మాటల మాంత్రికుడు శ్రీ పింగళి నాగేంద్రరావు
అడగగానే ఎంతో సంతోషంగా తాను చలనచిత్ర సుచిత్ర వ్యాస సంపుటిగా వ్రాసిన "బ్లాక్ అండ్ వైట్" పుస్తకంలో శ్రీ పింగళి నాగేంద్రరావు గారి మీద వ్యాసాన్ని ఈ వెబ్సైటులో వాడుకునేందుకు అనుమతి ఇచ్చిన సహృదయులు శ్రీ రావికొండలరావుగారికి శతకోటి ధన్యవాదాలతో.


***** కొత్త ప్రయోగాల చమత్కార రచయిత.******

"హలా, డింగరీ, గిడిగిడి, డింభకా, శాయరా" వంటి మాటల్ని పాటలు పాడుకున్నట్టుగా పదేపదే ప్రేక్షకుల చేత పలికించిన సినీ మహారచయిత పింగళి నాగేంద్రరావు. ఆయన పాటల్లోని మాటలూ, మాటల్లోని పాటలూ సినిమా టైటిల్స్ గా వచ్చినట్టు ఇంకో రచయితవి రాలేదు.

"ఎంత ఘాటు ప్రేమయో", "చూపులు కలిసిన శుభవేళ", "వివాహ భోజనంబు", "అహ నా పెళ్ళంట!" "రావోయి చందమామ" వంటి సినిమా పేర్లన్నీ ఆయన పాటల్లోవే. "సాహసం శాయరా డింభకా!", "నరుడా, ఏమి నీ కోరిక?" (తర్వాత మార్చినట్టున్నారు) వంటివి కూడా సినిమా పేర్లయినాయి. లలితమైన పదాలతో, భావయుక్తంగా, చమత్కారంగా పాట రాయడం పింగళివారి (కలం) పదును. "కలవరమాయె మదిలో, నీవేనా నను పిలిచినది, అన్నీ మంచి శకునములే, మనమేం చేస్తే అదే ఘన కార్యం" వంటి పాటలు కూడా సినిమా టైటిల్స్ గా రావడానికి క్యూ లో ఉండేవి. పాత్రల్ని సృష్టించడంలో పింగళి వారు ఎంత ధురీణులో, పాటలు రాయడంలో కూడా అంతటి ధురంధరులు. "చందమామ చల్లగా - మత్తు మందు చల్లగా" లాంటి చిన్న తమాషాలతో, హాయి పుట్టించడం ఆయనకి తెలుసు. 'పెళ్ళిచేసి చూడు ' (52) లోని డ్రీం సీక్వెన్స్ లో అర్జునుడు ఊర్వశితో పాడుతూ "చాలు చాలు నీ సాముదాయికపు వలపు పంపిణీ" అంటాడు. కో - పరేటివ్ విధానంలో ఊర్వశి తన ప్రేమను పంచుతున్నదన్నమాట. అదీ ఆయన చమత్కారం! ఆ పాటలోనే "యుగయుగాలుగా, జగజగాలుగా " అని ఒక చోట వస్తుంది. "ఊగించిన, ఉర్రూగించిన" అని యింకో చోట వస్తుంది. ' యుగయుగాలు ' అంటాంగాని ' జగజగాలు ' అనం. అలాగే 'ఉర్రూతలూగించిన ' అని ఉండాలి. దానికాయన సమాధానం. "పదాల్ని ప్రయోగించడంలో బాగుంటుందనుకున్నప్పుడు వేసేయడమే! 'జగజగాలు ' అలా వేసిందే. 'ఉర్రూగించడం' భాషలో తప్పయినా, హ్రస్వీకరించి అర్థమయ్యేట్టుగా వాడడం తప్పు కాదు. భావం భాషకి బందీ అయిపోకూడదు. తన అవసరానికి భావం భాషని వాడుకుంటుంది. భావం బాగుంటుందనుకున్నప్పుడు కొత్త ప్రయోగాలు చెయ్యాలి. తప్పు కాదు. ' పాతాళభైరవి ' లో "ఘాటుప్రేమ" అని రాసినందుకు దుష్ట సమాసం అనీ, భావప్రకటన కూడా సరిగాదనీ విమర్శించారు. కాని, తోట రాముడి పాత్రని బట్టి వాడి అప్రేమ ఘాటైనదే గాని మృదువైనది కాదు. వాడి ప్రేమ యువరాణికి ఘాటుగా కనిపించింది కాబట్టి అలా పాడుకుంది. సమాసాలు కూడా మడికట్టుకుని పేర్చుకోనక్కరలేదు. ' గర్భగుడి ' లాంటి మాటలు ఎన్నో వాడుకలోనూ రాతల్లోనూ వస్తూనేవున్నయి. అందుకే ' మాయాబజార్ ' లో రాశాను - "ఎవరో ఒకరు పుట్టించకుండా మాటలెలా పుడతాయని."

ఆయన పాత్రలకి పెట్టే పేర్లు కూడా చిత్రంగానే ఉంటాయి. 'తోటరాముడు, హంవీరుడు, నిక్షేపరాయుడు, హరమతి, కాలమతి,ఎంత చెబుతే అంతే గాళ్ళు, సలహాలరావు - మొదలైనవి. ' శ్రీ కృష్ణార్జునయుద్ధం ' (63) లో అర్జునుడు మారు వేషం వేసుకుని వచ్చినప్పుడు తన పేరు తికమకగా పెట్టుకుని చెబుతాడు. "అజబీదఫపా విశ్వేసకీ స్వాములవారు!" వినడానికి ఏదో విచిత్రంగా, గంభీరంగా అనిపిస్తుంది కాని, అర్జునుడికి ఉన్న పేర్లలోని మొదటి అక్షరాలను అటూ ఇటూగా పేర్చి ఆ పేరు తయారు చేశారు. ఆయన పాటల్లో, మాటల్లో చేసిన పలు ప్రయోగాలూ, చమత్కారాలూ రాయాలంటే మాటలు చాలవు. " ఐతే నేను ఉన్న వాటినే వెలికితెచ్చి వాడానుగాని, కొత్తగా పుట్టించలేదు. 'హలా' అనేది సంబోధన. ' గిడిగిడి ' అంటే నమస్కారం. ' డింగరి ' అంటే సేవకుడు, భక్తుడూ" అని చెప్పేవారు నాగేంద్రరావు.

' మాయాబజార్ ' లో "ఈకాలపు పిల్లలు ఇంతేనయ్యా" అంటాడు కృష్ణుడు. ఇలా రాశాడేమిటా అని ఒక్కసారి గుండె ఝల్లుమంటుంది కొందరికి. ' హరిశ్చంద్ర ' లో - రావలసిన రోజుకి వస్తానని చెప్పడానికి "తద్దినానికి వస్తాను" అంటాడు శిష్యుడు. అంటే - తత్, దినానికి (ఆ రోజుకి) అని. ఈ గారడీలూ గమ్మత్తులూ నాగేంద్రరావు వాణి. ఆయన సొంత బాణీ.

సంస్కృతాంధ్ర భాషల్లో వైదుష్యం గల నాగేంద్రరావు సినిమాలకు రాక ముందు నాటకాలు రాశారు. 'వింధ్య రాణి, నా రాజు, క్షాత్ర హిందు, ఒకే కుటుంబం, జేబున్నీసా' మొదలైనవి వాటిలో కొన్ని. ఉద్యోగం చేస్తూ జాతీయగీతాలు, దేశభక్తి పాటలూ రాశారు. రైల్వే ఉద్యోగం తర్వాత ' శారద ' అనే పత్రికలో ఉద్యోగం చేశారు. ' వింధ్యారాణి ' ఎక్కువగా ప్రదర్శితమైన నాటకం. తర్వాత సినిమాగా కూడా వచ్చింది. నాగేంద్రరావు అసలు రచన ' గుణసుందరి కథ ' (49) తోనే ఆరంభమైనా, అంతకుముందే ఆయన ' భలే పెళ్ళి ' (41) అనే చిన్న సినిమాకి రచన చేశారు. అది మోలియర్ నాటకానికి అనుసరణ. ఆ సినిమా ఆయనకి పెద్దగా సహాయం చెయ్యలేదు, ఆయన నైపుణ్యాన్ని బయటపెట్టనూ లేదు. అంతే! ఆ తర్వాత ఆయన తిరిగి బందరు వెళ్ళి అక్కడే ఉన్నారు - ఆయన ప్రజ్ఞపాటవాలు తెలిసివున్న కమలాకర కామేశ్వరరావు ' గుణసుందరి కధ 'కి రప్పించే వరకూ.

డి.వి.సుబ్బారావు ' వింధ్యరాణి, నా రాజు ' నాటకాలు ప్రదర్శిస్తూన్నప్పుడు నాగేంద్రరావు ఆ సమాజానికి కార్యదర్శిగా వుండి, చాలా చోట్ల నాటకాలు ఆడించారు. "అప్పుడే నాకు ప్రేక్షకుల నాడి బాగా తెలిసింది. వినోదం, చమత్కారం ఉంటే ప్రేక్షకులు ఆనందిస్తారు. ఏ కథైనా వినోద ప్రధానంగానే ఉండాలని నేను అనుకునేవాణ్ణి. 'గుణసుందరి కధ, పాతాళభైరవి, మాయాబజార్, జగదేకవీరుని కధ, శ్రీ కృష్ణార్జున యుద్ధం' ఇవన్నీ వినోదప్రధానమైనవే. సరదాగా, హాయిగా ఉండే పాత్రలతో, సన్నివేశాలతో వుంటే సినిమా కధ రక్తి కడుతుంది" అనేవారాయన. ఆయన రాసిన ఒకే ఒక సాంఘిక చిత్రం ' పెళ్ళినాటి ప్రమాణాలు ' (58) కూడా వినోద ప్రధానమే. విజయాకి కాకుండా బయటి చిత్రనిర్మాతలకి కూడ కొన్ని స్క్రిప్టులు రాసినా, వట్టి 'పాటలు మాత్రమే' తక్కిన వారికి రాయలేదు విజయాకి రాసినట్టు."విజయా చిత్రాల నాడి, అభిరుచీ నాకు తెలుసు. అక్కడ రాయడం జయం, బయటివాళ్ళకి రాయాలంటే, భయం!" అని చెప్పేవారు ఆయన.

"గుండమ్మ కథ" (62) లో నాగేశ్వరరావు, జమునలకు ఒక పాట ఉంటుందనీ, అది ఊటీలోనో, బృందావనంలోనో తియ్యాలనీ అనుకునేవారు. కొన్నాళ్ళయినతర్వాత "ఎందుకు వూటీ? - ఇక్కడే మన గార్డెన్లోనే తీద్దాం" అన్నారు చక్రపాణి. నాగేంద్రరావు పాట రాయడానికి కూచుని - ప్రేమ యాత్రలకు బృందావనము, నందనవనమూ ఏలనో?" అంటూ ఆ భావాన్నే గీతంలో పలికించారు. "జగమునే ఊటీ శాయగా" అని కూడా రాశారు. ఈవిధానంలో పాట రాస్తే చక్రపాణి గారికి ఓకే అయినట్టు మిగతావారికి అవుతుందా అని నా అనుమానం. అది శృంగార గీతం గనక, అందులో శృంగారమే లేదనవచ్చుగదా!" అని చెప్పే వారు నాగేంద్రరావు.

నాగేంద్రరావు బ్రహ్మచారి. ఒకసారి రేలంగి అడిగారు -"కవిగారూ! మీరు బ్రహ్మచారిగదా శృంగార గీతాలూ, రొమాంటిక్ సీన్లూ అంత బాగా ఎలా రాస్తున్నారు?" అని. "రేలంగీ! శృంగారం రాయడానికి శృంగారానుభవం అక్కర్లేదు. యుద్ధం దృశ్యాలు రాయాలంటే యుద్ధాలు చెయ్యాలా? రవి కాంచనిచో కవి గాంచును" అని సమాధానం ఇచ్చారు. "నీకూ, కవికీ వున్నతేడా అదే!" అంటూ.

నాగేంద్రరావుగారు చమత్కారప్రియులు. అందరితోనూ సరదాగా, కాలక్షేపం చెయ్యడం ఆనందం. ఆరోజుల్లో ఎన్ని పన్లున్నా, సాయంకాలం అయేసరికి, పానగల్ పార్కుకి హాజరు కావలసిందే, మిత్రులందరినీ పలకరించవలసిందే! ఒక రోజు "తొందరగా వచ్చారే" - అని ఒక మిత్రుడు అడిగితే, "ఇవాళ బేరాల్లేవు, తొందరగా దుకాణం కట్టేశాను." అన్నారు చమత్కారంగా. "బేరాలు లేవు" అంటే తన రచనకి ఆలోచనలు - రాలేదన్నమాట. విజయా చిత్రాలకి వన్నె తెచ్చిన పింగళి నాగేంద్రరావు తెలుగు సినిమాకి కొత్త మాటలు నేర్పిన రచయిత, నడక (దృశ్యసంకలన) నేర్పిన రచయిత, పాట రాసినా, మాట రాసినా తన బాణీనీ, మార్కునీ తప్పని రచయిత. రాసినవి తక్కువే అయినా, ఎక్కువ కాలం బతికేలాగా, రాసిన మాటలతో కొలవలేని గొప్ప రచయిత.

**************************************