చదివే కళ్ళు
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ప్రాణులన్నిటికీ నేత్రాలు చూడటానికి పనికొస్తాయిగాని మనుషులకు కళ్ళవల్ల ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది చదవడం. చదవగలగడం అనేది మనకున్న మిగతా శక్తులకన్నా భిన్నమైనది. తక్కిన శరీరభాగాలన్నీ జీవపరిణామదశలలో ఎప్పుడో ఒకప్పుడు ప్రకృతిపరంగా జరిగే పోటీకి తట్టుకోవడానికై రూపొందినవి. చదవగలగడం అనేది అటువంటిది కాదు. అక్షరాలనూ, లిపినీ చదవడమనేది మనిషి సమాజజీవనానికి అలవాటుపడ్డ కొన్ని వేల సంవత్సరాల తరవాత మొదలైన అలవాటు. ముందు నోటిమాటగా మొదలైన భాష క్రమంగా లిపిబద్ధం కావలసిన అవసరం ఏర్పడింది. నాగరికత మొదలైన చాలా శతాబ్దాల దాకా గ్రంథాలు అపురూపంగానే ఉండేవి. సామూహికంగా ఎన్నో వేల ఏళ్ళపాటు పోగుపడిన జ్ఞానం పుస్తకరూపంలో అవతరించడం అరుదుగా జరిగేది. మత గ్రంథాలైన బైబ్‌ల్‌, గురుగ్రంథ్‌ సాహెబ్‌ వంటివాటిని ఆ కాలంలో పూజనీయంగా భావించారంటే ఆశ్చర్యం లేదు. (అంతకంటే చాలారెట్లు సమాచారాన్ని పొందుపరచగలిగే సీడీరామ్‌లను మనం పూజించం!)
మధ్యయుగాలదాకా పుస్తకాలు మామూలు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. పుస్తక ప్రచురణ యంత్రాలద్వారా మొదలయాక చదువు రావడం అనేది ఆధునికులకు తప్పనిసరి అయింది. జీవపరిణామంలో కాకపోయినా సామాజికపరిణామపు పోటీకి తట్టుకోవడానికి చదువు రాకపోవడం ప్రతిబంధకమే. ప్రతివారూ బళ్ళోకెళ్ళి చదువుకోవాలి. తక్కిన విద్యల్లాగే ఇదికూడా మనిషి చిన్నతనం నుంచీ అభ్యసించాల్సిందే. చదువురానివాళ్ళకూ, ఎదుట ఉన్న లిపి అర్థంకానివాళ్ళకూ అక్షరాలు బాగానే కనిపిస్తాయి. ఎటొచ్చీ మామూలుగా కనబడే దృశ్యాన్ని మామూలు స్థాయిలో అవగాహన చేసుకునే మెదడుకు భాషాజ్ఞానానికి సంబంధించిన మరింత అవగాహన తోడైనప్పుడే చదవడం వీలవుతుంది. ఇది మనకు అలవాటయిన పని కనక ఇది ఎంత జటిలమైనదో చప్పున తెలియదు. ఇందులో కళ్ళు నిర్వహించే పాత్ర కూడా తక్కువేమీ కాదు.
చదవడమనే చర్యలో ఒక క్రమంలో ఉన్న అక్షరాలు గుర్తింపుకు లోనవుతాయి. కళ్ళు వాటిని అదే క్రమంలో వెంబడిస్తాయి. లిపులు ఎక్కువగా ఎడమనుంచి కుడికి రాస్తారు. కొన్ని కుడినుంచి ఎడమకూ, మరికొన్ని నిట్టనిలువుగానూ రాయడం కద్దు. కళ్ళు "కనిపెట్టిన" అక్షర సంకేతాలను మెదడు అర్థం చేసుకుంటుంది. ఇది దృష్టిరహితంగాకూడా జరుగుతుంది. దృష్టిలోపం ఉన్నవారు బ్రెయిల్‌ లిపిని వేళ్ళతో స్పృశించి వేగంగా చదవగలరు. మామూలు బడి చదువులాగే దీనికి కూడా ప్రత్యేక శిక్షణ అవసరం. శిక్షణ ఎటువంటిదైనా ముందుగా అక్షరాలను గుర్తించడం, అవి ఏయే శబ్దాలను సూచిస్తాయో తెలుసుకోవడం, పదాలూ, వాక్యాల నిర్మాణమూ, వ్యాకరణం, భాషయొక్క స్వరూపమూ, సంక్లిష్టతా అన్నీ నెమ్మదిగా నేర్చుకున్నాకనే మనం చదవడం మొదలెడతాం. ఇది జరుగుతున్నప్పుడు కళ్ళూ, మెదడూకూడా శిక్షణ పొందుతాయి. చదివి, అర్థం చేసుకోవడం అతిస్వాభావికం అనిపించడానికి కొంతకాలం పడుతుంది. ఇందులో కళ్ళు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు ప్రయత్నించారు.
ఈ విషయంలో అధ్యయనం మొదలై చాలా కాలమైంది. 1879లోనే పారిస్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనల్లో చదివేటప్పుడు కనుగుడ్ల కదలికలను గమనించారు. కళ్ళు సాఫీగా అక్షరాల మీదుగా ప్రయాణించవు. వేగంగా చదువుతున్నప్పుడు కూడా క్షణకాలంపాటు కాస్త కాస్తగా ఆగుతూ, పంక్తికి ఒక అంచునుంచి రెండో అంచుదాకా సాగి, వెంటనే రెండో పంక్తి మొదటికి చేరుకుంటాయి. ఆసక్తి రేకెత్తించిన ప్రశ్నలు ఎందుకు, ఎంతసేపు, ఎక్కడెక్కడ ఆగుతాయి? కొన్నిసార్లు వెనక్కెందుకు వెళతాయి? విడిగా రాసిన పదాలనూ, అంకెలనూ, పరభాషాపదాలనూ, వ్యక్తుల, స్థలాల పేర్లనూ చదువుతున్నప్పుడు కళ్ళు కాసింత ఎక్కువసేపు ఆగుతాయి. దీన్ని బట్టి కొన్ని విషయాలలో అవగాహనకు మెదడు ఎక్కువ సమయం తీసుకుంటుందని తెలుస్తోంది.
తొలి ప్రయోగాల్లో రెండు అట్టముక్కలతో చదువుతున్న అక్షరాలను కప్పేసి రెంటికీ మధ్య నాలుగు మిల్లిమీటర్ల గవాక్షం వంటిది ఏర్పాటు చేశారు. మరికొన్నిట్లో కంటికి ఈనాటి కాంటాక్ట్‌ లెన్స్‌ లాగా ఒక కప్పును అమర్చి దాని మధ్యలో ఒక రంధ్రం చేశారు. వీటి ద్వారా మొత్తం వాక్యాన్ని కంటికి కనబడనీయకుండా చేసి, కనుగుడ్ల కదలికను పరిశీలించే ప్రయత్నాలు చేశారు. తరవాతి కాలంలో కనుగుడ్ల మీదినుంచి ప్రతిఫలించే కాంతిని మామూలు కెమెరాలూ, సినీ కెమెరాలద్వారా పరిశీలించారు. వీటిలో తేలినదేమిటంటే కళ్ళు స్వల్పకాలంపాటు వెనక్కి కదులుతాయి. చదివే మొదటి పదంమీద కన్నా రెండోదాని మీదో, మూడోదాని మీదో ఎక్కువసేపు నిలుస్తాయి. ఇది ఒక పంక్తిలో 20 నుంచి 70 శాతం పదాలమీద జరుగుతుంది. చదవడమంటే కేవలం పదాలను ఒకటొకటిగా గుర్తించడం కాదు. చదివే ప్రక్రియ త్వరితంగా జరుగుతున్నప్పటికీ అవసరాన్నిబట్టి మన కళ్ళు కొన్ని పదాలు అర్థమయేంత వరకూ కదలవు.
అందరూ ఒకే పద్ధతిలో చదవరు. సందర్భాన్నిబట్టి ఒకే వ్యక్తి చదివే పద్ధతిలోనూ తేడాలుంటాయి. చదివే పద్ధతులను అవసరాన్నిబట్టి మార్చుకోవడం మేలు చెయ్యగలదని శాస్త్రవేత్తలు సూచించారు. ఆధునిక ప్రయోగాల్లో కంటి కదలిక తగ్గినప్పుడు చదివే క్రమంలో ఎంత సమాచారం మెదడుకు అందుతోందో తెలుసుకునే ప్రయత్నాలు జరిగాయి. మన కంటికి కనబడేవన్నీ రెటీనా మధ్యలో బింబం పడే కేంద్రంలోనూ, దాని చుట్టూ ఉన్న ప్రాంతంలోనూ, ఇంకా వెలపలి పరిధిలోనూ ఉంటాయి. మధ్యలోని దృశ్యం పూర్తిగా ఫోకస్‌ అవుతుంది. చదువుతున్నప్పుడు కళ్ళు నిలిచిన క్షణంలో ఈ మూడు చోట్లా లభ్యమయే సమాచారాన్ని మెదడు స్వీకరిస్తుంది. ఈ బింబం మధ్యభాగం సుమారు రెండు డిగ్రీల కోణానికి పరిమితమై ఉంటుంది. అది ఆరు నుంచి ఎనిమిది అక్షరాలకు సమానం. ఇవి పూర్తి అవగాహనకు లోనవుతాయి. కేంద్రానికి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కూడా పరిగణిస్తే మొత్తం 15, 20 అక్షరాలు గోచరిస్తాయి. కానీ ఈ ప్రాంతం అంత స్పష్టంగా అవగతం కాదు.
చిన్న పదాలను కళ్ళు దాటవేస్తాయట. కళ్ళు ఒక్కొక్క పదం మీదా ఎంతసేపు నిలుస్తాయో, ఎన్నిసార్లు వెనక్కెళతాయో అనేది చదువుతూ ఉండగానే వెంటవెంటనే నిర్ణయమైపోతూ ఉంటుంది. రెటీనా కేంద్రానికి వెలపల అస్పష్టంగా నమోదయే సమాచారాన్ని బట్టి ఇది జరుగుతుంది. ఆ సమాచారం వాక్య నిర్మాణంపైనా, పదాలు ఎంతవరకూ అర్థం అవుతున్నాయో అనేదానిపైనా ఆధారపడుతుంది. చదువుతున్నవారికి చదవబోయే పదాలు ఎలాంటివో ముందుగానే ఊహించుకోగలిగినప్పుడు సమాచారం మరింత బాగా అర్థమౌతుందని ప్రయోగాల్లో తేలింది. అటువంటి పరిస్థితిలో ఫోకస్‌లో లేని పదాలు ఊహించినట్టుగానే ఉంటాయి. పదాలు ఎప్పటికప్పుడు కనబడుతున్నా వాటి అర్థం మొత్తంగా వాక్యాన్ని చదవడం పూర్తయేదాకా అవగతం అవకుండా ఆగి ఉంటుంది. కంటికీ, మెదడుకూ ఏర్పడే సమన్వయం ఇదే.