డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి "మా నాన్నగారు"సర్వశ్రీ జనమంచి శేషాద్రి శర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, మొక్కపాటి నరసింహశాస్త్రి, పింగళి లక్ష్మీకాంతం, గుర్రం జాషువా, అడివి బాపిరాజు, అబ్బూరి రామకృష్ణారావు,సురవరం ప్రతాపరెడ్డి, గడియారం వేంకటశేషశాస్త్రి, భమిడిపాటి కామేశ్వర రావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఖండవల్లి లక్ష్మీరంజనం, కొడవటిగంటి కుటుంబరావు, రావూరు వేంకటసత్యనారాయణ రావు, బోయి భీమన్న, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, మా గోఖలే, రావిశాస్త్రి, ఉషశ్రీ, దాశరథి, మధురాంతకం రాజారాం - ఈ పేర్లన్నీ వింటే ఏమనిపిస్తుంది ? పైవారందరి విశేషాలు ఒక్కచోటే చూస్తే పాఠకులు ఏమైపోతారు ?

పైన చెప్పినవారే కాక, మొత్తంగా కీర్తిశేషులైన అరవై రెండు మంది సాహితీ ప్రముఖుల జీవితానుభవాలు, వారు జీవించి ఉన్నప్పటి సామాజిక, సారస్వత పరిస్థితులు, ఆపైన వారి కుటుంబజీవిత విశేషాలు, మరెవరో కాకుండా వారి పిల్లలచేతే వివరింపచేసిన పుస్తకం డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి "మా నాన్నగారు". సుమారు 400 పేజీల ఈ పుస్తకంలో కావలసినన్ని విశేషాలు. ఆ మహానుభావుల ఫోటోలతో సహా. తోడుకున్నమ్మకు తోడుకున్నంత అనేది ఈ పుస్తకంలోని విశేషాలకు సరిపోతుంది.

ఇక పుస్తకంలోకి, అందులోని విశేషాలకు వచ్చేస్తే -

శ్రీ గొబ్బూరి వేంకటానంద రాఘవరావు
1882 - 1959

రాఘవరావుగారి కుమార్తె శ్రీమతి చిల్లరిగె స్వరాజ్యలక్ష్మి గారు ఆయన గురించి తలుచుకుంటూ చెప్పిన విశేషం మచ్చుకు ఒకటి

- "నా చిన్నతనంలో మా నాన్నగారు గీత ప్రచార పరిషత్తు స్థాపించారు. వచన భగవద్గీతను అచ్చువేసి రెండణాలకు (బేడ) ఇచ్చేవారు. చాలా చౌకగా వస్తోందని పుస్తకాలు తీసుకొని వర్తకులు ఈ పుస్తకం పుటలను పొట్లాలకు వాడేవారట! అది చూసి మా నాన్నగారు ఆ ప్రయత్నం మానుకున్నారు."


శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి
1892 - 1973

మొక్కపాటివారి కుమార్తె శ్రీమతి అడ్డాల లలితాదేవి గారు ఆయన గురించి తలుచుకుంటూ చెప్పిన విశేషం మచ్చుకు ఒకటి

- " నాన్నగారి పేరు చెప్పగానే బారిష్టర్ పార్వతీశం నవలే గుర్తుకు వస్తుంది. 1924లో తెనాలి నవ్య సాహితీ సమితి సమావేశం జరిగింది. మా నాన్నగారు అందులో సభ్యులు. డిసెంబరు 24న సమితి సభ్యుల సమక్షంలో మానాన్నగారు స్వీయచరిత్ర కొంత చెప్పుకున్నారు. ఆ తర్వాత వర్షపు రోజుల్లో ఓసారి మా నాన్నగారు గుమ్మలూరు వెళ్ళారు. అక్కడ బావమరుదులూ, మరదళ్ళూ అంతా చేరి కబుర్లు చెప్పమన్నారు. మా నాన్నగారు తమ పడవ ప్రయాణం కబుర్లను పూసగుచ్చినట్టు చెప్పారు. వాళ్ళంతా ఓ కథలా రాస్తే బాగుంటుందన్నారు. "బాల వాక్యం బ్రహ్మవాక్యం అన్నారు పెద్దలు" అంటూ మా నాన్నగారు బారిష్టర్ పార్వతీశం నవల పుట్టుక గురించి తెలిపారు. గుమ్మలూరు నుంచి గుంటూరు వెళ్ళిన నాన్నగారు అక్కడ తల్లావజ్ఝల, నోరి, వజ్ఝ బాహూరావు, శ్రీనివాస్ శిరోమణి మొదలైనవారిని కూర్చోబెట్టి తను రాసిన కథ చదివి వినిపించారు. వాళ్ళంత కడుపుబ్బ నవ్వుకున్నారు. ఆ కుర్రవాడ్ని నిడదవోలు కాదు ఇంగ్లాండు పంపమన్నారు శివశంకర శాస్త్రిగారు. 'బారిష్టర్ పార్వతీశం' అని పేరు సూచించారు. ఈ విధంగా మొదటి భాగం నవల వెలువడింది. ఆంధ్రజ్యోతి సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావుగారు తమ వారపత్రికలో ధారావాహిక నవలగా ప్రచురించారు. తొలి ముద్రణను 1931లోనే భవానీ భాండారం వారు వేశారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమవుతున్నప్పుడు పాఠకుల స్పందనను తట్టుకోలేక నార్లవారు రెండోభాగం రాయమన్నారు. పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారి ప్రోత్సాహం వల్ల రెండు, మూడు భాగాలు రాశారు. మొదటి భాగానికి శ్రీనివాస్ శిరోమణిగారు, రెండో భాగానిక్ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు, మూడో భాగానికి కప్పగంతుల రాజేశ్వరిగారు వ్రాయసకారులుగా ఉన్నారు. అంటే ఈ నవలను విశ్వనాథవారిలా "డిక్టేట్" చేశారు. "


శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి
1894 - 1983

పిచ్చయ్యశాస్త్రి గారి కుమారుడు దీపాల రాధాకృష్ణమూర్తి గారు ఆయన గురించి తలుచుకుంటూ చెప్పిన విశేషం ఒకటి

- " 1966లో నేణు ఇల్లు కొనేందుకు ఆరువేల రూపాయలు అప్పుచేశానని తెలిసిన తరువాత నాకొక ఉత్తరం వ్రాశారు. సాధారణంగా కార్డు మీదనే జాబు వ్రాసేవారు. కానీ నాకు ఇన్లాండు లెటర్ వ్రాశారు. అది చూడగానే అందులో ఏముందో నాకు తెలిసింది. "మన ఇంటా వంటా లేని విషయం అప్పు చేయడం. మా తండ్రిగారు కానీ, నేను కానీ ఉన్నదానితో సరిపుచ్చుకొన్నాము గానీ అప్పుచేసి ఎరుగము. అటువంటిది ఆరువేల రూపాయలు అప్పు చేసావంటే నమ్మలేకుండా ఉన్నాను. ఇతరుల సొమ్ముతో సుఖము అనుభవించడం మంచి లక్షణం కాదు. అప్పు తీర్చడం మీ ప్రథమ కర్తవ్యంగా మీ దంపతులు భావించాలి" అని పెద్ద ఉత్తరం వ్రాశారు. "


శ్రీ సురవరం ప్రతాప రెడ్డి
1896 - 1953

ప్రతాపరెడ్డిగారి కుమారుడు ఎస్.ఎన్.రెడ్డిగారు ఆయన గురించి తలుచుకుంటూ చెప్పిన విశేషం ఒకటి

- " 1952లో మా నాన్నగారు వనపర్తి నుంచి ఎం.ఎల్.ఏ. గా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అందరూ విద్యామంత్రి అవుతారని ఎదురు చూచారు. చివరిగా ఈయన పేరు మంత్రివర్గం నుంచి తొలగించబడింది. ఈ సంఘటనతో మా నాన్నగారికి మంత్రి పదవి రాకుందా అడ్డుకున్న ఒకాయన ఏమన్నారో తిరుమల రామచంద్ర రాశారు - " ఏందయ్యా నీవు చెప్పటం? తెల్గంగి అఖ్బారు నడిపిండు. మంచిగా చేసిండు. దానికొరకు వజీరవుతాడా? మేమేమి గాజుల్ తొడుక్కున్నామా? ఆయనేమి దేశ్ముఖా, దొరా?" రాజకీయాలంటే మా నాన్నగారికి ఇష్టం వుండేది కాదు. ఎం.ఎల్.ఏ అయినా ఇతర పేరు ప్రతిష్ఠలు సంపాదించినా చివరిదాకా సొంత ఇల్లు లేదంటే చూడండి వారి నిజాయితీ! 1953 ఆగష్టు 25న గుండెనొప్పి వచ్చి సురవరం రంగారెడ్డి గారి ఇంట్లో 57వ సంవత్సరంలోనే కన్నుమూశారు"


శ్రీ దాశరథి కృష్ణమాచార్య
1925 - 1987

దాశరథి గారి అమ్మాయి దాశరథి ఇందిర ఆయన గురించి తలుచుకుంటూ చెప్పిన విశేషం ఒకటి

- " మా నాన్నగారి జీవితంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఒకనాడు అఖిలభారత ఉర్దూ కవిసమ్మేళణం 'ముషాయిరా'కు బయలుదేరారు. రిక్షాలో వెళ్తున్నప్పుడు రిక్షావాడు యువకుడు - ఎక్కడి కెళ్తున్నారు? అన్నాట్ట. నాన్నగారు ముషాయిరాకు వెళ్తున్నాను అన్నార్ట. నేనూ అక్కడికే అన్నాట్ట యువకుడు. వెంటనే నాన్నగారు రిక్షా దిగి ' నువ్వు కూర్చో నేను తొక్కుతాను ఒక కవి తొక్కే రిక్షాలో నేను కూర్చోడమా?' అన్నారట! " మీకు రిక్షా తొక్కటం రాదు కనక కూర్చోండి" అని ఆ యువకుడు అన్నాట్ట! ముషాయిరాలో ఆ రిక్షావాడు యూసఫ్ కవితను చదవటం శ్రోతలందరూ ముగ్ధులవటం - నాన్నగారు పరవశించి ఒక పాన్ బీడా ఇచ్చారు. మఖ్దూం మొహియుద్దీన్ చేతుల మీదుగా నాన్న ఆ ముషాయిరాలో సత్కారం అందుకున్నారు."


శ్రీ తుమ్మల సీతారామమూర్తి
1901 - 1990

సీతారామమూర్తి గారి అబ్బాయి తుమ్మల శ్రీనివాసమూర్తిగారు ఆయన గురించి తలుచుకుంటూ చెప్పిన విశేషం ఒకటి

- " ఒక కావ్యం ప్రారంభించాలంటే అది పూర్తయ్యేవరకు నిద్ర ఆహారాల మీద ధ్యాస వుందేది కాదు. మధ్యరాత్రి లేచి కిరోసిన్ లాంతరు దగ్గర కూర్చొని కవిత్వం రాస్తూ ఉందేవారు. ఒకసారి నిడుబ్రోలు నుంచి వారు వుందే అప్పికట్లకు వెళ్ళాను. అది రోహిణికార్తె. వడగాలులు బాగా వీస్తున్నాయి. అప్పుడు మా నాన్న తలకు టవల్ చుట్టుకొని కవిత్వం రాస్తున్నారు. అది ' గాంధీగానము ‘ రాస్తున్న సమయం. ఎండలు తగ్గాక రాయవచ్చు గదా అన్నాను. 'ఎప్పుడు రమ్మంటే అప్పుడు కవిత్వం రాదురా కవితావేశం వచ్చినప్పుడే రాయాలీ ‘ అని అన్నారు. ఇంకొక చమత్కారం చెప్తాను. ఒకసారి ఉదయం మా నాన్నగారి వద్దకు వెళ్ళాను. వరండాలో క్షురకుడు కూర్చొని ఉన్నాడు. నాన్నగారి గదిలోకి వెళ్ళాను. ఆయన గడ్డం ఒకవైపు చేయబడి వుంది. రెండవ వైపు సబ్బురాసి వుంది. మా నాన్నగారు కవిత్వం రాస్తూ కనిపించారు. విషయం ఏంఇటని వాకబు చేస్తే సగం గడ్డం తరువాత నాలుగు పద్యాలు రాసి వస్తానని లోపలికి వెళ్ళారట!"

మిగతావారి విశేషాల కోసం పుస్తకం తప్పక కొని చదవండి. పుస్తక ప్రతుల కోసం

Dr Dwa.Na.SAstry
H.No. 1-1--428,
Gandhi Nagar
Hyderabad, A.P. - 500 080
INDIA
Ph : 98492 93376


పుస్తకంలోని ప్రముఖులు, పుస్తక విషయసూచిక ఇక్కడ -