కవుల మధ్యనే ఈ పేచీలు
డాక్టర్.ద్వానా శాస్త్రి -"ద్వానాంతరంగం"




వెనుకటికి ఎవరో కవే అన్నాడు
అంతా కవులముగామా?
అంతింతో పద్య సమితి నల్లగలేమా అని
నిజమే. మరో కవి ఇంటింటా కవే అన్నాడు. శ్రీనాథుడు ఓ చాటు పద్యంలో కొండవీటిలో గాడిదను ఉద్దేశించి నువ్వు కవివేనా కొంపదీసి - అన్నాట్ట. కవి అంటే ఒక హోదా. కవిత్వానికి సద్యః స్పందనా వుంది. అందుకే సాహిత్యంలో కవిత్వానికే పెద్ద పీట.
అంతేనా? కవుల మధ్య తగాదాలకీ పెద్ద పీట వేయక తప్పదు. కవుల కలహాలపై పరిశోధన చేసి బృహత్ గ్రంథం రాయవచ్చు.కుకవినింద మనకి ఉండనే ఉంది. కవుల మధ్య పడకపోవటం బాగా ఎక్కువ. అసూయలూ ఆరోపణలూ బోలెడు.శ్రీనాథుడికీ సాటి కవుల నుంచి బాధలు తప్పలేదు. సోమరిపోతులు కొందఱయ్యలౌనని కొనియాడనేర రని కోపం చెందాడు. తనకు జరిగిన తిరస్కారాలను, అనుభవించిన వైషమ్యాలను భరించి రాయంచ ఊరకయుంట లెస్స అని సమాధానం చెప్పుకొన్నాడు. చేమకూర వేంకట కవి ఎంత బాధ పడ్డాడో కానీ - ఏ గతి రచియించిరేని సమకాలపు వారలు మెచ్చరే గదా అని వాపోయాడు.
రాయలకాలంలో కవుల మధ్య తిట్లపురాణాలెన్నో! తెనాలి రామలింగని చాటు పద్యాలలో కావలసినంత! పెద్దనను ఏడిపించాడట. భట్టుమూర్తిని మకారకొమ్ము విషకవి గా అధిక్షేపించడం తెలుసు. కాపు కవిత్వాన్ని ఈసడించడమూ కనిపిస్తుంది. పాత సాహిత్య పత్రికలు తిరగేస్తే అబ్రాహ్మణ కవులెవరు అనే అంశం కనిపిస్తుంది. కవులలో ఎన్ని వర్గాలో...! ప్రతి కవికీ ఒక ముద్ర వుంటుంది లేదా వేయబడుతుంది. సంప్రదాయ కవి, పండిత కవి, పద్య కవి, గేయ కవి, వచన కవి, అభ్యుదయ కవి, విప్లవ కవి, అనుభూతి కవి...ఇలా ఎన్నో
అవధానాలలో కవుల తగాదాలు లెక్కలేనన్ని. తిరుపతి వేంకటకవులకీ చాలామందితో తగాదాలు వచ్చాయి. కొప్పరపు కవులతో మరీను. కోర్టుల వరకూ వెళ్ళారు. ఈ తగాదాలు వైదిక కవులు, నియోగి కవులు అనే గ్రూపుల వరకూ వ్యాపించాయి.
గురజాడ అకవి అని ఒక పేచీ. యుగకర్త ఎవరు? అని మరొక పేచీ. అరసంలో చీలికలు. విరసంలో బహిష్కరణలు. శ్రీశ్రీ తనకి ఇష్టం లేని కవుల్ని నిందించాడు. దిగంబర కవులు సరేసరి -
భావకవుల నపుంసక హావభావాలకు సవాలు
అభ్యుదయ కవీ నల్ల మందు తిని నిద్రపోయావ్
నయాగరా జలపాతంలో దూకలేకపోయిన అన్నయా?
అంటూ ధ్వజమెత్తారు. ఒకసారి పొగుడుతూ మరొకసారి తిడుతూ ఉండటం అనే విశిష్ట లక్షణమూ కవుల్లోనే వుంది. విశ్వ సత్యనాథాయణ అగ్గిమీద గుగ్గిలం అని ఒకసారీ, తెలుగువాళ్ళ గోల్డు నిబ్బు, తెలుగువాడి ఆస్తి అని మరొకసారీ ప్రకటించడం తెలిసిందే. పద్య కవి వేరు. వచన కవి వేరు. ఒకరంటే మరొకరికి ససేమిరా పడదు. బేతవోలు రామబ్రహ్మంగారి ప్యారడీ చూడండీ
అర్ధగంటసేపు అలరింపుమని పిల్వ
గంటసేపు తోమె కవివరుండు
కవుల యందు గూడ కలరోయ్ అకాలీలు
స్త్రీవాదం, దళితవాదాలలో పరస్పరం విమర్శించుకొన్నారు. తిట్టు కవితలూ వెలువడ్డాయి. తాజాగా వర్గీకరణీయం రాసిన కవిని మరో కవి నిందిస్తూ దీర్ఘ కవిత రాశాడు. కవులకి శాపాలున్నాయేమో అన్నంతగా ఈర్ష్యలుంటాయి. తనకి బహుమతి రాలేదని దిగులు చెందితే ఫర్వాలేదు, మరొకరికి వచ్చినందుకు మరీ క్షోభ! ఇంకా ఊరుకోక - ఫలానా వారు నాకు అడ్డు తగిలారు - అని కూడా ప్రకటనలివ్వడం గమనిస్తాం. పూర్వం అయితే కపిత్వం, కపీశ్వరుడు వంటి జోకులు కూడా వేసుకునేవారు. కవుల వాద వివాదాలు సేకరిస్తే మరో వేయిపడగలవుతుంది. చేరా ఒకనాడు కవిత్వం రాసినవారే. శ్రీశ్రీ పై రాసిన చేరా పంక్తుల్ని ఒకసారి గుర్తుచేసుకుందాం
సినిమాల చిట్టడవిలో
చిక్కుకున్న మహాకవీ
జాతి జనులు పాడుకునే
గీతాలకు బదులుగా
మహాదేవికి జోలపాటలు
మధురంగా ఆలపిస్తావా?
మరో ప్రపంచ మహాకవీ
రామభక్త హనుమాన్ ఫేమా?