కళ్ళ కమామీషు
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌




ఏది సత్యం, ఏదసత్యం? కళ్ళారా చూసినదే నిజమని మనం నమ్ముతాం. యదార్థత అనే భావాన్ని తక్కిన ఇంద్రియాలకంటే కళ్ళు ఎక్కువగా కలిగిస్తాయి. చూపు మనకు చాలా ముఖ్యం. జీవాలన్నీ పరిణామదశలకు లోనై రూపొందినవే కనక కళ్ళు కూడా ఎప్పుడో, ఏవో కొన్ని పరిస్థితులకు అనుగుణంగా ఆవిర్భవించి ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ విషయం గురించి కాస్త చూద్దాం.
సూర్యుడినించి ప్రసరించే కాంతి గత 350 కోట్ల సంవత్సరాలుగా భూమి మీది జీవపరిణామానికి ప్రేరణనిస్తూనే ఉంది. పగలూ, రాత్రీ అనే క్రమంలో కాంతిలోని హెచ్చుతగ్గులు వివిధ జీవరాశులపై గాఢమైన ప్రభావం కలిగిస్తూ వచ్చాయి. నేత్రాల ఆవిర్భావం అందువల్లనే జరిగింది. ఇది ఎన్నిసార్లు, ఎన్ని విధాలుగా జరిగిందో చెప్పడం కష్టం. ఇది చాలా చిక్కుప్రశ్న అని డార్విన్‌ పంతొమ్మిదో శతాబ్దంలోనే గుర్తించాడు. దగ్గర సంబంధంలేని ప్రాణులన్నిటిలో సైతం కళ్ళకు సంబంధించిన జన్యువులలో పోలికలున్నాయని ఆధునిక పరిశోధకులు తెలుసుకున్నారు. అసలు కళ్ళు చూసేది ఏమిటి?
విద్యుదయస్కాంత వర్ణమాల
విద్యుదయస్కాంత వర్ణమాల, లేదా ఎలెక్ట్రోమాగ్నెటిక్‌ స్పెక్ట్రమ్‌లో ఎక్కువ నిడివిగల రేడియో తరంగాల నుంచి తక్కువ నిడివిగల గామా కిరణాలదాకా ఎన్నో ఉన్నాయి (పటం). తరంగం నిడివి తగ్గినకొద్దీ ఈ కాంతిలో నిక్షిప్తమైన శక్తి పెరుగుతుంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలం కాని ఎక్స్‌ కిరణాలను మన ఎముకలు మాత్రమే కొంతవరకూ నిరోధించగలవు. రేడియో తరంగాలను ఏంటెన్నాలు పసికడతాయి. ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలను వేడిమిగా మనం గుర్తిస్తాం. బేంకు చెక్కుల మీద సంతకాలను తణిఖీ చేసే అల్ట్రా వయొలెట్‌ దీపాల కాంతిని కూడా మనం చూడలేం. శరీరానికి తీవ్రమైన హాని కలిగించే ఎక్స్‌, గామా కిరణాల జాడ మనకు వాటి బారిన పడి జబ్బులు వచ్చాకగాని మనకు తెలియదు. ఇక మనం చూడగలిగింది ఇన్‌ఫ్రా రెడ్‌, అల్ట్రా వయొలెట్‌ కాంతికి మధ్యనుండే వానవెల్లి రంగులను మాత్రమే. చాలా తక్కువ పరిధికే మన నేత్రాలు పరిమితమై ఉంటాయి. ఈ విషయంలో మనకన్నా చీకట్లో చూడగలిగే పిల్లులూ, కుక్కలే నయం.
ఇలా జరగడానికి కారణం నయనేంద్రియాలు మొదటగా జలచరాల్లో ఆవిర్భవించడమే. నీరు "వడపొయ్యగా" కళ్ళకు తగిలే కాంతి తరంగాల నిడివి కొంతవరకే పరిమితమై ఉంటుంది. అందుకే మనం ఊదా, నీలం, ఆకుపచ్చ, పసుపుపచ్చ, నారింజ, ఎరుపు రంగు కాంతిని మాత్రమే చూడగలం. తక్కినవి నీటిలోకి అంతగా చొచ్చుకురాలేవు. తరవాతి కాలంలో కొన్ని జలచరాలు ఉభయ చరాలుగానూ, భూచరాలుగానూ మారినప్పటికీ చక్షువుల స్వరూపం అప్పటికే దాదాపుగా నిర్ణయ మైపోయింది. కళ్ళు చూడగలిగిన కాంతే మొక్కల్లో కిరణసంయోగ క్రియకు కూడా ఉపకరిస్తుంది. వాటి ఆకుల్లోని క్లోరోఫిల్‌ మనకన్నా ఎక్కువేమీ "చూడలేదు". మనకూ, మొక్కలకూ కూడా ఆదిమ యుగంలో జన్మనిచ్చిన జీవరాశి నీటిలోనే పుట్టి పెరిగిందనడానికి ఇది సాక్ష్యం. ప్రాథమిక దశలో పరిణామం చెందిన కళ్ళు కొన్ని జీవరసాయనిక ప్రక్రియల ద్వారా కాంతిని గుర్తించసాగాయి. ఎన్నేళ్ళు గడిచినా ఆ ప్రక్రియల్లో పెద్దగా మార్పు రాలేదు. ప్రాణులన్నీ అదే వ్యవస్థను కొనసాగించి "సర్దుబాట్లు" చేసుకున్నాయి. కొన్ని కీటకాలూ, ఇతర ప్రాణులూ తమ అవసరాలకని అల్ట్రా వయొలెట్‌ కాంతిని గుర్తించే శక్తిని సంపాదించుకున్నాయి. అందుకు తమ శరీరాల్లో అప్పటికే ఉన్న కొన్ని జీవరసాయన పదార్థాలని వినియోగించుకున్నాయి. అంతేకాని నేత్రవ్యవస్థలో పెద్ద మార్పులు జరగలేదు.
సెకండుకు అతి తక్కువ (సుమారు వంద) కంపనాలు కలిగి, ఎక్కువ నిడివి ఉన్న విద్యుత్‌ తరంగాలు నీటిలో బాగానే ప్రసరిస్తాయి. ఎలెక్ట్రిక్‌ తీగలను నీటిలో ముంచితే అందుకే ప్రమాదం. ఈ కారణంవల్లనే కొన్ని చేపలు ఎలెక్ట్రిక్‌ షాక్‌ కలిగించగలవు. బురదనీటిలో కాంతి అంతబాగా ప్రసరించదు కనక ఆత్మరక్షణకై అవి ఈ శక్తిని సంపాదించుకోవలసి వచ్చింది. భౌతిక పరిస్థితులు జీవపరిణామాన్ని ఎలా ప్రేరేపిస్తాయో అర్థం చేసుకోవడానికిది మంచి ఉదాహరణ. వెలుతురు ఉన్న చోట కళ్ళ పరిణామం ఎలా జరిగిందో చూద్దాం.
చక్షువుల నిర్మాణమూ, అవి పనిచేసే తీరూ కాంతికిరణాల భౌతికధర్మాల మీద ఆధారపడిన విషయాలు. కాంతికిరణాలు సరళరేఖలో ప్రసరిస్తాయి. అద్దంలోలాగ ప్రతిఫలనానికీ, గాజు దిమ్మలవంటి వాటిలో వక్రీభవనానికీ లోనవుతాయి. పట్టకాలలో జరిగినట్టుగా వాటి వర్ణంలో మార్పులు కలగవచ్చు. పొగమంచువంటివి అడ్డు తగిలినప్పుడు వాటి తీవ్రత తగ్గవచ్చు. ఈ అంశాలన్నీ నేత్రాల స్వరూపాన్ని నిర్ణయించాయి.
వివిధ ప్రాణులకు అవసరాలనిబట్టి రకరకాల చక్షువులు ఉంటాయి. వీటిలో కొన్ని కేవలం చీకటి వెలుగులని మాత్రమే గుర్తిస్తే తక్కినవి ఎదుటనున్న దృశ్యాన్ని అద్భుతంగా అవగతం చేస్తాయి. మనుషులకూ, కొన్ని క్షీరదాలకూ కనబడుతున్నవాటి ఆకారం, రంగులూ, వెలుతురూ, దూరమూ వగైరా అంశాలని ఎంతో చక్కగా చూడగలిగే సామర్య్థం ఉంటుంది. కంటికి తగిలే విద్యుదయస్కాంత తరంగాలని మెదడే ఒక దృశ్యంగా అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. కంటి పనల్లా ఆ తరంగాలకు స్పందించి నరాల సంకేతాల రూపంలో మెదడుకు సమాచారం అందించడమే. ఈ స్పందనకు తగిన విధంగా కళ్ళూ రూపొందాయంటే వాటిలో కాంతిని భౌతికంగా పసికట్టే వ్యవస్థ ఉండడం వల్లనే.
మనిషి కంటికి ముందు భాగంలో పారదర్శకంగా ఉండే కార్నియా, లేక శుక్లపటలం కాంతిని కంటిగుడ్డులో ప్రవేశించనిస్తుంది (పటం). దానికీ, దానివెనక ఉండే లెన్స్‌, లేదా కటకానికీ మధ్య నీటిలాగా పారదర్శకమైన ద్రవం ఉంటుంది. లెన్స్‌కు ముందు కంటిపాప ఉంటుంది. కాంతి తీవ్రతరమైతే ఇది చిన్నదై కన్ను మాడిపోకుండా కాపాడుతుంది. లెన్స్‌ అనేక పొరలుగా ఉంటుంది. దీన్ని లాగిపట్టే కండరాలు రింగులాగా చుట్టూ ఉంటాయి. లెన్స్‌ ఎంత మందంగా ఉండాలో ఇవే నిర్ణయిస్తాయి. ఎదురుగా ఉన్న వస్తువు దూరాన్నిబట్టికాంతి కిరణాలు ఎలా కేంద్రీకృతం అవాలో దీన్నిబట్టే ఉంటుంది. కనుగుడ్డు లోపల వెనకగా ఉండే రెటీనా, లేక నేత్రపటలం కాంతిని నాడీసంకేతాలుగా మారుస్తుంది. కనుగుడ్డు మొత్తం ఒక కామెరాలాగా పనిచేస్తుంది. ఇంత సంక్లిష్టమైన ఏర్పాటు జరగడానికి చాలాకాలం పట్టి ఉండాలి. కాంతికి స్పందించవలసిన అవసరం ప్రాణులకు ఎప్పుడు, ఎలా కలిగిందో, అటువంటి వ్యవస్థ ఏ విధంగా రూపొందిందో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.