ఔరా ! అవి అవధానాలా ??
డాక్టర్.ద్వానా శాస్త్రి -"ద్వానాంతరంగం"




అవధాన విద్య ఆంధ్రుల సొత్తు. నిజమే ! ధార, ధారణలకి నిలయం. ఇదీ నిజమే!! పద్య వైభవానికి, ఆశుకవితా విన్యాసానికి నిదర్శనం. అవును. కానీ - ఇదంతా గత వైభవమే ! ఒకనాటి వాస్తవమే.
అసలు అవధానం ఎప్పుడూ ప్రామాణిక కవిత్వంగా భావించబడనే లేదు. అదొక సల్లాపం. ఒక చమత్కారం. రవ్వంత కవిత్వం. అవధానాన్ని ప్రచారం చేసిన తిరుపతి వేంకట కవులు మొదట్లో డబ్బు కోసం చేశారు. ఆరుద్ర అన్నట్టు "యాచన" కోసం చేసిందే. గురువుగారికి తెలిస్తే చదువు చెడిపోతుందని భయపడి చాటుమాటుగా అవధానాలు చేశారు. చివరకు కీర్తి సంపాదించారు. మోజు తీరిన తర్వాత "ఉత్త ప్రగల్భ ప్రదర్శనం"గా భావించి దీనిని "సర్కస్" అన్నారు.

"దొమ్మరిసాని యెంతయును దుడ్కుమెయిన్ గడనెక్కి యాడు సో
ల్కిమతి బల్నికల్ని గడు గీరితికై యవధానముంబొనర్చు...."

అన్నది తిరుపతి వేంకట కవుల కంఠోక్తి. అయినా 'దేవీ భాగవతం', "పాండవోద్యోగ విజయాలు" వంటి రచనలు వీరిని నిలబెట్టాయి.

కందుకూరి వీరేశలింగం కూడా అష్టావధానం చేసినవారే. ఆయన మాటలివి..."ఊరక పామరుల వేడుక కొఱకు దక్క దీనివలనలోకమునకు గాని నాకు గాని నిజమయిన ప్రయోజనము లేదని భావించి....." ప్రయోజనం లేకపోలేదు - తాత్కాలిక ఆనందం. కాసేపు మనసుకి ఆహ్లాదం.

రాయప్రోలు సుబ్బారావు కూడా అవధానాలు చేశారు. చివరకు మొహం మొత్తి
- "జననీ! యేమిటి కింక ఆశుకవితా సన్యాసమిప్పించవే"
"దుర్వ్యసనం బేటికి త్రిప్పుమింక జననీ! రమ్యాక్షరక్షోణికిన్"

అని ఇష్టదేవతను ప్రార్థించారు, అవధానం నుంచి బయటపడాలని. అందులో రమ్యత లేదని చాటి చెప్పారు. బయట పడ్డారు. కాబట్టే కవిగా స్థిరపడ్దారు. యుగకర్తగా భావించబడ్డారు.

ఇంతగా వీళ్ళకి ఇష్టం లేకున్నా, దీనిని ఒక స్థాయి కవిత్వంగా భావించకపోయినా వీళ్ళు అవధానాలు బాగా చేశారు. అవధాన కవిత్వం అంటే ఏమిటో ఒక తరానికి చూపించారు. ఆష్టావధానాలే ఎక్కువ చేశారు. శతావధానాలు తక్కువే. ఏ అవధానం చేసినా చిత్తశుద్ధితో చేశారు. అవధాన విద్యకి పేరు వచ్చేలా చేశారు. దానికొక స్థాయిని కల్పించారు. తిరుపతి వేంకట కవులు, కొప్పరపు సోదర కవులు, రాజశేఖర - వెంకట శేష కవులు, పిశుపాటి చిదంబర శాస్త్రి, వేలూరి శివరామ శాస్త్రి మొదలయినవారు అవధాన విద్యకు వన్నె తెచ్చారు. వీళ్ళంతా అవధానం కోసమే చేశారు. పద్య రచన కోసమే చేశారు. ఆనాటి అవధానాలలో పృచ్చకులు ఎవరంటే....

  • అవధానితో సమానమయిన పాండిత్యం కలవారు
  • కొండొకచో అవధానిని మించినవారు కూడా
  • అవధానిని నిక్కచ్చిగా పరీక్షించేవారు
  • సై అంటే సై అనేవారు.


అటువంటి సందర్భాలలో అవధానం చేయడం కత్తిమీద సాము.ఆషామాషీ వ్యవహారం కాదు. "పస" తెలిసిపోతుంది. ఓటమిని కూడా స్వీకరించేవారు. 'విజయం' సామాన్యమయిన విషయం కాదు. "ఆశలడగి నీ గురువులంతటి వారెదిరింపలేక......" అనటంలోనూ "ఏనుగు నెక్కినాము ధరణీసురులు మ్రొక్కగనిక్కినాము" అని ప్రకటించడంలోనూ వారికి గల ధిషణాశక్తి, ఆత్మస్థైర్యం తెలుస్తుంది. అవధానం చేయటానికి ఆ స్థాయి ఉండాలి. ఆ సత్తా ఉండాలి. అలా 'ఢీ అంటే ఢీ' కొట్టగల పాండిత్యం, సవాలు చేసే శక్తి వుండాలి.

ఇవాళ కూడా అవధానాలు చేస్తున్నారు. బిరుదు మీద బిరుదు తగిలించుకొంటున్నారు. అష్టావధానాలు కాదు - శతావధానాలు, ద్విశతావధానాలు, సహస్రావధానాలు, ద్విసహస్రావధానాలు, పంచసహస్రావధానాలు...ఇలా పోటీ పడి చేస్తున్నారు. "నభూతో నభవిష్యతి"గా చేస్తున్నామంటున్నారు. ఇవ్వన్నీ పూర్వం అవధానాలు చేసిన అష్టావధానాల, శతావధానాల ముందు దిగతుడుపే! వాటి స్థాయి కాదు సరికదా - వాటి దరిదాపులకు వెళ్ళలేని స్థాయి కూడా!

ఇప్పుడు చేసే అవధానాలలో పృచ్చకుల స్థాయి గురించి ఎంత తక్కువగా చెప్పుకొంటే అంత మంచిది. పృచ్చకుల్ని ముందే కుదుర్చుకొంటారు. చందస్సు రాని పృచ్చకులుంటారు. చెప్పే పద్యంలోగల తప్పుల్ని గుర్తించలేనివారుంటారు. ఊరికే చప్పట్లు కొట్టడం, బాగుంది అనడం పృచ్చకుల బాధ్యత. అవధాని చెపుతుంటే సరిగ్గా రాయలేని వారిని నేను చూశాను. అవధానిని పరీక్షించి, నిలదీసి, నిగ్గు తేల్చే పృచ్చకులులేని అవధానం అవధానమా? విద్యార్థులతో, అప్పటికప్పుడు సరదాగా కూర్చొని ఏదో ఒకటి అడుగుదాం అనుకొనేవారితో అవధానమా?

నేటి అవధానాలలో "సభాపతి", "సంధానకర్త", "సమన్వయకర్త", "సభాసంచాలకులు" వంటి పేర్లతో ఒక పాత్ర - ప్రముఖ పాత్రను చూస్తాం. నిజానికి ఈయన అవధానికి సహాయకుడు. ఆపద్బాంధవుడు. సజావుగా సాగుతున్నట్టు 'సీన్" సృష్టించే ప్రతిభావంతుడు. వీరివల్లనే అవధానం విజయవంతం అయిందనిపించే తంతు!

అవధానానికి అతి ముఖ్యమయినది "ధారణ"! పూర్వపు అవధానులకు ఈ గుణం వుండటంవల్లనే అవధానం బలపడింది. అవధానుల "చేవ"కి ధారణాశక్తి నికషోపలం. ఇది నేటి అవధానాలలో మృగ్యం. సమయం లేదన్న సాకు - మొక్కుబడి ప్రహసనం....తప్పించుకోవటం. ఇది మామూలైంది.ఒక్కొక్కసారి ఈ రోజు జరిగినవి రికార్డు చేయించుకుని రాత్రికి మళ్ళీ మళ్ళీ విని - ఎంసెట్ కుర్రాడిలా మననం చేసుకొని చెప్పటమూ వుంది. సభా పర్యవేక్షకుల తోడ్పాటు ఈ విషయంలో కావలసినంత.

అధికారుల, నాయకుల, సంపన్నుల ప్రశంసల కోసం, వారి కనుసన్నల కోసం "గిట్టుబాటు" అవధానాలు చేయడం ఘనకార్యమా? కొందరు అవధానాల ద్వార "కలెక్షన్ కింగ్" లయ్యారు. ఈ తరం వాళ్ళు ఈ అవధానాలు చూసి అవధాన కవిత్వం అంటే ఇదే అనుకునే ప్రమాదం వుంది. 'పబ్లిసిటీ' ఎక్కువ అయింది. అవధానం లోపించింది. నిజమయిన, నిక్కచ్చి అయిన, నికార్సయిన అవధానం తెలుగునాట ఎప్పుడు జరుగుతుందో? స్వయంశక్తిగల, సవాలు చేయగల - కల్తీలేని అవధానులు ఎప్పుడొస్తారో??