చూసేవి కళ్ళు, చూపేది మెదడు
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌కళ్ళతో చూసే దృశ్యాలను అర్థం చేసుకోవడం చాలా జటిలమైన ప్రక్రియ. మెదడుకు ఇటువంటి అవగాహన నెమ్మదిగా పెరుగుతుంది. మనకు ఇది పసితనం నుంచీ మొదలవుతుంది. పుట్టిన కొన్ని రోజులకల్లా పసిపిల్లలు తల్లి ముఖం కనబడగానే చిరునవ్వులు కురిపిస్తారు. అది చూసిన తల్లి ఆనందానికి అంతు ఉండదు. నిజం చెప్పాలంటే ఆ వయసు శిశువులు దాదాపు ఏది కనిపించినా నవ్వుతారు. అది ఎంత భీకరమైనదైనా సరే. కొన్ని నెలల దాకా ఇలాగే జరుగుతుంది. పిల్లలమీద జరిపిన కొన్ని ప్రయోగాల్లో రకరకాల మాస్క్‌లను వాడారు. వాటిమీద కళ్ళకు బదులు చుక్కలనూ, ముక్కుకూ, నోటికీ గీతలనూ ఉపయోగించారు. వయసు తక్కువగా ఉన్నప్పుడు అవి అస్తవ్యస్తంగా ఉన్నా సరిపోయింది. కొన్ని నెలలు గడిచాక కళ్ళూ, ముక్కూ, నోరూ యథాస్థానంలో ఉండడం తప్పనిసరి అయింది. క్రమంగా బొమ్మలో వాస్తవికత అవసరం పెరిగింది. ఆ తరవాత తల్లికీ, ఇతరులకీ తేడాల గుర్తింపు మొదలయింది.
పుట్టిన వెంటనే మెదడుకు అంతులేనంత సమాచారం ఎడతెగకుండా చేరుతూ గందరగోళం సృష్టిస్తుంది. దాన్ని అవగాహన చేసుకోవడానికి మెదడులో ఎటువంటి ఏర్పాటూ ఉండదు కనక పెద్దవాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా సక్రమమైన పద్ధతిలో పిల్లల విషయంలో జరగదు. చూడడం అనే విద్యను పసితనంలో ప్రతివారూ నేర్చుకోవలసిందే.
పుట్టిన శిశువుకు కళ్ళూ, నాడులూ, దృష్టికి సంబంధించిన తక్కిన వ్యవస్థలూ అన్నీ పూర్తిగా పరిపక్వత చెంది ఉంటాయి. ఎదగవలసిందల్లా మెదడుకు అవగాహన చేసుకునే సామర్య్థమే. కామెరాలాగా పనిచేసే కళ్ళు నిరంతరమూ పరిసరాలను గురించి అందించే సమాచారాన్ని అవగతం చేసుకోవడమూ, దాన్ని జ్ఞానంగా పరివర్తన చెయ్యడమూ వగైరాలు రోజులు గడుస్తున్న కొద్దీ నెమ్మదిగా మెదడు అలవాటు చేసుకుంటుంది. కోతులూ, వానరాలకన్నా మనుషుల్లో ఇది మరింత నింపాదిగా జరుగుతుంది. తక్కిన శరీరభాగాల్లాగా ఈ అవగాహన పుట్టుకతో వచ్చేదికాదు. జీవపరిణామంలో ఇది ఒక ముఖ్యమైన అంశం.
కొన్ని ప్రయోగాల్లో పిల్లికూనల్ని కొన్ని వారాలపాటు పూర్తి చీకటిలో పెంచి, ఆ తరవాత వెలుతురులోకి తెచ్చినప్పటికీ వాటి దృష్టిలో మార్పు కలగలేదు. కానీ ఎన్నో నెలలపాటు వెలుతురు సోకకుండా పెంచిన పిల్లుల మెదడుల్లో విపరీతమైన మార్పులు కనిపించాయి. అంటే ఒక స్థాయికి మించి మెదడుకు దృశ్య సంబంధిత సమాచారం అందడంలో లోపాలు జరిగితే మెదడులో చూపుకూ, అవగాహనకూ దోహదపడే వ్యవస్థ దెబ్బ తింటుందని తెలుస్తోంది.
1930లకు ముందు ఈనాటిలాగా కంటికి కొత్త కార్నియాను ట్రాన్స్‌ప్లాంట్‌ చేసి అమర్చడం తరుచుగా జరిగేది కాదు. జీవితంలో చాలా ఏళ్ళు అంధులుగా గడిపి, వయోజనులైన తరవాత కొత్త కార్నియా వల్ల చూపువచ్చినవారి మీద చాలా పరిశోధనలు చేశారు. వాళ్ళంతా సినిమాల్లోలాగా చూపు రాగానే సంతోషంతో ఎగిరి గంతులెయ్యలేదు సరికదా, అయోమయంతో చాలారోజులు అవస్థపడ్డారు. అంతేకాదు; మొదట్లో దానికి తట్టుకోలేక తమ కళ్ళకు గంతలు కట్టెయ్యమని డాక్టర్లను వారు వేడుకున్నారుకూడా. అతి సామాన్యంగా అనిపించే త్రికోణపు, చతురస్రాకారపు బొమ్మలని గుర్తుపట్టడం కూడా వారికి కష్టంగా అనిపించింది. ఒక్కొక్కదానికీ ఎన్ని మూలలున్నాయో లెక్కపెట్టుకుంటూ అతి నెమ్మదిగా వాటిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు. చూస్తున్నది సవ్యంగానే కనబడుతున్నా అదేమిటో తెలుసుకోవటానికి వారికి ఇబ్బంది కలిగింది. అప్పుడే పుట్టిన పిల్లలకు అవగాహన ఎంత తక్కువగా ఉంటుందో వారి విషయంలోనూ అలాగే జరిగింది. మామూలుగా చూడడానికి వారికి చాలా కాలం పట్టింది.
అయిదు ఇంద్రియాలద్వారా అందుతున్న సమాచారాన్ని జీర్ణించుకుని అర్థవంతమైన అవగాహనను అందించేది మెదడే. దీనికి మెదడు "శిక్షణ" పొందడం చాలా అవసరం. అది జరిగేదాకా అప్పుడే పుట్టిన శిశువులు నిస్సహాయంగా ఉండక తప్పదు. చిన్నతనంలో సాధించిన ఈ "శక్తుల"వల్ల మనకు చూసినదీ, విన్నదీ, అనుభవించేదీ ఆటోమేటిక్‌గా వెంటవెంటనే అర్థమైపోతూ ఉంటుంది. అదొక పెద్ద విషయంగా మనం భావించం. తక్కిన జంతువులకు చాలా విషయాల్లో ఈ ప్రక్రియలన్నీ ఇన్‌స్టింక్ట్‌ల స్థాయిలో జరిగిపోతాయి. వాటి మనుగడకు తగినట్టుగా అవి ఒక్క చూపుమీదనేకాక, వాసనలూ, శబ్దాలను కూడా ఆధారం చేసుకుని ఆహారం సంపాదించుకుంటూ, క్రూరమృగాల వాతపడకుండా కాలం గడిపేస్తాయి. మనలాగా ప్రతిదాన్నీ అర్థంచేసుకుని, వివేచనతో, వివేకంతో, ముందుచూపుతో జీవించవలసిన అవసరం వాటికి ఉండదు. కుక్కలూ, తక్కిన జంతువులమీద పావ్లోవ్‌ వంటివారు జరిపిన ప్రయోగాల్లో వాటికి కండిషన్‌డ్‌ రిఫ్లెక్స్‌ల ద్వారా కొన్ని ప్రేరణలకు అలవాటు చేసినమాట నిజమే కాని అవన్నీ తాత్కాలికంగా "అవసరార్థం" నేర్చుకున్న విద్యలే.
మనిషి మెదడులో ప్రధానంగా మూడు భాగాలుంటాయి. అన్నిటికన్నా పైన కాలీఫ్లవర్‌లాగా అనిపించే పెద్ద మెదడూ, దాని కింద వెనకగా గోళాకారంలో ఉండే చిన్న మెదడూ, పెద్ద మెదడును వెన్నుపాముకు తగిలించే మధ్య మెదడూ ఉంటాయి. పెద్ద మెదడు తెలివికీ, వివేచనకూ మూలం. చిన్న మెదడు శరీరం నిలకడ వగైరాలకు పనికొస్తుంది. మధ్య మెదడులోని మెడుల్లా అనియంత్రిత చర్యలకు దోహదపడుతుంది. దాని పక్కనుండే థాలమస్‌ పెద్ద మెదడుకు నాడీ సంకేతాలను చేరవేస్తుంది. వీటిలో కళ్ళు అందించే సమాచారం కూడా ఉంటుంది. దృష్టికి సంబంధించిన భాగం పెద్ద మెదడు వెనక మెడకు దగ్గరలో ఉంటుంది. అవగాహనకూ, తెలివితేటలకూ, జ్ఞాపకశక్తికీ సహాయపడేది మెదడులోని ముందు భాగం. అందుచేత చూసినదాన్ని గుర్తించి, అర్థం చేసుకుని, సంవత్సరాల దాకా కూడా మరిచిపోకుండా ఉండడానికి ఈ రెండు కేంద్రాలూ అవసరం. మనుషులూ,క్షీరదాలూ నిద్రలో కలలు కంటున్నప్పుడు దృష్టికి సంబంధించిన కేంద్రంలో తీవ్రమైన ప్రక్రియలు జరుగుతాయి. అందుకే మనకు ఏవేవో దృశ్యాలు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది
మనకు కనబడుతున్నవాటిని రెండు కళ్ళూ ఒకేసారిగా చూస్తున్నప్పటికీ వస్తువుల మధ్య ఉన్న దూరాన్నిబట్టి ఎడమ, కుడి కళ్ళు చూసేవాటిలో కొద్దిపాటి తేడా ఉంటుంది. మెదడు వీటిని సమన్వయం చేసుకుని తెరవంటి రెటీనామీద పడిన దృశ్యాలని మూడుకొలతల వాస్తవంగా అవగాహన చేసుకుంటుంది. మనకు ఎదుట వివిధ దూరాలలో ఉన్న వస్తువులు ఎక్కడున్నాయో మనకు సులువుగా తెలుస్తుంది కాని పసిపిల్లలకు ఈ అవగాహన క్రమంగా ఏర్పడుతుంది.
కనబడుతున్నదానికి మన మెదడు కొంత ఊహాశక్తిని జోడిస్తుంది కనకనే అట్టమీదో, గుడ్డ మీదో గొప్ప కళాకారులు నైపుణ్యంతో చిత్రించిన బొమ్మలలోకూడా మనకు "లోతులు" పర్‌స్పెక్టివ్‌ ద్వారా తెలుస్తాయి. ఇవికాక ఎశ్చర్‌ (1898-1972) వంటి కొందరు చిత్రకారులూ, శాస్త్రవేత్తలూ కళ్ళకు భ్రమలు కలిగించే అనేకరకాల బొమ్మలు బుద్ధిపూర్వకంగా గీశారు. ఒకే సైజులో ఉన్నప్పటికీ నల్లని బొమ్మలు తెల్లనివాటికన్నా చిన్నవిగా అనిపిస్తాయి. వెనక కిరణాల్లాగా ప్రసరించే గీతలవంటివి ఉన్నప్పుడు సమాంతరంగా ఉన్న రేఖలు వంగినట్టు అనిపిస్తాయి. కళ్ళు ఎంత నిర్దుష్టంగా పనిచేసినా మెదడు తప్పుగా అవగాహన చేసుకుంటే మనకు అనేక రకాల భ్రమలు కలుగుతాయి. అందుచేత చూడటానికి మెదడే కీలకం.
ఎశ్చర్ చిత్రకళ - జలపాతపు నీరు కిందినుంచి పైకెక్కుతోందా?
ఇదేమిటీ?