అమర్చిన కళ్ళజోళ్ళు ధరించి కొంతమంది కొన్నాళ్ళు గడిపారు. వారికి దృశ్యాలన్నీ నీలం రంగులో కనబడ్డాయట. రెండు రంగులనీ సమన్వయం చేసిన మెదడు వారికి ఆ భావన కలిగించింది. కళ్ళు స్వీకరించే దృశ్యాల సమాచారాన్ని మనకు అర్థం అయే రీతిలో వివరించగలిగేది మెదడే.
మన మెదడు వర్ణమాలను విశ్లేషించే స్పెక్ట్రోమీటర్‌లా పనిచెయ్యదు. వివిధ భౌతిక ప్రేరణలు రంగులను చూస్తున్న భ్రాంతిని కలిగించగలవు. మనకు కనబడే రంగులన్నీ రకరకాల నిడివి గల తరంగాల కలయిక వల్ల రూపొందినవే. తగుమాత్రం తీవ్రత ఉన్న ఎరుపు, ఆకుపచ్చని కాంతి కలిస్తే పసుపుపచ్చగా అనిపిస్తుంది. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులు వివిధ నిష్పత్తుల్లో కలిసినప్పుడు మనకు అనేక రంగులు కనిపిస్తాయి. అన్నీ సమానమైన తీవ్రతతో కలిస్తే తెల్లని కాంతి కనబడుతుంది. కాంతికి తగినంత తీవ్రత లేకపోతే వస్తువులన్నీ బూడిదరంగులో కనిపిస్తాయి. చీకటిలో రంగులను పోల్చలేకపోవడానికి కారణం ఇదే. తెల్లని కాంతి వస్తువులపై పడినప్పుడు అందులో కొంతభాగమే ప్రతిఫలనం చెందుతుంది కనక ప్రపంచంలో వివిధ రంగుల వస్తువులు కనబడతాయి. ఏదైనా రంగుకు పూరకమైన మరొక రంగు తోడైతే తెల్లని కాంతి ఏర్పడుతుంది. ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంట రంగుల గురించిన అవగాహన మెదడు వల్లనే కలుగుతుందని. రంగులను గుర్తించడమనేది నాడులకూ, శరీరతత్వానికీ సంబంధించిన జటిలమైన ప్రక్రియ. ఇది కేవలం కాంతియొక్క భౌతిక లక్షణాల మీద ఆధారపడదు.
ఇంతకుముందు చెప్పినట్టుగా రెటీనాలో శంఖాకారంలోనూ, కాడలవంటివీ నాడీకణా లుంటాయి (పటం). రంగులను గుర్తించగలిగినవి శంఖాకార కణాలు. తక్కువ వెలుతురులో కూడా పనిచెయ్యగలిగిన కాడకణాలు రెటీనా మధ్యలోకాక కేంద్రం చుట్టూతా ఉంటాయి. బాగా వెలుతురున్న ప్రాంతం నుంచి చీకటి గదిలోకి ప్రవేశించినప్పుడూ, చీకటి నుంచి ఎండలోకి నడిచినప్పుడూ కళ్ళు వెంటనే సరిగ్గా చూడలేవు. చూసే "బాధ్యత" ఒకరకం కణాలనుంచి రెండో రకానికి అందడంలో కాస్త జాప్యం జరుగుతుంది. అందుచేత మనుషుల దృష్టి ఎంత సునిశితంగా రూపొందినప్పటికీ కొన్ని ఇబ్బందులు తప్పనిసరి. మనుషులూ, తక్కిన ప్రాణులూ రకరకాల భౌతిక, భౌగోళిక పరిస్థితుల్లో మనుగడ కొనసాగిస్తున్న నేపథ్యంలో వారి శరీరాలు "ఉన్నంతలో" జీవపరిణామాన్నిసాధించడం వల్లనే ఇన్ని రకాల వ్యవస్థల ఏర్పాటు జరిగింది.
మనుషులతో పోలిస్తే పిల్లులకి పగటిపూట చూపు అంత బాగా ఆనదు. అవి దృశ్యంలోని వివరాలను అంత బాగా చూడలేకపోయినా కదలికలను బాగా పసికడతాయి. మనకు కనబడినన్ని రంగులు వాటికి కనబడవు. రాత్రిళ్ళు వేటాడి పొట్టపోసుకుంటాయి కనక వాటికి అనువైన పద్ధతిలో కళ్ళ పరిణామం జరిగింది. కోతులకు మనలాగే ముఖాలకు ముందు భాగంలో రెండేసి కళ్ళుంటాయి. ఈ స్టీరియోస్కోపిక్‌ ఏర్పాటుద్వారా ఎదుట ఉన్న వస్తువులు ఎంతెంత దూరాన ఉన్నాయో తెలిసిపోతుంది. కోతుల మనుగడకు ఆకుల మధ్య నుంచి ప్రపంచాన్ని చూడటానికి తగిన నిశితమైన దృష్టి చాలా అవసరం. రంగులనుకూడా అవి బాగా పోల్చగలవు. వాస్తవప్రపంచాన్ని అవగాహన చేసుకోవడానికి ఎక్కువగా తోడ్పడేవి కళ్ళే కనక ఇది జీవపరిణామంలో ముఖ్యమైన అంశం.