మాటల మాంత్రికుడు శ్రీ పింగళి నాగేంద్రరావు
పింగళి నాగేంద్రరావు గారికి నీరాజనాలు అర్పిస్తూ "చిత్ర" సకుటుంబ సచిత్ర మాసపత్రిక - జూన్ 2009 సంచికలో ఇంద్రగంటి జానకీబాల గారు వ్రాసిన ఈ వ్యాసాన్ని అందించిన మిత్రులు శ్రీ దేవరపల్లి రాజేంద్రకుమార్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ...


***** పింగళి నాగేంద్రరావు కవనం.******

ఇతిహాసం విన్నారా! ఆ అతి సాహసులే ఉన్నారా!
హెచ్చరికో - హెచ్చరిక - హెచ్చరికో -
............
నాటివారివలె - నేటివారునూ
చాటగలరయా - సాహసమంటూ
1951లో "పాతాళభైరవి" పాటలన్నీ జనాల్ని ఆశ్చర్యంలో ముంచి వెర్రెక్కించాయి. నాటకం పాటల నుంచి సినిమా పాట వేరుగా వ్యక్తిత్వం చాటుకుంటున్న రోజులవి.

అదొక కొత్త కలం - మత్తెక్కించే గళం - ఆ మాటలు, ఆ పదబంధాలు, ఆ సమాసాలు, ఆ పేర్లు, ఆ వాక్యాలు, ఆ విరుపులు, ఆ ఝలక్కులు, ఆ చమక్కులు - అన్నీ కొత్తదనంతో తళతళ మెరిశాయి.

విన్నవారు, కన్నవారు మిన్నకుండలేకపోయారు. ఒకటికి పదిసార్లు వినాలనీ, చూడాలనీ పరుగులు పెట్టారు. వారు పామరులా, పండితులా, కార్మికులా, కర్షకులా, ఉపాధ్యాయులా, విద్యార్ధులా, ఆడవాళ్ళా, మగవాళ్ళా, ముసలివాళ్ళా, వయస్సువాళ్ళా? ఏమో! ఆ సినిమా చూడటంలో అందరూ ఒక్కటే. అందరికీ ఒకటే ఆనందం, ఒకటే ఆహ్లాదం - ఆ సినిమా పేరు పాతాళభైరవి - అయితే దానిని పాటలతో, మాటలతో, పద్యాలతో, చమత్కారాలతో రచించిన కవి పింగళి నాగేంద్రరావు. ఒక జానపద కథని కళాఖండంగా మార్చిన దర్శకులు కె.వి.రెడ్డికి వడ్డించిన విస్తరిలాంటి స్క్రిప్ట్ అందించిన పింగళి నాగేంద్రరావు మహా రచయిత.

ఏ కాలంలోనైనా, ఏ రోజుల్లోనైనా సినిమా పరిశ్రమలో - రచయితగా, కవిగా రాణించాలంటే కొన్ని ముఖ్యమయిన ప్రతిభా పాటవాలు ఉండితీరాలి. 1. కొత్తదనం - ఇవి తప్పనిసరి. ఇంకా చమత్కారం, సులువైన భాష సూటిగా వ్రాయడం. తనకి తోచిందేదో తను వ్రాయడం కాకుండా, కథకి, కథలోని పాత్రలకి, సంఘటనలకి అనువైన రచన చేయగలగడం.

ఇన్ని అపురూప లక్షణాలున్న శ్రీ పింగళి నాగేంద్రరావు సినీరంగ ప్రవేశం నలభైలలో కాకతాళీయంగా జరగలేదు. కాలానుగుణంగానే జరిగింది.

ఎక్కడో బందరు కాలేజీలో ఇంజనీరింగు చదివి, ఖరగ్ పూర్లో ఉద్యోగంలో చేరి, అక్కడ వుండకుండా, జాతీయోద్యమం వైపు మొగ్గుచూపి ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే వెంటనే సినిమా రంగంలోకి దూకేశారా - అబ్బే మధ్యలో చాలా కథ వుంది. 1901 డిసెంబరు 29న బొబ్బిలి దగ్గరున్న రాజాంలో గోపాలకృష్ణయ్య, మహాలక్ష్మమ్మకు జన్మించిన పింగళి నాగేంద్ర రావు చిన్ననాటినుండి సాహిత్యాభిమానంతో పెరిగారు. అమ్మమ్మ తాతగార్లు దివిసీమవారు కావడంతో ఆయన బాల్యం కృష్ణాజిల్లా బందరులో గడిచింది.

అక్కడే నేషనల్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశారు. ఆయన మనసులోని అసలు దినుసు సాహిత్యం - ఎందువల్లనంటే ఆయన తల్లి మహాలక్ష్మమ్మ కవయిత్రి. 1935లో శ్రీకృష్ణలీలలు సినిమాకి రచన చేయడంతో పింగళి నాగేంద్రరావు తెలుగు సినిమారంగ ప్రవేశం చేశారు.

1941లో భలేపెళ్ళి సినిమాతో పాటల రచయితగా పరిచయమయ్యారు. అప్పట్లో ఆ పాటలు కూడా ప్రజాదరణ పొందాయి. కానీ 1949లో కె.వి.రెడ్డి గారి గుణసుందరి కథతో పింగళి మరీ వెలుగులోకి వచ్చారు. సాంకేతికంగా కూడా సినిమా పరిశ్రమ ముందడుగు వేయడం వల్ల, పాటలు బహుళ ప్రచారం పొందాయి. 1948లో పింగళి వ్రాసిన వింధ్యరాణి నాటకం తీశారు. కానీ అది అంతగా ఆడకపోవడం వల్ల, ఎక్కువ ప్రచారం పొందలేదు. కానీ రచయితగా పింగళికి మంచి పేరు, గుర్తింపు వచ్చాయి. ఒక రచయిత గానీ, కవి గానీ, నటుడు గానీ వెలుగులోకి రావాలంటే వారికొచ్చిన అవకాశం మంచిదై, వారి ప్రతిభను చాటుకోగల వీలు కలగాలి. ఆ సినిమా ప్రేక్షకుల్ని అలరించాలి.

అప్పుడే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఏర్పడే వీలు కుదురుతుంది. పింగళి నాగేంద్రరావు గుణసుందరి కథకి పని చేసిన తర్వాత విజయా సంస్థలో సముచిత స్థానాన్ని పొందారు. కేవలం ఆయన రచన వల్లనే ఆ సంస్థకి కనకవర్షం కురిసింది. పుట్టుకతో వచ్చిన కవి లక్షణం అసలు సిసలు రచయితను, కవిని చేసింది. నిజానికి ఆయన చదివిన చదువు భాషా శాస్త్రం కాదు. ప్రబంధాలు, కావ్యాలు చదివే భాషా ప్రవీణా కాదు.

కేవలం ఆయన ఇష్టంతో, అభిరుచితో, సాధించుకున్నదే ఆయన్ని వేరే మలుపు తిప్పింది. వింధ్యరాణి నాటకంతో పేరు తెచ్చుకున్న పింగళిని, కమలాకర కామేశ్వర రావు కె.వి.రెడ్డిగారికి పరిచయం చేశారు. గుణసుందరి కథను సినిమాగా తీయాలని ఆలోచనలో రెడ్డిగారున్న సమయమది.

గుణసుందరి కథ సినిమాకి పాటలు, మాటలు వ్రాసే బాధ్యత పింగళి నాగేంద్రరావుకి అప్పగించబడింది.

మనం ముందే అనుకున్నట్లుగా పింగళి మాటల తీరు వేరు. పాటల్లో కూర్పు వేరు. భావాలు వేరు. భాషలోని పదును వేరు. అభివ్యక్తి వేరు. అంతరంగాల ఆవిష్కరణా వేరు.

భక్తి పాట వ్రాస్తే భక్తే -
విన్నవారు భక్తి పారవశ్యంతో ఊగవలసిందే.

ఓ...మాతా!
రావా - మొరవినవా
నీవు వినా దిక్కెవరే - ఓ రాజరాజేశ్వరీ...
దీన జనావన దీక్షావరమని
మానక నిన్నే మదినమ్మితినే
వ్రతములు - పూజలు ఫలరహితములా
భక్తురాలియెడ దయ లేదా! - ఓ మాతా
ఎవ్వరుపడనీ - ఎన్నడు గననీ
ఈ దుర్విధి నే నెటుల భరింతునె
జాలి కలిగదా - నా గతిగనినా
జీవితాంతమిక ఇంతేనా! - ఓ మాతా

పాటలోని భక్తిభావన, జాలిగొలిపే ఆమె స్థితీ, ఆంధ్రుల మనసుల్ని కరిగించి, కంటనీరు పెట్టించింది. పరమేశ్వరుడు చెప్పగా గుణసుందరి కథ విని పార్వతీదేవి, ఆమెను రక్షించడానికి భూలోకానికి దిగి వస్తుంది. ఈ గుణసుందరి కథలోని మాటలు, చమత్కారాలు, హాస్య, పాటలు ప్రేక్షకులకు ఎంతో నచ్చాయి

శ్రీ తులసీ - ప్రియ తులసీ
జయము నీయవే - జయము నీయవే
సతమూ నిను సేవింతుము
సత్కృప గనవే - సత్కృప గనవే

అంటూ గుణసుందరి పాడిన పాట ఆనాటి స్త్రీలందరూ తులసి కోట దగ్గర దీపం పెట్టి పాడుకున్నవారే -
అలాగే -
ఉపకార గుణాలయవై ఉన్నావు కదే మాతా! అనీ
కల్పకమ తల్లివై ఘనత వెలిసిన గౌరి
కల్యాణ హారతిని కళవు నీవే దేవి - అంటూ పేరంటాలలో అందరూ గళం విప్పిన వారే.

' అమ్మా మహాలక్ష్మీ దయ సేయవమ్మా '
' ఓహొరే ఒహోరే బ్రహ్మదేవుడా '
' నీవంత బుద్ధిశాలివయ్యా బ్రహ్మదేవుడా! '
' కలకలా ఆ కోకిలేమో '
' పలుకరించే వింటివా '
' అదియే ఎదురైవచ్చేదాకా - పదర ముందుకు పడిపోదాం '

ఒకే సినిమాలో భక్తి, హాస్యం, తత్త్వం అత్యంత సమర్థంగా వ్రాసిన కవి పింగళి నాగేంద్రరావు.

ఈ గుణసుందరి కథకి సంగీతం సమకూర్చిన ఓగిరాల రామచంద్రరావు పాటలకి మంచి బాణీలి కూర్చారు. పి.లీల, ఘంటసాల, కస్తూరి శివరాం ఆ బాణీలకు ప్రాణంపోసి పాడారు. సినిమా ఘన విజయం సాధించిన ఆనందం అందరిదీ - అయితే రచనా పరమైన విజయం పింగళి ఒక్కరిదే.

ఆ తర్వాత విజయా సంస్థలో కవిగా ఉద్యోగంలో చేరి ' పాతాళ భైరవి ' సినిమాకి పనిచేశారు. అప్పుడు పింగళి రచనాముద్ర ఆంధ్రులకి ఆరాధనై పోయింది. ప్రేమ గీతాలకు ఆయన పెద్దపీట వేశారు పాతాళభైరవిలో.

ఆయన మాటలు, పదప్రయోగాలు అందర్నీ తమాషాగా ఆహ్లాదంగా ఆకట్టుకున్నాయి. ప్రతి పాట పల్లవీ ఒక కోటబుల్ కొటేషన్ లా అయిపోయింది.
' కలవరమాయే మదిలో - నా మదిలో '
'ఎంతఘాటు ప్రేమయో - ఎంత తీవ్ర వీక్షణమో '
' ప్రేమ కోసమై వలలో పడెనే, పాపం పసివాడు , అయ్యో పాపం పసివాడూ '
' వినవే బాలా! నా ప్రేమ గోల '

అదే విధంగా, కొన్ని పేర్లు సృష్టించారు. అవి చూసి ప్రేక్షకులు ముచ్చట పడిపోయారు.
సదాజప (పద్మనాభం). నేపాళ మాంత్రికుడు (ఎస్.వి.రంగారావు) తోటరాముడు (ఎన్.టి.రామారావు)
' జై పాతాళభైరవి '
' నరుడా! ఏమి నీ కోరిక '
' ధైర్యే, సాహసే లక్ష్మి '
' నిజం చెప్పమంటారా! అబద్ధం చెప్పమంటారా '
' తప్పు తప్పు రాణిగారి తమ్ముడ్ని '
' సాహసం సేయర ఢింబకా '

ఇలాంటి సంభాషణల్లో ప్రయోగాలు జనాలను ఉర్రూతలూగించాయి. అవే సినిమాకి ప్రాణం పోశాయి.

ఎంత ఘాటు ప్రేమయో - పాటలో
కన్నుకాటు తిన్నదిగా కలలు విరిసెనే
నా మనసు మురిసెనే - అంటారు.
ఇక్కడ కన్నుకాటు అనేది చాలా విచిత్రమయిన ప్రయోగం కన్నుకాటు ఏమిటి ? ఏదో పాముకాటు లాగా - కానీ ఆయన గొప్పతనమే అది - కాటు తినినంతనే కలలు విరిశాయట. అడుగడుగునా ఇలాంటివి కనిపించి ఆశ్చర్యం కలిగిస్తాయి.

అదే విధంగా ' కలవరమాయే మదిలో ' అనే ప్రయోగం ఎందరు ఎన్ని విధాలుగా ఉపయోగించారో చెప్పలేం.

పింగళి రచన చేసిన విజయావారి మాయాబజార్ చిత్రం నభూతో, నభవిష్యతి అన్నట్లు చరిత్రలో నిలిచిపోయింది. ఈ చిత్రంలో ఘంటసాలవారి సంగీతం, పింగళివారి సాహిత్యం చెట్టాపట్టాలేసుకుని నడిచాయి.

' ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి వుండనే వుంది (సి.ఎస్.ఆర్) '
' రసపట్టులో తర్కం కూడదు ' (ఎన్.టి.ఆర్)
' గోంగూర శాకంబరీదేవి ప్రసాదం ' (వంగర)
' మీరు ధర్మాత్ములు కారని తెలిసినా అన్నగారితో ప్రమాదమేనే - ' (ఎన్.టి.ఆర్)
' అసమదీయులు - తసమదీయులు '
' దుసట చతుషటయము '
' హై - హై నాయకా! '
' వెయ్యరా వీరతాడు ' (ఎస్.వి.ఆర్) - ఇలాంటి పదబంధాలే కాదు.

' లాహిరి లాహిరి లాహిరిలో '
' చూపులు కలసిన శుభవేళా '
' నీ కోసమే నే జీవించునదీ '
' అహ! నా పెళ్ళంట ' - అనే పాటలు వేటికవే సాటి.

పింగళి నాగేంద్రరావు సినిమా రంగ ప్రవేశం చేయకముందు రకరకాల జీవితానుభవాలు పొందారు. ఎందరో ఆశ్రమవాసుల్ని, యోగుల్ని, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటున్న మహానుభావుల్ని కలిశారు. కాంగ్రెస్ పార్టీలో ఆర్గనైజర్గా పనిచేశారు. దేశభక్తి పబోధకాలైన కొన్ని గీతాలు వ్రాసి ' జన్మభూమి ' అనే పత్రికలో ప్రచురించారు. దానివల్ల అరెస్టయ్యారు. అయితే జైలుకెళ్ళలేదు. మొదటి తప్పుగా మందలించి వదిలేశారు. ఆతర్వాత ' శారద ' అనే పత్రికలో కొన్నాళ్ళు పనిచేశారు.

ఎందుకిదంతా అంటే అతి చిన్న వయసులోనే గొప్ప జీవితానుభవం సంపాదించుకున్నారని, ఆయన సినిమా రచనలో చూపించిన ప్రావీణ్యం వల్ల అర్థమవుతుంది.

' జగదేకవీరుని కథ ' లో హళా అనే ప్రాకృత మాటను హలా అనే మాటగా వాడారు. అలాంటి ఒక కొత్త మాటను అర్థవంతంగా వాడటం ఆయనకే చెల్లింది. ' రాణి ' అవ్వాలని ఒకే ఒక ఆశ వున్న గిరిజ పేరు ' ఏకాశ ' అని పెట్టారు.అలాగే రేలంగి పేరు రెండు చింతలు. ' బాదరాయణ ప్రగ్గడా ' అంటూ ఆడించే నాటకం అద్భుతం. ఇందులో పాటలన్నీ చాలా గొప్పగా ఉంటాయి.

' జలకాలాటలలో - కలకల పాటలలో ఏమి హాయిలే హలా - అహ ఏమి హాయిలే హలా '
' రారా - కనరారా
కరుణమానినారా - ప్రియతమలారా '
' అయినదేమో అయినది ప్రియ గానమేలే ప్రేయసీ '
' వరించి వచ్చిన మానవవీరుడు - ఏమైనాడని విచారమా '

అన్నింటికీ మించి - ' శివశంకరీ - శివానంద లహరి ' అనేది ఒక చారిత్రక అంశంగా నిలిచిపోయింది. పెండ్యాల వారి సంగీతం - ఘంటసాల వారి గళం - పింగళి సాహిత్యంతో కలిసి శాశ్వతత్వాన్ని పొందాయి.

అప్పట్లో రచయితల ఫోటోలు, వాళ్ళ గురించిన ప్రచారం అసలు వుండేవి కావు. దానికి తోడుగా పింగళి నాగేంద్రరావు కొంచెం సిగ్గరి. ప్రసిద్ధంగా కనిపించాలనే ధ్యాస తక్కువ గలవారు.ఆయన స్ఫురద్రూపులు కాకపోవడం వల్ల, పింగళి ఎలా వుంటారు ? అనేది ప్రేక్షకులకు గగనకుసుమంలాగానే వుండేది. ఆయన మాటల్లోంచి ఆయన రూపాన్ని ఊహించుకోడమే.

ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించిన మిస్సమ్మలో పాటలు నేటికీ ఏనాటికీ నిత్యనూతనంగా వున్నాయి.

' రావోయి చందమామ - మావింత గాధ వినుమా '
' ధర్మం చెయ్ బాబూ '
' బృందావనమది అందరిదీ - గోవిందుడు అందరి వాడేలే '
' ఏమిటో ఈ మాయ '

అవే కాకుండా ' తెలుసుకొనవె చెల్లి ' అంటూ నాయిక పాడిన పాటకి జవాబుగా ' తెలుసుకొనవె యువతి ' అంటూ ఎన్నో నిత్యసత్యాలు చెప్పారు.

' అప్పుచేసి పప్పుకూడు ' లో
' సుందరాంగులను చూసిన వేళల '
' కాశీకి పోయాను రామాహరి '
' ఓ కొంటె బావగారూ '
' చేయ్ చేయి కలుపరావె హాయిహాయిగా '
మణిపూసలే

అలాగే గుండమ్మ కథలో
' లేచింది మహిళాలోకం '
' కాలము మారెను '
' తీర్థయాత్రలకు రామేశ్వరమూ '
' కోలో కోలో యన్న '
లాంటి పాటలు మళ్లీ రాలేదు. అప్పట్లో పింగళి నాగేంద్రరావుగారి పాటలకు అద్భుతమయిన బాణీలు అమరడం - వాటిని మధురమైన గళసంపదగల గాయనీ గాయకులు పాడటం చరిత్రలో సువర్ణ ఘట్టాలను సృష్టించాయి. మనిషి శాశ్వతం కాదు గానీ, వారు చేసిన కృషికి వచ్చిన కీర్తి మాత్రం శాశ్వతంగా ఆచంద్రార్కం నిలిచి వుంటుంది. 1971 మే 6న పింగళి నాగేంద్రరావు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికే ఆయన పేరు ఆంధ్రుల గుండెల్లో నిత్య నూతనంగా తళ తళ మెరుస్తూనే వుంది. తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖింపబడే వుంది -

ఇంద్రగంటి జానకీబాల

**************************************