బిరుదుల వ్యామోహం ఎందుకో?
డాక్టర్.ద్వానా శాస్త్రి -"ద్వానాంతరంగం"




కవిబ్రహ్మ, కవి కౌస్తుభ, కవిరత్న, కవి కోకిల, అభినవ తిక్కన, పరిశోధనా పరమేశ్వర!
....ఇటువంటి బిరుదులు ఆదికవి నుంచి కోకొల్లలు. కవులకీ, కళాకారులకీ, ఈ బిరుదుల సరదా ఎక్కువ. రాజులు కవి పండిత పోషణలో భాగంగా బిరుదు ప్రదానాలు చేసేవారు. జమీందారులూ, సంస్థానాధీశ్వరులూ కూడా దీనిని కొనసాగించారు. ఇంగ్లీషు ప్రభుత్వం కూడా సర్, రావు బహద్దర్ వంటి బిరుదులిచ్చేది. ఈ బిరుదుల్లో చాలా రకాలున్నాయి
  • ఇతరులు ఇచ్చినవి
  • ఇతరులు వ్యాఖ్యానపరంగా పలికినవి
  • సొంతంగా పెట్టుకొన్నవి
  • నిజంగా సార్ధకమయినవి
  • ఆషామాషీగా వచ్చినవి
  • కీర్తికాంక్షకోసం తగిలించుకొన్నవి
  • అధిక్షేపాత్మకమైనవి
బిరుదు అంటే నిఘంటువుల్లో. సామర్థ్య చిహ్నం, శౌర్య చిహ్నం, విజయ చిహ్నం, ప్రతిజ్ఞ, బాధ్యతగలది, పట్టం కట్టడం వంటి అర్ధాలున్నాయి.
  • బిరుదయిన ఎద్దు భూసురనకిచ్చి బిరుదైన అంటే సమర్ధమైన
  • బిరుదులాడు ప్రతిజ్ఞ
  • బిరుదైన కవి గండపెండేరం
  • బిరుదులనైనను పి ఱికివాండ్రనునైన జంపుచో వీరులనైనను
ప్రాచీన కాలంలో ఇలా ప్రారంభమయిన బిరుదుల తంతు కవుల సొంతమైంది. రాజులు ఇచ్చారో, ఇవ్వకపోయినా ఇచ్చినట్లు చెప్పుకొన్నారో గానీ బిరుదు గొప్ప లాంఛనమైంది. ప్రతిభకు మారుపేరయింది. రచనా సామర్థ్యానికి, రచనా విధానానికి చిహ్నమైంది. ఉభయ కవి మిత్రుడు వంటివి సార్థకమయ్యాయి. గౌడ డిండిమభట్టును ఓడించి ప్రతిభను కనబరిస్తే గానీ కవి సార్వభౌమ బిరుదు రాలేదు. కొన్ని బిరుదులు చర్చనీయాంశంగాను, అనౌచిత్యంగానూ ఉంటాయి. ఎఱ్ఱనకి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఎలా వచ్చింది అనే అంశం చర్చనీయాంశమైంది. పండితులు విస్తృతంగా చర్చించారు. ‘ప్రబంధం అనే పదానికి ఎఱ్ఱన కాలంలో అర్థం వేరు. ఏమైనా అంతగా చర్చించవలసిన నేపథ్యం వుంది. జాషువాకి మధుర శ్రీనాథ బిరుదు సార్థకమేనా? శ్రీనాథుని జీవితానికి జాషువా జీవితానికి శ్రీనాథుడి శైలికీ జాషువా శైలికీ సంబంధం వుందా? కందుకూరిని గద్య తిక్కన అనటం ఏమిటి? ఎందులో పోలిక? కందుకూరి గద్యం మనోహరంగా వుంటుందా అంటే చిన్నయసూరి, పానుగంటి వంటివారి గద్యమే గ్రాంథికమైనా మనోహరం. ఇటువంటి బిరుదులు ప్రచారం చేయడం ఎందుకు? పరీక్షలలో ఇస్తారు. ఆంధ్రకవితా పితామహ బిరుదు ఎందుకు వచ్చిందో చెప్పమంటాడు. ఆధునిక కవి కుందుర్తి వచన కవితా పితామహుడు. నిజానికి ఈ బిరుదు శిష్ట్లా ఉమామహేశ్వరరావుకో, పఠాబికో రావాలి. అదేమంటే పితామహ శబ్దానికి తాత అనే అర్థం కాదు శ్రేష్ఠుడు లేదా ప్రచారం చేసిన పెద్దవాడు అనే గిట్టింపులు సిద్ధంగా ఉంటాయి. రామరాజ భూషణుడికి సంగీత కళా రహస్య నిధి అనే బిరుదు సముచితమైనదే. కవిత్వాన్ని సంగీతమయం చేసిన వాడు కాబట్టి. కవి సార్వభౌమ, కవి సమ్రాట్, కవి కోకిల వంటి వారు ఇద్దరు, ముగ్గురుంటారు. ఇంకా విచిత్రం ఏమిటంటే అభినవ తిక్కన, ఆంధ్ర వాల్మీకి, ఆంధ్ర వ్యాస ….వంటి బిరుదులు. తమిళ వాల్మీకి, కన్నడ వ్యాస, బెంగాలీ వాల్మీకి…అని ఉంటారా? ఇవీ సమంజసం కావు. ఇంకొందరికి ఆంధ్రా బెర్నార్డ్ షా, ఆంధ్రా జాన్సన్ అంటూ బిరుదులున్నాయి. చిలకమర్తి వారికి రే చీకటి వుంది. ఆంగ్ల కవి మిల్టన్ కి ఇందులో పోలిక వుంది. కాబట్టి చిలకమర్తిని ఆంధ్రా మిల్టన్ అంటున్నారు. సబబుగా వుందా? మహాత్మునిపై కవిత్వం రాస్తే తుమ్మల సీతారామమూర్తిని మహాత్ముని ఆస్థాన కవి అనెయ్యటమేనా? హేతువాద కవి త్రిపురనేనికి రాజరిక వ్యవస్థని సూచించే కవిరాజు బిరుదా? వ్యావహారిక భాషావాది గిడుగు రామమూర్తికి ఎవరిచ్చారో కానీ అభినవ వాగనుశాసనుడు ట! తాపీ ధర్మారావుగారిని ఆంధ్రకవితా విశారద అంటారెందుకో?
వచన రచయితలకి ఈ బిరుదుల గొడవ తక్కువే. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రికి కథక చక్రవర్తి అనే బిరుదు ఉండటం అప్పట్లో సముచితమే అనిపిస్తుంది. చింతా దీక్షితులుకి కూడా ఈ బిరుదు ఉందని చెప్తూ నోరి నరసింహ శాస్త్రి గారు ఇలా అంటారు చింతా దీక్షితులు ఎవరూ ఇయ్యకుండానే కథక చక్రవర్తి అనే బిరుదు సంపాదించుకున్నారు. అందువల్లనే వారికి కథారచనలో ఉన్న ప్రతిభ వ్యక్తమవుతుంది. సురవరం ప్రతాపరెడ్డి నిజంగా తెలంగాణా వైతాళికుడు.
ఇటీవలి పద్య కవులు, అవధాన కవులు మళ్ళీ బిరుదుల వ్యామోహంలో పడిపోతున్నారు. భారతీపుత్ర, అవధాన రాజహంస, అవధాన శిరోమణి….వంటివి ఎబ్బెట్టుగా వుంటాయి. నాళం కృష్ణారావుకి మధుర కవి వుంది. ఇంకా చాలా మందికి వుంది. వీరి మాధుర్యం ఎవరికీ తెలీదు. పద్యాలు నోట్లో ఉండవు. వేమన, కరుణశ్రీలకి మధుర కవి బిరుదు లేకపోయినా పద్యాలు మధురమయినవే మరి!
ఒక్కొక్కసారి బిరుదులు విరుద్ధంగానూ కనిపిస్తాయి. అందరూ మహాకవులే. అందరూ ప్రజాకవులే. నోరి నరసింహశాస్త్రి, అడవి బాపిరాజు వంటి వారుండగా చారిత్రక నవలా చక్రవర్తి గా పిలిపించుకోవటం సమంజసమా?
దేవులపల్లిని శోకరస గంగాధర అనో బాష్పకవితా నయాగరా అని అధిక్షేపించడంలోనైనా సార్థకత వుంది. శివశంకర శాస్త్రి వల్ల భావ కవితా వ్యాప్తి జరిగింది కాబట్టి భావకవి సంజాయిషీదారు అనే బిరుదు ఇవ్వడమూ సమంజసంగానే వుంది. అంటే వేళాకోళంగా లభించిన బిరుదులే అర్థవంతంగా వున్నాయి. పిచ్చి పిచ్చి బిరుదులవల్ల, పెట్టుడు బిరుదుల వల్ల ప్రయోజనం లేకపోగా అభాసు కావాల్సిందే. చరిత్రలో చోటు దక్కదు. అతిశయోక్తులు, అత్యుక్తులు, వక్రోక్తుల జాబితాలోకి బిరుదులు చేరిపోతున్నాయి. బిరుదులన్నీ ఇంగువ కట్టిన గుడ్డలో, దుర్గంధం మూటకట్టిన గుడ్డలో కావడం విచారకరం. రచనలు, వ్యక్తిత్వాల ముందు బిరుదులు ఎందుకూ పనికిరావు. ఎక్కడో చదివాను ప్రతిభా జీవులకి బిరుదులు అక్కర్లేదు అని.