"గ్రామదేవతలు"
డాక్టర్ ఎస్.పద్మనాభ రెడ్డిగ్రామదేవతల పుట్టుక వ్యాప్తి-సామాజిక, సాహిత్య నేపధ్యం
గ్రామదేవత పుట్టుక, వ్యాప్తి:-
మనదేశంలో మాతృదేవతా స్వరూపాలైన గ్రామదేవతలు గ్రామాలలో స్థిరపడి, వారు నిర్వహించే విధులననుసరించి విభిన్న పేర్లతో చలామణి అవుతున్నారు. గ్రామదేవతల్లో స్త్రీ దేవతలే గాక పురుష దేవతలు కూడా వున్నారు. వీరితో పాటు వృక్ష , జంతు సంబంధమైన దేవతలు కూడ పూజింపబడుచున్నారు. అయితే జానపదులు స్ర్తీ దేవతకు ఇచ్చినంత ప్రాముఖ్యత పురుష గ్రామదేవతలకు యివ్వలేదు. గ్రామీణుల దృష్టిలో మాతృదేవత అందరికంటే అధికురాలు, గ్రామీణులచే శక్తి దేవతగా పూజింపబడుతున్న మతృ దేవత అంబిక, భద్రకాళి, చాముండి, కాళి, కామాక్షి, కన్యాకుమారి, మహేశ్వరి అనబడు పేర్లతో భారతదేశమంతటా పూజింపబడుతోంది. గ్రామదేవతలు దేశమంతట విస్తరించి వుండటంవల్ల రాయలసీమ జిల్లాల గ్రామదేవతలను గురించి తెలుసుకునే ముందు దక్షిణ భారతదేశంలోని కొందరు గ్రామదేవతల గురించి తెలుసుకొందాం.
దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో గ్రామదేవతలు యెక్కువగా కనిపిస్తారు. చిత్తూరు జిల్లా సరిహద్దు రష్ట్రమైన తమిళనాడులో గ్రామదేవతల ఆరాధనా పద్దతులకు, చిత్తూరు జిల్లా ఆరాధనా పద్దతులకు కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తాయి. తమిళనాడులో గ్రామదేవతారాధనపై శిష్ఠ దేవతల ఆరాధనా పద్దతుల ప్రభావం యెక్కువ. దేవతలకు అభిషేకం చేయడం, ఉత్సవాలు జరిగేటప్పుడు విగ్రహాలను వూరేగించడం లాంటి పద్దతుల్లో శిష్ఠ దేవతారాధన స్పష్టంగా కనిపిస్తుంది. చిత్తూరు జిల్లాలో ఈ విధమైన పద్దతులు అక్కడక్కడా కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో పోతురాజు అని పిలవబడుతున్న గ్రామదేవతను తమిళనాడులో అయ్యనార్ అని అంటారు.

తమిళనాడులో అయ్యనార్ ప్రత్యేక పురుష గ్రామదేవత. ఈయనకు ప్రత్యేకమైన గుళ్ళు కూడా ఉన్నాయి. అయితే యీయనకు బలులు యెక్కువగా యివ్వరు. ఈయన గుడిముందు యెవరైన బలులిస్తే వాటిని అయ్యనార్ యిరువైపుల నున్న వీరులకు యిస్తాడు. వీరులు అయ్యనార్ రక్షక దేవతలు. కాని ఆంధ్రప్రదేశ్ లో కొన్నిచోట్ల పోతురాజుకు ప్రత్యేకమైన గుళ్ళువున్నా, యీయన పరిచరికుడు మాత్రమే. కంచి కామాక్షి, మధుర మీనాక్షి దేవతారాధనలో నేడు శిష్ఠ దేవతా సంప్రదాయ పూజా పద్దతులు చోటు చేసుకున్నాయి. తమిళనాడులో గ్రామదేవతల గుళ్ళు శిష్ఠదేవతల గుళ్ళతో సరితూగుతున్నాయి. ఇక్కడి శక్తి దేవతలను శిష్ఠ దేవతలతో సరిసమానంగా పూజిస్తారు.

కర్ణాటక రాష్ట్రంలో చిత్తూరు, అనంతపూర్ జిల్లాలలో పూజింపబడే కొందరు గ్రామదేవతలను పూజిస్తారు.. గంగమ్మ, మారమ్మ, పోతురాజు, ద్రౌపది లాంటి గ్రామ దేవతలను కొలుస్తారు. శివమొగ్గ జిల్లా సొరబ తాలూక చంద్ర గుత్తి అనే గ్రామం వద్ద రేణుకాంబ అనే గ్రామదేవతకు నగ్న సేవ కూడా చేస్తారు. బెల్గాం జిల్లా సదత్తి వద్ద గల యెల్లామ్మ దేవతను యితర రాష్ట్ర ప్రజలు కూడా పూజిస్తారు. ఈ ప్రాంతంలో గల హరిజన స్త్రీలు తమ తాళితో పాటు చెక్కతో తయారు చేయబడిన యల్లమ్మ పాదాలను ధరిస్తారు. ఇంకా వూరిమారమ్మ, గాలిమారమ్మ అనబడే దేవతలను కూడా పూజిస్తారు. బంగారు గనులున్న కోలారు పట్టణం కోలారమ్మ అనే గ్రామదేవత పేరు మీదుగా వెలసింది. కోలార్ జిల్లాలో ద్రౌపది, సప్తకన్యకలు, పోతురాజు అనే గ్రామదేవతలు కూడా పూజింపబడుతున్నారు. బెంగుళురులో అణ్ణమా, పటాలమ్మ అనే గ్రామదేవతలను కూడా పూజిస్తారు. ఇక్కడ నిత్య పూజలు వుంటాయి. వీరిద్దరు అక్కచెల్లెండ్రని యిక్కడి జానపదుల విశ్వాసం. ద్రౌపది పేరుమీదుగా యేడాది కొకసారి జరిగే గరగ ఉత్సవం చాలా ప్రసిద్ది చెందింది.