కళలన్నీ నిష్ప్రయోజనమయినవి. వ్యర్ధమయినవి...అనేవారు దివాంధాల వంటివారు. మనిషి తనాన్ని తెలుసుకోలేనివారు. మానవ సంబంధాలను పెంచేది, పంచేది కళ. వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేది కళ. అటువంటి లలిత కళలలో కవిత్వం ముఖ్యమయినది. కవిత్వం సాహిత్యంలో ఒక ప్రధానమైన భాగం. సాహిత్య రచన ఒక తపన, ఒక వేదన. సాహిత్య రచన మరికొందరికి బాధ్యత. ఏ కొందరికో మాత్రమే ఫ్యాషన్ లేదా సరదా.
|
|
|
-
తెలుగు వాడు కాదు తెగడకున్న
- తిక్కలేనివాడు తెలుగువాడెటు లౌను
|
|
|
అని నార్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఇది చాలా వరకు వాస్తవం. అందరూ అటువంటివారుండరు.కానీ ఎక్కువమంది అటువంటివారే. మిగతారంగాల కన్న సాహిత్యరంగంలో ఎక్కువమంది తెగిడేవారే! విమర్శించేవారే ! రంధ్రాన్వేషణ చేసేవారే!
|
|
|
ఒక రచన చేయటం మాటలు కాదు. తెలుగులో రాయటమే ఇవాళ విశేషం. కవితలు, కథలు, వ్యాసాలు ఏ రచన చేసినా కొంత శ్రమ పడాల్సిందే! మెదడుకి పని కల్పించనిదే కాగితంపై అక్షరం పెట్టలేం. ఒక కవితా శక్తి, ఒకింత సామాజిక తపన, కాసింత అనుభూతి,మరింత లోకానుశీలన లేనిదే ఏ రచనైనా సాధ్యం కాదు. కాబట్టి సాహిత్యరచన సామాన్యమయిన విషయం కాదు. అసాధారణమయినది. అందరికీ అలవడేది కాదు. లేకపోతే ఇన్ని కోట్ల ఆంధ్రుల్లో వందలాది మంది మాత్రమే రచనలు చేస్తున్నారు గదా! కాబట్టి రచన చేయ్యటం అనేది విశేషమని, అది ప్రతిభతో కూడుకొన్నదని, రచయిత హృదయం, మెదడు విశిష్టంగా వుంటుందనీ తెలుసుకోవాలి. రచన అందరికీ సాధ్యం కాదన్న తెలివిడి ఉండాలి. కొందరు ఎంతో విద్వాంసులు కావచ్చు కాని రాయలేరు. మరికొందరు మహావక్తలు కావచ్చు కానీ రచన చేయలేరు.
|
|
|
రచనలన్నీ ఉత్తమయినవిగా భావించలేం. భావించకూడదు కూడా! అయినా ఉత్తమం లేదా మంచి, చెడు అనేవి సాపేక్షమైనవి. కొందరికి మంచిది అయినది ఇంకొందరికి చెడు కావచ్చు. ఒక భావం అందరికీ నచ్చాలనటమూ సమంజసము కాదు. మనుషులందరూ ఒకే విధంగా ఆలోచిస్తే సమాజం ఎందుకు? జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి సామెత ఉండనే ఉంది. లోకోభిన్నరుచిః అన్నదీ తెలిసిందే. అందరూ ఒకేవిధంగా ఆలోచిస్తే ఇంత జ్ఞానం లభించేనా? ఇంతటి తత్త్వజ్ఞానం అందేనా? ఇంతటి సాంకేతిక సంపద దొరికేనా? ఆందరి భావజాలం ఒకటే అయితే ఇన్ని గ్రంథాలు వచ్చేవా? ఇవాల్టి భావం ఇవాళ నచ్చకపోయినా తరువాతి కాలం వారికైనా నచ్చవచ్చు. అనంతమయిన కాలప్రవాహంలో భావ వైరుధ్యంతో పాటు భావ సారూప్యమూ సహజమే. ఒక రచన సమీక్షించేవాళ్ళకి, ఒక రచనపై అభిప్రాయం తెలియజేసేవాళ్ళకి పైన పేర్కొన్న నేపథ్యం తప్పనిసరి. ఈ అవగాహన కలిగి ఉండాలి.
|
|
|
ఒకే కవి లేదా రచయిత రాసిన పుస్తకాలన్నీ ఉత్తమంగా ఉండాలని లేదు. ఉండవు కూడా. ఏది నిలుస్తుందో, ఏది నిలవదో కాలం గడిస్తే కానీ తెలీదు. సంచలనం కలిగించేవన్నీ ఉత్తమమైనవనీ తేల్చలేం. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వందకి పైగా రాసినా, బొబ్బిలి యుద్ధం మాత్రమే వ్యాప్తికెక్కింది. కాళ్ళకూరి నారాయణరావు మూడు సంఘ సంస్కరణ నాటకాలు రాసినా ప్రజలకి చింతామణి నచ్చింది. డాక్టర్ శ్రీదేవి కాలాతీతవ్యక్తులు అనే ఒకే ఒక నవల ద్వారా ప్రసిద్ధి పొందారు. ఒకే కవి కావ్యంలోని పద్యాలన్నీ కూడా ఓహో అనిపించవు. కొన్నిట్లో వస్తు బలం వుంటే మరి కొన్నిట్లో శైలీ శిల్పం ఉంటుంది. రెండూ వున్నవీ ఉంటాయి. వీటిని గుర్తిస్తూ పరిశీలించవలసి వుంటుంది. శైలీ శిల్పం లేనంత మాత్రాన వస్తు ప్రాధాన్యాన్ని ఈసడించడం లేదా వస్తు ప్రాధాన్యం ఎక్కువైతే శిల్పం లేదనటం కురుచబుద్ధికి నిదర్శనమే.
|
|
|
అందుకే పూర్వలాక్షణికులు రచనని పరిశీలించేవాడు కానీ, సమీక్షించేవాడు కానీ సహృదయుడు కావాలని నొక్కి చెప్పారు. సహృదయుడు అంటే మంచి హృదయం కలవాడని కాదు. రచయిత హృదయాన్ని అర్థం చేసుకునేవాడని అర్థం. ఖవి లేదా రచయిత ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో రాసాడో అర్థం చేసుకుని విమర్శించాలి. రచయిత ఉద్దేశాన్ని పూర్తిగా దుయ్యబట్టడం సహృదయత అనిపించుకోదు.
|
|
|
జాషువా గారి గబ్బిలాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సహృదయత అవసరం. లేకపోతే గబ్బిలం కావ్యంపై వ్యతిరేకత జనిస్తుంది. కొత్త భావాలు చెప్తున్నప్పుడు, కొత్త రచన చేస్తున్నప్పుడు నచ్చకపోవటం, నొచ్చుకోవటం సహజమే. దానిని అతిక్రమించగల స్థాయికి సమీక్షకుడు, పాఠకుడు చేరుకోవాలి. అందుకే జాషువా నాదు కన్నీటి కథ సమన్వయము సేయు,
ఆర్ద్రహృదయంబు గూడ కొంతవసరంబు అన్నాడు
|
|
|