చంచల నేత్రాలు
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌నాగరికత తొలి దశల్లో పుస్తకాలూ చదువూ అనేవి ఈనాటి కంప్యూటర్‌ లిటరసీలాగా కొద్దిమందికి మాత్రమే పరిమితమై ఉండేది. అచ్చుయంత్రాలు వచ్చాక "చదువు" అంటే విద్యాభ్యాసం అనే అర్థం ఏర్పడి, అది అందరికీ తప్పనిసరి అయింది. చదువుకున్నవాడు అంటే జ్ఞానవంతుడు అని అర్థం. మనతోబాటు కాస్త ముందు వెనకలుగా ప్రాణికోటిలో ఆవిర్భవించిన తక్కిన జంతువులన్నిటికీ చదువు రాకుండానే గడిచిపోతుందని మనం గుర్తించం. లక్షల సంవత్సరాల నుంచీ కొనసాగుతున్న జీవ పరిణామానికి సంబంధించకుండా, లిపిని సృష్టించుకున్నాక మనుషులు సాధించినదీ పరిణామం. ఈనాడు "అక్షరాభ్యాసం" చేసిన మనం నిమిషానికి 200 నుంచి 1000 పదాలు చదవగలం. ఇలా అక్షరాలు చదువుతున్నప్పుడు కళ్ళు నిరంతరమూ ముందుకీ వెనక్కీ కదులుతూ చంచలంగా ఉంటాయని పరిశోధనల్లో వెల్లడయింది. ఈ కదలికను సకాడ్‌ (saccade) అంటారు.
ఇతర విషయాల్లో జరుగుతున్నట్టు కేవలం దృశ్యాన్ని నమోదు చెయ్యడమే కాక, కళ్ళు అక్షరాల స్వరూపాన్నీ, తక్కిన అక్షరాలతో వాటికి గల సంబంధాన్నీ, వాక్య నిర్మాణాన్నీ, మొత్తం అర్థాన్నీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. అక్షరాల బింబం రెటీనా మధ్యలో పడినప్పుడు మనకు అవి బాగా అవగతం అవుతాయి. దానికి కాస్త అటూఇటూగా ఉన్నవి అంతకన్నా కొంత తక్కువగా అర్థం అవుతాయి కాని అవేమిటో మనం చూచాయగా ఊహించుకోగలుగుతూ ఉంటాం. ఇదంతా అతివేగంగా జరిగిపోతూ ఉంటుంది.
దీన్ని గురించి కంప్యూటర్‌ స్క్రీన్‌మీద జరిపిన కొన్ని ప్రయోగాల్లో వాక్యానికి చివరి పదాన్ని బుద్ధిపూర్వకంగా వదిలిపెట్టి, చదవడానికి ఇచ్చి, ఆ పదమేమిటో సెకండులో పదోవంతు సమయంలో సెలెక్ట్‌ చెయ్యమని చదువరులకు చెప్పారు. ఆ వెంటనే కంప్యూటర్‌ స్క్రీన్‌మీద మరొక క్షణంలో ఆ పదం కనబడేలా చేశారు. అంటే చదువుతున్నవారికి ఆ పదమేమిటో రెటీనా మీద పూర్తిగా ఫోకస్‌ అవని ప్రాంతంలో కనబడనే కనబడింది. ఈ విధంగా "ఔట్‌ ఆఫ్‌ ఫోకస్‌" అనిపించే భాగంలో ఉన్న సమాచారాన్ని కళ్ళు ఎంత వేగంగా పసికట్టగలవో తెలుసుకున్నారు. చదువరికి ఉన్న ఊహాశక్తిని బట్టి చదవబోయేది అస్పష్టంగా కనబడుతున్నా మెదడు దాన్ని సరిగ్గానే తెలుసుకోగలుగుతుంది.
సందర్భాన్నిబట్టి వాక్యం మధ్యలో కావాలని వదిలేసిన ఖాళీలను కూడా చదివేవారు సరిగ్గా ఊహించుకుని నింపుకోగలుగుతూ ఉంటారు. ఏ వాక్యంలోనైనా అర్థాన్ని ఎక్కువగా బోధపరిచే పదాలు కొన్నే ఉంటాయి. మనం ఎక్కువగా గమనించేది వీటినే. తక్కినవి తక్కువ ప్రాముఖ్యత కలిగి, వ్యాకరణదోషాలు రాకుండా చూడడానికీ, వాక్యాన్ని పూర్తిచెయ్యడానికీ మాత్రమే పనికొస్తాయి.సైకాలజీ ఫర్‌ ఎంటర్టెయిన్‌మెంట్‌ అనే తన పుస్తకంలో సోవియట్‌ రచయిత పెరెల్‌మన్‌ అసంపూర్తిగా అచ్చయిన కొన్ని వాక్యాలను ముద్రించాడు. ఆ ఇంగ్లీషు పదాల్లో కొన్ని (పంక్తి పొడవునా) పైభాగం సగమే కనబడతాయి. మరికొన్ని కింది సగం మాత్రమే కనబడతాయి. కాస్త ఇబ్బంది అనిపించినా ఆ వాక్యాలను మనం పూర్తిగా చదివి అర్థం చేసుకోగలుగుతాం. కనబడేవాటిలోని "తప్పులని" మెదడు సరిదిద్దుకోగలదు. ఇదంతా చూస్తే చదవడం అనే ప్రక్రియలో ప్రధానపాత్ర మెదడుదే అని తేలుతుంది. పఠనం అనేది మొత్తంమీద యాంత్రికమైనదీ, నాడీవ్యవస్థకు సంబంధించినదీ అయిన ఒక నిర్దుష్టమైన ప్రక్రియ. అలవాటు వల్ల మనకు ప్రత్యేకం అనిపించదు గాని, పునశ్చరణ పద్ధతిలో సాగే ఈ కార్యక్రమం అక్షరరూపంలో సక్రమంగా పొందుపరిచిన సమాచారాన్ని అవగతం చేసుకోవడంలో విజయాన్ని సాధిస్తుంది.తక్కిన జీవపరిణామ దశలలో ఉన్న వ్యవస్థ పోటీకి తట్టుకోలేని పరిస్థితిలో అంతకన్నా మెరుగైన పద్ధతి అమలులోకి వచ్చి పాతదాన్ని వెనక్కు నెట్టేస్తుంది. చదవడం అనే ప్రక్రియలో అటువంటిదేమీ జరగలేదు.
కనబడుతున్నదాన్ని చిత్రరూపంలో నమోదు చేసే ప్రయత్నంగా లిపి అనేది ఆవిర్భవించింది. ప్రపంచ భాషలన్నీకూడా చిత్రలిపులుగానే మొదలయాయి. చైనా, జపాన్‌ వారి లిపులు రేఖామాత్రంగా గీసిన బొమ్మలలాగే నేటికీ కనిపిస్తాయి. వాటిలో చెట్లూ, అడవులూ, నీరూ వగైరాలన్నీ పదాలకూ, శబ్దాలకూ, అక్షరాలకూ సంకేతాలు. నోటిమాటలుగా, మౌఖికంగా అంతకుముందే ప్రారంభమైన తొలి భాషలకు అక్షరాలు శాశ్వతత్వాన్ని కలిగించే ప్రయత్నం చేశాయి. వాటిని కళ్ళతో చదివి భాషాపరంగా, భావ, అర్థపరంగా తెలుసుకోవడం మానవులు మాత్రమే సాధించిన విజయం. భాషకు సంబంధించిన కొన్ని పరిశోధనల్లో వాటిని చదివేవారి కళ్ళ కదలికను గమనించే ప్రయత్నాలుకూడా జరుగుతున్నాయి. కొన్ని జంతువులు శిక్షణద్వారా అక్షర సంకేతాలను సరిగ్గా అర్థం చేసుకున్నమాట నిజమే కాని అవన్నీ మనుషులు ఏర్పాటు చేసిన వ్యవస్థలే. కోకో అనే చింపాంజీ, కంజీ అనే గొరిల్లాలకు మూగ, చెవిటివారు ఉపయోగించే సంకేతాల, సంజ్ఞల భాషను నేర్పగలిగారు. ఇది వాటి మెదడుకు అలవడిన శిక్షణ. అక్షరాలు చదవగలిగిన నేర్పు వాటికి లేదు.
మనం చదువుతున్నప్పుడు కంటి కదలికలో పాల్గొనే వివిధ కండరాల గురించీ, దృశ్యనాడి ద్వారా ప్రసారమయే సంకేతాల గురించీ చాలా పరిశోధనలు జరిగాయి. ఇదంతా ఎంతో జటిలమైన వ్యవహారం. కనుగుడ్లను కదిలించేవీ, నిలిపి ఉంచేవీ వేరువేరు నాడీకణాలూ, కండరాలూ అవసరాన్ని బట్టి గబగబా పనిచేస్తాయి. చదవడం సరిగ్గా చేతకాని డిస్‌లెక్సిక్‌ పిల్లల లోపాలను కూడా పరిశీలించారు. డిస్‌లెక్సియా ఉన్న పిల్లలకు మామూలు తెలివితేటలూ, దృష్టీ ఉంటాయి. అయినా వారు సరిగ్గా చదవలేరు. వారిలో కొందరు అక్షరాలకు సంబంధించిన శబ్దాలను తెలుసుకోలేరు. మరికొందరికి అక్షరాలు తలకిందులుగా (ఇంగ్లీషులో చిన్న టైప్‌లో బి, డి వంటి జంటలు) కనిపిస్తాయి. కారణం సరిగ్గా తెలియదు కాని వారి నాడీవ్యవస్థలో లోపం ఉన్నట్టు ఊహిస్తున్నారు.
రెటీనా మధ్యభాగంలో కనబడినంత స్పష్టంగా దానికి వెలపల ఉన్న ప్రాంతంలో కనబడదనేది తెలిసినదే. కొన్ని విషజంతువుల కాటు వల్లనూ, కొన్ని మందుల ప్రభావం వల్లనూ పరిధిలోని చూపు మరింతగా తగ్గుతుందని గుర్తించారు. నాడులూ, కండరాలకు సంబంధించిన ఈ సంక్లిష్ట ప్రక్రియలో కండరాల పటుత్వం తగ్గడం ఇందుకు కారణం కావచ్చు. కావాలని దృష్టిని నిలిపి చదవడానికి ప్రయత్నిస్తే స్పష్టంగా గోచరించే పరిధి తగ్గుతుంది. కొందరు తాము చదివే అక్షరాల వెంట తమ వేలును ఆనించి నడుపుతూ ఉంటారు. అలాటివారు చదివే వేగం తక్కువగా ఉంటుంది. అక్షరాలను ఇలా "కూడబలుక్కునే" క్రమంలో మొత్తం పదాన్నో, సరసనున్న ఇతర పదాలనో గుర్తించడం కష్టమౌతుంది. టీవీవంటి మాధ్యమాలు పుస్తకాలు చదివే అలవాటును దెబ్బతీస్తున్న ఈనాటి పరిస్థితుల్లో మనమంతా దృశ్యాలమీదా, ధ్వనులమీదా ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఇటువంటి ఆధునిక నిరక్షరాస్యులకు రాసినది చదివి అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఇది నిశ్చయంగా వెనకడుగే.