"గ్రామదేవతలు"
డాక్టర్ ఎస్.పద్మనాభ రెడ్డి




హైదరాబాదు నాంపల్లిలోని కమీషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్లో తెలుగు రీడర్ గా పనిచేస్తున్న శ్రీ ఎస్.పద్మనాభ రెడ్డి గారు తన వ్యాసాలు మీతో పంచుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వారికి సహస్ర ధన్యవాదాలు. ఎం.యే, ఎం.ఫిల్. పి.హెచ్ డి చేసిన డాక్టర్ పద్మనాభ రెడ్డి గారు 2003 సంవత్సరానికి మన రాష్ట్ర అత్యుత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు. డాక్టర్ పద్మనాభ రెడ్డి గారు తన 26 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఎందరో విద్యార్థులకి విద్యాదానం చేసారు. ఒక పక్క ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తూనే, గత 16 సంవత్సరాలుగా వివిధ పరిశోధనాంశాల మీద దృష్టి నిలిపి డాక్టరేట్ పట్టా పొందిన వీరికి శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీ ఇంకొక డాక్టరేట్ ప్రదానం చేసే దిశగా ఉంది. ఎన్నో ప్రముఖ పత్రికలలో వీరి వ్యాసాలు ప్రచురించబడినాయి. 60 కి పైగా రేడియో ప్రసంగాలు చేసిన ఘనత వీరి సొంతం. మన భాషకి, మన రాష్ట్రానికి తన వంతుగా చేయవలసినది ఇంకా ఎంతో ఉన్నది అని ఎంతో వినమ్రంగా చెప్పే ఆయన ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని కోరుకుంటున్నాను. ప్రథమంగా వీరి "గ్రామదేవతలు" వ్యాసాన్ని చదివి ఆనందించమని విన్నపం.
గ్రామదేవతల పూజా విధానాలు- పద్ధతులు
గ్రామదేవతల పూజా విధానాలు:-
గ్రామదేవతల పూజావిధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సంప్రదాయం. మానవుడు నిత్య జీవితంలో యెన్నో జయాపజయాల్ని చవి చూస్తున్నాడు. మరో వైపు తన లక్ష్య సాధనకోసం యెన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్ఠికి మూల కారకురాలు మాతృదేవత అని గ్రహించిన పురాతన మానవుడు, ఆమెను సంతృప్తి పరచేటందుకు యెన్నో మార్గాలను ఆశ్రయించాడు. అందులో ప్రార్థన, మంత్రతాంత్రికతలు, పవిత్రీకరణ, ఆత్మహింస , బలి అనేవి ప్రధానంగా కనిపిస్తాయి.
ప్రార్థన:-
అతీత శక్తుల్ని లొంగదీసుకోవడానికి, వాటినుండి ప్రయోజనం పొందడానికి పురాతన మానవుడు చేసిన మొదటి ప్రయత్నం ప్రార్థన.ఇది రెండు రకాలు 1. సాంఘిక ప్రయోజనం కోసం చేసే ప్రార్థన. 2. వ్యక్తిగత ప్రయోజనాలకోసం చేసే ప్రార్థన. సంఘంలో ఆనాడు మానవున్ని ప్రకృతి భీభత్సం , దుష్టశక్తుల నుండి భయం పట్టి పీడిస్తూ ఉండేది. వీటినుండి తమను తమ చుట్టూ వున్న వారిని రక్షించవలసిందిగా గ్రామదేవతల్ని ప్రార్థించాడు. ఈ విధమైన ప్రార్థన సాంఘిక ప్రయోజనాలకోసం చేసే ప్రార్థనగా చెప్పవచ్చు. తాను క్షేమంగా వుండాలని, అందరి కంటే సమాజంలో గుర్తింపు పొందాలని చేసే ప్రార్థనను వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసే అభ్యర్థనగా చెప్పవచ్చు. ఈ విధమైన ప్రార్థనా స్వరూపాన్ని, కోర్కెల రూపంలో అతీత శక్తులకు విన్నవించే వాడు. కృతఙ్ఞతగా కానుకలు సమర్పించేవాడు. ఇక్కడ దైవానికి, మధ్య పూజారి వుండేవాడు. కాలక్రమంలో మంత్ర, తంత్ర శాస్త్రాలు అభివృద్ది చెందిన తర్వాత దుష్ఠశక్తులకు దేవతా స్వరూపాన్ని కల్పించారు. ఫలితంగా దేవతల పూజా విధానంలో ఆచారాలు, పద్దతులు యేర్పడ్డాయి. తర్వాత పూజారి దేవునికి, భక్తునికి మధ్య వారధిగా నిలిచాడు.
మంత్రచర్య- తాత్వికత:-
అతీత శక్తులను లొంగదీసుకోవడానికి, మనవాతీత కార్యాలను సులభంగా సాధించడానికి, నియమిత శబ్ధాలను నిర్ధిష్ఠ పద్ధతిలో ఉచ్చరించడం అని చెప్పవచ్చు. అంతేకాకుండా దుష్ఠ శక్తులతో సంబంధం పెట్టుకునేందుకు ఇది ఒక సాధనగా పేర్కొనవచ్చు.తంత్రం అనగా అతీత శక్తులు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులద్వారా తన వశం చేసుకోవాలని చేస్తున్న ప్రయత్నమే. కావున కొన్ని ప్రత్యేక శబ్ధాలను నిర్ధిష్ఠమైన పద్దతిలో ఉచ్చరించడం వల్ల మంత్రం అవుతుందని ప్రాచీన మానవుడు నమ్మాడు. అయితే ఆ మంత్రానికి అతీత శక్తి వుందని భావించి వాటి ద్వారా అతీత శక్తులను లొంగదీసుకొని తన లక్ష్యాన్ని చేరుకోవాలని చేస్తున్న ప్రయత్నమే ఈ మంత్ర తాంత్రికతలు..
పవిత్రీకరణ:-
నిప్పుల మీద నదవడం, నీటితో, రక్తంతో శుభ్రం చేయడాన్ని పవిత్రీకరణ చర్యలుగా చెప్పవచ్చు. పురామానవుడు అతీతశక్తులను పూజించడం మొదలు పెట్టిన తర్వాత, ఆ శక్తులు వుండే స్థలాన్ని అతి పవిత్రంగా భావించేవాడు. అందుకే దేవాలయాలలో పవిత్రంగా భావించబడే ధ్వజస్తంభాలు ప్రారంభంలోనే దర్శనమిస్తాయి.. అలాగే గ్రామదేవతల ముందు పవిత్రతను సూచించే సంకేతంగా శూలాలు కనిపిస్తాయి. ఈ విధంగా పవిత్రీకరణ చర్య మానవునిలో అంకురితమై, పవిత్రమైన స్థలానికి వెళ్ళే ముందు భౌతికనగా, మానసికంగా, పవిత్రంగా వుండాలని ఆరాటపడతాడు. అందుకోసం నిప్పులు తొక్కడం అతడు ఆచరించిన మొదటి చర్యగా భావించవచ్చు. ఈ విధంగా వ్యాప్తిలోకి వచ్చిన ఈ ప్రక్రియ గ్రామీణులలో నేటికి కనిపిస్తుంది.
ఆత్మహింస:-
దైవానుగ్రహాన్ని పొందటానికి భక్తుడు తనను తాను హింసించుకోవడమే ఆత్మహింస. గ్రామదేవత ముందు కాళ్ళు చేతులు నరుక్కోవడం, దవడళ్ళో శూలాలు దించుకోవడం, నాలుకలో శూలాలు గుచ్చుకోవడం, కళ్ళను అర్పించడం లాంటివి కనిపిస్తాయి. గంగజాతర సందర్భంగా దవడల్లో, నాలుకల్లో శూలాల్ని గుచ్చుకోవడం కనిపిస్తుంది. ప్రస్తుతం సప్రాలు యెత్తుకోవడం, శరీరమంతా నిమ్మకాయలు గుచ్చుకోవడం, తలమీద టెంకాయలు కొట్టుకోవడం మొదలైన ఆత్మహింసా పద్ధతులు కనిపిస్తాయి. సిడియెత్తడం అనే ఆత్మ హింసా ప్రక్రియ పూర్వకాలంలో మిక్కిలి వ్యాప్తిలో ఉన్నా, ఈ మధ్య అక్కడక్కడ అరుదుగా కనిపిస్తోంది.
బలి:-
బలి అంటే ఆహుతి ఇవ్వడం అని అర్థం. భూతాలకు, కృతఙ్ఞతా రూపంలో కానుకలు ఇవ్వడం బలి. ఈ కానుకలు ధూపం, పుష్పం, మద్యం, ప్రాణి లేక మానవరూపంలో ఉండవచ్చు. పురామానవుడు శక్తి దేవతల నుండి సహాయం పొందేందుకు వారి క్రూరస్వభావం నుండి తనను తాను రక్షించుకోనేందుకు సమర్పించే కానుకే బలి. ఈ బలి జంతురూపంలో కాని, మనుష్య రూపంలో కాని, వస్తు రూపంలో కాని సమర్పించబడుతుంది. బలి సామాజిక శ్రేయస్సు, సామూహిక శ్రేయస్సు, కుటుంబ శ్రేయస్సు అని మూడు విధాలు. ఒక ఊరి అందరి శ్రేయస్సును దృష్ఠిలో ఉంచుకొని ఇచ్చే బలిని సామాజిక బలి అంటారు. ఊరివారందరు చందాలు వేసుకొని బలి ఇస్తారు. ఇది ఊరి వారందరి తరఫున బలి ఇవ్వబడుతుంది. ఈ బలి వలన వచ్చే శ్రేయస్సు గ్రామస్తులందరికి వర్తిస్తుంది.సామూహిక శ్రేయస్సు అంటే వూరిలోని కొన్ని కుటుంబాలు లేక ఒక వృత్తి జీవనాధారంగా కలిగిన వారి గుంపు ఇచ్చే బలి సామూహిక బలి అవుతుంది. ఉదా:- మడేల్రాజు పండుగ చాకలి వాళ్ళది, బీరయ్య పండుగా కురవలకు సంబంధించినది. కావున ఆ కుటుంబాలకే పరిమితమైనది ఈ సామూహిక బలి. కుటుంబ శ్రేయస్సు అంటే ఒక కుటుంబానికి సంబంధించి వారి శ్రేయస్సుకోసం ఇచ్చే బలి. ఇక్కడ స్వార్థానికి తావు ఎక్కువ.
బలి ఇచ్చే స్థలాలు:-
బలి ఇచ్చే వ్యక్తులను, పుచ్చుకునే శక్తులను బట్టి, బలి పశువులను బట్టి స్థలం, సమయాలు ఆధారపడి ఉంటాయి. ఊరి వారందరు కలిసి ఇచ్చే బలిలో , వేదిక బహిరంగ స్థలమైనా లేదా నాలుగు, మూడు వీధుల కూడలి ఐన అవుతుంది. ఒక కులం వారు ఇచ్చే బలిలో అది బహిరంగ స్థలమైనా కూడా ఆ కులం వారికి సంబంధించిన వీధి లేదా పొలానికి సంభందించినదవుతుంది. ఒక కుటుంబానికి సంబందించిన అయినపుడు తప్పనిసరిగా ఆ కుటుంబంవారికి సంబందించిన దొడ్డి, పొలం లేక ఇల్లు అవుతుంది.
బలి ఇచ్చే విధానం:-
బలి ఇవ్వడం అనేది ఆయాజాతుల ఆచార వ్యవహారాల మీద, బలి వుద్దేశాలమీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఆటవికులు రక్తం చిందించకుండా బలి ఇస్తారు. ఇతరులు రక్తం చిందించే విధంగా బలి ఇస్తారు. కంఠ భాగాన్ని , మెడను నరకడం, వెన్నును విరచడం, కొరత వేయడం, యెత్తునుండి తోసివేయడం, నలిగి పోయేట్లు చేయడం, వూపిరాడకుండా చేయడం వంటివి. బలి జంతువును బలి వేదిక దగ్గరకు తెచ్చి తలను కడగటం, జడ్తా ఇప్పించడం వంటి పనుద్వారా బలి ప్రాణిని పవిత్రం చేసి, దేవత చుట్టు తిప్పి దేవతకు యెదురుగా బలి ఇస్తారు. బలి జంతువు రక్తం ధారావాహికంగా కారితే దేవత బలికి తృప్తి చెందిందని విశ్వసిస్తారు. అందుకని చిన్న చిన్న జంతువుల మెడ భాగాన్ని క్రిందకు వంచి శరీర భాగాన్ని పైకి యెత్తుతారు.
బలి జరిగిపోయిన తరువాత:-
ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే జానపదులు శక్తి దేవతలకు జంతువుల్ని, కోళ్ళను బలి ఇస్తుంటారు. ఆ ప్రయోజనం ఏమిటి? దున్న, మేక, గొర్రె మొదలైన వాటిని బలి ఇవ్వగానే కసురును తీసుకు వెళ్ళి పోలి చల్లుతారు. పొలి గ్రామ శ్రేయస్సును ఉద్దేశించినదైతే గ్రామం చుట్టు చల్లుతారు. కుటుంబానికి సంబందించినదైతే ఇంటి చుట్టు, పొలం చుట్టు చల్లుతారు. పండుగ సమయంలో కాక, ఇతర సమయాలలో చిన్న జంతువులను బలి ఇస్తే వాటి అవయవాలను కొన్నింటిని చెట్టుకు కట్టి ఇంటికి వెళతారు. వాటి రక్తాన్ని ఆయాదేవతల విగ్రహాలకు పూస్తారు. బలి ప్రాణుల రక్తం భూమిలో కలిసేటట్లు చేయడం, దేవతలకు పూయడం , పూజారులు గావు పట్టి రక్తం తాగడం, రక్తం కూడు తినడం వల్ల దేవతా శక్తి వస్తుందని నమ్ముతారు.
గ్రామదేవతల పూజారులు- పూజా పద్దతులు:-
ఇంతవరకు చెప్పుకొన్న గ్రామదేవతలలో కొందరికి తప్ప ఎక్కువ మందికి నిత్య పూజలు లేవు. వీరికి జానపదులు వీలును బట్టి సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో పూజలు చేస్తుంటారు. బధ్య బధ్యన జిరిగే మొక్కులు ఆపద మొక్కులవుతాయి. ఈ దేవతలకు జరిగే పండుగలలోనూ సమర్పించే పూజా ద్రవ్యాలలోనూ కొన్ని సామాన్యాంశాలున్నాయి. అందులో కొన్నింటిని బోనం, ఘటం, గరగ సమర్పించడం, రతిచేయటం, రంగం యెక్కడం, గాజులు, గవ్వలు సమర్పించడం, గుమ్మడికాయను కొట్టడం, పుట్టను, వేపను పూజించడం, కోడిని దున్నను బలి ఇవ్వడం,పందిని బలి ఇవ్వడం వంటివి ప్రధానాంశాలు.
బోనం:-
శక్తి దేవత పండుగలలో మట్టికుండ బోనంగా ఉపయోగిస్తారు. దీనిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా బోనమని, బోనం కడవనీ, కుండబోనమని, ఘటమనీ వ్యవహరిస్తారు. ఈ బోనం భోజనానికి వికృతి. కావున ఇది నైవేద్యం అయింది.
వేప:-
శక్తి దేవతల విగ్రహాలు, గుళ్ళు, ఎక్కువగా వేప చెట్ల క్రింద ఉంటాయి. దేవతలు చెట్లను ఆశ్రయించుకొని ఉండటానికి కారణం ఆత్మారాధనలోని భాగాలైన వృక్షారాధన, చెట్లకున్న విశిష్ఠ లక్షణాలు. పూనకం వచ్చినవారు వేపకొమ్మలను చేతపట్టుకొని నములుతూ జుట్టు విరగబోసుకొని, వెనుకకు ముందుకూ వూగుతూ కొలువు చెప్పుతుంటారు. వీరిని శివ సత్తులు అని కూడా అంటారు. వేపాకు సఫలతా చిహ్నంగా బోనాల గరగల్లో, కుండల్లో పెడుతుంటారు. హారంలా కంఠంలో వేస్తారు. పండుగలు, జతరలలో ఇంటికి తోరణాలు కడతారు. మశూచి, పోచమ్మ, అంకాళమ్మ వచ్చినపుడు దానివల్ల కలిగే ఆరాటన్ని తగ్గించడానికి రోగి పక్కన వేపమండలు పెడతారు. ఈ వేపమండలనే విసన కర్రలుగా చేసి రోగికి గాలి విసరుతారు. వేపాకును నీళ్ళలో మరగించి ఆ నీళ్ళు వడగట్టి తాగిస్తారు. మిగిలిన నీరు బావిలో పోస్తారు. ఇది మశూచి మచ్చల తొలగింపుకు దోహదం చేస్తుంది. శరీరంపైన ఈగలను దోమలను కూడా వాలనివ్వదు. వేపాకులను పాము విషానికి విరుగుడుగా కూడా ఉపయోగిస్తారు. పురుగు ముట్టిందని అనుమానం ఉంటే వేపాకు తినిపిస్తారు. అప్పుడు వేపాకు తియ్యగా ఉంటే పురుగు ముట్టిందని నిర్ణయించుకొని మంత్రగాని కోసం పరుగులు తీస్తారు. వేపాకే కాకుండా వేప గాలి, వేపచెట్టు నీడ కూడా ఔషదంగానే పనిచేస్తుందని జానపదుల నమ్మకం.
కోడి:-
శక్తి పూజలో శక్తికి బలి పెట్టే ప్రాణులలో కోడి ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకొన్నది. మనుష్యులకు కాలు నొచ్చినా, కడుపు నొచ్చినా, దగ్గువచ్చినా, దమ్ములేచినా, ముక్కినా, మూల్గినా, దయ్యం పట్టినా, భూతంపట్టినా ముందుగా ఆ వ్యక్తులపై దేవత పేరు మీదుగా కోడిని మూడు సార్లు తిప్పి వదిలేస్తారు. మశూచి మానవులకు సోకినపుడు శాఖాహారులైన బ్రాహ్మణులు కూడా కోడిని తెచ్చుకొని, మశూచి సోకిన వారిపైనుంచి యితరులు తిప్పినట్లుగానే మూడు సార్లు తిప్పి వదిలేస్తారు. తర్వాత ఆ కోడిని తాము మొక్కుకున్న దేవతకు బలి యిచ్చి ఆ మంసాన్ని పని వాళ్ళకు చకలి, మంగలి, కుమ్మరి వాళ్ళకు దానం చేస్తారు. కోడిని యే దేవత పేరు మీద దిగదుడిచితే ఆ దేవతకే బలి ఇవ్వాలి. మరొక దేవతకు బలి ఇవ్వకూడదు. శ్రావణ మాసంలో చైత్ర మాసంలో వనభోజనాలకు వెళ్ళిన వారు తప్పనిసరిగా కోడిని బలి ఇస్తారు. వ్యవసాయదారులు కోడిని బలి యివ్వకుండా కోత పట్టరు. ధాన్యపురాశిని ముట్టరు. .
బండారు:-
శక్తి దేవతల పూజలో ప్రజలు, దేవతలకు మధ్య వినిమయ వస్తువుగా బండారు పరిగణింపబడుతోంది. కుంకుమ బొట్టు పెట్టుకోవడానికి అర్హత లేని స్త్రీలు కూడా బండారు పెట్టుకుంటారు. బండారు పసుపు నీరు సున్నముల కలయిక వల్ల రెండింటి రంగు పోయి మంచి ఎరుపు వస్తుంది. ఎరుపు ప్రేమకు ప్రతీక. పెళ్ళిలో యీ రెండింటి మిశ్రమాన్ని వధూవరులు పారాణిగా పూసుకుంటారు. నీరు, పసుపు, సున్నంల మిశ్రమమే బండారు. అయినా పసుపును నేడు బండారుగనే వ్యవహరిస్తున్నారు. బండారుకు బదులుగా పసుపును ఉపయోగిస్తున్నారు. పసుపు , వేప చిగుళ్ళు , కలిపి మశూచి పోసిన వారికి నూనెతో కలిపి పట్టిస్తారు. దీని వల్ల మశూచి నుండి యేర్పడే మచ్చలు తగ్గి శరీరం తొందరగా యధాస్థితికి రంగుకు వస్తుంది. అంతేకాకుండా క్రిమి సంహారిగా పనిచేస్తుంది. చీమలు, దోమలు రావు. ఉప్పు వుండటంవల్ల దురద ఉండదు. గాయం తొందరగా మాని రోగికి ఉపశమనం కలుగుతుంది.
గ్రామదేవతల పూజారులు:-
గ్రామదేవతలకు చాలామందికి నిత్య సేవలు లేవు. పూజారులు కూడా సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో లేదా ప్రత్యేక సంధర్భాలలోనో గుడిలో కంపిస్తుంటారు. వీరికి ఆహారాది నియమ నిష్ఠలు లేవు. శుచి, శుభ్రతను పాటించరు. కొన్నిచోట్ల యాదవులు, కాపులు, వెజ్జులు, ఆదీఅంధ్రులు, తలారులు, కొండదొరలు, దేవాంగులు, వడ్డెర కులాల వారు పూజారులుగా వున్నారు. పూజారులు పురుషులే వుండాలనే నియమం లేదు. కొన్నిచోట్ల స్త్రీలు, నపుంసకులు కూడా పూజారులుగా కనిపిస్తారు. ఈ పూజారులలో కొందరు దేవతలకు నైవేద్యాలు సమర్పిస్తారు. కొందరు కధలు చెప్తారు. ఉదాహరణకు చాకలి, కుమ్మరి మరికొందరు కధలు చెప్తారు. బైనీడు, ఆసాది కధలు చెప్తారు. కొందరు దేవతను గంపను నెత్తిన పెట్టుకొని అడుక్కొంటూ జీవనం సాగిస్తుంటారు . ఉదాహరణకు సుంకులోళ్ళు, పెద్దమ్మలోళ్ళు, జోగులోళ్ళు ఇల్లాంటివారే.