మాటల మాంత్రికుడు శ్రీ పింగళి నాగేంద్రరావు
June 1953 కినిమా పత్రికలోని వ్యాసం. పత్రికలోని ఈ వ్యాసాన్ని అడగగానే, తీరిక చేసుకుని "స్కాన్" చేసి నాకు అందించిన మిత్రులు పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలతో.


***** సినీరచయిత పింగళి నాగేంద్రరావు ******

మూడేళ్ళక్రితం వాహినీవారి "గుణసుందరి కథ" విడుదలై అపూర్వంగా నడిచినప్పుడు ఆ చిత్రం చూడవచ్చినవారిలో అత్యధిక సంఖ్యాకులు; తెరమీద "మాటలు, పాటలు" అన్న మాటకింద మొట్టమొదటిసారిగా పింగళి నాగేంద్రరావు పేరు చూసివుంటారు. కాని ఈ నాడు సినిమాప్రేక్షకులలో ఆపేరు తెలియనివారుగాని, సినిమా రచయితల జాబితాలో ఆపేరుకు అగ్రస్థానం ఇవ్వనివారుగాని ఉండరు. ఇది కేవలం అదృష్టవశాత్తూ వచ్చిన ఖ్యాతికాదు. కొన్ని పాత్రలు తీసుకుని వాటితో "డ్రామా" తీసుకురావటం చాలమంది చేయగలరు ; కాని నాగేంద్రరావు సృష్టించే పాత్రలలోనే "డ్రామా" వుంటుంది. ఏ సన్నివేశమూ అవసరంలేకుండానే ఆయన సృష్టించే పాత్రలు రక్తి కలిగిస్తాయి. ఇది నాగేంద్రరావు సొమ్ము.ఇక పాటల విషయం వస్తే సినిమాకు అనుకూలంగా పాటలు రాయగలవారిలో నాగేంద్రరావుకు పోటిగా చెప్పుకోదగినవారున్నట్లు కనబడరు. ఆయన పాటలలో సాహిత్యం పాత్ర పోషణకీ, సన్నివేశానికీకూడా అద్భుతంగా ఉపకరించటమేగాక ఎక్కడా "తొస్సు" లేకుండా బిగువుగా నడుస్తుంది. పాటలు రాయటంలో ఆయన చాలా క్లిష్టమైన నియమాలు పాటిస్తాడు. ఇన్నింటికీతోడు ఆయన పాటలలోనూ, మాటలలోనూకూడా హాస్యం కొల్లలుగా వుంటుంది. వరుసగా విజయాన్ని సాధించిన "గుణసుందరికథ", "పాతాళభైరవి", "పెళ్ళిచేసిచూడు" - ఆఖరు చిత్రంలో ఈయనవి పాటలు కొన్ని మాత్రమే - ఈయన రచనాసామర్థ్యానికి సాటిలేని నమూనాలు.

పింగళి నాగేంద్రరావు 1901 డిసెంబరు 29న బొబ్బిలి దగ్గిర తాండ్రపాపయ్యగారి ఊరైన రాజాంలో పుట్టాడు. ఆయన తండ్రి గోపాలకృష్ణయ్యగారు, యార్లగడ్డ గ్రామానికి కరణంగావుంటూ నాగేంద్రరావు జననానికి పూర్వమే కరిణీకం మానుకుని విశాఖజిల్లాలోని తన తమ్ముళ్ళదగ్గిరికి వెళ్ళిపోయారు. (నాగేంద్రరావు పినతండ్రులలో ఒకరు డిప్టీకలెక్టరు చేశారు, మరొకరు ప్లీడరు) నాగేంద్రరావుకు శ్రీరాములుగారని ఒక అన్నగారుండేవారు. ఆయన 1913లోనే మనదేశం వదిలిపోయి 1926 లగాయతు భార్యాబిడ్డలతో ఆస్ట్రేలియాలో పంచదార "ఎక్స్పర్ట్"గా వుంటూ వచ్చారు. ఆయనకాప్రాంతాల మూర్తీమహరాజ్ అనిపేరు. ఇటీవల ఆయన వార్తలు తెలియటంలేదు.

నాగేంద్రరావు తల్లిగారు మహలక్ష్మమ్మగారిది దివి తాలూకా, ఆయన చిన్నతనం నుంచీ కృష్ణాజిల్లాలోనే వుంటూ ఆంధ్రజాతీయ కళాశాలలోనే ఇతరవిద్యలతోబాటు మెకానికల్ యింజనీరింగు చదివాడు. కోపల్లె హనుమంతరావు ప్రభృతులు స్థాపించిన ఈ కళాశాలలో తొలివిద్యార్థుల దండులో నాగేంద్రరావు ఒకడు. మంగినపూడి పురుషోత్తమశర్మగారనే ప్రసిద్ధ కవీ, మాధవపెద్ది వెంకట్రామయ్యగారనే ప్రఖ్యాత స్టేజినటుడూ ఈ కళాశాలలో నాగేంద్రరావుతోబాటు చదివిన వారే. ఆంధ్రకంతటికీ గర్వకారణంగా వెలిసిన ఆంధ్రజాతీయ కళాశాల యొక్క తొలివిద్యార్థులలో ఒకడైన కారణంచేత నాగేంద్రరావుకు కోపల్లె హనుమంతరావు, డాక్టర్ భోగరాజు పట్టాభిసీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు ప్రభృతుల పరిచయం లభించింది.

1918లో చదువు పూర్తిచేసి నాగేంద్రరావు ఖర్గపూరు రైల్వే వర్క్ షాపులో ఎప్రెంటిసుగా వెళ్ళాడు. వర్క్ షాప్లో పనిచేసేటందుకు తగిన ఆరోగ్యం లేదని ఆయనను ఆఫీసుపనికి మార్చారు. ఆయన వుండగానే బి.ఎన్.రైల్వేకార్మికుల తొలియూనియన్ యేర్పాటయింది. నాగేంద్రరావు తన బావమరిది అయిన దండపాణిగారితోబాటు ఈ యూనియనుస్థాపనకు తీవ్రంగా కృషిచేశాడు. దండపాణిగారు యూనియనుకు అధ్యక్షుడు. అదేసమయంలో రైల్వేఫెడెరేషనుకు చిత్తరంజనదాసు అధ్యక్షుడు.

ఇట్లావుండగా ప్రసిద్ధ యోగవ్యాయామవేత్త అయిన రామజోగారావుగారు ఖర్గపూరులో జాతీయోత్సాహం రేకెత్తించే ఉపన్యాసాలివ్వసాగారు. ఈ ఉపన్యాసాల ఫలితంగా 1920లో నాగేంద్రరావు తన ఉద్యోగానికి ఉద్వాసన చెప్పి ఉత్తరదేశయాత్ర ప్రారంభించాడు. ఖర్గపూరులో వుండగానే ఆయన దివ్యజ్ఞానసమాజ (థియోసాఫికల్ సొసైటీ) సభ్యుడుకావటం జరిగింది. దివ్యజ్ఞానసమాజంవారి మకాములలో బసచేస్తూ ఆయన ఉత్తరదేశం పర్యటించి చివరకు సబర్మతీ ఆశ్రమం చేరుకున్నాడు. అసలే బ్రహ్మచారి, అందులో వైరాగ్యం కుదిరింది. కాని ఆశ్రమంవారు అనుమతించలేదు. నాగేంద్రరావు ఆశ్రమవాసిగా వుండేకన్న కాంగ్రెసు సంస్థలో చేరి ఎక్కువ దేశసేవ చేయగలుగుతాడన్నారు.

సబర్మతీలో పదిహేనురోజులున్న తరువాత ఈ నిర్ణయం జరిగింది. దీన్ని అమలు చేయగలందులకు కాకా కలేల్కర్ గారు, అప్పట్లో కృష్ణాజిల్లా కాంగ్రెసు అధ్యక్షులుగా వుంటూవుండిన ధన్వాడ రామచంద్రరావుగారికి ఒక లేఖ వ్రాసియిచ్చారు. దానిసహాయంతో నాగేంద్రరావుకు కాంగ్రెసు ఆర్గనైజరువుద్యోగం, వేతనంతోసహా లభించింది. ఈ ఉద్యోగంచేస్తూ ఆయన కొన్ని దేశభక్తి పద్యాలు రచించి "జన్మభూమి" అనే పుస్తకంగా ప్రచురించాడు. ఈ పని చేసినందుకు నాగేంద్రరావును బెజవాడలో అరెస్టు చేశారు. అయితే జిల్లాకలెక్టరుగారు "వార్నింగ్" ఇచ్చి ఆయనను విడిచిపుచ్చారు.

ఒకనాడు డాక్టర్ పట్టాభిగారు కాంగ్రెసు ఆఫీసుకొచ్చి అక్కడ నాగేంద్రరావునుచూసి, ఆర్థికస్తోమత కలవాళ్ళే కాంగ్రెసుసంస్థకు సేవచేయగలరనీ, బ్రతుకుతెరువుకు కాంగ్రెసుపై ఆధారపడేవారు భారమనీ, నాగేంద్రరావు లోగడ చేస్తూవుండిన ఉద్యోగం మానడం పొరపాటనీ అన్నారు. డాక్టర్ పట్టాభిగారి ఈ సలహాను గురూపదేశంగా భావించి నాగేంద్రరావు కాంగ్రెసుకు రాజీనామాయిచ్చాడు.

ఈ సమయంలో బందరులో కౌతా శ్రీరామశాస్త్రిగారు మోడరన్ రివ్యూ, ప్రవాసిపత్రికల పద్ధతిలో ఉత్తమ సాహిత్య పత్రికను ప్రారంభించాలని యత్నం చెయ్యసాగారు. ఆ పత్రికలో పనిచేయటానికి డాక్టర్ పట్టాభిగారే నాగేంద్రరావుని శిఫార్సు చేశారు. 1923లో "శారద" అనే పేరుతో ఈ పత్రిక వెలువడింది. శ్రీరామశాస్త్రిగారికి సహాయంగా వుంటూ నాగేంద్రరావు ఆ పత్రికను నడపసాగాడు. 1924లో ఈ పత్రిక నిలిచిపోయే పర్యంతమూ ఆ పనిలోనేవుంటూ ఆ పత్రికమూలంగా డాక్టర్ అహోబలరావుగారి వంటి పెద్దల మైత్రికూడా సంపాదించుకున్నాడు నాగేంద్రరావు.

చిన్నతనం నుంచీ విద్యార్థిదశలోకూడా, నాగేంద్రరావుకు రచనలుచేసే అభ్యాసం వుండేది. ముఖ్యంగా నాటకాలమీద ఆయనకు ఎక్కువమక్కువ. "శారద" నడిపేరోజులలోనే ఆయన డి.ఎల్.రాయ్ నాటకాలు "మేవాడ్ పతన్", "పాషాణి" తర్జుమాచేసి కృష్ణాపత్రికలో ప్రచురించారు. ఆయన సొంతనాటకాలు "జేబున్నీసా", "వింధ్యరాణి" కృష్ణాపత్రికలోనూ, "నారాజు" భారతిలోనూ పడ్డాయి.

"శారద" నిలిచిపోక పూర్వమే బందరులోని డి.వి.సుబ్బారావుగారు నాగేంద్రరావు రచించిన నాటకాలను కొన్నిటిని ఆడటం జరిగింది. ఆకారణంగా "శారద" నిలిచిపోగానే, నాగేంద్రరావుకు డి.వి.సుబ్బారావుగారి ఇండియన్ డ్రామెటిక్ కంపెనీలో సెక్రెటరీ పదవి లభించింది. 1946 దాకా నాగేంద్రరావు ఆ కంపెనీలోనేవుంటూ, వారి కార్యక్రమాలను నిర్వహిస్తూ, నాటకాలాడిస్తూ, నాటక రచనగురించీ ప్రేక్షకుల అభిరుచులను గురించీ, ప్రదర్శనంలో మెళుకువలను గురించీ అపారంగా నేర్చుకున్నాడు. దీనిమూలంగా డి. వి. సుబ్బారావుగారి "నారాజు", "వింధ్యరాణి" నాటకాలు అద్భుతమైన విజయం సంపాదించాయి.

ఈ విజయం ఎంతదాకా వెళ్ళిందంటే, బందరులో డాక్టర్ వి. దుర్గా నాగేశ్వరరావు గారు "వింధ్యరాణి" నాటకాన్ని డి. వి. సుబ్బారావుతోసహా చిత్రంగా తయారు చేయటానికని వైజయంతిఫిలింస్ సంస్థకూడా స్థాపించారు. ఈ సంస్థ స్థాపించిన కొద్ది రోజులకే ఎన్. జగన్నాధ్ గారు బందరు వచ్చారు. అంతకుపూర్వం ఆయన "తారుమారు" అన్న చిత్రం, 6 రీల్సుది,తయారుచేసివున్నారు. మరో పదివేల అడుగుల చిత్రంతీసి రెంటినీకలిపి విడుదలచేద్దామని జగన్నాథ్ గారి ఉద్దేశం. ఈ రెండో చిత్రం తీయటంలో వైజయంతిఫిలింస్ వారు తమకు భాగస్వాములుగా ఉండాలని కోరటానికి జగన్నాధ్ బందరు వచ్చి, ఇప్పుడీ చిన్న చిత్రం తీసి, ఆ అనుభవంతో "వింధ్యరాణి" తీస్తే బాగుంటుందని డాక్టర్ దుర్గానాగేశ్వరరావుగారిని ఒప్పించారు. జగన్నాథ్ గారు తీయదలచినది మోలియర్ నాటకానికి అనుసరణ "భలేపెళ్ళి". ఈ చిత్రానికి రచయితగా పనిచేసే భారం "వింధ్యరాణి" కర్తయిన నాగేంద్రరావు మీదనే పడింది.

ఇది నాగేంద్రరావుకు తొలిసినిమా అనుభవం. "భలేపెళ్ళి"కి పాటలూ, మాటలూ ఆయనవే. ఈ చిత్రంలో డాక్టర్ కూచిభొట్ల శివరామకృష్ణయ్య, జయంతి గంగన్న, ఇటీవల "పుట్టిల్లు" తీసిన డాక్టర్ రాజారావు, సురభి గోవిందరావు కూతుళ్ళూ, తదితరులు నటించారు. అయితే "భలేపెళ్ళి" నాగేంద్రరావును సినిమా ప్రపంచంలో వుంచెయ్యలేకపోయింది. అసలే యుద్ధం రోజులు. అందులోనూ మద్రాసు ఖాళీఅయి సినిమా చిత్రనిర్మాణం బాగా కుంటుపడినరోజులు. నాగేంద్రరావు తిరిగి నాటకాలాడించుకోవటానికి వెళ్ళిపోవలసివచ్చింది.

"వింధ్యరాణి" చిత్రంగా తయారయీరోజు 1946లో వచ్చింది. జెమినిస్టూడియో సహకారంతో వైజయంతిఫిలింస్ సంస్థ ఈ చిత్రం తయారుచేయ బూనుకున్నది. దీనికి సి. పుల్లయ్యగారి దర్శకత్వం. ఇందులో డి. వి. సుబ్బారావు, పుష్పవల్లి, రేలంగి, జి. వరలక్ష్మి, పండిట్ రావు ప్రభృతులు పాత్రధారులు. నాగేంద్రరావు రెండవ సారి "సినిమాలకు" వచ్చి సి. పుల్లయ్యగారి పర్యవేక్షణ కింద "వింధ్యరాణి" స్క్రిప్టు తయారుచేసాడు.

"వింధ్యరాణి" తయారవుతున్న సమయంలో నాగేంద్రరావుకు వాహినీ నిర్మాతా డైరెక్టరూ ఐన కె. వి. రెడ్డిగారి పరిచయం లభించింది. వాహినీ సంస్థ ప్రారంభం నుంచీ ఆ సంస్థలో పని చేస్తూ "యోగి వేమన" లో కె. వి. రెడ్డి గారికి సహాయదర్శకుడుగా పనిచేసిన కమలాకర కామేశ్వరరావు గారు - బందరు పౌరుడే - నాగేంద్రరావుకు రెడ్డిగారితో పరిచయం చేసారు. ఈ పరిచయం ఫలితంగా కె. వి. రెడ్డి గారు తాము తీయబోతున్న "గుణసుందరికధ" కు పాటలు మాటలు రాయటానికి నాగేంద్రరావును ఈర్పాటు చేసుకున్నారు. ఈ ఏర్పాటు కె. వి. రెడ్డి గారికీ, నాగేంద్రరావుకూ, ఆంధ్రా సినిమా ప్రేక్షకులకుకూడా లాభించిందని చెప్పాలి. కె. వి. రెడ్డి గారికి మరొక రచయిత హం మతి, కాలమతి వగైరా అరడజను హాస్యపాత్రలను యివ్వగలిగి ఉండడు. దర్శకుడు కె. వి. రెడ్డిగారు కానట్టయితే నాగేంద్రరావు సినిమా రచన "భలేపెళ్ళి", "వింధ్యరాణి" కి మించి ఎంతో పైకి వెళ్ళలేక పోయివుండవచ్చు. ఈ ఇద్దరి సమ్మేళంతో తయారైన "గుణసుందరి కథ" పూర్వం ఏ తెలుగుచిత్రమూ ఎరగనంత గొప్పవిజయాన్ని సాధించింది.

"గుణసుందరి కథ" నిర్మాణం నాటికి వాహినీ స్టూడియో తయరై, విజయావారి నిర్వహణకిందికి వచ్చింది. వాహినీలో మొట్టమొదటి కాల్షీట్ "గుణసుందరి కథ"దే కూడా. "గుణసుందరి కథ" పూర్తి అయేలోగా విజయ వారు చిత్రనిర్మాణం ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఏర్పాట్ల ప్రకారం నాగేంద్రరావు, కామేశ్వరరావుగారు మొదలైనవారు విజయసంస్థలోకి తీసుకోబడ్డారు.

అయితే కె.వి.రెడ్డిగారు విజయవారి ద్వితీయచిత్రం "పాతాళభైరవి" డైఇరెక్టుచేయటానికి ఒప్పుకున్నప్పుడు నాగేంద్రరావుకు కె.వి.రెడ్డిగారితో కలిసి పనిచెయ్యటానికి మరొక అవకాశం లభించింది. దీని ఫలితాన్నికూడా ఆంధ్ర సినిమాప్రేక్షకు లెరుగుదురు. "పాతాళభైరవి" చాలా విజయవంతంగా నడవటమేగాక చిత్రనిర్మాణంలో గొప్ప ప్రమాణాలను సాధించింది. కనుకనే దీనిని ఇండియాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర మహోత్సవంలో ప్రదర్శించటానికి ఎన్నుకున్నారు. "పాతాళభైరవి"లో సీను, అంజి, డింగరి పాత్రల విజయమూ, నేపాళమాంత్రికుడి పాత్ర యొక్క అపురూపకల్పనా, నాగేంద్రరావు ప్రతిభకు తార్కాణాలు.

ఇప్పుడు నాగేంద్రరావు తనను సినిమాలోకి తీసుకురావటానికి తోడ్పడిన కామేశ్వరరావుగారితో కలిసి విజయవారి నాలుగో చిత్రం "చంద్రహారం"కు పనిచేస్తున్నాడు. ఈ చిత్రంలో ధూమకేతు, నిక్షేపరాయడు, "ఎంతచెబితే అంతేగాళ్ళు", బుజ్జాయి, చిన్ని మొదలైనపాత్రలు ఇంతవరకు సినిమాప్రేక్షకులు చూసిన ఏపాత్రకూ తీసిపోవు. ఇవి ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని ఇవ్వగలవు.

మొదటనే చెప్పినట్టు సినిమాలకు "పాటలు, మాటలు" రాసేవారిలో పింగళి నాగేంద్రరావుకు చాలా ఉన్నతమయిన స్థానం వుంది. ఆయన ఒప్పుకునేపక్షంలో ఎంతడబ్బయినా ఇచ్చి ఆయనచేత తమ చిత్రాలకు రాయించుకునేటందుకు సిద్ధంగావున్నవారు చాలామంది వున్నారని మనం సులువుగా ఊహించవచ్చు. కాని ఎవరన్నా తనచేత రాయించుకోవాలని వున్నట్లు తెలిస్తే నాగేంద్రరావు చలోక్తిగా, "వారి రాత బాగుంటేగద నారాత బాగుండేది", అంటాడు. ఇది పైకి చలోక్తిగా కనబడినా దీనివెనక ఎంతోవివేకం వుంది. రచయిత ఒక్కడే ఏమీచెయ్యలేడు. తనరచన ఫలించాలంటే దాన్ని ఉపయోగించుకునేటందుకు ఒక గొప్ప సంస్థా, తనలాగే దాన్ని అంటిపెట్టుకున్న అనేకమంది నిపుణులు అవసరమని నాగేంద్రరావుకు తెలుసు.

**************************************