కాలం అవగాహన - 1
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌మనుషులకు ఉన్న అనేక సహజ లక్షణాల్లో కాలగమనాన్ని గమనించగలగడం ఒకటి. సంఘటనలన్నీ ఒకదాని వెనక ఒకటిగా జరుగుతాయని మనకు పసితనం నుంచీ తెలుస్తూ ఉంటుంది. పెద్దవుతున్నకొద్దీ కాలం గురించిన అవగాహనా, అపోహలూ కూడా పెరుగుతాయి. ముఖ్యంగా భవిష్యత్తును గురించిన ఆందోళన మొదలవుతుంది. ఇక అతీతశక్తుల గురించి చెప్పేవారి ఉత్సాహం పెరుగుతుంది. ఇలా సామాన్యులని బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించేవారిలో "త్రికాలజ్ఞులు" కూడా ఉంటారు. స్వయంగా చూడకపోయినా జరిగినవీ, జరుగుతున్నవీ, జరగబోయేవీ అన్నీ తమకు తెలుసునని వీరు బుకాయిస్తారు. మనలో చాలామంది జరగబోయేదంతా "రాసిపెట్టి" ఉన్నదని నమ్ముతారు. "రావలసిన ఘడియ" గురించీ, "కాలమహిమ" గురించీ అనుకోవడం, కాలం "తీరినవారు" చనిపోతారని భావించడం మామూలే. ఇదేదో తత్వధోరణిలా అనిపించినప్పటికీ దీని వెనక కాలం అంటే సరైన అవగాహన లేకపోవడమే కనిపిస్తుంది. మామూలు పద్ధతిలో కాలం అంటే ఏమిటో మనకందరికీ తెలుసు. అయినా దానికి సరైన నిర్వచనం ఇవ్వాలంటే భౌతిక శాస్త్రవేత్తలకు కూడా అంత సులువు కాదు.

కాలానికి కొలతలు ఏర్పాటయాయి. అయితే కాలాన్ని లెక్కపెట్టేది గడియారమే కానవసరంలేదు. నక్షత్రంచుట్టూ తిరిగే గ్రహమూ, ఇసక గడియారంలోని ఇసకా, లయబద్ధమైన గుండె చప్పుడూ, సీసియంవంటి అణువులోని కంపనాలూ వీటిలో దేన్నైనా కాలగణనానికి వాడుకోవచ్చు. మనకు తెలిసిన ప్రపంచానికి మూడు కొలతలున్నాయి. నాలుగోది కాలం. మూడు కొలతల "స్థలానికి" దీన్ని చేర్చాలి. రెండు వస్తువులు ఒకే స్థలాన్ని ఆక్రమించాలంటే విభిన్న సమయాల్లోనే వీలవుతుంది. ఒకదాని తరవాత ఒకే స్థలంలో రెండు వస్తువులు ఉండడం సాధ్యమే కనక మనది నాలుగు కొలతల ప్రపంచం అయింది.

కాలాన్ని గురించిన మన అవగాహనకూ, మన చైతన్యానికీ, శరీరావస్థకూ చాలా దగ్గర సంబంధం ఉంది. వ్యవధి ఒకటే అయినప్పటికీ, 10 నుంచి 20 ఏళ్ళ వయసులో కలిగే తేడాలు 60 70 ఏళ్ళ మధ్య కలగడం అసాధ్యం. అలాగే సమయానికీ, మన జ్ఞాపకశక్తికీ సంబంధం ఉంది. శరీరానికి కలిగే నొప్పులూ, బాధలూ, రోగాలూ కాలవ్యవధిని బట్టి మారతాయి. ఇదికాక చీకటి వెలుగులనుబట్టి మన శరీరాలు కాలానుగుణంగా స్పందిస్తూ ఉంటాయి. మన దేహాల్లోపల ఒక గడియారంవంటిది ఉంటుంది. టైమెంతయిందో తెలియకపోయినా భోజన నిద్రాదుల అవసరాన్నిబట్టి గడుస్తున్న కాలాన్ని మనం గుర్తిస్తూ ఉంటాం. అయినా, బైటి ప్రపంచంతో సంబంధం లేకుండా చాలా రోజులు ఎవరినయినా ఏ నేలమాళిగలోనో నిర్బంధిస్తే వారికి గడిచిన కాలం గురించి సరైన అవగాహన కలగదు. కాలగమనం తెలుస్తూ ఉండాలంటే ఏవైనా సంఘటనలు జరగాలి. ఇది మన స్పృహకూ, చైతన్యానికీ సంబంధించిన విషయం.

కాలాన్నీ, సమయాన్నీ గురించిన సిద్ధాంతాలు రెండున్నర వేల సంవత్సరాల క్రితంనుంచీ ఉన్నాయి. ఆకాశంలో తారల గమనాన్నీ, నెలలవారీగా రుతువుల్లో జరిగే మార్పులనూ కనిపెట్టసాగిన తొలి మానవులకు "కాలచక్రం" గురించి ఆనాడే కొంత అవగాహన మొదలైంది. వ్యవసాయం ప్రారంభించాక కాలగణనం మానవసమాజానికి చాలా ప్రధానమైన విషయం అయింది.

అసలు కాలం అంటే ఏమిటి? భౌతిక పరిభాషలో దానికేదైనా అర్థం ఉందా, లేక అది కేవలం మన మనసు కలిగిస్తున్న భ్రమేనా? కాలప్రవాహం అంటే ఏమిటి? అందులో ప్రవహించేవి గంటలా, నిమిషాలా, సెకండ్లా? సంఘటనలన్నీ "నిశ్చలన" దృశ్యాలనీ, మన చైతన్యం వాటిని ఒకదాని తరవాత ఒకటిగా గుర్తిస్తుందనీ, ఆ విధంగానే కాలం గురించి మనకు అవగాహన కలుగుతుందనీ అనుకోవచ్చా? స్థలానికి లేని "దిశ" కాలాని కెందుకుంటుంది? సినిమా రీలును వెనక్కి తిప్పినప్పుడు ఈ సంగతి బాగా అర్థమవుతుంది. మనుషులూ, బళ్ళూ వెనక్కి నడవడమే కాదు; టూత్‌పేస్ట్‌ ట్యూబ్‌లోకి వెళ్ళినట్టూ, కాఫీనుంచి డికాక్షన్‌ తొలిగిపోయి పాలు మిగిలినట్టూ అసంభవమనిపించే దృశ్యాలు కనిపిస్తాయి. దీన్నిబట్టి కాలాన్ని కార్యకారణ సంబంధంగా నిర్వచించుకోవచ్చు. (ముందు రాయి విసురుతాం. ఆ తరవాతే దెబ్బ తగులుతుంది). అలాగే కాలమంటే క్షణాల సముదాయం. ఈ క్షణాలన్నీ "భవిష్యత్తు"లో బయలుదేరి, ప్రస్తుత వర్తమానకాలంనుంచి గతంలోకి "వెళిపోతూ" ఉంటాయి.కాలమంటే సంఘటనలన్నీ ఒకేచోట ఒకేసారి జరగకపోవడం. కాలమంట ఒక వ్యక్తికి ఒకదాని తరవాత ఒకటిగా జరిగే అనుభవాల సమాహారం. మనకు మెదడూ, అవగాహనా లేని పరిస్థితిలో కాలం అనేదానికి అసలు అర్థమేదీ ఉండకపోవచ్చునని కొందరు అంటారు. స్థల, కాలాలు శాశ్వతమైనవనీ, వాటికి పదార్థంతోనూ, సంఘటనలతోనూ సంబంధం ఉండదనీ న్యూటన్‌ ప్రతిపాదించాడు. ఆయనకు సమకాలికుడూ, ప్రత్యర్థీ అయిన లైబ్నిజ్‌ అనే మేధావి మాత్రం సంఘటన లనేవి లేకపోతే కాలమనేదానికి అర్థం ఉండదని వాదించాడు.

మన అవగాహనకు సంబంధించినంతవరకూ ఊహించడంతప్ప మనకు ఖచ్చితంగా తెలియనిది భవిష్యత్తు. ప్రత్యేకంగా చెప్పక్కర్లేని విషయాలూ ఉన్నాయి. బుద్ధ భగవానుడికి వేదాల గురించి తెలిసి ఉంటుంది కాని వేదకాలపు వారికి బుద్ధుడి గురించి తెలియదు. అలెగ్జాండర్‌ ఈజిప్ట్‌ వెళ్ళి పిరమిడ్లను చూశాడు. జూలియస్‌ సీజర్‌ అలెగ్జాండర్‌ విగ్రహాన్ని సందర్శించాడు. వీరందరి తరవాతా పుట్టిన మనకు ఇవన్నీ తెలుసు.

మనకు సంబంధించినంత వరకూ మన కేలండర్‌కు సూర్యచంద్రులు ఆధారం. భూమి తన చుట్టూ తాను రోజుకొకసారి గుండ్రంగా తిరుగుతుంది కనక మన సౌకర్యం కోసం కాలగణనానికి స్థలాన్ని బట్టి కొన్ని పద్ధతులుపెట్టుకున్నాం. రోజూ మారే తేది కోసమని ఏర్పాటు చేసుకున్న ఇంటర్నేషనల్‌ డేట్‌ లైన్‌ పసిఫిక్‌ మహాసముద్రంలో ఉంది. ఈ ఏర్పాటువల్ల కొన్ని తమాషాలు జరుగుతాయి. పరీక్షలు జరిపేటప్పుడు ఆ రేఖకు ఆస్ట్రేలియావైపు నుంచి అమెరికావైపుకు కొద్ది నిమిషాలపాటు ఎగిరే రాకెట్‌ తారీఖు ప్రకారం ఇవాళ బయలుదేరి నిన్న చేరుతుంది. దీనివల్ల నిజమైన కాలవ్యవధికీ మన కాలగణనపద్ధతికీ ఉన్న తేడా తెలుస్తుంది. వీటితో సంబంధం లేకుండా జరిగే కాలాన్ని కొలిచేందుకు ఇతర ప్రక్రియలున్నాయి. భూమి రూపొందినప్పుడున్నవాటిలో యురేనియం వంటి రేడియో ధార్మికత కలిగిన పదార్థాలు కూడా మొదటినుంచీ ఉన్నవే. అది కాలం గడుస్తున్నకొద్దీ ఖచ్చితమైన మొత్తాల్లో తరిగిపోతూనే ఉంది. యురేనియం అణువులు క్షీణించే క్రమంలో అవి చివరికి సీసంగా మారతాయి. యురేనియం గనుల్లో ఈనాడు లభ్యమౌతున్న యురేనియం, సీసం మోతాదుల నిష్పత్తిని బట్టి ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలై ఉంటుందో (అంటే భూమి వయస్సు ఎంతో) శాస్త్రవేత్తలు లెక్కకట్టగలరు. కార్బన్‌ అణువుల్లో రేడియో ధార్మికత ఉన్నవాటికీ, లేనివాటికీ గల నిష్పత్తి ఆధారంగా కొన్ని పురాతన వస్తువుల వయస్సును అంచనా కట్టవచ్చు. అలాగే అనేక శతాబ్దాల కిందట మొలిచిన కొన్ని పెద్ద వృక్షాల బోదెలను అడ్డంగా కోసి చూస్తే వాటిలో ఒకే కేంద్రంతో రూపొందిన అనేక రింగుల నిర్మాణం కనబడుతుంది. చెట్టు ఎదుగుతున్నకొద్దీ దాని బెరడు అంతకంతకూ వ్యాకోచిస్తూ ఉంటుంది. దాన్నిబట్టి చెట్టు వయస్సును తెలుసుకోవచ్చు

కాలమంటే ఏమిటో మనకు ఎవరూ చెప్పనవసరంలేదు. నిత్యజీవితంలో మనకు అనుభవంలోకి వచ్చే కాలాన్ని గురించి శాస్త్రపరంగా నిర్వచించడంలో మాత్రం చాలా చిక్కులున్నాయి. వాటి గురించి ఎన్నో శతాబ్దాలుగా మేధావులు వాదించుకుంటూనే ఉన్నారు. అర్థంలేని వేదాంతం కన్నా ఈ ప్రతిపాదనల గురించి తెలుసుకోవడమే ఆసక్తికరంగా ఉంటుంది.