ఆధునికమానవుడు మామూలుగా పాటిస్తున్న ఆరోగ్య సూత్రాలవల్ల మనిషి సగటు ఆయుర్దాయం అంతకంతకూ పెరుగుతోంది. నూరేళ్ళు పైబడినవారు ఒక్క జపాన్‌లోనే 20 వేలమంది ఉన్నారట. |
ఎటొచ్చీ జీవకణాల స్థాయిలో జరుగుతున్న కొత్త పరిశోధనలు ముసలితనం, చావు వగైరాల రహస్యాలను వెల్లడిస్తున్నాయి. "నొసటి రాత" నొసటిమీద కాక అతిసూక్ష్మ జీవకణాల్లో నిక్షిప్తమై ఉందనడంలో సందేహం లేదు. ఇదంతా ఈనాడు కనబడుతున్న ప్రాణులు ఆవిర్భవించడానికి ఎంతో ముందుగానే జరిగిన వ్యవహారం. ప్రాణుల కన్నా జీవకణాలూ, వాటి నిర్మాణమూ చాలా పురాతనమైనవని గుర్తుంచుకోవాలి. ప్రాణుల శరీరాలన్నీ మిల్లిమీటర్‌లో వెయ్యోవంతు పరిమాణం కలిగిన కణాలతో కూడుకున్నవి. వీటిలో ప్రధానంగా నైట్రొజన్, ఆక్సిజన్, కార్బన్, హైడ్రొజన్ అణువు లుంటాయి. |
జీవకణాల్లోని ముఖ్యభాగం మరింత సూక్ష్మమైన కేంద్రకం, లేక న్యూక్లియస్. మొత్తం కణానికున్నట్టే దీనికీ బయట ఒక పొర ఉంటుంది. దానిగుండా అవసరమైన పదార్థాలు సరఫరా అవుతూంటాయి. ప్రాణి లక్షణాలను మొత్తంగా నిర్వచించే క్రోమొసోమ్‌లు ఈ న్యూక్లియస్ లోపలే ఉంటాయి. క్రోమొసోమ్‌లలో డిఎన్‌ఏ (డి ఆక్సీ రైబో న్యూక్లియిక్ ఆసిడ్) అనే క్షార పదార్థపు కణాలుంటాయి. ఇవి మెలికలు తిరిగిన త్రాటి నిచ్చెనలాగా రెండు ఒకేలాంటి పోగులు కలిసిఉన్న గొలుసులు. అతి పొడవైన ఈ గొలుసుల్లోని భాగాలను జీన్స్ అంటారు. వీటిలో నాలుగే నాలుగు రకాల పదార్థాలు (A అడినీన్, G గ్వానీన్, C సైటొసీన్, T థైమీన్ అనేవి) రకరకాల క్రమంలో వరసగా పేర్చబడి ఉంటాయి. శక్తివంతమైన మైక్రోస్కోప్‌లో తప్ప కనబడని సూక్ష్మస్థాయిలో మన జీవితాలకూ, ఆరోగ్యానికీ, మృత్యువుకూ కారణమైన ప్రక్రియలన్నీ జరుగుతూంటాయని తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. క్రమంగా చావుకు దగ్గరయే ప్రాణుల శరీరాల్లో జన్యువుల పాత్ర ఏమిటో పరిశీలించినప్పుడు కొన్ని జన్యువుల పనల్లా కేవలం టైం బాంబులాగా పనిచేసి చావుకు దారి తీయడమేనని తెలిసింది. |
జీవకణాలు తరుచుగా నాశనమవుతూ, మళ్ళీ కొత్తవి పుట్టుకొస్తూ ఉండడం మామూలే. పునరుత్పత్తికై ఈ చీలిక జరగబోతున్నప్పుడు కణం రెండింతలై కేంద్రకాల్లోని డీఎన్‌ఏ గొలుసులు రెండుగా చీలిపోతాయి. డీఎన్‌ఏలోని క్రోమొసోమ్ పోగు చీలుతుంది. ఈ క్రోమొసోమ్ కొసలను టెలొమీర్ (telomere) అంటారు. క్రోమొసోమ్ కొసలను ఒకదానికొకటి అతుక్కు పోకుండా కాపాడే ఈ టెలొమీర్ అనే డీఎన్‌ఏ అణువులు కొసలకు టోపీలవంటివి. ఇవి లేకపోతే క్రోమొసోమ్‌లకు ప్రత్యేకత ఉండదు. అతుక్కుపోయిన క్రోమొసోమ్‌లు కణవిభజన సమయంలో విడివడలేవు. పెనవేసిన రెండుపేటల దారం అంచులను అతికిఉంచే జిగురు కరిగిపోయినప్పుడు దారాలు వేరయినట్టుగా ఈ మార్పు జరుగుతుంది. అందుచేత టెలొమీర్‌లు లేని జీవకణం సరిగ్గా పనిచెయ్యదు. చీలిక జరిగినప్పుడల్లా ఈ పోగుల తోకలు పొట్టివవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఇలా జరిగాక రానురాను ఈ తోకలు మిగలకుండాపోతాయి. అప్పుడు పునరుత్పత్తి నిలిచిపోతుంది. కొందరు దీన్ని షూలేస్ తాళ్ళకు ఉండే చిన్న ప్లాస్టిక్ టోపీలతో పోల్చారు. అవి ఊడిపోతే లేసుల అంచుల పోగులు బైటపడి అవి పాడయే అవకాశం ఉంటుంది. టెలోమీర్‌ల విషయంలో దాదాపుగా అలాగే జరుగుతుంది. |
యవ్వనంలో ఈ పోగుల కొసల్లో 20 వేల క్షారకణ జంటలున్న జీవకణాలు వయసు పెరిగి రెండుగా చీలినప్పుడల్లా ఈ పోగుల అంచుల్లోని సుమారు వందేసి కణాలు తగ్గుతూంటాయి. క్రమంగా వాటి సంఖ్య 5 వేలకు పడిపోతుంది. అలా వయసుమళ్ళిన కణాలు కొంతకాలం బతుకుతాయిగాని విభజన చెందలేవు. అవి ఆక్సిజన్ ప్రభావంవల్ల పాడవుతాయి. డీఎన్‌ఏ రిపేర్లు సరిగ్గా జరగవు. ధమనులవంటి ముఖ్య శరీరభాగాల్లో జీవకణాలకు ఇటువంటి హాని కలిగితే మరణం తప్పదు. ఎందుకంట• ధమనుల, రక్తనాళాల గోడలు పెళుసెక్కడం వంటివి జరిగినప్పుడు ప్రాణాపాయం ఎక్కువౌతుంది. టెలొమీర్ తోకలు తరిగిపోతున్న కొద్దీ ముసలితనానికీ, శరీరహానికీ అవకాశాలు పెరుగుతాయి. వయసుమళ్ళినవారికి ఈ టెలోమీర్లు పొట్టివవుతున్నప్పుడు మరణించే అవకాశం ఎక్కువగా ఉండవచ్చని ఊహిస్తున్నారు. అది అంటురోగాలవల్ల కావచ్చు, హార్ట్‌అటాక్‌వల్ల కావచ్చు. పుట్టినప్పుడు ఈ టెలోమీర్ల పొడుగు అందరిలోనూ సమానంగా ఉండదట. ఆరోగ్యవంతుల్లో వయసు పైబడినదాకా ఇవి పొట్టివి కావు. దీన్ని 1961లో మొదటగా ప్రతిపాదించినవాడు లియొనార్డ్ హేఫ్లిక్. వివిధ జంతుజాతుల్లో ఆయుప్రమాణం వేరుగా ఉంటుందని ఇతను నిరూపించాడు. కింది బొమ్మల్లో ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ, టెలోమీర్ (T), న్యూక్లియోటైడ్‌లూ (N) చూపబడ్డాయి. టెలోమీర్‌ల నిర్మాణంలో A, C, T, G జన్యువులుంటాయి. |
కణాల ఆత్మహత్యకు దారితీసే ఈ మార్పులు జరగకుండా ఆపగలమా? కణవిభజనకు హేఫ్లిక్ ప్రతిపాదించిన పరిమితి గురించిన తరవాత జరిగిన పరిశోధనల్లో టెలోమరేస్ అనే ఎన్‌జైమ్ ఒకటి ఉన్నట్టు తెలిసింది. ఇది ఉత్పత్తి అవుతే టెలోమీర్ అనబడే కొసలు తరిగిపోవు. మామూలుగా కణాల్లో తోకలు పెరగడానికి పనికొచ్చే ఈ టెలోమరేస్ ఉంటుంది కాని నిద్రాణస్థితిలో ఉంటుంది. ఇది గనక చురుకుగా పనిచేస్తే వార్థక్యం రాకపోవచ్చు. స్త్రీపురుష కణాల సంయోగం జరిగినప్పుడు మాత్రమే ఈ పదార్థం మళ్ళీ తయారై, తోకలు పూర్తి స్థాయికి పెరుగుతాయి. మళ్ళీ కణవిభజన జరుగుతున్నప్పుడు ఇవి క్రమంగా పొట్టివయిపోతూంటాయి. దీన్నిబట్టి చూస్తే సంతానోత్పత్తి ద్వారా జాతిలో వైవిధ్యం కొనసాగడం తప్పనిసరి అనే ఆంక్ష ప్రకృతిలో ఉన్నట్టు కనిపిస్తుంది. పరిసరాల్లో నిరంతరం జరిగే మార్పులకు తట్టుకోవడానికి జన్యువుల స్థాయిలో మార్పులు ప్రకృతి "దృష్య్టా" అత్యవసరం. అందువల్ల ముసలితనం, చావు అనేవి ప్రకృతిపరంగా "విధి విధానం" అనిపిస్తాయి. ఏమైనప్పటికీ అంతకంతకూ తరిగిపోయే ఈ తోకల వ్యవహారం ప్రాణికి ముసలితనానికీ, హానికీ దారితీస్తుందనేది నిజమే. అరుదుగా, శరీరరక్షణకు ఉపయోగపడే తెల్ల రక్తకణాలవంటివి తయారవుతున్న సందర్భాల్లో అప్పుడప్పుడూ టెలోమరేస్ తయారవడం కద్దు. ఎందుకంటే రోగక్రిములను అడ్డుకోగలిగిన తెల్ల రక్తకణాల పునరుత్పత్తికి అవరోధం కలిగితే శరీరం రోగాల పాలవుతుంది. |
460 కోట్ల సంవత్సరాల క్రితం రూపొందిన భూగోళం మీద 300 కోట్ల సంవత్సరాల కిందటే తొలి జీవకణాలు ఆవిర్భవించాయి. వాటి లక్షణాలూ, లోపలి నిర్మాణాలూ ప్రస్తుత రూపాన్ని చేరుకోవడానికి ఊహించరానంత ఎక్కువ సమయం పట్టింది. చుట్టూ ఉన్న పరిస్థితులకు తట్టుకుంటూ తమ మనుగడనీ, సంతానోత్పత్తినీ కొనసాగించడానికి విజయవంతంగా ప్రయత్నించిన ఈ కణాల ఫార్ములాకు తిరుగులేదు. పునరుత్పత్తికి జీవకణాలు ప్రస్తుతపు ఆత్మహత్య పద్ధతిని "ఎన్నుకున్నా యంటే" జీవపరిణామ క్రమంలో తక్కిన పద్ధతులకన్నా ఇదే బలంగా నిలవగలిగిందని ఊహించాలి. ఇది ప్రకృతిసిద్ధంగా "అతీత శక్తుల" ప్రమేయమేమీ లేకుండా జరిగిన పరిణామం. |