పొడుపు కథలు |
ప్రతి భాషలో లిఖితంకానట్టి జానపద సాహిత్యం ఉంది. ఆ నోటా, ఈ నోటా జాలువారి పరవళ్ళుతొక్కి పరవశింపచేసేది ఈ జానపద సాహిత్యం. మన తెలుగు భాషలో జానపద సాహిత్యం పాటలు, కథలతో పాటు పొడుపు కథలను అంతర్భాగంగా చేసుకుని విరాజిల్లుతూ ఉంటుంది. ఈ "పొడుపు" వెంట "విడుపు" తో శోభాయమానంగా పిల్లలలో విజ్ఞానాన్ని , జ్ఞాపకశక్తి, లోకజ్ఞానం పెంపొందించి వారి బుద్ధి వికాసానికి తోడ్పడటానికి మన పెద్దలు కనిపెట్టిన అతికమ్మని అమృతగుళికలే ఈ పొడుపు కథలు. వీటికి సంస్కృత నామము "ప్రహేళిక / ప్రవల్హిక" - అనగా గూఢార్థములు కల కావ్య విశేషములు అని అర్థం. రెండు అర్థాలు, లేక నిగూఢార్థము కలిగి, చమత్కారంతో నిండి, రమణీయ అర్థాలు పొంది ఎదుటివారి మెదడుకి మేత పెట్టేవంటివి మన పొడుపు కథలు. ఈ పొడుపు కథలకు వస్తువులు మన చుట్టూ ఉండే ప్రకృతిలోని పక్షులు, పండ్లు, కాయలు, క్రిమికీటకాలు, ఆకాశం, చంద్రుడు, సూర్యుడు, మనుషులు, వారి వృత్తులు , నానా రకాల స్వరూపాలు, స్వభావాలు. వీటిలో వచనంలో ఒదిగినవి కొన్ని ఐతే, పద్యరూపంలో ప్రాసతో ఒదిగినవి కొన్ని, గీతాల్లో మరి కొన్ని , తత్వాలలో మరి కొన్ని. వీటి గురించి ఎంత చెప్పినా మదికి మోదమే కలుగుతుంది. పొడుపు కథలకు ఉన్న గొప్ప సుగుణం ఏమిటంటే , ఇవి విన్నవెంటనే మనసుకి ఆలోచనలు కలిగించి, వివేచన పెంపొందించి వాటి విడుపు ఎలాగయినా విప్పాలి అనే జిగ్ఞాస పుట్టిస్తాయి.పొడుపుకథల చరిత్రకివస్తే వీటిలొ కొన్ని అతిప్రాచీనకాలం నుంచి, మన కావ్యాల్లో కథల్లో ఇమిడిపోయి ఉన్నాయి. ఉదాహరణకి కాశీమజిలీకథలే తీసుకోండి.అందులో మనకుకావలసినన్ని పొడుపు కథలు ఉన్నాయి. మన తేటతెలుగులో లెక్కకు మిక్కిలిగా ఉన్న పొడుపుకథలు భాష, భావం ఒకదాని వెంట ఒక పోటీ పడి పరుగులు పెడుతున్నట్టుగా ప్రశ్నించే విషయాన్ని, బహుపసందుగా రూపకల్పన చేసి, కొసమెరుపుగా వాటి విడుపు తెలుపుతూ ఉంటాయి.నా చిన్నప్పుడు ఎప్పుడో, విన్న ఈ పొడుపు కథలని ఈ సంకలనంలో పొందుపరచటానికి ప్రయత్నం మొదలు పెట్టాను. మీ పిల్లలకూ ఉపయోగపడితే అంతకన్నా సంతోషం లేదు. మీ సలహాలకు ఎల్లవేళలా ఆహ్వానం. ఏదన్నా తప్పులు ఉంటే సహృదయంతో సరిదిద్దమని విన్నపము. మీ వంశీ |