" ఆంధ్రపత్రిక - జనవరి 14, 1956 "
శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు

- శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారి వ్యాసం
ఆంధ్రపత్రిక - జనవరి 14, 1956 లో ప్రచురితమైన ఈ వ్యాసం అందించిన మా నాన్నగారు శివరామ శర్మగారికి వందనాలతో. ఆయన చాలా వాటిని జాగ్రత్త చేసినట్టే, దీనిని కూడా ఫైలు ఫోల్డర్లో పెట్టి జాగ్రత్త చేసారు. కానీ ఆ ఫైలుకు, అందులోని పేపర్ కట్టింగులకు అవసానదశ సమీపించడంతో ఐదారేళ్ళ క్రితం ఆ ఫైలులోనుండి వ్రాసుకోగలిగినంత ఒక పుస్తకంలో వ్రాసుకున్నారు. ఆ పుస్తకం, మొన్నీ మధ్య స్నేహితుడు హైదరాబాదు వెళితే వాడికిచ్చి పంపించారు. అదీ కథా కమామీషు అన్నమాట.

విశ్వనాథ వారి సమగ్ర వ్యక్తిత్వాన్ని అలా ఒక్కసారి కళ్ళకు కట్టినట్టు చూపించారు రుక్మిణీనాథ శాస్త్రిగారు, తన ధోరణికి విభిన్నంగా. అదీ ఇందులోని చమక్కు. చదువుకుని ఆనందించండి. ఆ పుస్తకంలోని ఇతర వ్యాసాలు మళ్ళీ ఎప్పుడన్నా.....దీని కాపీరైటు సంగతి నాకు తెలియదు, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియపర్చండి. వెంటనే తొలగించబడుతుంది.



శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు

- శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి

జయవీరుడిగా నిలబడిన కవియోధుడు బ్రహ్మశ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు. తానుగా వరించి ఏర్పరుచుకున్న కవితాయోగ సమాధినుంచి ఏ ఒక్క క్షణమూ దిగజారని తీవ్రసాధకుడు. తన సాధన ద్వారా కలిగిన సిద్ధిని అనుక్షణమూ పరిశీలించుకుంటూ అనుక్షణమూ సంపన్నుడు అయిన వాడు కాని, మరొకటీ మరొకటీ కాదు. ఈ ఒక్క విషయం చాలు, ఆయన, మహాకవిత్వ దీక్షావిధి నిర్వహణకు. ఈశ్వర సాన్నిధ్యమును, ఏ మార్గాన అయినా చేరుకోవచ్చు. కవిత్వం యోగం వంటిది. అందుకనే, యోగులతో పాటు కవులనూ ఈశ్వర శబ్దంతో కలిపి, కవీశ్వరులు అని వ్యవహరిస్తారు. చిత్తశుద్ధి తోటి దశాబ్దులకు దశాబ్దులు కవితా తపస్సు చేసిన కవీశ్వరులు విశ్వనాథ సత్యనారాయణగారు. ఈ నిష్ట మామూలుగా లభించేది కాదు. కొంచెం పరిశీలించుకుందాం, సత్యనారాయణగారి సమకాల పరిస్థితుల్ని దివాకర్ల తిరుపతిశాస్త్రి గారూ, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారూ కలిసి, తిరుపతి వేంకటేశ్వర కవులు కవితా తపస్సు ప్రారంభించారు. వారు తీవ్ర సాధకులు. తమ సిద్ధిని, తమ శిష్యుల సిద్ధినీ కన్నులారా కాంచిన అదృష్టజాతకులు వీరు. అందులో చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు మఱీని.

" ఇతర కవుల స్థితి "

రాయప్రోలు సుబ్బారావుగారు తరువాత కొత్తమార్గం తొక్కి కంఠం మోగించాడు. ఆచార్య పీఠం అలంకరించాడు. కవిత్వం ద్వారా ఋషిత్వాన్ని అందుకోవాలని చేసిన వీరి తపస్సు, జాతిని ఉత్తేజపరచగలిగింది అంతే.

అబ్బూరి రామకృష్ణరావుగారు, గంభీరమైన హృదయమూ వాణీ కలిగిగూడా, ఒకటి రెండు గ్రంథాలతో, మొహం మొత్తినట్లు అయి ఆగారు.

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు విలక్షణుడై ఆచార్య పీఠం అధిష్టించి కూడా, "భోగమూ బద్ధకమూ ఎక్కువై కృషి తక్కువై" వీలయినంతగా కవితా తపస్సును విస్మరిస్తున్నారు. నాయిని సుబ్బారావుగారి కంఠం ఏనాడో వినపడడం తగ్గించింది. నండూరి సుబ్బారావుగారు అంత సున్నితంగా శృంగారాన్ని పలికించినవారు, వేదుల సత్యనారాయణశాస్త్రిగారి వంటి హృదయ కవి, సంస్కారి, మౌనం వహిస్తున్నారు. ఎంచేతనో. అగాధమై నిండారబారు అఖండగోదావరిలాగు, ఆగోదావరి వరదలాగు వచ్చే కవితా స్రవంతిని, ఒక రాజకీయ పార్టీకి "మెగఫోన్"గా చేసుకుని, కవిత్వపు జలలు ఇగిరిపోతుంటే, తనను తాను అనుకరించుకుంటూ తిట్టుకవిత్వంలోకి దిగాడు శ్రీశ్రీ.

కథలను, సర్వాంగీణంగా తీర్చిదిద్దిన వారైన చింతాదీక్షితులు గారూ, గుడిపాటి వెంకటచలంగారూ కవిత్వం కంటె ఉన్నతమైన ధ్యానాన్ని అందుకుని ఈశ్వరభక్తులు అయినారు.

గొప్ప సంస్కారులూ, మహాపండితులూ అయిన వేలూరి శివరామశాస్త్రిగారు అంతర్ముఖులు అయినారు.

తనతోటి సహయాత్రీకులు, ' బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో ' అన్నట్లుగా జారిపోతున్నా మారిపోతున్నా ముక్తిమార్గంలో నడిపించే కవితా తపోనిష్ఠలో విశ్వనాథ సత్యనారాయణగారు నిలబడగలిగారు అంటే సామాన్యమైన విషయం కాదు.

" కవితాత్మ "

కవిగా నిలబడడం మాటలతోటి పనికాదు. కవితాత్మ మహాజ్వాల. ప్రతిక్షణమూ హృదయాన్ని కాలుస్తూంటుంది. ఆవేడికి నిబ్బరించుకోడం కష్టం. రంగుల నీడలో మాటలో, వెలుగులో ఆమోదంలో, ప్రమోదంలో ఆవేదనలో, ఆలోచనలో అనుక్షణమూ ఉక్కిరిబిక్కిరి చేసి, ఎక్కడున్నామో ఎటుపోతున్నామో అనైనా తెలీనీకుండా వేధిస్తుంది. సౌందర్య సాగరం కెరటాలు ఉక్కిరి బిక్కిరి చేస్తూంటై. ఇంత హాలాహలమూ తానుగా భరించి తన సాధనను యోగివలె మౌనంగాకాక పదిమందిలోనూ కలిసి తిరుగుతూ సుఖదుఃఖాలు ఎక్కువగా తాను కల్పించుకున్నవే అయినా సరే అనుభవిస్తూ కవితా తపస్సు చేస్తాడు నిజమైన కవి.

చూచేది అనుభవించేది సర్వేసర్వత్రా ఈశ్వరుణ్ణి. చెప్పేదీ, వ్రాశేదీ ఈశ్వరుణ్ణి. కాని సర్వాబద్ధాలలో కలిపి సత్యం చెప్పాడు కవి.

నేలలో, గాలిలో, నిప్పులో, నీరులో, ఆకాశంలో, వెన్నెట్లో, చీకట్లో, నక్షత్రాల మినుకుమినుకుల్లో రంగులలో మాటలలో, మాటలతో పాటు చేష్టలలో అసలు హృదయంలో ఉండే సౌందర్యాన్ని చూచి అనుభవించి ఆ అనుభవాగ్నులను తన జాతికి అందించడం అతని ధర్మం. మిగిలిన కథ, పాత్రలు శిల్పం అంతా ప్రమిదవంటిదైతే, ఆ ప్రమిదను ఆశ్రయించుకుని వెలిగే దీపం సౌందర్యం. ఆ దీపంకోసం ఈ ప్రమిదను గూడా గట్టిదిగా చూచుకుంటాం. అంతేగాని, దీపం మాట విస్మరించి ప్రమిదలనే అలంకరిస్తూ కూచోటం సాహిత్యం అంటే సమ్యక్ దృష్టి లేకపోవడమే. సాహిత్యం చదివినవారు అర్హతలో కరుణామయులై, సౌందర్యాన్ని అనుభవించి, సంఘంలోనూ సర్వేశ్వరుని ముందూ యోగ్యులై మెలగాలి. అందుకే కవీశ్వరుని అవసరం జాతికి.

విశ్వనాథ సత్యనారాయణగారు, ఏమీ వొరగబెట్టారూ అంటే? దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి వాక్యాలు ఇవి:

" రాయప్రోలు తొలి కావ్యాలలో మధురంగా వినబడిన పూర్వాంధ్ర గాధలు మరీ గాఢోజ్జ్వలంగా విశ్వనాథ ఆంధ్ర పౌరుషము, ఆంధ్ర ప్రశస్తి మొదలైన కావ్యాలలో ప్రత్యక్షమౌతాయి. ఇతని ధోరణిలోనే కొడాలి సుబ్బారావు తీవ్రావేశంతో హంపీక్షేత్రము వ్రాశాడు. తుమ్మల సీతారామమూర్తి చౌదరి నిర్దుష్టమధురమైన రాష్ట్ర గానము మొదలయిన కావ్యాలలోనూ, ఆంధ్రలో కొన్ని అమితంగా ఆకర్షించిన జాషువా కవి కావ్యాలలోనూ జారిన దేశగౌరవము చక్కదిద్దవలెనన్న ప్రబోధవేగము బాగా స్ఫురిస్తుంది. ఆత్మపరంగా గిరికుమారుని ప్రేమగీతాలు మొదలయిన కావ్యాలు విశ్వనాథ వ్రాశాడు. కిన్నెరసాని పాట, కోకిలమ్మ పెళ్ళి, అనార్కలీ నాటకం లో కొన్ని పద్యాలు ఇవన్నీ ఇతని గేయకావ్యాలు. ఆంధ్ర ప్రశస్తిలో మాధవవర్మ వంటి కధాకావ్యాలు ఉన్నాయి. ఋతుసంహారం వంటి వస్తుపరమైన కావ్యం వ్రాశాడు. ఇప్పుడు రామాయణ కల్పవృక్షం అనే మహాకావ్యం వ్రాస్తున్నాడు. ఇతనిది గాఢ ప్రతిభ. మహాకావ్య ఘట్టొంల్లంఘన పటిష్టమయినది. ఇతనిలో తెలుగుతనం ఎక్కువ. సాహసమూ విజిగీషా అమితం. ఎట్టి వస్తువునైనా కావ్యవస్తువుగా తీసుకుందుకు జంకడు; ఎట్టిమాటనయినా కావ్యభాషలో పొదగడానికి వెనుదీయడు. "

" అవిశ్రాంతి సృష్టి "

కల్పనదీక్ష ఏకాగ్రత దానితో సమృద్ధి - ఈ గుణాలు కలిగి అవిశ్రాంతంగా కావ్యసృష్టి చేయిస్తాడు ఇతను. హైందవ జాతీయోద్యమం ఇతని కావ్యాలలో ఉజ్జ్వలంగా సాక్షాత్కరిస్తుంది. తరతరాల హైందవ విజ్ఞాన సంస్కృతులను నేటి ఆంధ్రలోకంలో పునఃప్రతిష్ట చేయాలనే ప్రయోజన మర్థించి ఇతను కావ్యరచన కావిస్తున్నట్టు కనబడుతుంది " (భారతీ రజతోత్సవ సంచిక)

విశ్వనాథ సత్యనారాయణగారు చేసిన కృషిని గురించి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి మాటలవల్ల తేటతెల్లం అవుతుంది. ఏకవిని గురించి అయినా ఆలోచించేటప్పుడు, వ్యాకరణ దోషాలు ఎన్ని ఉన్నాయి ? యతులు ఎన్నిసార్లు తప్పిపోయినాయి అని చూడడం నాకు చాతకానిపని. పైగా నాదృష్టిలో అవి బహుస్వల్పాలు, అప్రధానాలు. కాళిదాసు అంతవాడు, అవైనేమాంహింకర మష్టమూర్తిః అని వ్రాస్తే భట్టోజీ దీక్షితులు, సిద్ధాంతకౌముదిలో అత్రావైహీతి వృద్ధిరసాధురేవ అని తప్పు పట్టాడు. అభిజ్ఞాన శకుంతలంలోని గాహంతాం మహిషానిపానసలిలం శృంగైర్ముహుఃతాడితం ఛాయాబద్ధా కదంబకం మృగకులం రోమంధమభ్యస్యతాం అనే శ్లోకంలో కావ్య ప్రకాశికాకారుడు మమ్మటభట్టు, ప్రక్రమభంగం దోషం చూపించాడు. ఇవి దోషాలు కావు అనిగాని, కాళిదాసుది తప్పే అనిగాని నేను అనడంలేదు. కాళిదాసు కవితాత్మముందు ఆ సౌందర్యమహారాజ్యాల ముందు యివి ఏపాటివి? వీటిని లెక్కిస్తామా? అనుకుంటాను. అట్లాగే విశ్వనాథ సత్యనారాయణగారు - వైకల్పిక రూపాలు వాడతాడు అనీ, లుప్తోపమల్ని వేస్తాడు అనీ -

నీధమ్మిల్ల జటాగ్ర భాగములపై నీరాజనం బెత్తనీ అని వ్రాశాడు. ధమ్మిల్లం ఏమిటీ ? జటాగ్రభాగం ఏమిటీ ? అని చూచుకుంటూ నాలిక కొరుక్కోడం నాచాతగాని పని. అంతేకాదు. ఎన్ని ఉపమానాలు వాడాడు ? ఎన్ని ఉత్ప్రేక్షలు వాడాడు ? ఎన్ని అర్ధాంతరన్యాసాలు? ఎన్ని కావ్యలింగాలు? ఎన్ని నిదర్శనలు? ఎన్ని ప్రతివస్తూపములు? అని లెక్కించడం గూడా నా తలకు మించిన పనే. స్వర్గీయులు సోదరులు చిలుకూరి నారాయణరావుగారు నేడు వుంటే అట్టి మహామహులు ఇట్టి పనికి తగినవారు.

" ఉన్నత లక్ష్యం "

ఏలక్ష్యంతో, కవితాయాత్ర ప్రారంభించారు ? ఆ లక్ష్యశుద్ధి ఎంతదాకా నిలిచింది? ఆలక్ష్యం ఎంత ఉన్నతం అనే నాయావ అంతా. ఈ అలంకారాలతో, ఎక్కడికి బారచాస్తున్నాడు? ఎంత ఆవరిస్తున్నాడూ? అనే చూచుకోడం నాకు చాతనైన పని. ఏం చెప్పాడు? ఎట్లా చెప్పాడు? అనే నాకు తహతహ. విశ్వనాథ సత్యనారాయణగారికి, జగద్గురు శ్రీ శంకరులందూ, భారతీ సంస్కృతి యందూ, భారతీయ సంస్కృతికి విరుద్ధంగా తెలుగుల సంస్కృతి యందూ పరమ ప్రామాణ్యం. ఆ దృష్టితోనే ఆయన దర్శిస్తాడు. అదే కావ్యరూపేణా సంతరిస్తాడు. అది జాతికి బలం కలిగించేదేగాని, మరోటీ మరోటికాదు.

" మనిషి "

విశ్వనాధ సత్యనారాయణగారు ఖరాఖండీ మనిషి. ఆయన్ను అర్థం చేసుకోడానికి, ఆయన చిన్ననాట జరిగినది, కొడాలి ఆంజనేయులుగారు చెప్పింది ఇక్కడ వ్రాస్తాను.

విశ్వనాథ సత్యనారాయణగారూ, కొడాలి ఆంజనేయులుగారూ జంట కవులు. అంతేకాదు, సత్యనారాయణగారి తండ్రీ, ఆంజనేయులు గారి తండ్రీ స్నేహితులు. సత్యనారాయణగారూ, ఆంజనేయులుగారూ ' సత్యాంజనేయులు ' అనే పేరుతో కవిత్వం వ్రాసారు. ఇద్దరూ సాహితీ సమితి సభ్యులు అయినారుగూడానూ. సత్యనారాయణగారూ ఆంజనేయులుగారూ కలిసి నడిచి ప్రయాణం చేస్తున్నారు. ఇద్దరూ ప్రాణస్నేహితులు. జంటకవులు. మాట్లాడుకోవడంలో శ్రీనాధుడి ప్రసక్తి వచ్చింది.

" శ్రీనాధుడు ఓ గొప్పేమిటి పోదూ " అని అన్నారు సత్యనారాయణగారు.

ఆంజనేయులుగారికి అది నచ్చలేదు. మాటామాటా జరుగుతోంది. శ్రీనాధునివైపు ఆంజనేయులుగారూ, ఆయన చెప్పింది ప్రత్యాఖ్యానం చేస్తూ సత్యనారాయణగారూనూ. కొడాలి ఆంజనేయులుగారికి కోపం వచ్చింది. చాచి, ఫెళ్ళున లెంపకాయ కొట్టారు, సత్యనారాయణగార్ని. సత్యనారాయణగారు అదిరిపోయారు. ఆ దెబ్బకు కంటనీరూ, నిప్పులూ వస్తున్నై. వెంటనే స్థిమితపడ్డారు.

" ఆంజనేయులూ! నువ్వు కాబట్టి సరిపోయింది, బతికి పోయావ్ !! " అన్నారు సత్యనారాయణగారు. ఇద్దరూ మౌనంగానే నడుస్తున్నారు. వాగు అడ్డం వచ్చింది. ఈ ఆంజనేయులుగారు వాగు దాటలేరు. సత్యనారాయణగారు, ఆంజనేయులుగారిని ఎత్తుకుని బిడ్డను అక్కున చేర్చుకున్నట్లుగా, ఆ వాగును దాటారు. అంతే.

స్నేహితులంటే ప్రాణం పెట్టగలిగినవాడు ఆయన. మనుష్యులయందు, మనుష్య హృదయాలమీదా అమోఘమైన విశ్వాసం, సాంప్రదాయికమైన ఆచార వ్యవహారాలమీదా ముఖ్యంగా భారతీయ సంస్కృతి మీద, అచంచలమైన తాత్పర్యం కలవాడాయన. కనుకనే ఎవరు ఏమాత్రం వైదొలగినా, కరవొస్తాడు. కవిగా " నా మాతృభాష నానా దుష్ట భాషల ఔద్ధత్యమును తల నవధరిస్తోందో " అని వాపోతాడు. వాపోయేటట్టు తన పఠితలను చేస్తాడు. తూగరు కన్నెల చుక్క కన్నెలు తొంగి చూడడమూ, వేదకాలపునాటి ముత్తైదువలూ అవీ మనకు చూపిస్తాడు. సత్యనారాయణగారి సృష్టి ఇంద్రజాలంలో నిలిచిపోయి, అదే లోకంగా అవుతాం మనం.

మరొక్క విషయం. ' అనార్కలీ ' అనే సత్యనారాయణగారి నాటికలో ఎప్పుడూ ఈ విషయం నన్ను చకితుణ్ణి చేస్తుంది.

" నాసంతే కృతదృష్టి రవ్యవహిత భ్రూః వ్యాఘ్రచర్మాసనే !
విష్టామర్దిత బాహ్యవస్తు విషయా యాబ్రహ్మ రంధ్రోద్గతా !
తేజోభః భృశ మైందవైః ప్రచలితైః వ్యోమ్నిస్థితే వాంశుభిః !
సర్గస్థిత్యవతా రహేతురవతాత్ శైవార్థ సీమంతినీ "


ఇది అనార్కలీలో నాంది. ఈ నాంది వ్రాయడం ఒక్క విశ్వనాధ సత్యనారాయణకే చాతనైంది. ' అనార్కలీ ' లో సలీమును యోగిగా వ్యాఖ్యానించాడు సత్యనారాయణగారు. అతనిలోని సుకుమార భావములను చిలుకలుగా, కోకిలలుగా, విభావ సామాగ్రిద్వారా చెప్పించాడు. ఇదంతా గొప్ప సృష్టి. ఇదేదీ చాలదన్నట్లుగా ఆ నాంది!

నాయకుణ్ణి ఎప్పుడు యోగిగా తీర్చిదిద్దాడో, అప్పుడే ముక్తికాంత అవసరము కలిగింది. మోక్ష ప్రదాత్రి పార్వతి. కనుకనే తురక నాటకం అనేది ఏ కోశాన లేదు గనకనే శైవార్ధ సీమంతిని రక్షించాలి అని నాంది వ్రాసుకున్నాడు ఆయన. మరో మాటగూడా వ్రాయనిదే ఆగలేను. అనార్కలీలోదే మరో పద్యం.

శైవాంశంబని చెప్పనా ! దశ
దశ శిరస్సంత్రాస చండాకృతిన్,
శ్రీ వాయూద్భవుడందునా
అనిలు శాసించెన్ మహాయోగియై
పోవో కేసరి కోతికూనవన నా
ముక్తేంద్రియభ్రాంతు, నన్నావే
శించిన రామచంద్ర పదపద్మా
ధీన చేతుస్కునిన్


సత్యనారాయణగారు వ్రాస్తున్నది అనార్కలీ. అనార్కలీ నాయకుడు సలీం, జహంగీర్. స్థూలంగా చూస్తే - రసాభాసం, బానిసను చక్రవర్తి కుమారుడు ప్రేమించకూడదు అన్న ఉదాత్త భావం తప్ప మరొకటి కనిపించదు. మిగిలింది అంతా వ్యధాకరమే కథలో. ఇక్కడ కవి ప్రతిభ, విశ్వనాథ సత్యనారాయణగారి అంతర్దృష్టి జన్మలను భేదించుకుని పోయింది.

జ్ఞానుల దయవల్ల కొందరి కొందరి జన్మలు తెలిసినై. నమ్మడం కష్టం కావచ్చు. కాని, ఆ జ్ఞానులు అహంకారాన్ని పడగొట్టి దగ్ధం చేసికున్నవారు. మనకుండే పరిమితులూ, రాగద్వేషాలూ ఏ మాత్రమూ లేనివారు. జ్ఞానుల వాణిని నేను నమ్మాను. నేను నమ్మిందే వ్రాస్తున్నాను.

జహంగీర్ ఎవరో కాదు. మన పురాణాలలోని హనుమంతుడే. అక్బర్ ఎవరో కాదు. రామాయణ నాయకుడు శ్రీరాముడు, విష్ణువే. ఇది తెలిశాక సత్యనారాయణగారి పద్యం ఎంత గొప్పగా వెలుగుతుందో మరి!

" దేశికుడు "

విశ్వనాథ సత్యనారాయణగారు ఉత్తమ దేశికుడుగా రాణకెక్కాడు. అవిష్టుడై ( ఆయనకు ఆవేశం కలగనిదెప్పుడు?) ఆయన పాఠాలు చెప్పుచుండగా ఆయన పాదాల సన్నిధిని కూర్చుని పాఠం చదువుకొన్నవాళ్ళదే అదృష్టం. జన్మజన్మాలకు మరపురాదు.

విశ్వనాథ సత్యనారాయణగారు ఉత్తమోత్తములగు గురువులకు శిష్యుడయినాడు. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారికి, శ్రీ విమలానంద భారతీ స్వాముల [ కె.టి.రామారావుగారు ] వారికి, జగద్గురు శ్రీ కల్యాణానంద భారతీ మాంతాచార్య స్వాములవారికీ విశ్వనాథ సత్యనారాయణ శిష్యుడు. మళ్ళీ గురుమూర్తీ అయినాడు.

భాష, భాషలో సొగసులు, శిల్పం, శిల్పంలో చమత్కారాలు హృదయభాండారంలోని మణులు. ఇలా ఎన్నెన్నో రత్నాలను శిష్యులకు యిచ్చాడు. అసలు ఇంతకూ గురువు చేసేది అంతే. గురువు, మన సొమ్మును మనకు ఇస్తాడు. కాని ఆ ట్రస్టీ ఇవ్వనిదే మన సొమ్మైనా సరే మనకు రాదు. విశ్వనాథ సత్యనారాయణగారు ఉత్తమ గురువుగా శిష్యుల హృదయ నీరాజనాన్ని సర్వధా సర్వధా అనుభవిస్తూనే ఉన్నాడు. కాని చాలదు. గురూత్తముడు కావాలి.

భాషద్వారా ఈశ్వరుని చెప్పేదిమారి, నేరుగా ఈశ్వరునే చెప్పాలి. ఆజానుజ్జ్వల బాహువు, కాషాయరమ్య వల్కల హుతాశన శిఖా సంపిహితాశ్వత్థ సామిధేణి, సత్యనారాయణ భారతి వ్యాఘ్రాజినం మీద కూర్చునేది ఎప్పుడో!

విశ్వనాథ భారతి పాదుకలను కన్నులకు అద్దుకుని -

' భోగమాత్ర సామ్యలింగాచ్చ. అనావృత్తి శ్శబ్దాద నావృత్తిశ్శబ్దాత్ ' అర్త్థం చెప్పించుకుని ప్రస్థానత్రయ శాంతిచేసే అదృష్టం ఎవరికో! ఎవరికో! ఎప్పుడో, ఎప్పుడో!! గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చ్ఛిన్నసంశయాః || ఈ అదృష్టం ఎవరికో, ఎప్పుడో!

" ఒక్క మనవి "

కవిగా, కవీశ్వరుడిగా, పండితుడిగా విశ్వనాథ సత్యనారాయణగారు అమోఘమూ అనితర సాధ్యమూ అయిన పనిచేశారు. ఇంకా చేస్తున్నారు, చేస్తారు. ఆ మహాకవి చెప్పింది చదివి, మమనం చేసి, లాభం పొందడం, ఆనందించడం ఆయనకు నిజమైన గౌరవం. ఆ పండితుడు చేసిన కృషిలో ఏ కొంతైనా చెయ్యడం ఆయన పట్ల గౌరవాన్ని భక్తి ప్రపత్తులనూ చూపించడం, ఆయన్ను మార్గదర్శిగా వరించడం ఆయనకు అఖండమైన సన్మానం. అంతేకాని, ఏ 'కవిమహాధ్యక్ష ' అనో ' సాహిత్య మహాధ్యక్ష ' అనో బిరుదం ఇచ్చి ఆయన్ను మిత్రులూ శత్రులుగా గూడా న్యూనత పరచవద్దని ప్రార్థిస్తున్నాని. ఎందుకంటే ఆయనకు బిరుదేమిటి ? అసందర్భం. రేపు ఆయన పేరే, "విశ్వనాథ సత్యనారాయణ" అన్నదే బిరుదం కాబోతోందీ !! అది అంతే.

www.maganti.org