దృష్టికి జన్యువుల తోడ్పాటు
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
పరిసరాలను గుర్తించడానికి కళ్ళు పనికొస్తాయి కాని చూపుమీద ఆధారపడడంలో జంతువుల మధ్య తేడాలు కనిపిస్తాయి. కుక్కలు ప్రధానంగా వాసనపైనే ఆధారపడతాయి. ఆకాశంలో ఎగిరే డేగలూ, గద్దలూ, వాటికి ఆహారం కాదగిన ఎలుకలూ, ఉడతలూ ఒకదాన్నొకటి చూపుద్వారానే గుర్తించుకుంటాయి. లోతైన గనుల్లోనూ, గుహల్లోనూ పెరిగి ఎన్నో ఏళ్ళుగా చీకటిలో జీవిస్తున్న బొద్దింకలూ, ఇతర ప్రాణులూ గుడ్డివని పరిశోధకులు గుర్తించారు. వెలుతురే లేని చోట కళ్ళుండి ప్రయోజనం లేదు గనక జీవపరిణామం ఆ దిశగా జరగలేదు. స్పర్శతోనో, తక్కిన ఇంద్రియాలతోనో ఆ ప్రాణులు పని గడుపుకుంటున్నాయి. వెలుతురున్న చోట మాత్రం చూపు అత్యవసరం.
ప్రాణులకు కళ్ళు ఎలా ఏర్పడ్డాయో వివరించడానికి డార్విన్‌ పరిణామవాదం చాలా సమస్యలను ఎదుర్కోవలసివస్తుందని కొందరు శాస్త్రవేత్తలంటారు. నాచురల్‌ సెలెక్షన్‌ ప్రక్రియల్లో తలవని తలంపుగా జరిగే జన్యుపరమైన మార్పులు నేత్రాలవంటి సంక్లిష్టమైన ఇంద్రియాల ఆవిర్భావానికి దారితీయడం కష్టమని వారి అభిప్రాయం. ఈ పరిణామాలు ఎంత నింపాదిగా, కోట్ల సంవత్సరాల పాటు జరిగాయనుకున్నా, కళ్ళలో ఈనాడు కనబడే లెన్స్‌, రెటీనా, కంటిపాప మొదలైన భాగాలు విడివిడిగా రూపొంది, వీక్షణానికి పనికొచ్చే సునిశితమైన పరికరాలుగా తయారవడం ఊహించలేమని వారంటారు. ఎందుకంటే కొన్ని పరిణామదశల్లో కళ్ళు అసంపూర్తిగా ఉండి ఉండాలి. అటువంటివాటివల్ల ప్రాణులకు ఉపయోగమేముంటుంది?
నేత్రాలు జీవపరిణామం ఫలితంగా రూపొందినవి కాకపోతే "సృష్టించబడినవై" ఉండాలి. అది నిజమని అనుకున్నా ఆ సృష్టి చాలా అవకతవకగా జరిగినట్టు అనిపిస్తుంది. ఉదాహరణకు రక్తనాళాలు రెటీనా మీదుగా వ్యాపించి ఉంటాయి. వెనక ఉండవు. అందుచేత వాటి సంఖ్య పెరిగినా, అవి చిట్లినా దృష్టిలోపాలు తప్పక కలుగుతాయి. ఇది నిర్దుష్టమైన సృష్టి అనిపించదు. జీవపరిణామవాదం కళ్ళ విషయంలో నిజమైతే అవి ఏయే దశల ద్వారా అభివృద్ధి చెందాయో ఊహించాలి.
నాచురల్‌ సెలెక్షన్‌ పద్ధతిలో ప్రకృతిసిద్ధంగా జరిగిన ఏరివేత క్రమంలో నేత్రాల స్థానంలో మొదట వెలుతురుకు స్పందించే జీవకణాల పొర ఏదో ఉండి ఉండాలి. రంగు కలిగిన ఈ మచ్చ కాలక్రమాన అద్భుతమైన నేత్రంగా పరిణమించి ఉంటుందని కొందరు శాస్త్రవేత్తల నమ్మకం. ఈ రెండు రకాలకీ మధ్యస్థంగా "గుడ్డిలో మెల్ల" అనిపించే చక్షువుల ఉదాహరణలు వారికి లభించాయి. మొదట కేవలం చీకటి వెలుగుల తేడాలను మాత్రమే గుర్తించగలిగిన జీవాలు తక్కిన "గుడ్డి" ప్రాణులకన్నా బాగా మనగలిగాయి. క్రమంగా జన్యువులలో యాదృచ్ఛికమైన తేడాలు కలగగా కనుగుంటలవంటివి చూడడానికి మరికాస్త తోడ్పడ్డాయి. వీటిలో చిన్న రంధ్రం ఉన్నవాటికి ఇవి పిన్‌ హోల్‌ (సూచీ రంధ్ర) కామెరాలాగా ఉపయోగపడ్డాయి. చిన్నచిన్న మార్పులు కూడా కాస్తకాస్తగా ఉపయోగపడడంతో కళ్ళ స్వరూపం మెరుగుపడుతూవచ్చింది. వెలుతురును పసికట్టే పొర క్రమంగా వెనక్కు వెళ్ళి రెటీనాగా ఏర్పడింది. అది ఇప్పటికీ ఒక రంగు మచ్చవంటిదే. అలాగే కంటికి ముందు ఉండే కటకం, లేక లెన్స్‌ మొదట పారదర్శకమైన రెండు పొరలమధ్య ద్రవంతో నిండినదిగా ఆవిర్భవించింది. ఈ ద్రవం ఎక్కువౌతున్న కొద్దీ కన్ను గోళాకారం సంతరించుకుంది. కళ్ళవంటి అవయవాలు కలిగిన ప్రాణులు తొలిగా 55 కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నట్టు సాక్ష్యాలున్నాయి. ఈ "మచ్చలు" నేత్రాలుగా రూపొందడానికి నాలుగు లక్షల సంవత్సరాలు కూడా పట్టి ఉండదని శాస్త్రజ్ఞుల అంచనా (పటం).
పరిస్థితులను బట్టి కళ్ళ రూపురేఖల్లో మార్పులు జరిగిన దాఖలాలు కూడా కనిపిస్తాయి. వివిధ రకాల ప్రాణుల కంటి స్వరూపంలో పోలికలున్నాయంటే అవన్నీ ఒకే రకమైన జీవపరిణామపు ఒత్తిడికైనా గురి అయి ఉండాలి, లేదా ఒకే కుదుటినుంచి మొదలై వేరుపడినవి అయి ఉండాలి. కాంతికి ఉండే భౌతిక లక్షణాలు నేత్రాల పరిణామాన్ని ఒకే దిశగా నెట్టగలిగినంత నిర్దుష్టమైనవి కనక ఈ మార్పులు ఒకే పద్ధతిలో జరిగి ఉండవచ్చు. ఉదాహరణగా చేపలనూ, స్క్విడ్‌ అనే జాతి మీసాల జలచరాలనీ పోలుస్తారు. రెండిటికీ కామెరావంటి కళ్ళుంటాయి. పారదర్శకమైన కటకాలూ, కాంతిని నాడీ సంకేతాలుగా మార్చగలిగిన ఓప్సిన్‌ అనే జీవరసాయన పదార్థమూ వగైరాలన్నీ ఒకలాంటివే. ఎటొచ్చీ చేపలలో కాంతిని గుర్తించే కణాలు రెటీనాకు వెనకాల ఉండగా స్క్విడ్‌లలో అవి ముందు వైపు ఉంటాయి. దీన్ని బట్టి వీటి కళ్ళ పరిణామం వేరువేరుగా జరిగిందని ఊహించవచ్చు
అలాగే రెండేసి కళ్ళుండడం వెన్నెముకగల ప్రాణుల్లోనూ, నత్తలూ, పీతలవంటి జలచరాల్లోనూ, కీటకాలూ, పురుగులవంటివాటిలోనూ కూడా కనిపిస్తుంది. కాంతిని పోగుచేసుకుని ఫోకస్‌ చేసుకోవడానికి ఉపయోగపడే ఈ పరిణామం ఒకే ఫలితాన్నిచ్చేట్టుగా పైవాటన్నిటిలోనూ వివిధ మార్గాల్లో జరిగి ఉండాలి. ఓప్సిన్‌ యొక్క డీఎన్‌ఏను బట్టి చూస్తే మాత్రం అన్ని జాతుల్లోనూ ఒకేలాంటి మార్పులు జరిగినట్టుగా అనిపిస్తుంది. కాని కళ్ళ స్వరూపాన్ని శాసించే జన్యువు (పాక్స్‌ 6 అనేది) ఇతర విధులను కూడా నిర్వరిస్తుంది కనక ప్రాణుల నేత్రాలు వేటి కవిగానే రూపొంది ఉంటాయని కొందరు పరిశోధకులు ఊహిస్తున్నారు.
ఏది ఎలా ఉన్నా నేత్రాల పనల్లా కాంతి కిరణాలను గుర్తించి వాటిని దృశ్యాలుగా మెదడుకు అందజెయ్యడమే. ఇందుకు తోడ్పడేవి ఓప్సిన్‌, క్రోమొఫోర్‌ అనే పదార్థాలు. ప్రాణుల్లో ఎన్ని వ్యత్యాసా లున్నా ఈ విషయంలో అన్నీ ఒకటే. చూపు అత్యవసరమైనది కనక ఒక్కొక్క జంతువులోనూ రెటీనా, లెన్స్‌ వగైరా భాగాల తయారీకి ప్రాణుల శరీరాల్లో అప్పటికే ఉన్న వివిధ పదార్థాలు ఉపయోగపడ్డాయి. చూపును "ప్రసాదించే" జన్యువు అన్నిటిలోనూ ఒకటే అయినప్పటికీ ఒక్కొక్క రకం జీవరాశిలోనూ ఒక్కొక్క పద్ధతిలో జీవపరిణామవాదానికి లోబడి చక్షువులు రూపొందినట్టు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కొన్నిరకాల ఈగల జన్యువులలో చూపుకు సంబంధించిన మార్పులను వారు పరిశోధించారు. వాటిలో మ్యుటేషన్లు కలిగితే కళ్ళలో లోపాలు ఏర్పడడమో, కళ్ళు పూర్తిగా పోవడమో జరుగుతుంది. ఇది క్షీరదాల్లోనూ, మనుషుల్లోనూ కూడా జరుగుతుంది. ఆ జన్యువుల ఫలితాలు పొరపాటున కలగకూడని స్థలంలో కలిగితే అక్కడ వెలుతురుకు స్పందించే లక్షణం కలుగుతుంది. ఈగలూ, ఎలుకలూ, మనుషులూ అంతా ఒకే కుదుటినుంచి పుట్టినందువల్ల ఒకే రకమైన జన్యువులు అంతటా కనిపిస్తాయి. నేత్రాల ఆవిర్భావాన్నీ, స్వరూపాన్నీ శాసించే జన్యువుల సముదాయాన్ని పరిశోధకులు గుర్తించగలిగారు. ఈ విధంగా అనేక జంతువుల్లో పరిస్థితులనీ, అవసరాలనీ బట్టి రకరకాల మార్గాల్లో, ఒకే రకమైన జన్యువుల సహాయంతో నేత్రావయవాలు రూపొందినట్టు తెలుస్తోంది. ఇందులో సృష్టి అనే భావనకు స్థానం లేదు.