జీవపరిణామం
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌జీవపరిణామం గురించి ఈ రోజుల్లో చర్చించడం అవసరమా? కేవలం సైన్స్‌ పుస్తకాన్నో, వ్యాసాన్నో చదువుతున్నప్పుడు మాత్రమే ఇలాంటి సిద్ధాంతాల గురించి ఆలోచిస్తూ, తరవాత మరిచిపోవడం జరుగుతుందా? అది నిజమైతే మనం చిన్నప్పుడు చదువుకున్న కొన్ని విషయాలు మళ్ళీ గుర్తు చేసుకోవడం అవసరం.
మనకు ఇప్పుడు ప్రపంచంలో కనబడుతున్న రకరకాల ప్రాణులు మొదటినుంచీ లేవనేది వాటిలో ఒకటి. కుక్కలూ, నక్కలూ, తోడేళ్ళూ ఒక జాతివనీ, పిల్లులూ, చిరతపులులూ, పెద్ద పులులూ, సింహాలూ మరొక జాతికి చెందినవనీ, గుర్రాలూ, గాడిదలూ, జీబ్రాలూ ఒకలాంటివేననీ పిల్లలకు కూడా తెలుసు. గతంలో వీటికి తలొక "పూర్వీకుడూ" ఉండి ఉండాలి. ఇంకా వెనక్కెళితే ఈ "ఆదిమ" శునకానికీ, మార్జాలానికీ, అశ్వానికీ జన్మనిచ్చిన మరేదో మృగం ఉండి ఉంటుంది. ఇంకా ప్రాచీన యుగంలో ఈ క్షీరదాలకీ, తక్కిన చేపలూ, తాబేళ్ళూ, జలచరాలూ, పక్షులూ అన్నిటి ఆవిర్భావానికీ దారితీసిన ప్రాణి ఏదో ఉండే ఉంటుంది. వీటిలో కొన్ని శాకాహారులుగానూ, మరికొన్ని మాంసాహారులుగానూ రూపొందడానికి భౌతిక ప్రేరణలూ, పర్యావరణ పరిస్థితులే కారణాలు అయి ఉంటాయి. ఇన్నిరకాల ప్రాణులు "వాటంతట అవే" ఎలా ఉద్భవిస్తాయని అనుమానం కలగడం సహజమే. అయినా ఎంతటి సృష్టికర్తకైనా ఇన్నిరకాల, సైజుల, రంగుల, మచ్చల, చారల జీవాలని తయారుచేస్తూ కూచోవడం కష్టమే.
ఉదాహరణకు ఆఫ్రికాలో పుట్టుకొచ్చిన మానవజాతి క్రమంగా ఉత్తరదిశగానూ, తక్కిన ప్రాంతాలకీ విస్తరించిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. ఉష్ణోగ్రత దృష్య్టా తొలిమానవులు నల్లని రంగులో ఉండి ఉంటారని అనుకోవచ్చు. ఉత్తరాన ఎండపొడ తక్కువగా పడే ప్రాంతాలకు వెళ్ళినవారి చర్మం తెల్లగా మారక తప్పలేదు. పూర్తిగా నల్లరంగులో ఉన్న ఒక మానవసమూహం తెల్లగా మారిపోవడానికి 20 వేల సంవత్సరాలు సరిపోతాయని అంచనా. తక్కిన జంతువుల సంగతి ఎలా ఉన్నా, ఒక్క మనిషిజాతినే తీసుకుంటే, చర్మం రంగూ, ముఖకవళికలూ అన్నీ కాస్తకాస్తగా మారడానికి జీవపరిణామ ప్రక్రియలే కారణమని రుజువు అవుతోంది. అంచేత జీవపరిణామ సిద్ధాంతాన్ని కాదనేవారు ఈ రోజుల్లో దాదాపుగా ఎవరూ లేరనే అనుకోవచ్చు.
జీవపరిణామం అనేది గురుత్వాకర్షణవంటి "శక్తి" కాదు. అది ప్రాణులను మార్పుల దిశగా "నెట్టుతుందని" అనిపిస్తుంది కాని అటువంటి ప్రత్యక్షమైన ఒత్తిడి ఏమీ ఉండదు. దానికి "నిర్దేశిత గమ్యం" కూడా ఏమీ ఉండదు. జన్యువులలో తనంతట తానుగానో, ఏ కాస్మిక్‌ కిరణాల ప్రభావం వల్లనో జరిగే "లాభకరమైన" మార్పులకు అది సహాయపడుతుంది. అంతే తప్ప అది స్వయంగా జన్యువులను మార్చదు, మార్చలేదు. జీవకణాల విభజన జరిగినప్పుడు డిఎన్‌ఏల కాపీలు తయారవడంలో లోపాలు కలగడం, తప్పులు దొర్లడం వల్ల ఆకస్మిక పరివర్తన (మ్యుటేషన్‌) జరుగుతుంది. అవి అనియతంగా (రేండమ్‌) జరుగుతాయి కనక వాటి ఫలితంగా శరీర లక్షణాల్లో కలిగే మార్పులన్నీ కాకతాళీయమే. జంతువులకూ, పక్షులకూ పుట్టిన పిల్లల్లో కొన్ని పుట్టుకతోనే బలహీనంగా ఉండడం చూస్తాం. ఆ కారణంగా అవి ఎక్కువ కాలం బతకవు. తిండి సంపాదించుకోలేకనో, ఇతర మృగాల వాత పడడం వల్లనో అవి చావగా, బలహీనతను కలిగించే వాటి జన్యువులు త్వరగా అంతరించిపోతాయి. పంటలకు సంబంధించకుండా ప్రకృతిలో పెరిగే మొక్కలూ, ధాన్యమూ, కాయగూరల వంటి వాటిలో గిడసబారినవీ, చేదుగా ఉండేవీ, తినడానికి పనికిరానివీ ఉంటాయి. ఈ ప్రక్రియలో మనిషి జోక్యం కలిగించుకుని, తనకు పనికొచ్చేవాటిని మాత్రమే ఏరుకుని పండించుకుంటాడు. అలాగే పొగరుబోతు గొడ్లనూ, కుక్కలనూ కాకుండా మచ్చికగా ఉండే జంతువులనే పెంచుకుంటాడు. ఇక్కడ గమనించవలసినదేమిటంటే ప్రకృతిలో అన్ని రకాలూ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. జన్యువుల్లో, విస్తృతంగా కాకపోయినా చిన్న చిన్న మార్పులు యాదృచ్ఛికంగా జరుగుతూ ఉండడంవల్ల ప్రాణుల సంతతిలో ఎప్పటికప్పుడు తదనుగుణంగా తేడాలు తలెత్తుతాయి.
ఇలాటి తేడాలు శరీర లక్షణాలలోనే కాదు, ప్రవర్తనలోనూ, అలవాట్లలోనూ, సామర్య్థంలోనూ కూడా మార్పులు కలిగిస్తాయి. సామర్య్థం అంటే కేవలం ఎక్కువ బలమో, వేగమో, పెద్ద శరీరమో ఉండడమో కాకపోవచ్చు. జీవపరిణామం కేవలం మనుగడ కొనసాగించడానికే (సర్వైవల్‌) అని అంటారు. కాని, ఆయుర్దాయం సరిసమానంగా ఉండే ప్రాణుల్లో సైతం సంతానోత్పత్తిని సాధించడంలో తేడాలుండవచ్చు. తన జోడీని ఆకర్షించి, సంపర్కంద్వారా ఎక్కువ సంతానం కలిగిన ప్రాణి యొక్క జన్యువులు మాత్రమే కొనసాగుతాయి. జీవపరిణామం కొన్ని సందర్భాల్లో విపరీతమైన మార్పులు కూడా కలిగిస్తుంది. వీటిలో కొన్ని అత్యాశ్చర్యం కలిగించేట్టుగా ఉంటాయి. నీటి మీద నడిచే పిట్టలూ, నీటి బొట్టును తుపాకీ గుండులాగా కొట్టి కీటకాలను చంపే చేపలూ, ఎన్ని మైళ్ళు ఎగిరినా దారి తప్పకుండా గూటికి చేరే తేనెటీగలూ, ధ్వనిని రేడార్‌లాగా ఉపయోగించే గబ్బిలాలూ మొదలైనవన్నీ జీవపరిణామం వల్లనే తమ "శక్తులను" సాధించాయి.
ఇవేవీ "కావాలని" జరిగిన మార్పులు కావు. ఉదాహరణకు నల్లని మనుషులకు చర్మంలో మెలనిన్‌ అనే పదార్థం తగ్గడంవల్ల తేలిక రంగులో ఒకరో, ఇద్దరో పిల్లలు పుట్టడం అసాధారణం కాదు. మెలనిన్‌ సూర్యకాంతిలోని అల్ర్టావయొలెట్‌ కిరణాలవల్ల చర్మ రక్షణకై ఉత్పత్తి అవుతుంది. ఎండద్వారా అటువంటి ప్రేరణ లభించని పరిస్థితిలో చర్మం నల్లబడదు. నలుపు తగ్గిన సంతతి ఎండ లేని ప్రాంతాల్లో మరింత బాగా మనుగడ సాగించగలగడంతో క్రమంగా వారి సంఖ్య బలపడి కొన్ని వేల తరాల అనంతరం తెల్లవారి జాతి తయారౌతుంది. అలాగే చెట్ల నీడల్లో దాగి ఉండేందుకు అనువైన రీతిలో మచ్చలూ, చారలూ కలిగిన పులులు ఆవిర్భవించాయి. అవి మరింత బాగా వేటాడి తమ సంతతిని వృద్ధి చేసుకోగలిగాయి. సాలెపురుగు అద్భుతంగా గూడు కట్టగలిగినా, పిల్లులకు నిశ్శబ్దంగా నడిచేందుకు అనువైన పాదాలున్నాయన్నా అవన్నీ సహజమైన ఏరివేత కార్యక్రమంలో వాటికి దక్కిన సదుపాయాలే. పరిణామం ఒక దిశలో విజయం పొందాక ఆ ప్రాణి మనుగడకు మరింతగా దోహదపడే శరీరాకృతి ఏర్పడడంలో ఆశ్చర్యం లేదు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. ప్రకృతిలోని వింతలకు కారణాలు పరలోకంలో వెతకనివారికి జీవపరిణామం గురించిన భౌతిక ఆధారాలు ఎన్నో లభిస్తాయనేది మాత్రం నిజం.